లింగ మహా పురాణము
36 - క్షుపకృత విష్ణుస్తుతి - ధధీచివలన క్షుపునకు పరాభవము
నంద్యువాచ -
క్షుపుఁడు ఏకాగ్ర భక్తిని తన నారాధించుటవలన నా రాయణడు ప్రత్యక్షము కాగా-నాతని శంఖచక్ర గదాధరత్వమును కిరీటమును సర్వాభరణములను లక్ష్మీ భూదేవీ సాహిత్యమును దేవాతాపరివేష్ఠి తత్వమును గాంచి సంతుష్టుడై ప్రణమిల్లియు “నీవు ప్రకృతితో కూడిన పురుషుడవు! మహత్తత్త్వము, అహంకారము, పంచతన్మాత్రలు (మిశ్రములు కాని పంచమహాభూతములు.) జ్ఞానకర్మేంద్రియములు ఇత్యాదిక మంతయు నీవేను; అని క్షుపుఁడు నుతింపగా - నారాయణుఁడు “నీకు కావలసినదాని నిచ్చెదను అడుగుము!” అనవుఁడు - క్షుపుఁడు - “భగవానుడా! దధీచి యను బ్రాహ్మణపుంగవుఁడు - ధర్మాధర్మములను గుర్తించువాడు, వినయసంపన్నుడుగా నున్నందున నాకు పూర్వము- మిత్రుడై యుండెను. ప్రాణులందరిచే వధింప నలవిఁగానివాడై- శివారాధన తత్పరుఁడునై సభలో ఎడమకాలితో శిరస్సుపై తన్ని నన్నవమానించి “దేనినుండియు భయపడువాడను కాను” అని గర్వముతో పలికెను గాన నాతని నోడింపఁదలచితిని. “నాకు హితము నొనఁగూర్చుము! “అని ప్రార్థింపగా శ్రీహరి మహేశ్వరుని మహిమను, దధీచి అవధ్యుడగుటను లోలోన తలచుకొని దిగువవిధము సంభాషించెను.
రాజేంద్రా! విప్రులు శివభక్తులైనచో నవ్వారికి ఎట్టి భయము కలుగఁజాలదు. శివ భక్తులు నీచులైనను నిర్భయులగుచుండగా దధీచి యొక్క శివభక్తి పారవశ్యమును చెప్పనేల? అందువలన నీకు విజయము చేకూరదు. దక్షయజ్ఞములో దధీచి శాపము వలన నాకు మూర్ఛావస్థ, మరల మేలుకొనుటయు సంభవించినవి.
“ఐనను నీ భక్తికి వశుడనై దధీచిఁ జేరి నీ విజయమునకు ప్రయత్నించెద” నని చెప్పగా క్షుపుఁడు అట్లే చేయుఁడని అంగీకరించినందున భగవానుఁడు వృద్ధ బ్రాహ్మణరూపమున దధీచ్యా శ్రమము బ్రవేశించి దధీచిమునికి నమస్కరించియు “నీవు నాకు నొక వరమునీయు” మని యాచింపగా -
జనార్థనా! నీవు వృద్ధ బ్రాహ్మణ రూపమున నేతెంచితివి! క్షుపుఁడు నిన్నారాధించినందున భక్తవత్సలుడవైతివి. నాకు వానివలన భయము కలదేని వచింపుము! ఈ జగత్తున దేవ దానవాదుల వలనను ద్విజులవలనను నాకు భయము లేదు’’ అని వచించెను.
దధీచి వాక్యము నాలకించిన శ్రీహరి నిజరూపము గలవాడై చిరునగవుతో “దధీచే! నీకెట్టి భయము లేదని నాకు తెలియును. శివభక్తి ప్రభావమున సర్వజ్ఞుఁడవైనావు! “నీ వలన భయపడుదును” అని సభలో క్షుపు నుద్దేశించి ఒక తడప మాత్రము పలుకుము! ఇది నా యభీష్టము; నీకు నమస్కారము“ అని ప్రాధేయపడగా “నేను శివానుగ్రహము వలన నిర్భయుఁడనైతిని గాన భయమును పలుకనని నుడివెను.
అంత నారాయణుఁడు ఉగ్రుఁడై దధీచి పై తన సుదర్శన చక్రమును ప్రయోగింపగా
శ్లో॥ అభవత్ కుంఠితాగ్రం హి - విష్ణో శ్చక్రం సుదర్శనం । ప్రభావాద్ధిదధీచస్య- క్షుపస్యైవ హి సన్నిధౌ ॥
విష్ణు ప్రయుక్తమగు సుదర్శనచక్రము దధీచి యొక్క శివభక్తి మహిమచే క్షుపుని ముందు కొట్టుబడినందున దధీచి మహాముని మందస్మితమున “విష్ణో! నీవు మహేశ్వరుని వలన సంపాదించినట్టి చక్రమిది. ఇది నన్ను వధింపఁజాలదు” అని ధైర్యముతో వచింపగా శ్రీహరి అనేక శస్త్రాస్త్రములను ప్రయోగించెను. అమరులు విష్ణువునకు తోడుగా దధీచితో పోరు సలిపరి. అంత దధీచి శివుని స్మరించి దర్భముడిని దేవతలపై విసరెను. అయ్యది - ప్రళయాగ్ని జ్వాలలతో మండు త్రిశూలమై దేవాదులను కాల్పనుండెను.
నారాయణుఁడు దేవేంద్రాదులును ప్రయోగించిన శస్త్రాస్త్రములన్నియు త్రిశూలముముందు మోకరిల్లి వెనుదీయగా - అమరులందరు వేఱగంది తమ సామర్ధ్యముఁ గోలుపోయి నలుదిసలకు పారిపోవుచుండిరి.
అందువలన నారాయణుఁడు తనతో సమానులైన గణములను తన శరీరము నుండి పుట్టించి తనపైకి పంపగా నా విష్ణు గణములను దధీచి దహించెను.
అంత శ్రీహరి విశ్వరూపము దాల్చి - అందు దేవతా గణములను కోట్లకొలది బ్రహ్మాండములను చూపెట్టగా దధీచిముని శుద్ధజలముతో విష్ణుమూర్తి నభిషేకించి దేవా! నీ మాయను పరిత్యజించి నాతో పోరాడుము! “అని నుడివి తనలో బ్రహ్మ విష్ణు రుద్రులను చరాచరమునంతయు చూచుటకు దివ్యదృష్టి నొసగగా నారాయణుఁడు నిజరూపము గలవాడై దధీచికి మ్రొక్కియు వైకుంఠమునకు వెడలెను. అంత క్షుపుఁడు దుఃఖాతరుడై దధీచి జేరి “నేను పొరపాటున చేసిన యపచారమును క్షమింపుము! నా వంటి క్షత్రియాధములకు శివభక్తి దుర్లభము గదా! “అని ప్రార్థింపగా దధీచి ప్రసన్నుడై క్షుపు ననుగ్రహించి “అమరులారా! మీరు విష్ణువుతో సహ దక్షప్రజాపతి కృతయజ్ఞమున రుద్రకో పాగ్ని దగ్ధులగుదురు గాక! “అని శపించెను. మరియు “రాజేంద్రా! క్షుపా! బ్రాహ్మణులే దేవ మానవ పూజ్యులుగా శ్రేష్ఠులగుదురు”. అని ప్రవచించి దధీచి - తన యాశ్రమమునకు పోబోవుచుండగా క్షుపుఁడు దధీచికి ప్రణమిల్లి నిజనివాసమునకు జనెను.
దధీచి క్షుప సంవాదము, విష్ణు పరాభవము, అమరులకు దధీచి శాపంబు జరిగిన చోటు - స్థానేశ్వర మనబఱిగి నందున నచ్చోట వెలసిన స్థానేశ్వర శివ లింగమును దర్శించి పూజించువారు శివసాయుజ్యము నొందుదురు.
ఈ క్షుప దధీచి సంవాదము గల వృత్తాంతమును చదివినవారు- వినినవారు వినుపించినవారు అపమృత్యువులను జయించి ప్రారబ్ధాంతమున కైలాస నివాసము గలవారగుదురు. దీనిని పఠించి యుద్ధమునకు వెళ్లు క్షత్రియులు శతృవుల నోడించి విజయులగుదురు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (36) ముప్పదియారవ అధ్యాయము.
Summary of chapter 36 of the Linga Mahā Purana is as follows:
This chapter details the profound philosophical dialogue between King Kshupa and Sage Dadhīca regarding the comparative powers of royal authority and spiritual penance. Realizing his error through the divine intervention of Parameśvara Śiva and Vishṇu, King Kshupa bowed before Sage Dadhīca, acknowledging the supreme glory of Śiva devotion and the invincible power of spiritual wisdom.