లింగ మహా పురాణము
93 - శివుఁడు అంధకాసురుని నిగ్రహించి యనుగ్రహించుట
“మనోహరములైన గుహులు గల మందరాద్రిపై మహేశ్వరుఁడు అంధకాసురుని గ్రహించి అనుగ్రహములో గాణపత్యము నొసఁగిన వృత్తాంతమును వివరింపుము!”
అని శౌనకారులు ప్రశ్నింప సూతముని చెప్పదొడగెను.
పూర్వము అంధకాసురుఁడు తపస్సుచే బ్రహ్మపరము నవధ్యత్వముగా బడసి -ముల్లోకముల కధిపతియై స్వర్గమును వశపఱచుకొనియు దేవేంద్రుని బాధించుచు అమరులను వేధించుచున్నందున హరి బ్రహ్మాది దేవతలు భయపడినవారై మందర పర్వతముజేరగా అంధకాసురుఁడును మందరాద్రిపై నడుగిడెను,
అట్టితఱి బృందారకులు పూర్వాధికభయ గ్రస్తులై – “మహాదేవా ! మేమందరము అంధకాసుకుని శస్త్రాస్త్రములచే వెతలఁజెందితిమి. మమ్ము రక్షింపుము” అని ప్రార్థింపగా మహేశ్వరుఁడు కరుణించి గణాధిపతులను వెంటనిడుకొని అంధకాసురునకు ఎదురుగా వెళ్లునపుడు హరిబ్రహ్మేంద్రముని వర్యాదులందరు జయజయధ్వానములఁజేయుచు తమ కీరీటములపై దోసిలొగ్గియు శంకరుని వేడుచుండిరి. ఆ పిమ్మట మహేశానుఁడు తన త్రిశూలముఁడగు మంటలతో అంధక సైన్యమగు కోట్లకొలది దైత్యులను భస్మమొనర్చెను.
అదే సమయమున అంధకాసురుని మహేశ్వరుడు త్రిశూలాగ్రముపై నిలిపినందున నాతడు పాపరహితుఁడగుటను బ్రహ్మదేవుఁడు గాంచి సంతోషముతో అట్టహాసధ్వని నొనర్చెను. అట్టి బ్రహ్మనాదమును దేవతలు విని మహేశ్వరునకు ప్రణమిల్లుచుండిరి. మునులు ఆనందాతిశయమున నాడుచుండిరి. ప్రమథగణాధిపతులు ఆనందా బ్ధినోలలాడిరి. ఖేచరులు శంకరునిపై దివ్య పుష్పములఁ గురిపించిరి. త్రిలోకనివాసులందరును సంతోషించుచుండిరి.
త్రిశూలాగ్నిజ్వాలలచే కాల్పఁబడిన అంధకుఁడు ప్రేతవంటివాడై సాత్త్వికభావము నవలంబించి మనస్సులో సెట్లు భావించుచుండెను. ‘‘నేను పూర్వజన్మలయందు మహేశ్వరు నారాధించితిని గాన నీజన్మయందు శివునంచు భక్తి కలిగినది.
శ్లో॥ యః స్మరే న్మనసా రుద్రం ప్రాణాంతే సకృదేవ వా । స యాతి శివసాయుజ్యం కింపునర్బహుశః స్మర?
ప్రాణ ప్రయాణ (మరణ) సమయమున మనస్సులో నోకసారియైనను రుద్రుని స్మరించువాడు శివసాయుజ్యమునొందును. జీవితకాలమున పలుమారులు శివుని తలచుకొనువాడు ముక్తుఁడగునని చెప్పనవసరము లేదు.
మరియు బ్రహ్మదేవుఁడు, విష్ణుభగవానుఁడు, ఇంద్రాది దేవతలును మహేశ్వరుని శరణము నొంది తమ పదవులపై స్థిరపడి యున్నవారు. అందువలన నేను నీశ్వరునకే శరణాగతుడ నగుచును.” అని చింతించి శాంత చిత్తమున తనను అనేక విధస్తోత్రములతో ప్రార్థించిన అంధకాసురు ననుగ్రహింపఁ చలచినవాడై “అంధకా ! నీ ప్రార్థనతో ప్రసన్నుఁడనైతిని. వరముల గోరుకొనుము!” అని నుడువగా - “మహాదేవా ! భక్తుల ఇడుములఁ బావు నట్టి కరుణ గలవాడవు. నేను వరయోగ్యుడనైనచో నీ యందు నిరంతరము నాకు భక్తి కలుగునట్లు వరము నీయుము!” అని యాచింపనా పరమేశ్వరుఁడు తనయందు అత్యంత భక్తి శ్రద్ధలుండునట్లు వరము నొసగులుటే గాక త్రిశూలమునుండి దైత్యుని దింపి గణాధిపతిత్వమును ప్రసాదించెను. అంత గణాధిపతియగు అంధకాసురునకు సురేంద్రాదులు ప్రణామముల నొనర్చిరి.
ఇయ్యది “ శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (93)వ అధ్యాయము.
Summary of chapter 93 of the Linga Mahā Purana is as follows:
The historical account of the demon Andhaka is narrated, describing his birth from the sweat of Śiva, his blind arrogance, and his attempt to overpower the devas and possess Mother Pārvatī. The chapter details the grand battle wherein Bhagavān Śiva pierced Andhaka with His trident, held him elevated for thousands of years until his demonic pride dissolved, and ultimately granted him liberation and appointed him as a divine Gaṇa named Bhingi.