లింగ మహా పురాణము
59 - అగ్ని యొక్క మూడు విధములను సూర్యుని సహస్ర కిరణముల యొక్క కర్తవ్యమును నిరూపించుట
పూర్వాధ్యాయమున సూతుఁడు చెప్పినది వినిన శౌనకాదులు “సూర్యాదుల యొక్క ప్రభావమును విస్తరించి వక్కాణింపుము“ అని అడుగగా రోమహర్షణుఁ(సూతుఁ)డు చెప్పలదొడఁగెను.
మీరు ప్రశ్నించిన విషయమునకు ప్రశాంతులైన వేదవ్యాసాదులచే నిర్వచింపబడిన సమాధానమును వక్కాణించుచున్నాను.
ఆకాశమున సూర్య చంద్ర నక్షత్ర గ్రహాది జ్యోతిస్సులు సంచరించు విధానమును మరియు నవ్వాని రథాశ్వములను నిరూపించితిని. ఇక అగ్ని తైవిధ్యమును తదితరములను నిర్వచించుచున్నాను.
అవ్యక్త జన్ముఁడగు బ్రహ్మదేవుఁడు దిన ప్రళయమున గడచిన రాత్రి శేషించియుండగా చీకటి పూర్తిగా అంతరించలేదు. రాత్రి ప్రారంభమున నాలుగవ భాగము బ్రహాండము దక్క నితరమంతయు లోపింపగా భగవానుఁడైన స్వయంభువు (విధాత) ఖద్యో తము (మిణుగురుపురువు) వలె “మరల జగత్తును నిర్మింపవలె‘ నను తలంపుతో మసకచీకటిలో తిరుగాడుచు మొదట భూజల మిశ్రమగు అగ్నిని పుట్టించి దానిని ముత్తెఱగులు వేరుపరచెను. లోకమునందు బాహ్యమున వెలుగొందు అగ్ని పార్థివమనియు, సూర్యునందు తపించు అగ్ని శుచియనియు, జలములో దాగియుండు అగ్ని - వైద్యుతమనియు వ్యవహరింపబడును.
సూర్యుడు తన కిరణములతో ఉదకమును త్రాగి ప్రకాశించుచుండును. ఉదకములో వైద్యుతాగ్ని యుండుటచే అగ్ని జలముతో శాంతింపదని తెలియవలెను. మానవుల కడుపులో గల జఠరాగ్ని గూడ నుదకముచే శాంతించునది కాదు. పార్థివాగ్ని మంటలు గలదై యుండును. జఠరాగ్ని మంటలు లేనిది. సూర్యుడు అస్తమించునపుడు అగ్నియందు ప్రవేశించును. ఉదయించుతఱి అగ్నియొక్క వేడి సూర్యుని జేరును. సూర్యుడు అస్తమించి తమలో దాగియుండును గాన నుదకములు కొద్ది యెరుపు వన్నె గలవగును. రవి ఉదయించిన తఱి ఉదకములు తెల్లనివగును.
మాఘమాసమున వరుణుడనియు, ఫాల్గునమున సూర్యుడనియు చైత్రమున అంశు వనియు; వైశాఖమున ధాత యనియు; జ్యేష్ఠమాసమున ఇంద్రుడనియు; ఆషాఢమున ఆర్యమయనియు; శ్రావణ మాసమున వివస్వంతుఁడనియు, భాద్రపడమున భగుఁడనియు, ఆశ్వయుజమున పర్జన్యుఁడనియు, కార్తికమాసమున త్వష్టయనియు; మార్గశీర్షమున మిత్రుఁడనియు; పౌషమాసమున విష్ణువనియు రవి పేర్కొనబడును.
వసంత ఋతువున కపిలవర్ణుడు, గ్రీష్మమున సువర్ణకాంతిమంతుడు, వర్షర్తువునందు శ్వేతవర్ణుఁడు - శరత్కాలమున పాండు (కొద్ది తెలుపు) వర్ణము గలవాడు- హేమంతమున తామ్ర (ఎరుపు) వర్ణము గలవాడు - శిశిర ఋతువున లోహిత (కొద్ది ఎరుపు) వర్ణము గలవాడునై రవి ప్రకాశించును.
చంద్రుడు నక్షత్రములు గ్రహములును సూర్యునిపై ఆధారపడియుండునవి. నక్షత్రాధిపతియగు చంద్రుఁడు మహేశ్వరుని వామనేత్రముగాను, సూర్యుఁడు దక్షిణ నేత్రముగాను ప్రవర్తించు వారై - ప్రాణుల నేత్రములకు వెలుతురు నొసఁగుచుందురు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక’’ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (59) ఏబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 59 of the Linga Mahā Purana is as follows:
The text details Sūryaraśmisvarūpa, explaining the various colors, functions, and divine potencies of solar rays. It describes how specific solar rays nourish the moon, planets, and stars, while others bring warmth, rain, and health to the earth, acting as the divine instruments of Bhagavān Śiva's sustaining energy.