లింగ మహా పురాణము
47 - జంబూ ద్వీప గత వర్షనిరూపణము ఆగ్నీధ్రుని వంశమును నిర్దేంచుటయు
సూత ఉవాచ:
ఆగ్నీధ్రుఁడు - అత్యంత శివ భక్తి ప్రణవపంచాక్షర జపానుష్ఠానంబు యౌవనంబు గలవాడై యుండగా నాతని కుమారులు తొమ్మండుగురు శివభక్తులై శివు నారాధించుచుండిరి.
వారు - నాభి, కింపురుషుడు, హరివరుఁడు, ఇలావృతుఁడు, రమ్యుఁడు, హిరణ్మంతుఁడు కురువు, భద్రాశ్వుఁడు, కేతుమాలుఁడు నను పేరులతో విలసిల్లిరి.
అగ్నీధ్రుఁడు - నాభిని హేమవర్షాధిపతి గాను; కింపురుషుని హేమ కూట వర్షాధిపతిగాను;హరివరుని నైషధ వర్షాధికారిగాను; మేరు పర్వతము మధ్యగా గల వర్షమునకు ఇలావృతుని ప్రభువుగాను;రమ్యుని నీలపర్వతము నాశ్రయించిన వర్షమునకు అధిపతిగాను; హిరణ్మంతుని శ్వేత వర్షాధికారిగాను; కురువును శృంగవర్షాధికారి గాను; భద్రాశ్వుని మాల్యవంత వర్షప్రభువుగాను; కేతుమాలుని గంధమాదన వర్షాధికారిగాను నియమించెను.
ఇట్లు ఆగ్నీధ్రుఁడు తన కుమారులు తొమ్మండుగురికి తొమ్మిది వర్షముల నొసగి శివనిష్ఠ గలవాడై వేద వేదాంతార్థమును పరిశీలించుచు శివధ్యాన నిరతుఁడై యుండెను.
కింపురుషము మొదలగు ఎనిమిది ద్వీపములయందు ప్రయత్నము లేకుండ కార్యములు సిద్ధించుటయు, ముసలితనము మరణము ననువాని వలన కలుగు భయము లేకుండుటయు, పుణ్యపాప రాహిత్యము, ఉత్తమ మధ్యమ అధమభేదములు లేకుండుటయు, యుగధర్మ రాహిత్యంబునుండును.
జంబూ ద్వీప గత భరత వర్షము నందు భరతఖండమున శివక్షేత్రములలో మరణించినవారు పై ఎనిమిది ద్వీపముల యందు జన్మించి సుఖపడుచుందురు. అట్టి పుణ్యాత్ముల కొరకు పరమేశ్వరుడు అష్ట ద్వీపముల నేర్పరచి వారి సనుగ్రహింప నటఁజేరియుండు కతన - తమ హృదయములలో మహాదేవుని దర్శించి ముక్తులగుదురు.
ఇక నాభియనువాడు మేరుదేవియందు జన్మింపజేసిన ఋషభుఁడు - భరతుని కనఁగా భరతుఁడు ఋషభుని సూర్గురు కుమారులలో పెద్దవాడై యుండెను. ఆతఁడే ఋషభుని ఆదేశము ననుసరించి భరత వర్ష భరతఖండాధిపతి యాయెను. ఋషభుఁడు ఇంద్రియములు అను మహాసర్పములను వశపఱచుకొని జ్ఞాన వైరాగ్య సంపన్నుడునై సదాశివుని మనస్సులో నిలుపు కొనియు, జడలు ధరించి నార వస్త్రములఁ ధరించియు శివ ధ్యానముఁ జేయుచు శివలోకముఁ జేరెను.
హిమాలయమునకు దక్షిణదిశయందు గల భరతవర్షము భరతుని పేరుతో ప్రఖ్యాతమైనది.
భరతునకు సుమతి యను కుమారుఁడు కలుగగా భరతుడు సుమతిని భరత వర్షాధిపతిగా పట్టాభిషిక్తు నొనర్చియు వానప్రస్థుఁడై శివధ్యానబలమున పరమపదముఁజెందెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (47) నలబది యేడవ అధ్యాయము.
Summary of chapter 47 of the Linga Mahā Purana is as follows:
This chapter glorifies Bhāratavarsha, the sacred land of karma and spiritual liberation, situated at the southern realm of Jambūdvīpa. The narrative extols Bhāratavarsha as the only land where human beings perform righteous deeds, sacred sacrifices, and intense devotion to attain svarga or ultimate mukti, detailing its holy mountains, sacred rivers, and nine sub-divisions.