లింగ మహా పురాణము
53 - ప్లక్ష ద్వీపా దిగత అచలాది వర్ణనము
క్రౌంచ ద్వీపమున క్రౌంచము, వామనకము అంధకారకము, దివావృతము, వివిందము, పుండరీకము దుంధుభిస్వనము నను రత్నమయ సప్తపర్వతములు;
శాకద్వీపమున ఉదయము, రైవతము, శతామకము, రాజతము, ఆంబికేయము, సర్వౌషది సమన్వితము, కేసరి యను సప్తగిరులుండగా కేసరి పర్వతము నుండి వాయువు బయలు దేరి వీచుచుండును.
పుష్కర ద్వీపమున మణిమయశిఖరములు సమున్నత శిలలును గల నొకే పర్వతము పూర్వార్ధమున విచిత్ర శిఖరములు గలదై ఏబది (50) వేల యోజనముల ఎత్తు, ముప్పదినాలుగు (34) యోజనముల క్రింది భాగంబు గలదియునై ఉత్తరార్భమున మానసోత్తర పర్వతముగా వ్యవహరింపఁబడుచు సముద్రము యొక్క చెలియల కట్ట వరకు వ్యాపించి క్రొత్తగా ఉదయించిన చంద్రుని వలె శోబించుచు వెనుక వైపున మానసాద్రిగా పేర్కొనబడుచుండును. మరియు పుష్కర ద్వీపమున మానస పర్వతముఁదగు విభాగములు రెండు అమరి యుండును. పుష్కరద్వీపము మధురజలము గల సముద్రముతో చుట్టబడియుండును.
ఇవ్విధము సప్త ద్వీపములు ఏడు సముద్రములచే పరివేష్టింప బడినందున భూలోకము విడివిడిగా నున్నను గొప్పదిగా గానంబడును. భూలోకము సూర్యమండలము వరకు భువర్లోకము ధ్రువమండలమువరకు పరిమితములు కాగా ఆవహము, ప్రవహము, అనువహము, సంవహము వివహము, పరావహము, పరివహము నను సప్తగతులు గలదై వాయువు ప్రవర్తించును.
ఇంక మేఘములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, సప్తర్షులు, ధ్రువుడు ననునవి, ఒక దానిపై మరియొకటి యుండును.
భూమినుండి బ్రహ్మలోకము వరకు గల అంతరములు దిగువ విధముగా గ్రహింపఁదగినవి.
భూమండలము నుండి సూర్యమండలము లక్ష యోజనములు, సూర్యమండలమునుండి రవిరథము పదునారు (16) వేల యోజనములు, రవి రథము నుండి ధ్రువలోకము ఎనుబదినాలుగు (84) వేల యోజనములు - ధ్రువలోకము నుండి మహర్లోకము కోటి యోజనములు; మహర్లోకము నుండి జనలోకము రెండు కోట్ల యోజనములు - జనలోకము నుండి తపోలోకము నాలుగు కోట్లు యోజనములు -తపోలోకము నుండి బ్రహ్మలోకము ఆరు కోట్ల యోజనముల ఎత్తుపై నుండును.
మహోజన తపోలోకములు బ్రహ్మదేవుని దిన ప్రళయమున లోపింపనివై బ్రహ్మాంతమువరకు శాశ్వతములుగా నుండును.
భూః, భువః, స్వః, మహః జనః, తప, సృత్యములనఁ బడు ఏడు - పుణ్యలోకములుగా పరిగణింపఁబడును. భూలోకము క్రింద సప్త పాతాళములయొక్క దిగువన గల ఇరువది ఎనిమిది కోట్ల నరకములలో పాపాత్ములు తమ తమ కర్మల ననుసరించి శిక్షింపఁబడుచుందురు.
ఇయ్యది ఒక బ్రహ్మాండము యొక్క స్వరూపము కాగా ఇటువంటి బ్రహ్మండములు వేల కొలది కోట్ల కొలదియు బీజరూపములుగ నుండును.
ప్రకృతి - పైన క్రింద అడ్డముగాను బ్రహ్మాండముల నన్నిటిని వ్యాపించి యుండును. ప్రతి బ్రహ్మాండములో పదునాలుగు లోకములు ఇమిడియుండును. ఈ బ్రహ్మాండములన్నిటి యొక్క కర్త - మహేశ్వరుడేను.
లోకాలోక పర్వతము యొక్క పార్శ్వము వరకు మాత్రము సూర్యకిరణములు ప్రసరించును. రెండవ పార్శ్వమంతయు చీకటి నిండియుండును. ప్రతి బ్రహ్మాండము యొక్క ఆవరణములలోనే గాక వెలుపల నష్టమూర్తి యుధించియుండును. వాస్తవముగా శరీరము లేనట్టి మహాదేవునకీజగత్తు దేహమగుచున్నయది. ఆద్యంతములు లేనట్టి మహేశ్వరు నర్ధాంగియగు ప్రకృతి - మహత్తత్త్వ అహంకార శబ్ద స్పర్శ రూప రస గంధములనఁ బడు ఏడు అంగములు కలది కాగా మహేశ్వరుడు పృథివీ జల అగ్ని వాయు ఆకాశములు (5) కర్మజ్ఞానేంద్రియములు (10) మనస్సు నను పదునారు (16) అంగములు గల వాడునై పంచమహాభూతములు (5) సూర్య చంద్రులు (2) తనను శాంభవదీక్షతో సుపాసించు లేక యజ్ఞ కర్తయగు జీవాత్మ (1) యను ఎనిమిది మూర్తులు గలిగియుండును.
పరమేశ్వరుని ఆజ్ఞవలన భూమి స్థిరముగా నిలచియున్నది. మేఘములు ఉదకమును కురిపించుచున్నవి. సముద్రములు ఎంత యుప్పొంగినను భూమిని ముంచి వేయకున్నవి. సూర్య చంద్ర నక్షత్ర గ్రహాది జ్యోతిర్గణము ఆకాశమునందు సంచరించుచున్నది. ఇంద్రాది దేవతలు వైమానికులును చరాచర ప్రాణులును తమ తమ కర్తవ్యములను నెరవేర్చుచున్నవారు.
హరి బ్రహ్మేంద్రాది దేహులందరు పశుపతి యగు మహేశ్వరునకు పశువులై కింకరులగుచున్నవారు.
ఇక కేనో పనిషదృత్తాంతము ననువదించు లింగమహా పురాణము ఎంతటి వేదాంత సన్నిహిత మైనదో గమనింపుడు!
పూర్వము ఒకప్పుడు దేవతలు రాక్షసులును పోరాడగా - నమరులు గెలిచిన వారై గర్వముఁ జెందియుండిరి. అట్టితో పరమేశ్వరుడు యక్షుని రూపముతో ఆకాశమునందు కనుపడగా దేవేంద్రు ననుమతిని అగ్ని దేవుడు యక్షుఁజేరి యాతని ముందున్న గడ్డిపలకను కొల్పజాలలేదు. వాయువు తృణమును కదల్పజాలలేదు. ఇతర దేవతలును తమ తమ సామర్థ్యములను వినియోగించి వ్యర్థులైరి.
అప్పుడు దేవేంద్రుడు సమీపించి “నీ వెవరు?” అని ప్రశ్నింపగా యక్షుడు అదృశ్యుడయ్యెను ఆ పిదప సర్వాభరణములతో శోభించు పార్వతీ దేవి ప్రత్యక్షముకాగా దేవేంద్రాదులు “ఈ యక్షుడెవరు?“ అని ప్రశ్నించిరి. అట్టితఱి జగదంబ “యక్షస్వరూపుఁడు పరమేశ్వరుఁడు. ఆతని శాసనము ననుసరించి నేను ప్రవర్తించుచు జయాపజయముల నేర్పరచుచుందును. పరమేశ్వరుని వలన నేను ముందు ఆవిర్భవించితిని. ఈ బ్రహ్మాండ మంతయు మహేశ్వరుని ఆజ్ఞకు లోబడియుండును. ఇట్టి బ్రహ్మాండము నుండి బ్రహ్మాదేవుఁడు జన్మించి శివాజ్ఞాబద్ధుఁడై స్థూల జగత్సృష్టిఁజేయుచున్నవాడు.
జ్యోతిర్గణము మొదలగు విశేషములు గల ప్రపంచమంతయు శివాత్మకమై శివశాసనము ననుర్తించుననియు, ‘‘మేము విజయులమైతి“ మని గర్వింపకుడు ! మీ విజయమునకు కారణము శివానుగ్రహమే ననియు “ప్రబోధించినందున నమరులు తమ గర్వమును తొలగించుకొని పరమేశ్వరునందు నిష్ఠ గలవారైరి.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (53) ఏబది మూడవ అధ్యాయము.
Summary of chapter 53 of the Linga Mahā Purana is as follows:
Continuing the description of Bhuvanakosha, this chapter details the outer boundaries of the earth, the Lokāloka mountain range that divides the illuminated world from the realm of darkness, and the surrounding shell of the cosmic golden egg. The text explains how divine light and cosmic energy flow from Parameśvara to sustain life throughout all enclosed worlds.