లింగ మహా పురాణము
105 - గజాననుని ఉదయము, మరియు గణపతికి శంకరుడు వరముల నొసగుటయు
ఇట్లు దేవేంద్రాదులు పరమేశ్వరునకు ప్రణమిల్లి ప్రార్థింపగా నవ్వారికి మహేశ్వరుఁడు దర్శనము నొసఁగి శుభము కలుగునట్లు ఆశీర్వదించెను. అట్టితఱి బృహస్పతి వినమ్రుఁడై దైత్య దానవ రాక్షసులకు విఘ్నముల నొనఁగూర్చుటకు, ఆదితేయులకు విజయమును చేకూర్చుటకున్ను ఒకానొక మహాపురుషు నావిర్భవింపఁజేయు” మని ప్రార్ధింపగా శంకరుడు శాంకరి ననురాగముతో నవలోకించినందున గజవక్త్రము, త్రిశూల పాశధారణంబు గల వినాయకుఁడు పార్వతీ దేవి నుండి యుద్భవించెను.
ఆ శుభసమయమున ఖేచరుట సిద్ధులును పుష్పవర్షమును గావింపగా దేవతలు వినాయకుని భక్తితో నుతించిరి. వినాయకుఁడు ఆనందముతో తాండవము నొనర్చుచు, విచిత్ర వస్త్ర భూషణములఁ దాల్చి - తల్లిదండ్రులగు పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లగా మహేశ్వరుఁడుసంతసించి జాతకర్మాది సంస్కారములఁజేయించి బాలుని దరిజేర్చుకొనిన వాడై శిరస్సు నాఘ్రాణించియు “కుమారా! నీ యావిర్భావము - దైత్యులను నశింపజేయుటే గాక దేవతలకు మేలు నొనగూర్చును. బ్రహ్మవాదులైన ద్విజుల కుపకరించును.
దక్షిణ లేని యజ్ఞమునకు అన్యాయముగా జరుపఁబడు అధ్యాపనమునకు అధ్యయనమునకు వేదవేదాంగార్థ నిర్వచనమునకు సంధ్యా వందనాది కర్మకును విఘ్నములను కల్పించుము! వర్ణ భ్రష్టులైన స్త్రీ పురుషుల యొక్కయు స్వధర్మము నాచరింపనివారి యొక్కయు ప్రాణముల నపహరింపుము! నిన్ను భక్తితో పూజించువారికి నీ సమానత్వము నొసఁగుము! నీ భక్తుల నెల్లకాలము రక్షించుచుండుము! యువకులు వృద్ధులు నిన్నారాధించునెడ నవ్వారికి నభీష్టములను సిద్ధింపఁజేయుము ! ముల్లోకముల
యందు పూజనీయుడవు, వందనీయుడ వగుదువు !
నన్ను గాని శ్రీ హరిని గాని చతుర్ముఖుని గాని పూజించువారు, మొదట నిన్నారాధింతురు. నిన్ను పూజింపక చేయఁబడు శ్రౌతస్మార్త కర్మలు లౌకికకృత్యములును వ్యర్థములగును.
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులును భక్ష్యభోజ్యాదులను గంధ పుష్పధూప దీపాదులను సమర్పించి నిన్నర్చించు నెడ దేవేంద్రాద్యమరులతో గౌరవింపఁబడుదురు. నిన్ను నిరాకరించి ఇతర దేవతలను పూజించినచో ఫలమెద్దియు లభింపదు.
బ్రహ్మదేవుని నారాయణుని నన్ను విఘ్నములతో బాధింతువేని కామ్యాకాంక్షు
నిన్నారాధింపకుండురు గాక ! “ అని యను గ్రహించెను,
ఇట్టి శివాను గ్రహముఁబడసిన వినాయకుఁడు విఘ్నగణములను పుట్టించి మహేశ్వరునకు ప్రణమిల్లియు ముందు నిలువబడెను. అప్పటినుండి ప్రపంచమున వినాయకుని పూజించుట - ప్రసిద్ధంబైనది.
“శౌనకాదులారా! స్కందాగ్రజుడైన గణేశుని ఉత్పత్తిని వివరించితిని. ఈ యధ్యాయమును చదువువాడు, వినువాడు వినుపించువాడును శాశ్వతకాలము సుఖపడుదురు.” అని సూతుఁడు ప్రవచించి మధ్యాహ్నకృత్యమునకై విరమించెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (105)వ అధ్యాయము.
Summary of chapter 105 of the Linga Mahā Purana is as follows:
The narrative details the divine manifestation of Bhagavān Vināyaka, Gaṇeśa, created by Mother Pārvatī from divine unguents and endowed with life by Śiva. The chapter recounts how Vināyaka was appointed by Prabhu Śiva as the supreme lord of obstacles, Vighneshvara, who must be worshipped first in all Vedic and Agamic rituals to ensure success and overcome all impediments.