లింగ మహా పురాణము
55 - శివాంతర్యామికుడైన సూర్యుని రథమును వర్ణించుట
సూర్యుని యొక్కయు, చంద్రుని యొక్కయు గ్రహములయొక్కయు గతిని నిరూపించుచున్నానని సూతుఁడు చెప్పఁ దొడఁగెను.
ద్విజ శ్రేష్ఠులారా !
బ్రహ్మదేవుడు రథమును నిర్మించి సూర్యున కొసఁగెను. అయ్యది సంవత్సరావయవములతో, మూడు నాభులు పంచ ఆరములు గల చక్రముతో కూడినదైసువర్ణమయంబునై సర్వామరప్రియంబునై భాస్కరుని నివాసముగా నలరారుచుండును.
అరమనగా - రథచక్రము యొక్క ఆకు;
నాభియనగా - రథచక్రము యొక్క నడిమితూము;
సూర్యరథము - తొమ్మిది వేల యోజనముల వెడల్పు, పొడవును గలదై లోన పదునెనిమిది వేల యోజనముల పరిమితి గల స్థలముతో నమరినదియునై అంతరిక్షమున భూమినంటక సంచరించునదై గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి. త్రిష్టుఁ, అనుష్టుప్, పంక్తియను ఏడు ఛందస్సులతో నిర్మింపబడినట్టి సప్తాశ్వములతో నడుపఁబడునదై యుండును.
అట్టి రవిరథసంచారమునకు ఆలంబనము ధ్రువుడు గాన ధ్రువుడు గూడ రవిరథము ననుసరించి అంతరిక్షోపరిభాగమున సంచరించుచు సూర్యచంద్రాది జ్యోతిస్సులను వాయుప్రసారములచే చలింప జేయుచుండను. దేవతలు మునులును శివాత్మకుఁడైన భాస్కరు నారాధించు చుందురు. మరియు సంవత్సరములో రెండేసి నెలలుగా నేర్పడు ఆరు ఋతువులు - రవి రథమును పరివేష్టించి యుండును. గంధర్వులు అప్సరసలును నృత్య గీతములతో రవి నుపాసించుచుందురు. సర్పములు సూర్యరథమును చుట్టుకొని యుండును. యాతుధానులు అనబడు రాక్షసులు రవిరథము ననుసరింతురు. వాలఖిల్యమునులు ఉదయాద్రి నుండి అస్తాచలమునకు రవి రథమును గొంపోవుచుందురు.
చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తికము, మార్గశీర్షము, పౌషము, మాఘము, ఫాల్గునము ననునవి పండ్రెండు మాసములగును. ఈ పన్నెండు నెలల కాలము మానవులకు సంవత్సరమగును.
వసంతము, గ్రీష్మము, వర్షము, శరత్తు, హేమంతము, శిశిరము ననునవి ఋతువులనబడును.
ధాత - అర్యమ - మిత్రుఁడు-వరుణుఁడు--ఇంద్రుఁడు- వివస్వంతుఁడు-పూష - పర్జన్యుఁడు - అంశువు - భగుఁడు - త్వష్ట - విష్ణువుననువారు ద్వాదశాదిత్యులగుదురు.
పులస్త్యుఁడు, పులుహుఁడు, అత్రి, వసిష్ఠుఁడు, ఆంగీరస్సు, భృగువు, భారద్వాజుఁడు, గౌతముఁడు, కశ్యపుఁడు, క్రతువు, జమదగ్ని, కౌశికుఁడు ననువారు - ద్వాదశ మునులగుదురు.
వాసుకి - కంకణీకరుఁడు - తక్షకుఁడు - నాగుఁడు - ఏలాపత్రుఁడు - శంఖపాలుఁడు - ఐరావతుఁడు ధనంజయుఁడు - మహాపద్ముఁడు - కర్కోటకుఁడు -కంబలుఁడు - అశ్వతరుఁడు ననువారు - ద్వాదశమహాసర్పములగును.
తుంబురు - నారుదుఁడు - హాహా - హూహూ - విశ్వావసువు, ఉగ్రసేనుఁడు, సురుచి, పరావసువు, చిత్రసేనుఁడు, ఊర్ణాయువు, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చస్సు ననువారు ద్వాడశగంధర్వులన బలగుదురు.
వీరందరును నానావిధరీతులలో ఆకసమున సువర్ణరథముపై శరవేగముతో సంచరించు సూర్యభగవాను నారాధించువారేను.
కృతస్థల - శుభానన - శుభశ్రోణి - దివ్య - పుంజికస్థల-మేనక- సహజన్య - ప్రమోచ - శుచిస్మిత- అనుమోచ - ఘృతాచి - విశ్వాచి - ఊర్వశి- పూర్వచిత్తి-- తిలోత్తమ రంభ యను దివ్యాంగనలు, నృత్యములతో గేయములతోడను సూర్యు నభినందించుచుందురు.
రథకృత్ - రథౌజస్సు - రథచిత్రుఁడు - సుబాహువు - రథస్వనుఁడు -వరుణుఁడు - సుషేణుఁడు - సేనజిత్తు - తార్యుఁడు అరిష్టనేమి - క్షతజిత్తు - సత్యజిత్తు -సను పండ్రెండ్రుగురు ముఖ్యులు రవి రథాశ్వముల యొక్క పగ్గములను పట్టుకొని సూర్యరథము వెంట నడచుచుందురు.
మునులు స్వవిరచితములగు స్తోత్రములతో రవిని పొగడుచుందురు. వీరందరు మానవులచే కీర్తింపఁ బడినచో నవ్వారి దురితములను పోగొట్టుచుందురు. దురాత్ముల పుణ్యము నపహరించుచుందురు. వీరందరు కోమగమనము గల విమానమునందు సూర్యరథము వెంట సంచరించు చుందురు. ఒక మన్వంతరమువరకు ప్రాణులను కాపాడుచుందురు.
ఇవ్విధము - సూర్యభగవానుడు ఏకచక్రరథమున ఆకుపసుపు వన్నె గలిగి, వినాశము లేనట్టి ఏడు గుఱ్ఱములతో వహింపబడుచు సప్తద్వీపములు గల పృథివిని ప్రకాశింపఁజేయుచు అంతరిక్షమున సంచరించుచుండునని తెలియవలెను.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక” అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (55) ఏబది ఐదవ అధ్యాయము.
Summary of chapter 55 of the Linga Mahā Purana is as follows:
The narrative presents a detailed description of Sūryaratha, the divine single-wheeled chariot of Sūrya Deva, drawn by seven divine horses representing the Vedic meters. The chapter details how solar rays draw water from the oceans, distribute life-giving rain across the earth, and sustain the vital forces of devas, pitṛs, and human beings under the direction of Śiva.