లింగ మహా పురాణము
50 - ఇంద్రాదుల యొక్క పట్టణములను వర్ణించుట
,శితాంత పర్వత శిఖరమున పారిజాత వనము నందు దేవేంద్రుఁడుండును. దానికి తూర్పున గల కుముద పర్వతము యొక్క శిఖరమున దానవుల ఎనిమిది పురములు; సువర్ల కోటరాద్రిపై రాక్షసుల నరువది యెనిమిది పట్టణములు; మహానీలాచలమున అశ్వముఖములు గల కిన్నరుల యొక్క పదునైదు పురములు; వేణుసౌధాద్రిపై విద్యాధరుల మూడు సగరములు; వైకుంఠము అను పర్వతమున గరుత్మంతుని నివాసము; కరంజాద్రిపై నీల లోహితరుద్రుని ఆవాసము; వసుధార నగమునందు అష్టవసువుల నివాసము; రత్న ధారాద్రిపై సప్తర్షుల యొక్క సప్తభవనములు; ఏక శృంగ పర్వతమున ప్రజాపతి యొక్క నివాసము; గజశైలాద్రియందు దుర్గాదేవ్యాదుల నివాసములు; హేఘకక్షమనబడు నగముపై ద్వాదశాదిత్యుల యొక్కయు, ఏకాదశ రుద్రుల యొక్కయు, అశ్వినీ దేవతల యొక్కయు, ఆవాసములు; హేమ కక్ష పర్వతమున ఎనుబది (80) దేవతా నగరములు; సునీలాద్రిపై పంచకూటాద్రిపైనను రక్కసుల ఐదు కోట్ల నివాసములు; శతశృంగ పర్వతముపై యక్షుల యొక్క నూరు పురములు; తామ్రాభనగమున సర్పరాజముల నివాసములు; విశాఖాద్రియందు కార్తికేయుని పురము; శ్వేతోదరాద్రిపై సుపర్ణుని సౌధము; పిశాచక పర్వతమున కుబేరుని నివాసనగరము హరికూటాద్రిపై నారాయణుని సౌధము; కుముద పర్వతమున కిన్నరావాసము; అంజనాద్రియందు చారణుల నివాసము; కృష్ణ పర్వతమున గంధర్వనగరములు; పాండురాద్రియందు విద్యాధరులయొక్క ఏడు నగరములు; సహస్ర శిఖర పర్వతమున ఉగ్రులైన దైత్యుల యొక్క ఏడువేల పురములు; పుష్పకేతు నగమున పన్నగుల నివాసములు; తక్షకాద్రిపై సూర్య చంద్ర వాయు నాగాధిపుల యొక్క నాలుగు ఆయతనములు; బ్రహ్మ విష్ణు రుద్ర కుమార కుబేర ఈశానుల యొక్క భూలోక సీమలగు పర్వతములపై నివాసములు విరాజిల్లుచుండును.
శ్లో॥ శ్రీకంఠాద్రి గుహావాసీ - సర్వావాసః సహోమయా । శ్రీకంఠస్యాధి పత్యం వై-సర్వదేవేశ్వరస్య చ ॥ అండ స్యాన్య ప్రవృత్తిస్తు-శ్రీకంఠేన న సంశయః ॥
సర్వాధారుడగు పరమేశ్వరుడు శ్రీకంఠపర్వతము జెందిన గుహలో పార్వతీ దేవితో విహరించుచుండును. సర్వ దేవేశ్వరుడైన శ్రీ కంఠమహాదేవునిదే అధికారము గావున నీ బ్రహ్మాండమును శ్రీకంఠుడే ప్రవర్తింపఁజేయును.
అనంతేశాదివిద్యేశ్వరులు ప్రత్యేకముగ బ్రహ్మాండమును రక్షించుచు తమ శాసనము నప్రతిహతమునొనర్చువారు. చరాచర ప్రపంచము ప్రళయకాలాగ్ని నుండి శివుని వరకు శ్రీకంఠునిచే నదిష్ఠింపబడినది గాన దీనిని విస్తరించి చెప్పనలవి కాదు.
ఇయ్యది “శివ విజ్ఞాన వీచిక “ అను శాంకరీయ ఆంధ్రానువాద ప్రవచనమున (50) ఏబదియవ అధ్యాయము.
Summary of chapter 50 of the Linga Mahā Purana is as follows:
The chapter presents a comprehensive description of Bhuvanavinyāsa, detailing the celestial abodes, palaces, and realms of the various devas, lokapālas, and cosmic deities located on the summits around Mount Meru. It outlines how these celestial realms are arranged in accordance with cosmic order and spiritual hierarchy established by Parameśvara Śiva.