నారద మహా పురాణము - ఉత్తరార్థము
79 - మధురా మాహాత్మ్యము
మోహిని పలికేను :-
ఓ వసూ ! నరుల పాపములను హరించు అవస్తి మాహాత్మ్యమును వింటిని.ఇపుడు మధురా మాహాత్మ్యమును వినగోరుచున్నాను.
వసువు పలికేను:-
మోహినీ! శుభావహమగు మధురామాహాత్మ్యమును చేప్పెదను. వినుము ఈమధురలో బ్రహ్మ ప్రార్ధనచే శ్రీహరి జన్మించెను. మధురలో ఆవిర్భవించి నందగోకులమును చేరెను. నన్దగోకులమున నివసించి గోపకులతో నానా క్రీడలనాచరించెను. కంసుడు పంపిన పూతనాది రాక్షసులను సంహరించి ద్వాదశవనములలో గోపికలతో విహరించేను. ద్వాదశవనములలో కలతీర్ధములను, ముధురలో గల తీర్దములను ఇపుడు నీకు చెప్పెదను వినుము. మొదటిది మధువనము. ఇచట స్నానమాడి పితరులకు దేవతలకు తర్పణము నాచరించినవారు విష్ణులోకమున విరాజిల్లెదరు. ఇక రెండవది తాలవనము. ఇచట స్నామాడినవారు కృతకృత్యులయ్యేదరు. మూడవది కుముదవనము. ఇచట స్నానమాడినవారు వాంఛితార్ధములను పొంది. ఇహపరములందు ఆనందింతురు. నాలుగవది కామ్యవనము. ఇచటికి వెళ్లిన వారు విష్ణులోకమును పొందెదరు. ఇచట చాలా తీర్ధములు కలవు. వాటిలో విమల కుండము సర్వతీర్ణోత్తమోత్తమము. ఇచట స్నానమాడిన వారు విష్ణుపదమును చేరెదరు. అయిదవది బహులావనము. ఇచట స్నానమాడినవారు సర్వాభీష్టములను పొందెదరు. ఆరవది భద్రవనము. ఇచట స్నానమాడినవారు శ్రీకృష్ణానుగ్రహముతో సర్వభద్రములను బడయగలరు. ఏడవది ఖాదిరవనము. ఇచట స్నానమాత్రముననే పరమపదమును పొందెదరు. ఎనిమిది శ్రీహరికి ప్రియమగు మహావనము. భక్తితో ఈవనమును చూచినవారు ఇంద్రలోకమున విరాజిల్లెదరు. తొమ్మిదవది లోహజంఘవనము. ఇచట స్నానమాడినవారు మహావిష్ణు ప్రసాదమున భుక్తి ముక్తులను పొందును. పదియవది .బిల్వారణ్యము. ఇచటస్నానమాడినవారు నిజేచ్చానుసారముగా శివలోకమును కాని విష్ణులోకమును కాని పొందగలరు. పదకొండవది యోగి దుర్లభమగు ఖాండీరవనము. ఇచట స్నానమాడినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. ఇక పన్నెండవది సర్వపాపహరమగు బృందావనము. బృందావనసమమగుమరియొక వనము ఈ భూమండలముననే లేదు. ఇచట స్నానమాడి దేవర్షి పితృ తర్పణము గావించినవారు ఋణత్రయము క్తులై విష్ణులోకమున విరాజిల్లెదరు. మధురామండలము వింశతియోజనపరివ్యాప్తముగా ఉన్నది. ఈ మండలమున ఎచట స్నానమాడిననూ విష్ణుభక్తిని పొందగలరు. ఈ మండల మధ్య భాగమును మధురానగరము సర్వోత్తమోత్తమము. ఈ నగరమునుదర్శించినంతనే మాధవ భక్తి కలుగును. ఇచటనే విశ్రాన్ని తీర్థము కలదు. ఇచట భక్తి చే స్నానమాడినవారు వైష్ణవపదమును పొందెదరు. విశ్రాప్తి సమీపమున దక్షిణ భాగమున విముక్తమను ఉత్తమతీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు నిశ్చయముగా ముక్తిని పొందగలరు. ఇచటికి దక్షిణభాగమున రామతీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు అజ్ఞానబంధమునుండి విముక్తులగుదురు. ఇచటికి దక్షిణమున సంసారమోక్షణతీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు విష్ణులోకమున విరాజిల్లెదరు. ఇచటికి దక్షిణభాగమున దేవదుర్లభమగు ప్రయాగ తీర్ధముకలదు. ఇచట స్నానమాడినవారు అగ్ని హొమ ఫలమును పొందెదరు. తరువాత కనకలతీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు దేహాంతమున స్వర్గమును పొంది నందనాదులలో విహరించేదరు. ఇచటికి దక్షిణమున తిందు తీర్ధము కలదు. ఇచట స్నానమాడినవారు రాజసూయఫలమును పొంది స్వర్గమున ఆనందింతురు. దాని తరువాత సటుస్వామితీర్ధము కలదు. ఇది భాస్కరప్రియము. ఇచట స్నానమాడి సూర్యసందర్శనమును గావించి భోగములననుభవించి స్వర్గమును పొందెదరు. ఇచటికి దక్షిణభాగమున ధ్రువతీర్ధము కలదు. ఇచట స్నానమాడి ధ్రువుని దర్శించిన వారు విష్ణుపదమును పొందెదరు. ధ్రువ తీర్ధమునకు దక్షిణ భాగమున సప్తర్షిసేవిత తీర్ధము కలదు. అచట స్నానమాడి సప్తర్షులను దర్శించి ఋషిలోకమున ఆనందించును. ఋషితీర్ధ మున కు దక్షిణమున ఉత్తమమగు క్షతీర్థ ము కలదు. ఇచటస్నాన మాత్రమున సర్వపాతకవినిర్ముక్తుడగును. ఇచటికి దక్షిణభాగమున బోధినీ తీర్ధము ఇచటస్నానముచేసి పితరులకు పిండప్రదానము చేసి వారిని స్వర్గమున చేర్చగలడు ఇచటికి దక్షిణ భాగమును కోటి తీర్థము కలదు. ఇచట స్నానమాడిన సర్వపాపవినిర్ముక్తుడై విష్ణులోకమును పొందును. విశ్రాస్తితీర్ధమున కుత్తర భాగమున అసి కుండతీర్ధము కలదు. ఇచట స్నానమాడిన విష్ణు పదమును చేరును.
అసి కుండముననుత్తర భాగమున నవతీర్థము కలదు. ఇచట స్నానమాడిన స్వర్గమును పొందును. ఇచటికి ఉత్తరమున సంయమనతీర్థము కలదు. ఇచట స్నానదానములతో యమలోకదర్శనము కాదు. ఇచటికి ఉత్తరమున ధారాయతన తీర్థము కలదు. ఇచట స్నానమాడినవారు పితరులతో కలిసి ఆనందింతురు. ఇచటికీ ఉత్తరమున నున్న నాగతీర్థమున స్నానమాడినవారు సర్పములనుండి అభయమును పొందగలరు. ఇచటికి ఉత్తరమున గల ఘంటాభరణమను బ్రహ్మతీర్థమున స్నానమాడినవారు పాపవిముక్తులై బ్రహ్మలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల సోమ తీర్థమున స్నానమాడినవారు సోమలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల ప్రాచీ సరస్వతిలో స్నానమాడినవారు వాగీశ్వరులయ్యెదరు. ఇచటికి ఉత్తరమునగల చక్రతీర్థమున స్నానమాడిన మానవులు శత్రువర్గమును జయించి స్వర్గమున ఏడు యుగములు ఆనందింతురు. ఇచటికి ఉత్తరమున గల దశాశ్వమేధిక తీర్థమున స్నానమాడిన అశ్వమేధఫలము లభించును. ఇచటనున్న గోకర్ణ శివుని యధావిధిగా పూజించినవారు ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున శివలోకమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల విఘ్నరాజతీర్థమున స్నానమాడినవారు నిర్విఘ్నముగా సర్వకర్మఫలమును పొందెదరు. ఇచటికి ఉత్తరమున గల అనన్త తీర్థమున స్నానమాడినవారు చతుర్వింశతి తీర్థముల ఫలమును పొందెదరు. మధురానగరమున సాక్షాత్తుగా శ్రీహరియే యున్నాడు. చతుర్వ్యూహరూపముతో ఇచటినుండి మధురా వాసులకు ముక్తి ప్రదుడగుచున్నాడు. వారాహమూర్తి, నారాయణమూర్తి, వామనమూర్తి, హలధర మూర్తి అని నాలుగు వ్యూహరూపములు. ఇట్లు చతుర్వ్యూహధరుని దర్శించి యధావిధిగా పూజించినవారు ముక్తిని పొందెదరు. రంగేశుని, భూతేశుని, మహావిద్యను, భైరవుని దర్శించి యధావిధిగా పూజించి తీర్థయాత్రఫలమును పొందెదరు. చతుస్సాముద్రిక కూపమున కుబ్జ కూప మున, గణేశకూపమున, కృష్ణగంగయందు స్నానమాడినవారు పాప విముక్తులగుదురు. సమగ్రమధురామండలాధిపత్యమున క్లేశనాశకుడగు మాధవుడు కలడు. మధురామండలమున కేశవుని దర్శించనివారి జన్మవ్యర్థము. వారు సంసారముననే పరిభ్రమించెదరు. ఇంకా ఇతర తీర్థములు అసంఖ్యాకములు కలవు. మధురామండలమున కేశవుని దర్శించనివారి జన్మవ్యర్థము. వారు సంసారముననే పరిభ్రమించెదరు. ఇంకా ఇతర తీర్థములు అసంఖ్యాకములు కలవు. వాటియందు స్నానమాడి దానమాచరించినవారు దుర్గతిని పొందజాలరు. ఈ మధురామాహాత్మ్యమును వినినవారు వినిపించినవారు హరిభక్తిని పొంది సర్వాభీష్టములను బడయుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తరభాగమున వసుమోహినీసంవాదమున మధురామాహాత్మ్య వర్ణనమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.
