నారద మహా పురాణము - ఉత్తరార్థము
16 - పతివ్రతోపాఖ్యానమ్
వసిష్ఠమహర్షిపలికెను :- ధర్మాంగదుని మాటలను విని సంతోషించిన రుక్మాంగద మహారాజు ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఇది నిజమే. ఈమోహిని నీతల్లియే. నాకు మందర పర్వతమున లభించినది. ఈమె బ్రహ్మపుత్రిక. నన్ను భర్తగా పొందవలయునని దృఢనిశ్చయము చేసుకొని మందరపర్వతమున దారుణమగు తపమును చేయుచున్నది. నేను ఇటనుండి అశ్వముపై బయలుదేరి పదునైదు దినములలో బహుధాతుసమన్వితమగు మందరపర్వతమును చేరితిని. ఆపర్వత శిఖరమున ఈ బాల మహేశ్వరుని గానముచే సంతోషింపచేయు చున్నది. చూడముచ్చటగా నున్న ఈగానము చేయుచుండగా నేను చూచితిని. ఈమె సౌందర్యమును చూచి నేను మూర్చిల్లి భూమిపై పడితిని. వ్యాధుని చే కొట్టబడిన మృగమువలే మన్మధ బాణములచే కొట్టబడితిని. తరువాత చారునేత్రయగు ఈదేవి వచ్చి నన్ను కదిలించినది. నేను కొంచెము ప్రార్థిచంగా నన్ను భర్తగా వరించినది. నేను కూడా నాదక్షిణ హస్తమును చాచి ప్రతిజ్ఞ చేసితిని. అపుడు మందర పర్వత శిఖరమున ఈమెను వివాహము చేసుకొంటిని. పర్వతము నుండి దిగి అశ్వమునధిరోహించి మూడు దినములలో వేగముగా నీదగ్గరికి చేరితిని. దారిలో పర్వతములను, ప్రదేశములను, సరస్సులను, నదులను చూచుచు వచ్చితిని. ఇట్లు ఈమె నీకు తల్లి. నీకు ప్రీతిని పెంచును. నీవు ఈసుందరాంగిని నీతల్లిని నమస్కరించినట్లు నమస్కరించుము. అట్లు పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగదుడు అశ్వము మీద నున్న మోహినికి భూమి మీద పడి సాష్టాంగ ప్రణామమును ఆచరించి ఇట్లు పలికెను. ఓతల్లీ! నాయెడ ప్రసన్నురాలవు కమ్ము. నీవు నాకు తల్లివి. నేను నీకు పుత్రుడను. భృత్యుడను, దాసుడను, చాలా మంది రాజులతో కలిసి నీకు నమస్కరించుచుంటిని. ఇట్లు భూమి మీద పడియున్న పుత్రుని మోహినీదేవి చూచి, భర్త ప్రేమననుసరించి అశ్వము నుండి దిగి, పడియున్న ధర్మాంగదుని లేపి, బాహువులచే ఆలింగనము చేసుకొనెను. అట్లు తల్లి ఆలింగనము చేసుకొనగా మరల అభివాదము చేసెను. తరువాత మోహినికి చక్కని వస్త్రాభరణములను సమర్పించి అలంకరింప చేసి మరల తన వీపుపై ఆమెపాదము నుంచి అశ్వముపై అధిరోహింపచేసెను. అదే విధముగా తండ్రిని కూడా అశ్వారోహణమును చేయించెను. ధర్మాంగదుడు మాత్రము రాజులతో కలిసి కాలినడకన సాగెను. తల్లియగు మోహినిని చూచి సంతోషముచే పులకించెను. తాను స్వయముగా మేఘగంభీరవాదముచే స్తోత్రము చేయుచుండెను. ఎక్కువ మంది తల్లులున్న పుత్రుడు ఈలోకమున ధన్యుడు. తండ్రికి కొత్త భార్యలు, కొంగొత్త భార్యలు ఎక్కువ ప్రీతి పాత్రులుకదా? ఒకే తల్లియున్న పుత్రుడు, ఒకే భార్య యున్న తండ్రి కూడా దుఃఖభాజనులగుదురు. తండ్రి దుఃఖితుడైన చోపుత్రుని హృదయమున సౌఖ్యమెట్లు కలుగును? ఒక తల్లికి నమస్కరించిననే పృధివీఫలము లభించును. చాలా మంది తల్లులకు నమస్కరించిన ఎంతో పుణ్యము లభించును కదా. కావున ప్రతిదినము చాలామంది తల్లులకు నమస్కరించుచుండువానికి కలుగు పుణ్యము ఆనంతముకదా? ధర్మాంగదుడు రాజులతో కలిసి ఇట్లు స్తుతించుచు సుందరము, అభివృద్ధి సహితము అగు విదిశానగరమును చేరెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినితో కలిసి అశ్వముపై నగరమును చేరెను.
అపుడు ప్రజలచే పూజింపబడుచు తన భవనమును చేరి అశ్వమునుదిగి మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ పుత్రుడగు ధర్మాంగదుని ఇంటికి వెళ్ళుము. ఈ ధర్మాంగదుడు యధోచితముగా నీకు సేవలను చేయును. ధర్మాంగదుడు చేయు సేవలను నీకు నీ చెలి, నీ దాసి కూడా చేయజాలదు. ఇట్లు భర్తమాటతో తన గృహమునకు వెళ్లుచున్న మోహినిని చూచి, రాజులలో మీరు ఇచటనేయుండుడు, తండ్రి ఆజ్ఞచే నే నీతల్లిని సేవించెదను. అని పలికి, ఆమెను చేతులతో తీసుకొని పదునైదవ మందిరమునకు తీసుకొని వెళ్ళి, బంగారముచే నిర్మించబడి, పట్టసూత్రము చుట్టబడి, కోమలము దృఢము అయిన, మెత్తని అస్తరణముగల, మణి రత్న విభూషితము, రత్నదీపఖచితము, సూర్యసమానకాంతి యుతము, అగు పర్యంకమున కూర్చుండబెట్టెను. అంతట ధర్మాంగదుడు మోహినీ దేవికి పొదప్రక్షాలనముగావించెను. సంధ్యావలీ దేవికంటే పూజ్యురాలుగా భావించేను. మోహినిని చూచిన ధర్మాంగదుని మనసు కలుషితము. కాకపొయేను. ధర్మాంగదుడు సుకుమారుడు సుందరుడు యువకుడు అయిననూ తన్వంగి పీనోరు జఘనస్తని యగు మోహినిని పదివేల సంవత్సరముల దానినిగా బాలునిగా భావించేను. ఆమె తనను మూడుసంవత్సరముల పాదములను కడిగి ఆజలమును తలపై దాల్చెను. వినయముతో వంగి తల్లీ! నేను ధన్యుడనైతిని అని పలికెను. ఇట్లు పలికీ ఇతర నరులతో నారీమణులతో పాటు తానుకూడా ఆమెకు అలసటను తొలగించును పచారములను చేసెను, సంతోషముతో ఆమెకు అన్ని భోగములను కూర్చెను. క్షీరసాగరమున మధన సమయమున సముద్రమునుండి ఉత్పన్నములై అమృతమును స్రవించుచున్న పాతాళము లోకమున దానవులను గేల్చిపొందిన కుండలములను మోహినీ దేవి కర్ణములకు అలంకరించెను. ధాత్రీఫలములవలె స్వచ్చమగు నూటా ఎనిమిది ముత్యములచే రచితమగు హారమును మోహినీదేవి హృదయమున అలంకరించెను. నిష్కము పలశతమితము, అనేక వజ్రఖచితముఅగు లఘూత్తర హారమును ఆమె కంఠసీమలో నలంకరించేను. రెండు చేతులకు ఎనిమిది కంకణముల చొప్పున పదహారింటిని ఒక్కొక్కటి కోటి నిష్కములు కలిగి, విలువ తెలిసిన వారిచే చేయబడినవాటిని తొడిగెను. వెలకట్టలేని కేయూరములను, నూపురములను అలంకరించుకొనుట కిచ్చెను. తారకాసుర యుద్ధమున భయముచే పార్వతీ దేవినడుమునుండి జారిపడిన కాలనేమి రాజ్యముననది. దానిని లోకమయి యగు మయాసురుడు తీసుకొనెను. కోటిమంది దైత్యులచే కూడియున్న మయుని ధర్మాంగదుడు తండ్రి ఆజ్ఞచే సంవత్సరము యుద్ధముచేసి సంహరించేను. అతని ప్రియురాలి నడుమునకున్న కటి సూత్రమును హరించెను. ఆకటి సూత్రమును సంతోష పులకితుడగు ధర్మాంగదుడు తండ్రికిష్టురాలగు మోహినికి సమర్పించెను. పూర్వకాలమున లోకసుందరియగు హిరణ్యకశ్యపుని భార్యకు సౌదామిని సమప్రభమగు సీమంతకముండెను. ఆమెభర్త మరణించినపుడు ఆ సీమంతకమును సముద్రమున పడవేసి భర్తతో అగ్నిలో దగ్గమాయెను. సముద్రుడు రెండు శ్రేష్ఠరత్నములతో కూడియున్న ఆ సీమంతకమును తీసికొని ధర్మాంగదుని పరాక్రమమునకు మెచ్చి ధర్మాంగదునికిచ్చెను. ఆ సీమంతకమును ఇపుడు ధర్మాంగదుడు మోహినికి సమర్పించెను. అగ్నివలే పరిశుద్ధములగు శుభకరములగు వస్త్రయుగ్మమును, మనోహరములు సహస్రకోటి మూల్యములు అగు కంచుకములను మోహినికి సమర్పించెను. దివ్యమాల్యములను, సుగంధాఢ్యములగు దివ్య విలేపనమును, సర్వదేవ విభునకు ఉపయోగించునది సుదర్లభము, పూర్వము ధర్మాంగదుడు ద్వీపముల విజయ సమయమున సిద్దుల హస్తము నుండి స్వీకరించునది, కామ వర్ధకమగు గంధమును మోహినీదేవికి అర్పించెను. ఇట్లు చక్కగా మోహినీ దేవిని అలంకరించి తరువాత తల్లిచే తేబడిన షడ్రసోపేతమగు భోజనమును భుజింపచేసేను. మోహిని ఎదుటనే తన తల్లిని చక్కని మాటలతో బోధించెను. ఓ తల్లీ! నేను నీవు తండ్రిగారి మాటను పాటించవలయును. అట్టి రాజుకు ఇష్టురాలు ప్రియురాలు మనకు చాలా పూజ్యురాలు. భర్తకు ఇష్టురాలగు యువతిని సవతిగా చూచిన స్త్రీ పదునలుగురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. అట్టి ఇష్టురాలిపై భర్తకు ద్వేషము కలిగించు స్త్రీ రాగి పెనముపై కాల్చబడును. కావున భర్తకు ఆనందము కలుగు విధానమునే భార్య అనుసరించవలయును. భర్తకు ఇష్టురాలగు యువతికి అనుకూలమును హితమును ఆచరించవలయును. భర్తను చూచినట్లు భర్త ప్రియురాలిని కూడా చూడవలయును. భర్త ప్రియురాలు హీనురాలైనను ఆమెను సేవించిన భార్య స్వర్గమును పొందును. తరువాత జన్మలో ఆమె కూడా భర్తకు ప్రియురాలుగా పుట్టును. భర్తకు ఇష్టమగు దానిని ఆచరించిన స్త్రీ సకల భోగములను అనుభవించగలుగును.
ఈర్ష్యా భావమును వదిలినచో సర్వేశ్వర లోకము లభించును. సవతి సేవ సేయు స్త్రీకి భర్త ప్రియమును చూచునదగును. కావున అక్షయ లోకములు లభించును. పూర్వకాలమున ఒక పురుషుడు శూద్రజాతి వాడు పరమదుష్టుడు, కర్మాచరణ హీనుడు ఉండెను. అతనికి ఒక వేశ్యపై ఇష్టము కలిగి వేశ్యను ఇంటికి తీసుకొని వచ్చెను. అపుడు భార్య వేశ్యను సంతోష పరిచెను. వేశ్య వారించుచున్ననూ ఇద్దరి ఉచ్చిష్టమును భుజించి, ఇద్దరికన్నా క్రింద పరుండి ఆ ఇద్దరికి హితమును ఆచరించు చుండెను. ఇట్లు వేశ్యతో పాటు భర్తను సేవించుచుండగా చాలాకాలము గడిచేను. ఒకనాడు భర్త మూలకములచే చేయుబడినది తైలమిశ్రితమగు మాహిష నిష్పావమును (జున్నును) దుష్టబుద్ధి కలవాడై భుజించేను. ఇట్లు పతివ్రతను అవమానించి అపధ్యమును భుజించిన అతనికి గుదమున ఘోరమగు భగందరమను రోగము పుట్టేను. అరోగముతో అతను రాత్రింబవళ్ళు దహించబఠడుచుండెను. అంతట యావేశ్య అతనింటిలో నున్న ధనము నంతటిని అపహరించుకొని వెళ్ళి కామ పరాయణురాలు కావున మరియొక యువకునికిచ్చెను. అంతట అతను దీనమగు ముఖముచే సిగ్గుపడుచు వ్యాకులమగు మనస్సుచే రోదించుచు. భార్యతో ఇట్లు పలికెను. ఓదేవీ! పరమ కఠినుడను, వేశ్యాసక్త చిత్తుడనగు నన్ను కాపాడుము. నేను పరమపాపినై నీకు ఏ మాత్రము ఉపకారమును చేయలేకపోతిని. నేను చాలా సంవత్సరములు వేశ్యతో గడిపితిని. వినయ శీలురాలు పతివ్రత యగు భార్యను ఆదరించనివాడు పదునైదు జన్మలు అశుభములను పొందును. తరువాత హీన జాతిలో పుట్టెదను. గాననీవు మాత్రము నన్ను ఆదరించుచు నీ మనసు స్వచ్చమైనదని తెలిపితివి. ఇట్లు భర్త మాటలను విని అతనితో ఇట్లు పలికెను. పూర్వ జన్మలలో చేసిన పాపములే దుఃఖములగును. జ్ఞాని ఆ దుఃఖములను సహించగలుగును. అట్లు సహించగలవాడే ఉత్తమ మానవుడు. కావున నేను పూర్వజన్మలో పాపములను చేసి యుంటిని. ఆ పాపములనే దు:ఖములనుగా అనుభవించు నాకు ఎట్టి పరితాపము లేదు. ఇట్లు పలికి భర్తను ఓదార్చి, తండ్రి నుండి బంధువుల నుండి ధనమును తెచ్చి, భర్తను శ్రీమన్నారయణునిగా భావించి పగలు మూడు మార్లు గుహ్యమును శుద్ధి చేయుచు, చంద్ర వృక్ష రసమును తీసి నఖముతో వ్రణములో వేయుచు, మెల్ల మెల్లగా వ్రణములోని క్రిములను తీసివేయుచు, నేమిలి పించముతో వీచుచుండెను. ఆమె పగలు, రాత్రి నిదురించలేదు. భర్త దు:ఖముతో పరితపించుచు జగత్తును దహించుచున్నట్లు తలచుచుండెను. ఈ భూదేవి, పితృదేవతలు, దేవతలు ఉన్నచో నా భర్తను రోగహీనునిగా చేయుడు. అట్లు చేసినచో చండికాదేవికి మేక యొక్క, మహిషము యొక్క మాంసమునుండి వచ్చు రక్తమును తర్పణ చేసెదను. ఆదరముతో పది యుపవాసములను చేయింతును. నేను నా శరీరమును చిన్నముళ్ళ పడకపై నుంచేదను. మధురమును ఘృతమును భుజించను. చాలా దినములు బాహ్యాభ్యంగ రహితముగా నుందును. నా భర్త రోగ రహితుడై నూరేండ్లు చల్లగా బ్రతుకనిమ్ము. ఇట్లు ప్రతిదినమూ పలుకుచు ఆమె గడిపెను. ఇంతలో కొద్దికాలమునకే అతనికి త్రిదోషము సంక్రమించెను. అపుడామె భర్తకు చాలా ప్రయత్నించి త్రికటువును ఇచ్చెను. శీతబాధచే వణకుచు అతను భార్య వేలును కొరికెను. రెండు పలువరుసలు ఒకటిగా కలిసి పోయెను. భార్యాంగులీ ఖండము. అతని నోటిలోనే ఉండి పోయెను అట్లే అతను పంచత్వమును పొందెను. అంతట ఆమె కంకణమును అమ్మి కట్టెలను కొని చితిని పేర్చివేయి పోసి భర్తను చేతులలో ధరించి చితిపై కూర్చొని, పాదముతో అగ్నిని ఆకర్షించి, అతని ముఖమున ముఖమును, హృదయమున హదయమునుంచి, జఘనమున జఘనము నుంచి బాధపీడితమగు భర్తృదేహమును తనతోపాటు కాల్చెను. అట్లు ఆమె దేహమును విడిచి భర్తను తీసికొని చాలా పాపరాశులను శుద్ధిచేసి దుష్కర సాధనమగు తన కర్మలచే దేవలోకమును చేరెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున పతివ్రతో పొఖ్యానమను పదునారవ అధ్యాయము.
