నారద మహా పురాణము - ఉత్తరార్థము
6 - బ్రహ్మవాక్యమ్
బ్రహ్మ పలికెను :- నీవేమి ఆశ్చర్యమును చూచితివి? ఎందుకు భేదమునొందుచున్నావు? సద్గుణముల విషయమున పరితపించుట మరణాంతకమగును కదా? నరుడు శ్రీహరి నామోచ్చారణముననే పదమును పొందునుకదా? ఇక ఆహరివాసరమున ఉపవసించిన వాడు ఏల పరమపదమును చేరడు? శ్రీకృష్ణునకు చేయు ఒక్కప్రణామమే దశాశ్వమేధఅవభృధములతో సమానము. పది అశ్వమేధ ములను చేసినవాడు పునర్జన్మను పొందును. శ్రీ కృష్ణునకు నమస్కారమును చేసినవాడు పునర్జన్మనందడు. శ్రీహరినామము జిహ్వాగ్రమున కలవానికి కురుక్షేత్రముతో, కాశితో, విరజానదితో ఏమిపని? బ్రాహ్మణుడై చండాలని రజస్వలగానున్నపుడు సంగమించిన, పాచిఅన్న మును తినువాడైనను అంత్యకాలమున శ్రీహరినామమును స్మరించినచో అభక్ష్యభక్షణమువలన అగమ్యగమనమువలన కలుగుపాపముల నుండి విముక్తుడై సంసార బంధములను తెంచుకొని విష్ణుసాయుజ్యమును పొందును. శ్రీహరి వాసరమున ఉపవసించినచో ఏల మోక్షము రాదు? శ్రీహరి వాసరమున శ్రీమన్నారాయణుని చింతుంచును. గానము చేయును కదా. భక్తి లేకున్ననూ లీలామాత్రముగా శ్రీహరినామ మును పలికిననూ వినిననూ గంగాజలముతో పవిత్రుడైన వానితో సముడగును. మనకు లోకములకు నాధుడు పురుషోత్తముడు. మనందరికి జన్మనిచ్చినవాడు. అట్టి శ్రీహరి వాసరమును సేవించువానిని ఎవరు ఎట్లు శాసించగలరు? శ్రీహరిభక్తులచే నీవు చూర్ణము చేయబడలేదు. వారు దృఢముగా నిన్ను బంధించలేదు. అదియేవారు మన యెడ చూపిన గౌరవమని ఏల తెలియవు? రాజుగారినుండి పొందు భోగములను తెలియజోలని సేవకుడు చాలాదు:ఖమును బొంది రాజభటులచేనిగ్రహించబడును. సేవకులు రాజులకు ఇష్టులైన వారు అపరాధములను చేసిననూ నిగ్రహించరాదు. ప్రభువు అనుగ్రహమువలన వారు సిద్ధపురుషులు గాన శాసించువారిని నిగ్రహింపచేతురు. అట్లే జనార్దనుని . భక్తులు పాపములను చేసినంతమాత్రమున వారిని శాసించ సాహసించుట నీ బాల్యమును చాటును. ఓ యమధర్మరాజా? శివభక్తుల విషయమున, సూర్య భక్తుల విషయమున, నాభక్తుల విషయమున కానీ నీకు సాయము చేయగలను కాని శ్రీహరి భక్తుల విషయమున నేనేమియును చేయజాలను. దేవతలందరికి ఆది దేవుడు పురుషోత్తముడు. కావున మధుసూదన భక్తులను నిగ్రహించుట సాధ్యముకాని పని. రెండు పక్షములలో ద్వాదశీవ్రతమును కపటముతో ఆచరించిన వారు చేసిన అవమానమున నేను సాయము చేయజాలను. ఓ సూర్యపుత్రా! నీకు సాయమును చేసినచో నాకు దేవఘాతకమగు అవినీతి సంక్రమించును. బ్రహ్మపదచ్యుతికూడా కలుగును. కావున విష్ణుభక్తులకు నేను అడ్డుపడలేను. బ్రహ్మలోకమునకు మార్గమును చూపినది విష్ణుభక్తులేకదా?
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున బ్రహ్మవాక్యమను ఆరవ అధ్యాయము.
