నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

58 - బ్రహ్మాండోత్పత్తి వర్ణనమ్

వసువు పలికెను : -

ఇట్లు పురుషోత్తముని యధావిధిగా భక్తిచే పూజించి, శిరసుచే నమస్కరించి, తరువాత సాగరమును ప్రార్థించవలయును. ఓ నదీ నాధా! నీవు సర్వ భూతములకు ప్రాణభూతుడవు. తీర్థరాజా! నీకు నమస్కారము. ఓ అచ్యుత ప్రియా! నన్ను కాపాడుము. ఇట్లు ఉత్తమము శుభప్రదమగు ఈ క్షేత్రమున చక్కగా స్నానమాడి తీరమున యధావిధిగా నారాయణుని పూజించి బలరామ శ్రీకృష్ణ సుభద్రలకు సముద్రమునకు నమస్కరించి శతాశ్వమేధ ఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై, సర్వదుఃఖవర్జితుడై శ్రీమంతుడై బృన్దారక హరివలే రూప యౌవన గర్వితుడై దివ్య గంధర్వ నాదముగల అర్కవర్ణము గల విమానముచే ఇరువది యొక్క కులములనుద్దరించి విష్ణులోకమును పొందును. ఇచట ఉత్తమ భోగములనను భవించి దేవతలతో కలిసి క్రీడించి అటనుండి భూలోకమునకు వచ్చి బ్రహ్మ జ్ఞానము గల బ్రాహ్మణునిగా పుట్టును. యశస్వి, మతిమంతుడు, శ్రీమంతుడు, సత్యవాది, జితేన్టియుడు, వేద శాస్త్రార్ధ జ్ఞానము కలవాడుగా ఉండి తరువాత విష్ణుభక్తుడై వైష్ణవ యోగమును పొంది తరువాత మోక్షమును పొందును. గ్రహణ కాలమున, సంక్రమణమున, అయనములందు విషువమున, యుగాదులందు, మన్వాదులందు, వ్యతీపాతమున, దీనక్షయమున, ఆషాఢ పూర్ణీమయందు కార్తీక పూర్ణీమయందు, మాఘ పూర్ణిమ యందు ఇతర శుభతిధులందు ఈ క్షేత్రమున బ్రాహ్మణులకు దానమును చేయువారు ఇతర తీర్థములలో దానము చేసిన దానికి వేయిరెట్లు ఫలమును అధికముగా పొందెదరు. ఇచట యధావిధిగా పితరులకు పిండ ప్రదానమును చేయువారు వారి పితరులకు అక్షయ మగు తృప్తిని కలిగించేదరు. ఇది సాగర స్నాన ఫలము. నీకు సమగ్రముగా వివరించితినీ. అట్లే దానఫలమును, పిండ ప్రదాన ఫలమును చేప్పితిని. ఈ సాగర స్నానము ధర్మార్థమోక్ష ఫలప్రదము. ఆయుః కీర్తి యశ పూజ, భుక్తిముక్తి ప్రదము, నరులకు ధన్యము, దుస్స్వప్న నాశకము. సర్వపాపహరము, పుణ్యము, సర్వకామ ఫలప్రదము. ఈ విధానము నాస్తికునకు శఠునకు, దీనునకు చెప్పరాదు. పురుషోత్తమ తీర్థ రాజమమాత్మ్యామును బ్రాహ్మణులు వర్ణించువరకే ఇతర తీర్థ రాజములు తమ మహాత్మ్యామును గర్జించును. పుష్కరాది తీర్థములు తమ తమ ఫలములను మాత్రమే నిచ్చును. తీర్థ రాజమగు సముద్రము మాత్రము సర్వతీర్థ ఫలములనిచ్చును. ఈ భూమండలమున నున్న సకల తీర్థములు, నదులు సరస్సులు సాగరమున ప్రవేశించును. కావున సాగరము సర్వశ్రేష్టమైనది. నదీపతియగు సముద్రము సమస్త తీర్థరాజము. కావున సాగరము సమస్త తీర్థములలోశ్రేష్ఠ తమము. సర్వకామ ప్రదము. సూర్యుడుదయించగనే చీకటి నశించునట్లు సాగర తీర్థమున సర్వపాపములు నశించును. ఈ సాగరమున తొంబది తొమ్మిది కోట్ల తీర్థములు గలవు. కావున సాగరమున చేయు స్నానము, దానము, హోమము జపము, దేవతార్చన అన్నియూ అక్షయ ఫలము నొసంగును.

మోహిని పలికెను :

ఓ గురువర్యా! అన్ని సముద్రములలో ఈ సముద్రము ఉప్పు సముద్రముగా ఎందుకైనదో నీవు సర్వజ్ఞుడవు కావున తెలుపుము.

వసువు పలికెను :-

ఈ సముద్రము ఉప్పు సముద్రమెందుకైనదో చెప్పెదను వినుము. పూర్వము సృష్టి క్రమమున ఏడు సముద్రము లేర్పడినవి. ఈ యేడు సముద్రములు రాధికా గర్భ సంభూతులు దివ్యదేహులు గానుండిరి. ఒక సమయమున రాధికాపతి ప్రియురాలగు రాధికతో కలిసి యుండెను. బృన్దావనమున గోపగోపీ గోపతి రాస మండలమధ్యమున సుదీప్తమగు మణి మండపమున స్నిగ్ధురాలగు ప్రియురాలితో శృంగార సంయుక్తుడై యుండెను. బాలులగు ఆ సప్త సాగరులు, స్తన్యపానమున ఆశగల వారై జగన్మాతయగు తన తల్లిని వెతుకుచు అంతటా చూచి క్షుధార్తులై, ఏడ్చుచు మణిమండపమును చేరిరి. ద్వారమున నున్న గోపికలు వారించు చున్ననూ స్తన్యపానాభిలాషులై వెడలిరి. చాలా కోపముతో నుండిరి. తల్లి వడిలో నుండదగు వారని గోపికలు కూడా ఉపేక్షించిరి. అంతట వారు ఏడ్చుచు మణి మండపమునకు వెళ్ళి ఓ తల్లీ ! ఎక్కడుంటివి అని పెద్దగా అరిచిరి. కాని స్తనార్ధులగు తమను తల్లి పిలువక పోవుటచే అందరిలో చిన్నవాడు. రాధాకృష్ణులరతిస్థలమును చేరెను. తన మీద మిక్కిలి మమకారముతో తనవద్దకు వచ్చిన శృంగార భంగప్రదుడగు పుత్రుని చూచి కోపించిన తల్లి త్వరగా భూలోకమనకు వెళ్ళుడని శపించెను. మీరు నాకు శృంగార భంగమును చేయుటకు ప్రయత్నించితిరి కావున మీరు భూలోక మునకు వెళ్ళి ఒంటరిగా ఉండుడు. అని శపించెను. జగన్మాతయగు రాధ మాటలను విని వియోగభయము చే దీనులై అందరూ పెద్దగా యేడ్చిరి. అంతట ప్రణతార్తిహరుడగు శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడై పుత్రులారా! మీరు భయపడకుడు. నేను మీ చెంతనే యుందును. మీరు ద్రవ రూపులై వేరు వేరు రూపములతో సంచరించుడు. లోని కొచ్చిన ఇతను మాత్రము క్షారత్వమును పొందుగాక. అని పలికి వారిని విడిచిపుచ్చేను. ఆ సాగరములను ఓదార్చుటకు శ్రీహరి ఎపుడూ వారి సమీపమునే ఉండును. రతి గృహమున ప్రవేశించిన కనిష్ఠ సాగరము లవణార్ణవమాయెను. మిగిలిన సాగరములు ద్రవరూపములై క్షీరాదులుగా విడిగా నుండెను.

మోహిని పలికెను :-

మీరు చెప్పిన జగన్మాతయగు రాధ ఎవరు? ఆరాధాతత్త్యమును నాకు సమగ్రముగా తెలుపుము. నాకు వినవలయునని కోరిక కలదు. పురాణములలో వర్ణించబడిన రాధా మాధవ రహస్యమునంతయూ యధార్థముగా నీకు తెలియును.

వసిష్ఠ మహర్షి పలికెను: -

ఓ రాజా ! ఆమోహినీ వాక్యమును వినిన వసువు గోవిన్దుని యందు మిక్కిలి భక్తిగలవాడై తన్మయుడాయెను. పులకాంకిత సర్వాంగుడై ప్రహృష్ట హృదయుడై సంతోషముతో మోహమును పొంది మోహినితో ఇట్లు పలికెను.

వసువు పలికెను :- ఓదేవీః రహస్యములలో అతిరహస్యము, పరమ గోప్యము బ్రహ్మైకత్వ విధాయకమగు శ్రీకృష్ణ చరితమును చెప్పెదను వినుము. ప్రకృతి పురుషులను నియమించువాడు, విధికి విధి, సంహరించువారినందరిని సంహరించువాడు యగు భగవంతునికి నమస్కారము. బ్రహ్మయొక్క సర్వావతారములు కృష్ణరూపములు. శ్రీకృష్ణుడు. మాత్రము స్వయముగా అవతారి. ఇతను సగుణుడు నిర్గుణుడు. వస్తు రూపుముగా అతనే రాముడు. అతనే కృష్ణుడు. గుణములననుసరించి వేరు. అన్ని లోకములు ప్రాకృతికములే. గోలోకము మాత్రము నిర్గుణము. గోవులు తేజోంశములు అని వేదవిదులు చెప్పియున్నారు. బ్రహ్మ విష్ణు శివాదులు ప్రాకృతులు గుణనిర్మితులు. శ్రీకృష్ణుని తేజస్సు సర్వదా నిర్గుణము. గుణకారి. గుణములన్నియూ అతని అంశలే. ఇవి యన్నియు వికారరూప ములే. రజస్సత్యత మోనామకములు వ్యాకృతోత్పాదికములుగా తెలియుము. అవ్యాకృత పురుషుని తెలుపునవి గుణములు. ఈ గుణములు అతనికి దేహభూతములు. అతని శక్తియే ప్రకృతి, ప్రధాన ప్రకృతి కార్యకారణరూపిణి అనబడును. పురుషుడు నిర్గుణుడు సనాతనుడు సాక్షి అనబడును. పురుషుడు ప్రకృతియందు వీర్యమునుంచిన గుణములేర్పడును. వాటి నుండి సత్వాదులేర్పడును. సత్యాదులనుండి మహత్తత్యము ఏర్పడును. ఈ మహత్తత్యము పురుషుని ఇచ్చచే వ్యాకృతమై అహంకార తత్త్యముగా ఏర్పడును. ఈ ఆవ్యాకృతము ద్రవ్య జ్ఞానక్రియారూపముగా మూడు విధములగును. అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములు. వైకారికము నుండి మనసు పుట్టెను. వైకారికులు అను దేవతలు పది విధములు. దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వనీదేవతలు, బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేన్లుడు, మిత్రుడు అని. జ్ఞానేన్జీయములు కర్మేన్దియములు తైజసములు శ్రోత్రత్వక్ ణనేత్ర జిహ్వలు జ్ఞానేంద్రియములు. వాకాణి పాదపాయు ఉపస్థలు కర్మేంద్రియములు. తామసాహంకారము నుండి శబ్దము కలిగెను. శబ్దము నుండి ఆకాశము కలిగెను. ఆకాశము నుండి స్పర్శ, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండి రూపము, రూపమునుండి తేజస్సు, తేజస్సు నుండి రసము రసము నుండి జలము, జలము నుండి గంథము, గంథము నుండి పృథివి ఏర్పడెను. సకల చరాచర జగత్ స్థితి భూమి యందే కనపడుచున్నది. ఆకాశాది పంచతత్త్య ములందు ఒకటి, రెండు, మూడు, నాలుగు గుణములు వరుసగా నుండును. పృథివి, యందు అయిదు గుణములుండును. ఇదియే విశేషము, కాలమాయాంశ లింగముల నుండి అచేతనమగు అండము కలిగెను. ఈ అండముదరమున ప్రవేశించి చేతనమగును. ఈ అండము నుండి విరాటుషుడు కలిగెను. ఈ పురుషుడు జలాంతరమున శయనించెను. ఇతనికి ముఖాద్యవయవములు కలిగెను. నీటిలో ఉన్న ఈ పురుషునికి వచనాది సిద్ది కొరకు ఈ పురుషుని నాభి నుండి సూర్య సన్నిభమగు పద్మము కలిగెను. ఈ పద్మము నందు లోకమునకు ప్రపితామహుడగు బ్రహ్మ పుట్టెను. ఈ బ్రహ్మ తీవ్రమగు తపము నాచరించి పురుషుని ఆజ్ఞను పొంది లోకములను, లోకపాలురను సృజించెను. కట్యాదులనుండి అధోలోకములేడు, జఘనాదుల నుండి ఊర్ధ్వలోకము లేడు కలిగెను. ఈ పదునాలుగులోకములతో బ్రహ్మండమనబడును. ఈ బ్రహ్మండమున స్థావరజంగమ ప్రాణులను సృజించెను. బ్రహ్మమనసు నుండి సనకాదులు నలుగురు మహర్షులు కలిగిరి. బ్రహ్మదేహము నుండి భవాదులు పుట్టిరి. వీరిచేతనే ఈ జగత్తు వృద్ధి చెందినది.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున

పురుషోత్తమమాహాత్మ్యమున బ్రహ్మండోత్పత్తి వర్ణనమను యాబదియెనిమిదవ అధ్యాయము.