నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

32 - సంధ్యావలీ కథనమ్

వసిష్ఠ మహర్షి పలికెను : బ్రహ్మపుత్రిక యగు మోహిని సంధ్యావలీదేవి మాటలను వినియోహపరవశురాలై స్వకార్య తత్పరురాలై ఇట్లు పలికెను. ఓ శుభకరురాలా? నీవిట్లు ధర్మాధర్మ స్వరూపమును తెలిసి భర్త కొరకు ధన జీవితముల నీయదలచినచో నేను జీవితమున కంటే అధికమగు విత్తమును యాచించెదను. నీకు చాలా ఇష్టమగునది హృదయము కంటే అధికమగు నీ పుత్రుని శిరమును నాకిమ్ము. నీ భర్త ఏకాదశి నాడు భోజనము చేయనిచో నీ భర్తయే స్వయముగా తన హస్తమున ఖడ్గమును తీసుకొని, చంద్రబింబము వంటి శుభకరమగు, మీసములు మొలవని, కుండలవిభూషితము అగు పుత్రుని శిరమును ఛేదనము గావించి నావడిలో పడవేయ వలయును. ఏకాదశిన భుజించనిచో ఈ పనిని చేయమని చెప్పుము. మోహినీదేవి పలికిన పరుష పదజాలమును వినిన సంధ్యావలీ దేవి శ్రీతార్తమగు కదలీ వృక్షమువలె క్షణకాలము వడకెను. తరువాత దైర్యమును కూడ గట్టుకొని మోహిని ఎదురుగా నవ్వుచు మోహినితో ఇట్లు పలికెను. ఓ సుందరీ! పురాణములో ద్వాదశిని గురించి స్వర్గమోక్షప్రదములగు చాలా కధలు వినబడుచున్నవి. ధనమును, భార్యను, జీవితమును, గృహమును దేశమును, రాజును, స్వర్గమును, మిత్రుని, గురువును, తీర్ధమును, ధర్మమును అత్యంత ప్రియమును కూడా ఏకాదశీ వ్రతము కోజుకు విడువ వలయును. యోగమును, దానమును, జ్ఞానమును, పుణ్యక్రియలను కూడా విడువవలయును. తపస్సును, విద్యను, సిద్దిని మోక్షమును కూడా విడువవలయును. కాని శుక్లకృష్ణ పక్షములలోని ద్వాదశిని మాత్రము విడువరాదు. బంధువులు, పుత్రులు, సోదరులు, మిత్రులు, ప్రియులు ఈ లోకమున సంబంధము కలవారు. కాని ద్వాదశి మాత్రము ఇహపరములను సాధించగలది. ద్వాదశీ ప్రభావముచే సర్వము క్షేమప్రదము కాగలదు. కావున ఓ సుందరీ! నీ సంతోషము కొఱకు ధర్మాంగదుని శిరమును ఇప్పించగలను. నా మాట యందు విశ్వాసమునుంచుము సంతోషించుము. ఓ మంగళప్రదురాలా! ఈ విషయముననే పురాతనమగు ఇతిహాసమొకటి కలదు. దానిని నీకు చెప్పెదను. సావధానముగా వినుము.

పూర్వకాలమున ధర్మపరాయణుడగు విరోచనుడను దైత్యుడుండెను. అతని భార్య విశాలాక్షి. బ్రాహ్మణ పూజాపరురాలు. ప్రతి దినము ప్రాతఃకాలము ఒక ఋషిని యధావిధిగా పూజించి అతని పాదోదకమును భక్తితో సంతోషముతో పానము చేసెడిది. హిరణ్యకశ్యపుడు మరణించిన తరువాత ఉగ్రతేజస్సు గల ప్రహ్లాదపుత్రుడగు విరోచనుడు రాజ్యపాలన చేయుచుండగా భూమండలవాసులు నిశ్చింతులైరి. ఒకపుడు ఇంద్రాది దేవతలు గురువును చేరి శత్రు తాపితుల మగు మేము ఏమి చేయవలయును అని యడీ గిరి. వారి మాటలను వినిన బృహస్పతి దుఃఖితులగు దేవతలు విష్ణువున కు మొర పెట్టుకొనవలయునని చెప్పెను. అమితతేజోవంతుడగు గురువాక్యమును వినిన దేవతలు విరోచన వధ కొరకు వైకుంఠమునకు వెళ్ళిరి. అచటికి దేవశ్రేష్ఠుడగు శ్రీహరిని ఈ విధముగా స్తుతించిరి.

దేవతలు పలికిరి; దేవాధిదేవుడు అమితతేజోవంతుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. భక్త విఘ్న వినాశకునకు, వైకుంఠనకు నమస్కారము. శ్రీహరికి, అద్భుతసింహునకు, వామనునకు, మహాత్మునకు, వరాహరూపునకు, మత్స్యరూపునకు, ప్రలయాబ్ది నివాసికి, నమస్కారము. కూర్మరూపునకు, మందరాచలధారికి, భార్గవరామునకు, అబ్దిశాయికి, శ్రీరామునకు అఖిలలోకనాధునకు, విశ్వేశునకు, సాక్షికి నమస్కారము. దత్తాత్రేయునకు, శుద్ధునకు, కపిలునకు, ఆర్తిహారికి, యజ్ఞరూపునకు, ధర్మధారకునకు, సనకాది స్వరూపునకు, ధ్రువవర ప్రదాతకు, పృధునకు, భూరికర్మునకు, ఋషభునకు, విశుద్దునకు, హయశీర్షధరరూపునకు, హంసునకు, ఆగమరూపునకు, అమృత కుంభధారికి నమస్కారము. శ్రీకృష్ణునకు వాసుదేవునకు సంకర్షణ దేహధారికి, ప్రద్యుమ్నునకు అనిరుద్ధునకు, బ్రహ్మకు, శంకరునకు, కుమారస్వామికి, గణేశునకు, నందికి, భృంగికి నమస్కారము. గంధమాదన నివాసికి, నరనారాయణ స్వరూపునకు, జగన్నాధునకు, సాధునకు, రామేశ్వరునకు నమస్కారము. ద్వారకా నివాసికి, తులసీవనవాసికి, కమలనాభునకు, పద్మపాదునకు నమస్కారము, కమలహస్తునకు, కమలాక్షునకు, కమలాపాలకునకు, కేశవునకు నమస్కారము, భాస్కరరూపునకు, చంద్ర రూపధరునకు, లోకపాల స్వరూపునకు, ప్రజాప్రతిరూపునకు, భూత గ్రామస్వరూపునకు, జీవరూపునకు తేజోమూర్తికి, జయమునకు, జయికి, నేతకు, నియమమునకు, క్రియారూపునకు, నిర్గుణునకు, నిరీహునకు, నీతిజ్ఞునకు, క్రియారహితునకు, బుద్దునకు, కల్కిరూపునకు, క్షేత్రజునకు, అక్షరునకు గోవిందునకు, జగద్భర్తకు, అనస్తునకు, ఆద్యునకు, శార్జికి నమస్కారము. శంఖధారికి, గదాధారికి, చక్రధరునకు నమస్కారము. ఖడ్గశూలాది సర్వశస్త్రాస్తధారికి, శరణ్యునకు, వరేణ్యునకు, పరునకు, పరమాత్మకు, హృషీకేశునకు, విశ్వునకు, విశ్వరూపునకు, నమస్కారము. కాలనాభునకు, కాలునకు, చంద్రసూర్యనేత్రునకు, పూర్ణునకు, పరిసేవ్యునకు, పరాత్పర తరునకు, జగత్కర్తకు, జగద్భర్తకు, జగద్దాతకు అంతకునకు, మోహికి క్షోభికి, కామరూపికి, ఆజునకు, సూరికి నమస్కారము. ఓ భగవన్! మేము దైత్యతాపితులమై, నిన్ను శరణువేడుచున్నాము. కావున ఓ యఖిలాధారా! మేము ఆనందముగా ఉండునట్లు చేయుము. మేము పుత్రమిత్ర కళత్రాదిసహితులమై ఆనందముగా విహరించునట్లు చేయుము. 

ఇట్లు దేవతలు చేసిన స్తోత్రమును వినిన శ్రీహరి సంతోషించి దైత్యపీడితులగు దేవతలకు దర్శనము నిచ్చెను. వారు స్నిగ్ధమానసుడగు వైకుంఠుని చూచి ఆదరముతో విరోచన వధ కొరకు ప్రార్థించిరి. ఇంద్రాదుల కార్యమును విని కార్యజ్ఞులలో . శ్రేష్ఠుడు వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి విరోచనుని ఇంటికి వెళ్ళెను. బ్రాహ్మణ పూజాకాలమున కార్యసాధకుడు వచ్చెను. ఆ బ్రాహ్మణుని చూచి విశాలాక్షి సంతుష్టాంతరంగయై అపూర్వ భక్తి భావముతో సత్కరించి ఆసనము నొసంగెను. ఆ బ్రాహ్మణుడు ఆమె ఇచ్చిన ఆసనము నంగీకరించక ఆమెతో ఇట్లు పలికెను : ఓ దేవీ! నేను నీ విచ్చునాసమును స్వీకరించను. నేనొచ్చిన కార్యమును వినుము. నా మనసున నున్న పనిని తెలుసుకొని అంగీకరించు వారి పూజనే నేను స్వీకరించెదను. బ్రాహ్మణ వృద్ధుని వాక్యమును విని వాక్య విశారదురాలగు విశాలాక్షి విష్ణుమాయా మోహితురాలై స్త్రీత్వము వలన మిక్కిలి సంతోషించి ఇట్లు పలికెను. 

విశాలాక్షి పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా! నీ మనసున నున్నదానిని ఇచ్చెదన కావున నేనిచ్చు ఆ సనమును స్వీకరించుము. వాంచితార్ధ ప్రదమగు పాదోదకమునిమ్ము. విశాలాక్షి ఇట్లు పలుకగా ఆ బ్రాహ్మణ వృద్ధుడు నేను స్త్రీ పలుకులను విశ్వసించను. నీ భర్త ఈ మాట చెప్పినచో విశ్వసించెదనని పలికెను. వృద్ధ బ్రాహ్మణుని మాటలను విని విరోచనుని గృహిణి అపుడే భర్తను పిలిపించెను దూత వాక్యముతో ప్రహ్లాదపుత్రుడగు విరోచనుడు సంతోషముతో అచటికి వచ్చెను. విశాలాక్షి యున్న అంతఃపురమును చేరెను. వచ్చిన భర్తను చూచి ధర్మపరాయణురాలగు విశాలాక్షి లేచి నమస్కరించి బ్రాహ్మణునకు మరల ఆసనమును అర్పించెను. వృద్ధ బ్రాహ్మణుడు ఆసనమును స్వీకరించకపోవుటచే తన భర్త రాక్షసరాజుగు విరోచనునితో జరిగిన వృత్తాంతమును వివరించెను. భార్యయందు గల ప్రీతిచే విరోచనుడు విశాలాక్షి మాట నంగీకరించెను. విరోచనుడు అంగీకరించ గనే అతని మనసును తెలుసుకొని వృద్ధ బ్రాహ్మణుడు సంతోషముతో మీ ఆయుష్యమును నాకు అర్పించుడని పలికెను. అపుడు ఆ దపంతులు తమ ఆ చారముతో మోహితులై ఒక ముహూర్త కాలము ధ్యానములో నుండి చేతులు జోడించి బ్రాహ్మణునితో ఇట్లు పలికెరి. ఓ బ్రాహ్మణోత్తమా! మా జీవితమును స్వీకరించుము. నాకు పాదోదకమునిమ్ము. నీవు చెప్పిన మాటను నిజము చేతుము. సంతోషించుము. అతంట బ్రాహ్మణుడు ప్రీతికలవాడై విశాలాక్షి సమర్పించిన ఆసనమును స్వీకరించి భక్తి ప్రీతుడగు జనార్దనుడు విశాలాక్షికి పాదోదకమునిచ్చెను. అంతట విశాలాక్షి సంతోషముతో భర్తతో కలిసి బ్రాహ్మణుని పాదములను కడిగి ఆ పాద జలమును శిరస్సు పై ధరించిరి. అంతట :వెంటనే ఆ దంపతులు . దివ్యరూపమును ధరించి ఉత్తమ విమానమునధిరోహించి విష్ణుపదమునకు వెళ్ళిరి. అంతట ప్రసన్నుడగు శ్రీహరి దేవతల వ్యవసనమును తొలగించి, దేవగణములచే స్తుతించబడుచు వైకుంఠ భవనమునకు వెళ్ళెను. ఇట్లే నీకు చేసిన ప్రతిజ్ఞననుసరించి నేను కూడా ఈయవలయును. రుక్మాంగదుడను నా భర్తను సత్యము నుండి తప్పించజాలను. మానవులకు సత్యమే సద్గతినిచ్చును. సత్యమునుండి తప్పిన మానవుడు చండాలున కంటే అధముడగును. ఇట్లు సంధ్యావలీదేవి బ్రహ్మపుత్రి యగు మోహినితో పలికి కోమలారుణాంగుళులు కల చేతులతో ఎఱ్ఱనైన భర్త పాదములను పట్టుకొనెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున సంధ్యావలీ కధనమను ముప్పది రెండవ అధ్యాయము.