నారద మహా పురాణము - ఉత్తరార్థము
39 - గంగాస్నానమాహాత్మ్యమ్:
వసువు పలికెను:
ఓ మోహినీ! పురాణములలో తత్త్యదర్శులగు మునులు చెప్పిన గంగాదర్శన ఫలమును చెప్పెదను వినుము. గరుడుని దర్శనము వలన సర్పములు విషహీనములగునట్లు గంగాదర్శనము వలన పాపరహితులగుదురు. గంగను దర్శించిన, స్పృశించిన, స్నానమాడినవారికి ముందు ఏడు తరములను, తరువాత ఏడు తరములను వారికంటే ఇతరులను తరింప చేయును. దర్శనస్పర్శన పానముల వలన గంగా నామసంకీర్తనము వలన నూర్లవేల పురుషులను తరింపచేయును. సాటిలేని జ్ఞానము, ఐశ్వర్యము, ప్రతిష్ణ, ఆయుష్యము, యశస్సు, శుభాశ్రమవాసము గంగాదర్శనము వలన కలుగును. గంగాదర్శనము వలన ఇంద్రియ చాంచల్యము, వ్యసనములు, పాపములు, దీనత్వము నశించును. శాశ్వత పదమును కోరు నరుడు గంగను మాటిమాటికి చూడవలయును. మాటిమాటికి తాకవలయును. వాపీకూతటాకమ్రపాదీతర తీర్థములలో కల పుణ్యమంతయూ గంగా దర్శనము వలన కలుగును. పరమాత్మదర్శనము వలన కలుగు పుణ్యము భక్తిచే గంగను దర్శించిన వారికి కలుగును. నైమిష కురుక్షేత్ర నర్మదాపుష్కర స్నాన స్పర్శనాదుల వలన కలుగు ఫలము కలియుగ మున గంగా దర్శనము వలన కలుగును. పురాణములలో చెప్పబడిన గంగా స్పర్శన ఫలమును ఇపుడు చెప్పెదను. అశుభకర్మలను చేయుచు సంసారసాగరమున మునిగి యుండి నరకమున పడుచున్న వారిని గంగాస్మరణముద్దరించును. సహస్రయోజనదూరమున నున్ననూ గంగను స్మరించువాడు దుష్కృత్యములను చేయువాడైనను ఉత్తమ గతిని పొందును. గంగాస్మరణ మాత్రముననే పాపసంఘాత పంజరము వజ్రాయుధముచే కొట్టబడిన పర్వతము వలే వేయి వక్కలుగా చీలిపోవును. నడుచుచు, నిలుచుచు, పడుకొనుచు, ధ్యానించుచు, మేలుకొనుచు, తినుచు, నవ్వుచు, ఏడ్చుచు, ఎప్పుడూ గంగను స్మరించువాడు సంసార బంధవినిర్ముక్తుడగును. సహస్రయోజన దూరముననున్న వారు కూడా గంగా, గంగా అని ఆక్రోశించుచు గంగనుస్మరించువారు పాపములనుండి విముక్తులగుదురు. గంగను స్మరించుచువారు, గంగా భక్తిపరులు సమస్త మహాపాపముల నుండి విముక్తులగుదురు. గంగను స్మరించు స్త్రీలకు భవనములు, విచిత్రాభరణములు, ఆరోగ్యము, ధన సంపదలు కలుగును. దూరమున నున్న నరుడు మనసుతో గంగను స్మరించువాడు సహస్ర చాంద్రాయణ వ్రత ఫలమును పొందును. శతయోజనముల దూరమున నున్నవాడు కూడా గంగా గంగాయని జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకమును చేరును. గంగా కీర్తనము వలన పాపములు తొలగును. దర్శనము వలన శుభములు కలుగును. స్నానమాడి, గంగా జలమును పానము చేసినచో ఏడు తరములకు ముక్తి కలుగును. ప్రసంగవశమున గంగను కీర్తించిననూ ముందు ఏడు తరములను, తరువాత ఏడు తరములను, ఆ తరువాత ఏడు తరములను కూడా తరింపచేయును. అశ్రద్దచేనైనను పుణ్యవాహినియగు గంగనామాను కీర్తనము చేసినవాడు కూడా స్వర్గమును పొందును. సర్వావస్థలను పొందినవాడు, సర్వధర్మవర్జితుడు, కూడా గంగానామసంకీర్తనము వలన శుభకరమగు గతిని పొందును. బ్రహ్మఘాతకుడు గురుఘాతకుడు, గోఘ్నుడు, సర్వపాతక సంస్పష్టుడు కూడా గంగా జలమును స్పృశించి సర్వపాతక వినిర్ముక్తుడగును. నేనెపుడు గంగను దర్శించగలను, ఎపుడు గంగలో స్నానము చేయగలను అని అభిలషించువారి కులమును గంగ తరింపచేయును. ఇక ఇపుడు గంగాస్నాన ఫలమును చెప్పెదను. దీనిని వినినంతనే సర్వపాప వినిర్ముక్తుడగును. గంగా స్నానము చేసిన వానికి వెంటనే పాపములు నశించును. అపూర్వపుణ్యము కూడా లభించును. గంగా పవిత్ర జలములలో నిశ్చలమనస్సుచే స్నానము చేసినవారికి సర్వ శుభములు కలుగును.
పవిత్ర గంగా జలములలో స్నానమాడువారికి కలుగు ఫలము నూరు యాగములను చేసిన వారికి కూడా కలుగదు. గంగా జలముచే ప్రోక్షితుడగువాడు ఉదయకాల సూర్యుడు తీవ్రాంధకారమును నశింప చేయునట్లు పాపములను నశింప చేయును. గంగా జలమున ఒక మారు స్నానమాచరించిన వాడు కూడా. అశ్వమేధయాగ ఫలమును పొందును. గంగా స్నానమాత్రమున అనేక జన్మ సంచితములకు పాపములు నశించి పుణ్యభాజనులగుదురు. ఇతర ప్రదేశములలో చేసిన పాపము గంగా తీరమున నశించును. పగలు సంధ్యవేళ, రాత్రిపూట ప్రయత్నముచే గంగా స్నానమును చేసినవాడు, గంగా జలమును తీసుకొని వచ్చి ఇంట్లో స్నానమాడిన వాడు కూడా అశ్వమేధ యాగ ఫలమును పొందును గంగాస్నానము వలన సర్వతీర్థగత పుణ్యమును, సర్వదేవాలయ పుణ్యమును పొందకలుగును. మహాపాతక యుతుడైనను, సర్వపాతక యుక్తుడైననూ యధావిధిగా గంగా స్నానము నాచరించినవాడు సర్వపాతక వినిర్ముక్తుడగును. గంగా స్నానమునకు మించిన ఫలము లేదు. ఉండబోదు. కలియుగమున గంగా స్నానము విశేషముగా పాపములను హరించును. భక్తిచే గంగా స్నానమును చేసినవారు కామజ దోషములను మనో వాక్కాయ దోషములను హరించి స్వర్గమున దేవతల వలే ఆనందింతురు. గంగా జలమున ఒక సంవత్సరము స్నానము చేయువాడు విష్ణులోకమున ఒక కల్పకాలము నివసించును. మరణ పర్యంతము ప్రతిదినము గంగా స్నానము చేయువాడు సమస్త పాప వినిర్ముక్తుడై సమస్త కుల హితముగా సమస్త భోగముల ననుభవించి విష్ణులోకమున రెండు పరార్థములు విరాజిల్లును. ఇచట విచారించవలసిన పనిలేదు. నిత్యము నిరంతరము గంగా స్నానమును చేసినవాడు ఇచటనే జీవన్ముక్తుడగును. మరణించిన పిదప పరమ పదమును చేరును. ప్రాత కాల స్నానమునకంటే మధ్యాహ్న స్నానము దశగుణ ఫలమును కల్పించును. మధ్యాహ్న స్నానమున కంటే సాయంకాల స్నానము శతగుణ ఫలము నిచ్చును. శివసన్నిధిలో గంగా స్నానమాచరించిన అనంత ఫలప్రదము. కోటి కపిలాదానముల కంటే గంగాస్నానము అనంత ఫలప్రదము. కురుక్షేత్ర సమము గంగా జలము, హరి ద్వారమున ప్రయాగలో సాగరసంగమమున విశ్లేషించి ఫలప్రదము, నాకిరణములచే తపించబడిన గంగా జలమున స్నానమాడినవారు నా మండలమును ఛేదించుకొని మోక్షమును చేరెదరని సూర్యుని వాక్యము. ఇంట్లో ఉన్నవాడు కూడా స్నాన సమయము గంగను స్మరించినచో స్వర్గమును పొందునని వరుణుడు చెప్పెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున గంగా స్నానమాహాత్మ్యమను ముప్పది తొమ్మిదవ అధ్యాయము.
