నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

7 - మోహినీంప్రతి బ్రహ్మవాక్యమ్

యమధర్మరాజు పలికెను :- శ్రీహరిపాదపద్మములకు నమస్కరించుటచే నేను కూడా హితమును పొందితిని. కావున నేను మరల యోగాంతమును పొందజాలను. రుక్మాంగదుడు భూమిని పాలించుచున్నాడు. శ్రీహరివాసరమున ఒక్కరుక్మాంగదుని ధైర్యచ్యుతుని చేయగలిగినచో నేను నీకింకరుడనగుదును. రుక్మాంగదుడొక్కడేనాకు శత్రువు. అతనే నా రాతను తుడిచి వేసెను. కావున శ్రీహరివాసరమున ఒక్కరుక్మాంగదమహారాజును భుజింపచేసిన గయాపిండప్రదానము చేసిన వానివలె కృతకృత్యుడనగుదును. ఇప్పటినుండి శ్రీహరిని స్మరించుకొని, స్తుతించువారిని, ఉపవసించువారిని నేను శాసించను. వ్యాజముతో నైనను హరినామమునుచ్చరించు వారుపునర్జన్మనందరు. నారాతలో చోటు చేసుకోరు. దేవతల చేత కూడా నమస్కరించబడుదురు.

సౌరిపలికెను :- కుశలాంఛనుడగు బ్రహ్మ యమధర్మరాజు ప్రార్థనను ఆలకించి అతని కార్యమునెట్లు చేయవలయునని ఒక క్షణమాలోచించి, సర్వభూతసహితుడై సర్వభూతభయంకరమగు రూపమును ధరించేను. ఆరూపమున లోకమును మోహింపచేయగల ఒక యువతిని సృజించెను. ఆయువతి సకల యువతులలో శ్రేష్ఠురాలుగా బ్రహ్మమానసపుత్రిగా ప్రకాశించేను. ఆమోహిని సర్వాలంకార భూషితయై బ్రహ్మముందు నిలిచేను. రూపసంపదతో, వెలుగొందుచున్న మోహినిని చూచి బ్రహ్మ పాపభీతిచే కనులను మూసుకొని మోహినిని చూచి కామమోహితులైన తనవారితో నిట్లుపలికెను. కోరిక గల మనసుతో కాని, కోరిక కలకనులతో కాని తల్లిని లేదా పుత్రికను ఆలోచించిననూ చూచిననూ అట్లే కోడలిని, అన్న భార్యను, గురువు భార్యను, రాజు భార్యను చింతించిననూ చూచిననూ చండాలన్రీ గురించి చింతించిననూ చూచిననూ అతను ఘోరమగు నరకమును పొందును. ఈ స్త్రీలను చూచి చలించువాడు జన్మమొత్తము చేయు లేదా చేసిన పుణ్యము వ్యర్థమగును. అట్టి స్త్రీ ప్రసంగమున దశసహస్రజన్మ సముపార్జిత పుణ్యము క్షీణించును. పుణ్య క్షయముతో పాపియై పాషాణముగానో ఎలుకగానో పుట్టును. కావున ఈ స్త్రీలను కోరికతో చింతించరాదు. చూడరాదు. పన్నెండు సంవత్సరములు వయసుకలవారు తల్లిపాదములను కూడా స్పశించరాదు. యౌవనము వచ్చిన పుత్రులకు తల్లీకూడా అభ్యంగనము (తలంటిపోయుట) చేయరాదు. అరువది సంవత్సరములు దాటిని స్త్రీని అభ్యంగమునకు వినియోగించవలయును. వృద్దుడైననూ యువకుడైననూ స్త్రీ పాదధావనము చేయరాదు. అట్లు చేసినచో వారిద్దరూ నరకమును పొందెదరు. మామకు తన శరీరమును సవివరముగా చూపిన కోడలు కాళ్ళుచేతులు లేనిదై క్రిములచే భక్షింపబడును. కోడలిచే కాళ్ళుకడిగించు కొనువాడు, స్నానమాడువాడు, అభ్యంగనమును చేయించుకొనువాడు కూడా క్రిమిభక్షిఅగును. ఒక కల్పకాలము సూచీముఖములుగలకృష్ణవక్రములచే భక్షింప బడును. కావున కూతురును కోడలును కోరికతో చూడరాదు. కోరికతో ఆలోచించినన ఆక్షణముననే పతితుడగును. ఇట్లుపలికి తనలో తాను చాలా సూక్ష్మదృష్టితో ఆలోచించసాగెను. మన కనులకు గుండ్రముగా ఉన్నతముగా సుందరముగా కనపడు ఈ ముఖము చర్మముతో మాంసముతో కప్పబడిన అస్థిపంజరముమాత్రమే. స్త్రీలలోనున్న ప్రకాశవంతములైన కనులు వసామేడ (కొవ్వుచీము) భూయిష్టములు. స్త్రీలకు ఉన్నతములుగా పీనములుగా కనవడు స్తనములు మాంసపుముద్దలు. కడుపుమీదనుండు మూడు ముడతలు నిమ్నస్థితిని చూపును. పిరుదులరూపములోనున్నవి మాంసము అధికముగా నున్న భాగములే. మూడులోకములు మోహము చెందు గుహ్యము వాస్తవముగా చూచిన మూత్రద్వారమే కదా? ఇక పొయ్వింద్రియము అపానవాయుసంమిశ్రితము. రెండుగా కనబడు ఈ పిక్కలు ఒక కాష్ఠమును రెండుగా చీల్చినపుడు ఏర్పడు రెండు భాగవములవంటివి. రక్తము ఎముకల మాంసములతో ఏర్పడిన శరీరము సుందరమెట్లగును? మాంసము, కొవ్వు, చీముతో నిండిన శరీరమున సారమేముండును? క్రిములు, మలము, మూత్రములతో పుష్టి చెందిన శరీరమునందు ఎవనికి ప్రీతికలుగును? ఇట్లు బ్రహ్మ జ్ఞానచక్షువుతో పలువిధములుగా ఆలోచించి ధైర్యమును కూర్చుకొని గజగామినియగు మోహినితో నిట్లు పలికెను. ఓ వరవర్ణినీ! నీవు నామనసుచే సృష్టించబడినదానవు. నేను సంకల్పించిన విధముగా నీవు మనసునకు ఉన్మాదమును కలిగింతువు, అపుడు మోహిని బ్రహ్మకు నమస్కరించి ఇట్లు పలికెను. ఓ ప్రభూ? నా రూపముతో మోహింపబడిన ఈ స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతయూ మూర్చనందినది. ఒక యోగమాత్రమే స్వచ్చముగా నుండును. ఓ పద్మజా? ఈమూడులోకములలో నన్ను చూచి వికారము చెందని మగవాడు నీనుండి ఎవరూలేరు. శుభమును కోరువారెవ్వరూ ఆత్మస్తుతిని చేసుకోరాదు. పరిశుద్దుడగు మానవుడు కూడా ఆత్మస్తుతిచే నరకమును పొందును. అయిననూ కార్యముననుసరించి ఆత్మస్తుతి చేయవలసివచ్చినది. నేను ఎవరినో ఒకరిని చలింపచేయుటకే మిచేత సృజించబడితిని. అతని వివరములను తెలిపినచో చలింపచేతును. నన్ను చూసిన పర్వతము కూడా మూర్చనొందును. ఇక చైతన్యము కలిగి ఊపిరిని పీల్చు నరుని విషయము చెప్పవలయునా? పురాణములలో స్త్రీచూపులను పురుషులకు ఉన్మాదమును కలిగించునవి, కష్టసాధ్యవ్రతములను భంగపరుచునవి యని వర్ణించబడియున్నవి. కనుబొమలను ధనువున సంధించబడి కర్ణమార్గమునునసురించి నల్లనికనురెప్పలుగల విలాసవతుల చూపులను తూపులు ధైర్యమును దొంగలించుచు పురుషుల హృదయమును తాకునంతవరకే పురుషులు సన్మార్గమునను సంచరించగలరు. ఇంద్రియములను అరికట్టగలరు. సిగ్గుపడగలరు. వినయమును అనుసరించగలరు. మరియు ప్రీముఖమును చంద్రునితో పోల్చు మూఢమనస్సుకల కుకవిత్వము వ్యర్థము. కనుబోములముడిపాటు, రెప్పలతడబాటు, దరహాస విస్మయములతో నుండు చూపులు, చిరుకోపము, మెప్పుకోలునుసూచించు చిరునవ్వులుగల చూపులు చంద్రునిలో కలవా? ఎంతవివేకముకలవాడైనను మద్యమును పానముచేసినచో మోహమును కలిగించును. కాని యువతి చూడబడిననూ తలచబడిననూ మోహింప చేయును. కావున పురుషులను మోహింపచేయుటకు మీరు నన్ను సృష్టించితిరి. ఎవరిని మోహింపచేయవలయునో తెలుపుము. ఆజ్ఞాపించుము. నేను మూడులోకములను నీయాజ్ఞచే మోహింపచేయగలను.