నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

65 - తీర్ధ యాత్రావర్ణనమ్

మోహిని పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రమున నున్న వనములేవి? నదులెన్ని? ఎన్ని తీర్ధములు కలవు? వాటి నన్నిటిని క్రమముగా తెలుపుము. నాకుఉత్తమ గతిని ప్రసాదించు గురువు నీవేకదా!

వసువు పలికెను : ఓ మోహినీ! పుణ్యప్రదమగు కురుక్షేత్రయాత్రా విధానమును చెప్పెదను. వినుము. ఈ యాత్ర నాచరించిన వారు ఉత్తమ గతిని పొందెదరు. ఈ క్షేత్రమున ఏడు వనములు కలవు. పుణ్యప్రదములగు ఆ వనముల పేర్లను చెప్పెదను. కామ్యకవనము, అదితివనము, వ్యాసవనము, ఫలకీవనము, సూర్యవనము, మధువనము, సీతావనము. ఈ ఢనములన్నియూ మానవ కల్మషనాశకములు. ఈ ఏడు వనములలో అనేక తీర్థములు కలవు. సరస్వతీ నదీ, వైతరణీ నది, గంగానది, మధుసవా, దృషద్వతీ, కౌశికీ, హైరణ్వతీ అని కలవు. వీటిలో ఒక సరస్వతి తప్ప మిగిలిన నదులన్ని యీ వర్షకాలము ప్రవహించునవి. ఈ నదుల జలములు స్పర్శకు పానమునకు స్నానమునకు పవిత్రములు. పుణ్యక్షేత్ర ప్రభావమువలన ఈ నదులకు కలుషితత్వములేదు. మొదట రంతుక క్షేత్రమునకొచ్చి అచట మహాబలుడు యక్షుడగు ద్వారపాలుని నమస్కరించి యాత్రను ప్రారంభించవలయును. తరువాత పుణ్యప్రదమగు అదితి వనమునకు వెళ్ళవలయును. ఇచటనే అదితి సంతానము కోరకుగొప్ప తపము నాచరించినది. ఇచట స్నానమాడి దేవమాతయగు అదితిని చక్కగా పూజించిన స్త్రీ సర్వలక్షణయుతుడు, మహా శూరుడగు పుత్రుని ప్రసవించును. తరువాత పరమోత్తమమగు విష్ణుస్థానమునకు వెళ్ళవలయును. ఇదియే విమల తీర్థము. ఇచట ఎపుడూ శ్రీమహావిష్ణువు సన్నిహితుముగా నుండును. విమలా తీర్థము స్నానమాడి విమలేశ్వరుని దర్శించి నిర్మలుడై దేవదేవుడగు శ్రీహరిలోకమును పొందును. శ్రీకృష్ణుని బలరాముని ఒకే స్థానమున నుండగా చూచినవారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. తరువాత లోకప్రసిద్దమగు పారిప్లవమునకు వెళ్ళవలయును. ఇచట స్నానమాడి ఆచమనము చేసి వేదపారగుడగు బ్రాహ్మణుని దక్షిణాదులచే సంతోషపరిచిన బ్రహ్మయజ్ఞ ఫలము లభించును. పాపనాశకమగు కౌశికీసంగమమున భక్తిచే స్నానమాడినవాడు ప్రియసమాగమమును పొందును. తరువాత క్షమతో పృథివీతీర్థమును చేరి భక్తితో స్నానమాడి ఉత్తమగతిని పొందును. ఇచట స్నానమాడినవాడు చేసిన సమస్త పృథివీగత దోషములను ఇచటి దేవి క్షమించును.

తరువాత పుణ్యప్రదమగు దక్షాశ్రమమున దక్షేశ్వరుడగు శివుని దర్శించి అశ్వమేధ యజ్ఞఫలమును పొందును. తరువాత శాలకినీ తీర్థమునకు వెళ్ళి అచట స్నానమాడవలయును. వాంఛి తార్థలాభమునకు హరునితో కలిసియున్న శ్రీహరిని పూజించవలయును. ఇచటి నుండి నాగతీర్థమునకు వెళ్ళి యధావిధిగా స్నానమునాచరించి ఇచటి నాగులకు పెరుగును, నేతిని తినిపించి సర్పములనుండి అభయమును పొందును. తరువాత సాయంకాలము రంతుక తీర్థమున కొచ్చి ఒక రాత్రి నివసించి మరునాడు ద్వారపాలకుని పూజించవలయును. గంధాద్యుపచారములచే బ్రాహ్మణుని పూజించి భుజింప చేయవలయును. తరువాత లోకత్రయ ప్రసిద్ధమగు పంచనద తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట శంకరుడు రాక్షసులను భీతిల్లజేయు పంచసాదములను గావించెను గాన దీనికి పంచనదమను పేరు కలిగెను. ఈ తీర్థము సర్వపాతక నాశనము. ఇచట స్నానముచే దానముచే నరుడు నిర్భయుడగును. తరువాత కోటి తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట స్వయముగా రుద్రుడు కోటి తీర్థములను సంగ్రహించి స్థాపించెను. ఈ తీర్థమున స్నానమాడి కోటీశ్వరుడగు శివుని దర్శించి, పంచయజ్ఞ భవపుణ్యమును ఇప్పటి నుండి ఎపుడూ పొందును. ఇచటనే దేవతలందరూ వామనదేవుని ప్రతిష్టించిరి. కావున ఇచట వామనుని పూజించి అగ్నిష్టోమ ఫలమును పొందును. తరువాత అశ్వితీర్థమును చేరి శ్రద్ద కలిగి జితేంద్రియుడై స్నానమాచరించి యశస్వి రూపవంతుడగును. తరువాత వారాహతీర్థమును చేరి విష్ణు ప్రకల్పిత తీర్థమున శ్రద్దచే స్నానము చేసి సద్గతిని పొందును. తరువాత చంద్రుడు తపమునాచరించి ఆరోగ్యమును పొందిన సోమతీర్థమునకు వెళ్ళి స్నానమాడవలయును. ఇచట గోదానమును చేసినవారికి రాజసూయ ఫలము లభించును. ఇచటనే భూతేశ్వరుని, జ్వాలామాలేశ్వరుని తాపలింగమును పూజించిన వారు మరల సంసారమును పొందరు. ఏకహంసమున స్నానమాడిన వారు సహస్రగోదాన ఫలమును పొందును. కృతశౌచమున స్నానమాడినవారు పుండరీక ఫలమును పొందును. తరువాత శంకర దేవుని ముంజవట తీర్థమును చేరి, ఒకరాత్రి ఉపవసించి ఈశుని పూజించి గణాధిపత్యమును పొందును. ఇచట ఉపవసించి ద్వారమున నున్న యక్షిణిని ప్రార్థించి స్నానమాడి బ్రాహ్మణులను పూజించి మహాపాతక శాంతి కొఱకు భుజింప చేయవలయును. ప్రదక్షిణ మాచరించి పుష్కరమునకు వెళ్ళవలయును. ఇచట స్నానమాడి పితృదేవతలను పూజించి కృతకృత్యుడగును. ఇచట కార్తీక పూర్ణిమరోజున కన్యాదానమునాచరించి వాడు దేవతానుగ్రహమున అభిమత ఫలమును పొందును. ఇచట మహాయక్షుడగు కపిలుడు ద్వారపాలకునిగా ఉండును. పాపములకు విఘ్నములను కల్పించి సుకృతమును ప్రసాదించును. కపిలపత్ని ఖలమేఖల కలదు. దుందుభిని మ్రోగించుచు నిత్యము తిరుగుచుండును. పాపులను స్నానము చేయనీయక వారించును. సుకృతులను తీసుకొనివచ్చును. తరువాత రామప్రదమునకు వెళ్ళవలయును. ఇచట యధావిధిగా స్నానమాచరించి దేవతలను పితరులను. ఋషులను పూజించి భుక్తిని ముక్తిని పొందును. శ్రద్ధతో రాముని పూజించి స్వర్ణదానమును గావించి ధనవంతుడగును.

వశమూల తీర్థమును చేరి స్నానము చేసి తన వంశము నుద్దరించును. కాయ శోధనక తీర్థమున స్నానమాడి శుద్దదేహుడై శ్రీహరిని చేరును. తరువాత లోకోద్ధార తీర్థమును చేరి స్నానమాడి జనార్ధనుని పూజించి సనాతనమగు శ్రీ విష్ణులోకమును చేరును. తరువాత శ్రీ తీర్థమును చేరి స్నానము నాచరించి పరమోత్తమమగు సాలగ్రామమును పూజించి నిత్యము తన సమీపముననే శ్రీహరిని చూడగలుగును. తరువాత కపిలాహ్రదమును చేరి స్నానమాడి పితరులను దేవతలను పూజించి సహస్రకపీలాదాన పుణ్యమును పొందును. ఇచట విశ్వేశ్వరుడగు కపిలుని యధావిధిగా పూజించి దేవతాసత్కారమును పొందుచు శివలోకమును చేరును. తరువాత సూర్యతీర్థమున ఉపవసించి సూర్యుని పూజించు వలయును. ఇట్లు చేసిన అగ్నిష్టోమయజ్ఞ ఫలమును పొంది స్వర్గమును చేరును. ఇచట పృథివి వివరద్వారమున నున్న గణపతిని స్వయముగా దర్శించి పూజించి యజ్ఞఫలమును పొందును. దేవీతీర్థమున స్నానమాడినవారు ఉత్తమ తీర్థమును పొందును. బ్రహ్మావర్తమున నరుడు స్నానమాడి బ్రహ్మజ్ఞానమును పొందును. సుతీర్థకమున నరుడు స్నానమాడి దేవతలను, ఋషులను పితరులను మానవులను చక్కగా పూజించి అశ్వమేధయజ్ఞఫలమును పొందును. కామేశ్వరతీర్థమున శ్రద్ధాసమన్వితుడై స్నానమాచరించి సర్వవ్యాధి వినిర్ముక్తుడై శాశ్వత బ్రహ్మను పొందును. మాతృతీర్థమున స్నానము చేసి శ్రద్దగా పూజించిన వారికి ఏడు తరముల వరకు కులమున సంపదలు పెరుగును. తరువాత సీతావనమునకు వెళ్ళి దర్శించినంతనే ఇరువది యొకటి తరములను పావనము చేయును ఇచట కేశములను విడిచి పాపములనుండి వినిర్ముక్తుడై పరిశుద్దడగును. ఇచట లోకత్రయ ప్రసిద్ధమగు దశాశ్వమేధిక తీర్థము. కలదు. ఈ తీర్థమును దర్శించినంతనే నరుడు పాపముల నుండి పరిముక్తుడగును. తరువాత మానుషాహ్వతీర్థమున స్నానమాచరించవలయును. ఇట్లు చేసిన మరల మానవజన్మకలుగును. మానుషతీర్థమునకు ఒక కోసు దూరమున ఆపణాతీర్థము కలదు. ఇచట స్నామునాచరించి బ్రహ్మణులకు పాలతో సిద్దము చేసిన శ్యామాకమును భుజింపచేయవలయును. శ్రాద్ధకర్తకు పాపము నశించును. భాద్రపద కృష్ణ పక్షమున పితృపక్ష మహాలయమున చతుర్దశినాడు మధ్యాహ్నమున పిండి ప్రదానము చేయువారికి ముక్తి లభించును. ఇటనుండి బ్రహ్మస్థానమగు బ్రహ్మోదుంబరకమును చేరి ఇచట బ్రహ్మర్షికుండము నందు స్నానము నాచరించి సోమయాగఫలమును పొందును. వృద్ధ కేదారక తీర్థమున దండిసమన్వితుడగు స్థాణువును చక్కగా పూజించి ఇచ్చానుకూలముగా అంతర్ధానమును పొందగలడు. తరువాత కలశీతీర్థమునకు వెళ్ళి స్నానమాడి అంబికాదేవిని పూజించి సంసారసాగరమును దాటగలడు. కృషి సరమునందు మహేశ్వరుని దర్శించి శివలోకమును పొందును. సరకమున మూడు కోట్ల తీర్థములు కలవు సరోమధ్యమున రుద్రకోటి కలదు. సరసున స్నానమాడి రుద్రకోటిని స్మరించినచో రుద్రకోటిని పూజించినవాడగును. ఇచటనే పాపప్రణాశనమగు ఈహాస్పద తీర్థము గలదు. ఈ తీర్థమును దర్శించినంతనే ముక్తిని పొందును. ఇచట నున్న దేవతలను పితరులను పూజించి దుర్గతికి దూరుడగును. మనసున కోరినది లభించును.

కేదార మహాతీర్థము సర్వకల్మష నాశనము. ఇచట స్నానము చేసిన పురుషుడు సర్వదాన ఫలమును పొందును. సరక తీర్థమునకు పూర్వభాగమున అన్యజన్మయను తీర్థము ప్రసిద్ధము. ఈ తీర్థము స్వచ్చ జలము. ఇచట హరిహరులు సన్నిహితులుగా నుందురు. ఇచట విష్ణువు చతుర్బుజునిగా, శివుడు లింగాకారముతో నుండును. ఇచట స్నానమాడి హరిహరులను దర్శించి స్తుతించి మోక్షమును పొందును. చైత్ర శుక్ల పక్షమున నాగప్రదమునకు వెళ్ళి స్నానమాడి శ్రాద్దమును ఆచరించువాడు ముక్తిని పొందును. యమలోకమును చూడడు. తరువాత దేవసేవితమగు త్రివిష్టప తీర్థమును చేరి అచట నున్న వైతరణీనది యందు స్నానమాడి శూలపాణియగు వృషధ్వజుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై ఉత్తమ గతిని పొందును. రసావర్తమున స్నానమాడి ఉత్తమసిద్ధిని పొందును. చైత్ర శుద్ధ పూర్ణిమనాడు విలేపక తీర్థమున స్నానమాడి భక్తిచే శివుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడగును. తరువాత ఉత్తమమగు ఫలకీవనమునకు వెళ్ళవలయును. ఇచట గంధర్వులు దేవతలు పరమతపము నాచరింతురు. ఇచట దృషద్వతీనదిలో యధావిధిగా స్నానమాడి దేవతలకు పితరులకు తర్పణము గావించి అగ్నిష్టోమ అతిరాత్ర ఫలమును పొందును. పూర్ణిమనాడు అమావాస్యనాడు ఇచట శ్రాద్ధమునాచరించు వాడు గయాశ్రాద్ధ ఫలమును పొందును. అరణ్యమున శ్రాద్ధమాచరించిననూ ఫలకీవనమును స్మరించిన చో పితరులకు తృప్తి కలుగును. తరువాత పాణిఘాత తీర్థమున పితరులకు తర్పణము నాచరించి రాజసూయ ఫలమును పొంది సాంఖ్యయోగమును పొందును. మిశ్రకతీర్థమున యధావిధిగా స్నానము నాచరించి సర్వతీర్థ పలమును పొంది ఉత్తమగతిని పొందును. తరువాత వ్యాసవనమునకు వెళ్ళి అచటి మనోజనతీర్థమున స్నానమాడి మనీషి విభును దర్శించి మనోభీష్టమునలను పొందును.

మధువనమునకు వెళ్ళి శుచియై దేవీతీర్థమున స్నానమాడి దేవతలను ఋషులను పూజించి ఉత్తమసిద్ధిని పొందును. కాశీకీ సంగమతీర్థమున దృషద్వతీనదిలో స్నామాడి నియమబద్దుడై నియతాహారమును భుజించి సర్వపాప వినిర్ముక్తుడగును. వ్యాస మహర్షి పుత్రశోకాభిభూతుడై దేహత్యాగమునకు నిశ్చయించి దేవతలచే మరల స్వస్థతను పొందించబడిన వ్యాసస్థలికి వెళ్ళినవారు. దు:ఖమును పొందజాలరు. కిందుశూ కూపమును చేతిలప్రస్థదానమును గావించి పరమ స్థితిని పొందును. ఇచట మరణించినవాడు ముక్తిని పొందును. ప్రసిద్ధములగు ఆహ్నముదిత తీర్థము లందు స్నానము చేసి సూర్యలోకమును పొందును. మృగముచ్యమునకు వెళ్ళి గంగకు నమస్కరించి మహాదేవుని పూజించి అశ్వమేధ ఫలమును పొందును. కోటితీర్థమునకు వెళ్ళి స్నానమాడి కోటీశ్వరుడగు శివుని దర్శించి స్తుతించి కోటి యజ్ఞఫలమును పొందును. బలి యజ్ఞమును హరించుటకు వామనుడవతరించిన లోకత్రయ ప్రథితమగు వామనకమునకు వెళ్ళి విష్ణుపదమున స్నానమాడి వామనుని పూజించి సర్వపాప విశుద్ధాత్మయై విష్ణులోకమున విరజల్లును. ఇచటనే సర్వపాతకనాశనమగు జ్యేష్టాశ్రమము కలదు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినాడు పవసించి మరునాడు ఇచట యధావిధిగా స్నానమాడి నరశ్రేష్ఠుడగును. ఇచట శ్రాద్ధమాచరించిన పితరులకు మిక్కిలి ప్రీతి కలుగును. ఇచటనే లోకత్రయ ప్రసిద్దమగు కోటి తీర్థము కలదు. ఇచట స్నానమాడి కోటి యజ్ఞఫలమును పొందును. ఇచట కోటీశ్వరుడును మహేశ్వరుని యధావిధిగా పూజించి గణాధితప్యమును పొందును.

ఇచటనే ఉన్న సూర్యతీర్థమున స్నానమాడి సూర్యలోకమును చేరును. కులో తారక తీర్థమున కు వెళ్ళి స్నానమాచరించవలయును. స్వకులమును తరింపచేసి స్వర్గమున కల్పాన్తము వరకు నివసించును. పవనహ్రదమున స్నానమడి దేవుడగు మహేశ్వరుని దర్శించి సర్వపాప వినిర్ముక్తుడై శివలోకమును చేరును. హనుమత్తీర్ధమున స్నానము చేసి ముక్తిని పొందును. రాజర్షియగు శాలిహోత్రుని తీర్థమున స్నానమాడి పాపరహితుడగును. శ్రీకుంభమను సరస్వతీ తీర్థమున స్నానమాడి యజ్ఞభాక్కగును నైమిషకుండమున స్నానమాడి నైమిషపుణ్యమును పొందును. వేదవతీ తీర్థమున స్నానమాడిన స్త్రీ సతీత్వమును పొందును. బ్రహ్మతీర్థమున స్నానమాడిన వాడు బ్రాహ్మణ్యమును పొందును.బ్రహ్మలోకమును పొంది దుఃఖరహితుడుగును. సోమతీర్థమున స్నానమాడినవాడు సద్గతిని పొందును. సప్త సారస్వత తీర్థమును చేరి స్నానమాడి ముక్తిని పొందును. ఇచటనే ఏడు సరస్వతీనదులు ఐక్యమును పొందినవి. సుప్రభా, కాంచనాక్షి. విశాలా, మనోహరీ, సునందా, సువేణు, విమలోదక అనునది సప్తసరస్వతులు. నోశనస తీర్థమున స్నానమాడి పాతకములనుండి ముక్తుడగును. కపాలమోచన తీర్థమున- స్నానమాడి బ్రహ్మహతకుడు కూడా శుద్ది పొందును. విశ్వామిత్ర తీర్థమున స్నానమాడి బ్రాహ్మణ్యమును పొందును. పృథూదకమున స్నానమాడి సంసార బంధముక్తుడగును. అవి కీర్ణతీర్థమున స్నానమాడి బ్రహ్మచర్య ఫలమును లభించును. మధుప్రసవ తీర్థమునకు వెడలి స్నానమాడి పాతక విముక్తుడగును. వాసిష్ఠ తీర్థమున స్నానమాడి వసిష్ఠలోకమును పొందును. అరునా సంగమమున స్నానమాచరించి మూడు రాత్రులుపవసించి మరల స్నానము చేసినవాడు ముక్తిని పొందును. ఇచట నాలుగు సముద్రములు కలవు. వీటిలో స్నానమాడినవాడు గోసహస్రప్రదానపలమును పొంది స్వర్గమున విరాజిల్లును. సోమతీర్థమున స్నానమాడి చైత్ర శుక్లషష్ఠినాడు శ్రాద్ధము నాచరించి పితరులను తరింపచేయును. ఇక పంచవటమున స్నానము చేసి యోగమూర్తి ధరుడగు శివుని యధావిధిగా పూజించి దేవతలతో కలిసి ఆనందించును. తరువాత కురుతీర్థమున స్నానమాడి సర్వసిద్ధిని పొందును. స్వర్గ ద్వారము స్నానమాడినవాడు స్వర్గమున నివసించును. అనరక తీర్థమున స్నానము చేసి సర్వపాతకముక్తుడగును. తరువాత కామ్య, కవనమునకు వెళ్ళవలయును. ఇచట ప్రవేశించినంతనే సర్వసంచితముల నుండి విముక్తుడగును. ఇక ఆదిత్యవనమును చేరి దర్శనమాత్రముననే ముక్తిని పొందును. ఇచట ఆదివారము నాడు కామితమును పొందును. యజ్ఞోపవీతిక తీర్థమున స్నానము చేసి స్వధర్మఫలమును పొందును. తరువాత చతుప్రవాహత్మమున స్నానము చేసి సర్వతీర్థపలమును పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును. విహారతీర్థమున స్నానమాడి సర్వసౌఖ్యమును పొందును దుర్గాతీర్థమున నరుడు స్నానమాడి దుర్గతిని పొందజాలడు. పితృతీర్థమను పేరుగల సరస్వతీ తీర్థమున స్నానమాడి దేవాదుతలను తృప్తి పరిచి ఉత్తమగతిని పొందును. ప్రాచీ సరస్వతి యందు స్నానమాడి యధావిధిగా స్నానము చేసి దుర్లభకామనలను పొంది దేహాంతమున స్వర్గమును పొందును. శుక్ర తీర్థమున నరుడు స్నానమాడి శ్రాద్దము నాచరించినచో పితరులను తరింపచేయును. బ్రహ్మతీర్థమున చైత్ర కృష్ణ అష్టమినాడు. కాని, చతుర్దశినాడు కాని ఉపవసించినచో ముక్తిని పొందును. స్థాణు తీర్థమున స్నానము చేసి స్థాణువటమును దర్శించి ఘోరపాతకములనుండి ముక్తిని పొందునని పితామహుడు చెప్పెను.. స్థాణులింగ దర్శనముచే యాత్ర పరిపూర్ణమగును.కురుక్షేత్రముతో సాటివచ్చు తీర్థము ఇంతకు మునుపు లేదు. ఇక ఉండదు. ఇచట ద్వాదశయాత్రలను చేసినవాడు మరల జన్మను పొందడు. ఇచట నాచరించి ఇష్టాపూర్తములు తపస్సు, హోమము, యధావిధానము అన్నియూ అక్షయములగును. మన్వాదిక, యుగాదిన, సూర్యచన గ్రహణములలో, మహాపతమున, సంక్రమణమున, పవిత్రుములగు ఇతర దీనములందు కురుక్షేత్రమున స్నానమాడిన వాడు అనన ఫలమును పొందును. ప్రతి యుగమున కలుగు పాపములను నశింపచేయుటకే బ్రహ్మ కురుక్షేత్రమును కల్పించెను. ఇట్లు పాపప్రణాశిని పుణ్యప్రదము అగు ఈ కథను కీర్తించిన వారు వినినవారు కూడా పాపములనుండి విముక్తులగుదురు. కురుక్షేత్రమున సూర్యగ్రహణ కాలమున దానము చేసిన దానినే ప్రతిజన్మలో పొందును. సంసారముక్తిని కోరువారు కురుక్షేత్రమునే సేవించవలయును. ఇదియే మహాపుణ్యము. ఇదియే మహాతపము. ఇదియే మహాజ్ఞానము. ఈ భూమండలమున కురుక్షేత్రము వంటి తీర్థము మరియొకటి లేదు. ఆచారవంతుడు ఆచార రహితుడు కూడా ఇచట ముక్తిని పొందును. ఇట్లు నీవడిగిన దంతయూ చెప్పితిని. సర్వపాపనాశకము, పుణ్యప్రదము మోక్షప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చేప్పితిని. ఇంకనూ ఏమి వినదలచితిరి?

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున కురుక్షేత్రమాహాత్మ్యమున తీర్థయాత్రా వర్ణనమను అరువది అయిదవ అధ్యాయము.