నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

61 - పురుషోత్తమ క్షేత్ర యాత్రా ఫల వర్ణనమ్

వసువు పలికెను :- ఓ బ్రహ్మపుత్రీ! ఆ మహానుభావులగు దేవతలందరు బలరాముని శ్రీ కృష్ణుని సుభద్రను స్తోత్రము చేయుదురు.

దేవా ఊచు:

దేవతలు పలికిరి : లోకపాలా! నీకు జయము. పద్మనాభా! భూధరణ జయము. ఆదిదేవా! బహుకారణా! జయము. వాసుదేవా! సచ్చరణా! సత్కరణా! నీకు జయము. దివ్యమీనా! త్రిదశేశ్వరా! జయము. జలధిశయనా! యోగీశా! వేదధరా! జయము. వీశ్వమూర్తీ! చక్రరీధరా! జయము. భూతనాధా! శ్రీనివాసా! యోగీవరా! జయము. సూర్యనేత్రా! దేవవరాహ! జయము కైటభారే! వేదవరా! జయము. కూర్మరూపొ! యజ్ఞవరాహా కమలనాబ్రా! శైలధరా! జయము. యోగీశా! వేగధరా! విశ్వమూర్తీ! చక్రధరా! భూతనాధా! ధరణీధరా! జయము. శేషశాయీ! పీతాంబరధారీ! జయము. సోమకాన్హా! యోగావాసా! సుఖనివాసా! ధర్మకాంతా మతినివాసా! జయము. గహన గేహనివాసా! యోగిగమ్యా! మఖనివాసా! జయము. వేదవేద్యా! శాంతికరా! యోగిచిన్హ్యా! పుష్టికరా! జయము. జ్ఞానమూర్తీ! కమలాకరా! భావవేద్యా! ముక్తికరా! విమలదేహ! సత్యనిలయ! గుణసమూహ! యజ్ఞకరా! జయము! గుణవిహీనా! మోక్షకరా! భూహిరణ్యా! కాంతియతా! జయము. లోకవరణా! లోకపతీ! పంకజాక్షా! సృష్టికర్తా! యోగయు అత సీకుసుమ సిసుమ శ్యామదేహ! జయము. సముద్రావిష్టదేహ! లక్ష్మీపంకజ భోగదేహ! భక్తిభావనా! లోకగేయా! లోకకాంతా! పరమ శాంతా! జయము. పరమసారా! చక్రధరా! భోగియుతా! నీలాంబరా! జయము. సాంఖ్యనుతా! కలుషహరా! కృష్ణా! జగన్నాధా! సంకర్షణానుజా! జయము. పద్మపలాశాక్షా! విష్ణో! నీకు నమస్కారము. ఇంద్రాది దేవతలు, సిద్ద చారణ గంధర్వులు ఇతర స్వర్గవాసులు ఇట్లు స్తుతించి సంతుష్టమనస్కులై దర్శించి స్తుతించి,. నమస్కరించి వారి యందే మనసు నుంచి బలరామకృష్ణ సుభద్రలను ధ్యానించుచు తమ తమ స్థానములకు వెళ్ళేదరు. శత కపిలాదానముచే కలుగు ఫలము వేదికపై నున్న బలరామ సహితకృష్ణ సందర్శనముచే లభించును. శతనిష్కసువర్ణదానముచే భూమి దానము వలన కలుగు ఫలమును, కన్యాశతదానముచే కలుగు ఫలము మంచము పై నున్న శ్రీకృష్ణ సందర్శనముచే కలుగును. అన్నదానము వలన, సర్వాతిధ్యము వలన, యధావిధిగా చేసిన వృషభోత్సర్జనము వలన, వేసవిలో జలదానము వలన, తిలధేను ప్రదానము వలన, గజాశ్వరధదానముల వలన, సర్వతీర్థసేవనము వలన, సర్వవ్రతా చరణము వలన, సర్వదానముల వలన కలుగు ఫలములన్నియు సుభద్రాసహిత బలరామకృష్ణ సందర్శనమున కలుగును. కావున నరుడు కాని, నారి కాని మంచస్థుడగు పురుషోత్తముని దర్శనము చేసుకొనవలయును. శ్రీకృష్ణుని స్నానశేష జలమును ప్రోక్షణ చేసుకొనినచో గొడ్డురాలు, మృతసంతానవతి, దౌర్భాగ్యపీడితులు, అందరూ పరిశుద్దిని పొంది అభీష్టములను పొందెదరు. ఇతరములను అభిలషించరు కూడా.

ఈ భూమండలమున నున్న సకల పుణ్యములు శ్రీకృష్ణస్నాన శేషజలము యొక్క ఒక అంశతో కూడా సాటి రాజాలవు. కావున శ్రీకృష్ణ స్నాన శేషజలముచే శరీరమంతటిని ప్రోక్షణ చేసుకొనవలయును. స్నానము చేసిన శ్రీకృష్ణు భగవానుని, దక్షిణాభిముఖముగా వేళ్ళు శ్రీకృష్ణుని దర్శించినవారు బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తులగుదురు. భూమిని మూడు మార్లు ప్రదక్షిణము చేసినచో శాస్త్ర బోధితమగు పలము దక్షిణాముఖ కృష్ణ సందర్శనముచే లభించును. భూమండలమున తీర్థయాత్రల వలన కలుగు ఫలము దక్షిణాముఖముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని సందర్శనము వలన లభించును. గంగాద్వారముఖ, కుబ్ధామమున, కురుక్షేత్రమున, అర్కపర్వమున, పుష్కరాది పుణ్యతీర్థములందు స్నానమాడికందు వలన కలుగు ఫలము దక్షిణముగా వెళ్ళుచున్న శ్రీకృష్ణుని దర్శనమున కలుగును. వేద శాస్త్రపురాణాది పఠనము వలన, భారతాది సంహితా పఠనము వలన కలుగు ఫలము దక్షిణాముఖముగా నున్న బలరామకృష్ణుని దర్శించినవారు శ్రీహరి లోకమునకు వెళ్ళెదరు. గుండి చామండపమునకు వెళ్లు సమయమున, ఫాలున పూర్ణిమనాడు, విషువమున ఒకమారు శ్రీకృష్ణ సందర్శన వలన చేసినచో శ్రీహరి లోకమును పొందును. ఎన్నిమార్లు పురుషోత్తమయాత్ర చేసిన అన్ని కల్పములు విష్ణులోకమున నివసించును. ద్వాదశయాత్రలు పూర్ణములైనచో బలరామకృష్ణ సుభద్రలను ప్రతిష్ఠించవలయును. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు సావధాన మనస్కుడై పవిత్రమగు జలాశయమునకు వెళ్ళి, అచమనమును చేసి భక్తి కలిగి పవిత్రుడై అచట అన్ని తీర్థములను ఆవాహనమును గావించి, నారాయణుని ధ్యానించి యదోక్త విధిననుసరించి స్నానము చేయవలయును. ఇట్లు స్నానము గావించి, చక్కగా దేవతలను, ఋషులను, తమ పితరులను, ఇతరులను నామగోత్రోచ్చారణ పూర్వకముగా తర్పణము చేయవలయును. తీరమును చేరి, నిర్మలములు గౌతములగు వస్త్రములను ధరించి, ఆచమనము గావించి, సూర్యోపస్థానము నాచరించి, గాయత్రీ మంత్రమును అష్టోత్తర శతము జపించి, ఇతర సూర్యమంత్రములను మూడు మార్లు పఠించి సూర్యుని నమస్కరించవలయును. మూడు వర్ణములలో స్నానము జపము వేదోక్తము. స్త్రీ శూద్రులకు వేదోక్త విధివర్జితముగా స్నాన జపములు చేయవలయును. తరువాత భక్తిచే మందిరములోనున్న పురుషోత్తముని వద్దకు వెళ్ళవలయును. హస్త పాదప్రక్షాళనమును గావించుకొని ఆచమనము చేసి శ్రీహరిని మొదటనే తితో, తరువాత పాలతో మధువుతో గంధోదకముతో, తీర్థ చందన జలముతో స్నానమును చేయించవలయును. తరువాత శ్రేష్ఠమగు వస్త్రయుగ్మమును కట్టించవలయును. చందనాగురు కర్పూర కుంకుమలచే లేపనము గావించవలయును. పరమభక్తిచే సద్మములతో పురుషోత్తముని పూజించవలయును. ఇట్లు జగన్నాధుడు భక్తి ముక్తి ప్రదుడగు శ్రీహరిని చక్కగా పూజించి అగురు సంయుక్త ధూపమును దేవదేహమున అగ్రభాగమున వేయవలయును. ఘృతసమన్వితమగు గగులముమ దహించవలయును. తరువాత శక్తిననుసరించి నేతితో దీపమును వెలిగించవలయును. మరియు పన్నెండు దీపములను వెలిగించవలయును. ఈ దీపములను గోమృతముచే కాని నువ్వులనూనె చేకాని  వెలిగించవలయును. తరువాత పాయసమును,. అపూపములను, సకిలములను, మోదకములను, అరిసెలను ఇతర ఫలములను నివేదన చేయవలయును. ఇట్లు పంచోపచారములచే పురుషోత్తముని చక్కగా పూజించి “ఓం నమః పురుషోత్తమాయ” అను మంత్రమును అష్టోత్తర శతము జపించవలయును. తరువాత దేవుని ప్రార్థించి దండవత్రణామములనాచరించి తరువాత గురువును భక్తిచే పుష్ప/ చందనాదులచే పూజించవలయును.

దేవునకు గురువునకు భేదము లేదు. తరువాత ఉపరిభాగమున దేవునకు మండపమును నిర్మించవలయును. ఇచట విశాలముగా నానాపుష్పములచే విచిత్రమండలము నేర్పరచవలయును. అవధారణము గావించి రాత్రి జాగరణము చేయవలయును. రాత్రి పూట వాసుదేవ కధను కాని గీతములను కాని వినుచుండవలయును. దేవుని ధ్యానించుచు కీర్తించుచు స్తుతించుచు ఆ రాత్రిని గడుపవలయును. తరువాత స్వచ్చమగు ప్రభాతకాలమున ద్వాదశి నాడు వేదపారగులగు పన్నెండు మంది బ్రాహ్మాణులను వ్రతస్నాతులను నిమగ్రణ చేయవలయును. వీరు ఇతి హసపురాణజ్ఞులు, శ్రోత్రియులు, జితేంద్రియులు కావలయును. యధావిధిగా స్నానమాచరించి ధౌత వస్త్రములను ధరించి జితేంద్రియుడై భక్తిచే అచట నున్న పురుషోత్తముని పూర్వము వలె స్నానము చేయించవలయును. గంధ పుష్ప ఉపహారములచే ధూపనైవేద్యములచే, బహు విధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములుచేయించవలయును. గంధ పుష్ప ఉపహారములచే ధూపనైవేద్యములచే విధోపచారములచే, ప్రదక్షిణ నమస్కారములచే జపస్తోత్ర నమస్కారములచే, మనోహర గీతవాద్యములచే చక్కగా పూజించి, తరువాత బ్రాహ్మణులను పూజించవలయును. బ్రాహ్మణులకు పన్నెండు గోవులను బంగారమును, ఛత్రమును, పాదరక్షలను కాంస్యపాత్రను భక్తిచే అర్పించి, వారిని పాయసపూర్వకముగా భుజింప చేయవలయయును. పక్వాన్నము, భక్ష్యభోజ్యములు, శర్కరాన్వితమగు గుడము భోజనమును అర్పించవలయును. భుజించి తృప్తి చెందిన బ్రాహ్మణులను స్వస్థమానసులను ద్వాదశ ఉదకుంభములను గ్రహింపచేసి మోదకములనర్పించవలయును. యధాశక్తి దక్షిణలనర్పించవలయును. సువర్ణ వస్త్ర గోధాన్యములను ఇతర ద్రవ్యములను సమర్పించి చక్కగా పూజించి నమస్కరించి ఈ మంత్రమును పఠించవలయును

అని సర్వవ్యాపకుడు, జగన్నాధుడు, శంఖ చక్రగదాధరుడు, అనాది నిధనుడగు పురుషోత్తముడు ప్రీతి చెందుగాక అని అర్థము. ఇట్లు ఉచ్చరించి బ్రాహ్మణులను మూడు మార్లు ప్రదక్షిణము నాచరించి శిరసుచే నమస్కరించి ఆచార్య సహితునిగా వారిని విసర్జించవలయును. బ్రాహ్మణుల వెంట సీమ వరకు వెళ్ళవలయును. వెంటవెళ్ళి నమస్కరించి తిరిగి వచ్చి స్వజనులతో బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు చక్కగా ఆచరించిన పురుషులు స్త్రీలు సహస్రాశ్వమేధముల ఫలమును, శత రాజసూయ యాగముల ఫలమును పొందును. అతీతములను నూటిని రాబోవు  నూరు పురుషులనుద్దరించి దివ్యరూపధరుడై, అవ్యయుడై, సర్వలక్షణ సంపన్నుడై, సర్వాలంకార భూషితుడై సర్వకామసమృద్ధుడై రూపగుణ యౌవనములతో అంతట గంధర్వాప్సరసలచే స్తుతించబడుచు, కామగతి గల స్థిరమగు అర్కవర్ణముగల విమానముచే పతాకధ్వజయుతముగా శతసూర్యకాంతియుతముతో పది దిక్కులను ప్రకాశింప చేయుచు శ్రమరహితుడై ఆకాశమున యువకునిగా మహాబలునిగా ధీమంతునిగా విష్ణులోకమునకు వెళ్ళును. విష్ణులోకమున నూరు కల్పముల కాలము యధేష్ట భోగములను అనుభవించును. మునివరులచే స్తుతించబడుచు శ్రమరహితుడై యుండును. శ్రీహరి శం:విచక్రగదాధరుడై నాలుగు భుజములతో ఉండునట్లు ఇతను కూడా చతుర్బుజరూపమును ధరించి సంతోషముతో ఇష్టభోగములననుభవించి చాలాకాలము విహరించి, తరువాత అఖిల కామప్రదమగు బ్రహ్మలోకమును చేరును. ఈ బ్రహ్మలోకము సిద్దులచే విద్యాధరులచే దేవతలచే కిన్నరులచే శోభితమై యుండును. బ్రహ్మలోకమున తొంబది కల్పములు భోగముల ననుభవించి దేవతలచే సేవించబడు సుఖప్రదమగు రుద్రలోకమునకు వచ్చును. ఇచట కూడా సిద్దులు విద్యాధరులు దైత్యులు దానవులు ప్రకాశించుచుందురు. రుద్రలోకమున ఎనుబది కల్పములు భోగములననుభవించి తరువాత సర్వభోగసమన్వితమగు గోలోకమునకు వెళ్ళును. ఈ గోలోకము సురసిద్ద అప్సరసలచే శోభితము సుమనోహరము. ఇచట డెబ్బది కల్పములు భోగముల ననుభవించి ప్రాజాపత్యలోకమును చేరును. ఇచట అరువది కల్పములు భోగములననుభవించి సర్వాశ్చర్య సమన్వితమగు ఇన్జలోకముననకు వచ్చును. ఇచట యాబది కల్పములు భోగములననుభవించి విమానాలంకృతములగు అమరగృహములను చేరును. ఈ గృహములలో నలుబది కల్పములు సుదుర్లభములగు భోగములననుభవించి నానా సౌఖ్యసమన్వితమగు నక్షత్రలోకమును చేరును. ఇచట ముప్పది కల్పములు యధేష్ట భోగములననుభవించి చన్దలోకమును చేరును. ఇచటనే సర్వదేవతలచే అలకరించబడు చందుడుండును. ఇచట ఇరువది కల్పములు సుదుర్లభములగు భోగములనునుభవించి సురపూజితమగు ఆదిత్యలోకమును చేరును. ఇచట పదికల్పములు భోగముల ననుభవించి గంధర్వలోకమును చేరును. ఇచట యధాసుఖముగా ఒక కల్పము భోగములనుభవించి మరల భూలోకమున రాజుగా పుట్టును, ధార్మికుడు, చక్రవర్తి, మహాబలపరాక్రమములు కలవాడు స్వరగుణాలంకృతుడుగా నుండును. దర్మబద్ధముగా రాజ్య పరిపాలనము గావించి సదక్షిణముగా యజ్ఞములచే శ్రీహరిని సేవించి అంతమున మోక్షప్రదము శివకరమగు యోగిలోకమునకు వెళ్ళి ఇచట ప్రళయకాలము వరకు ఉత్తమ భోగములననుభవించి మరల -భూలోకమున కొచ్చి యోగుల కులమున ఉత్తమమగు విష్ణుభక్తుల వంశమున దుర్లభము సాధుసమ్మతవగు వంశమున నాలుగు వేదములు తెలిసిన బ్రాహ్మణోత్తమునిగా బ్రహ్మ యజ్ఞపరునిగా పుట్టును. తరువాత వైష్ణవయోగమును చేరి కైవల్యమగు మోక్షమును పొందును. ఇట్లు పురుషోత్తమ తీర్థయాత్రా ఫలమును, మానవులకు భుక్తిముక్తి ప్రదమగు దానిని విపులముగా వివరించితిని. ఇంకనూ ఏమి వినదలచితివో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమున పురుషోత్తమ క్షేత్రయాత్రా ఫల వర్ణనమను అరువది యొకటవ అధ్యాయము.