నారద మహా పురాణము - ఉత్తరార్థము
64 - అధ్యాయము
మోహిని పలికెను : కృపాలూ! ధర్మజ్ఞా! వసూ బహువిదుడవగు నీవు ప్రయాగ తీర్థరాజమాహాత్మ్యమును తెలిపితివి. ఇక ఇపుడు సర్వతీర్ధములలో పావనము, శుభప్రదము, ముఖ్యము అగు కురుక్షేత్ర మాహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను :- మోహినీ! ఇపుడు పుణ్యప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. వినుము. ఇచటికి వెళ్ళిస్నానము చేసినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును. ఇచట అనేక తీర్ధములను మునీశ్వరులు సేవించిరి. ఇపుడు నీకు ఆ తీర్ధములను ముక్తి ప్రదములను చెప్పెదను. వినుము. గయాశ్రాద్ధమున బ్రహ్మజ్ఞానము గోగ్రహమున మరణము, కురుక్షేత్రమున నివాసము ముక్తి ప్రదములని చెప్పబడినవి. సరస్వతీ దృషద్వతీనదుల మధ్యభాగము బ్రహ్మవర్తమనబడును. దూరమున నుండు వాడుకూడా కురుక్షేత్రమునకు వెళ్ళేదను, నివసించెదను అని ఎల్ల కాలము స్మరించువాడు కూడా పాప విముక్తుడగును. ఇచట సరస్వతీ తీరమున నివసించు వారు బ్రహ్మజ్ఞానమును పొందును. ఈ కురుక్షేత్రమును దేవతలు ఋషులు సిద్దులు సేవించుచుందురు. ఈ కురుక్షేత్రమును సేవించుట వలన తనలో బ్రహ్మను దర్శించగలడు.
మోహిని పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రము సర్వతీర్ధాధికమెట్లు అయినదో నాకు విస్తరముగా తెలుపుము. నిన్ను నేను శరణుపొందితిని.
వసువు పలికెను :- శుభప్రదురాలా! మహాఫల ప్రదము మానవుల పాపమును దహింపచేయునది బ్రహ్మకు ప్రియమగునది యగు కురుక్షేత్రమేట్లేర్పడినదో చెప్పెదను వినుము. ఇచట మొదట పవిత్రమగు బ్రహ్మసరస్సు ఏర్పడినది. తరువాత రామప్రదము ఏర్పడినది. ఇపుడు కురుక్షేత్రమేర్పడినది. మొదట బ్రహ్మచే నిర్మించిన సరస్సు సన్నిహితముగానున్నది. ఇపుడే బ్రహ్మవేదికకు మధ్యలో నున్నది. సృష్టి చేయగోరిన బ్రహ్మ ఇచట తపమును చేసెను స్థితిని కోరు విష్ణువు కూడా ఇచటనే తపమునాచరించెను. ఈ సరస్సున ప్రవేశించుటవలననే శంకరునకు స్థాణుత్వమేర్పడినది. పితృవధముచే పరితపించిన పరశురాముడు బ్రాహ్మణద్వేషులగు క్షత్రియులను వధించి ఇచటనే రక్తపు మడుగులనేర్పరిచెను. ఆ రక్తముతో పితరులకు తర్పణమునిచ్చి ఇచటనే తపమునాచరించెను. అప్పటి నుండి ఇది పాప నాశకమగు రామతీర్థముగా ఖ్యాతిగాంచినది. ఇచటనే మార్కండేయ మహర్షి పరమ తపమునాచరించెను. ప్లక్షజాతయగు సరస్వతి వచ్చిన ప్రతి ప్రదేశమును మార్కండేయ మహర్షి స్తుతించెను. సన్నిహితమగు సరస్సునుండి పశ్చిమదిశకు బయలుదేరినది. అపుడు ఈ సరస్వతిని కురువుక్షేత్రమున్నంతవరకు ఆకర్షించెను. ఈ క్షేత్రము పంచయోజన విస్తీర్ణము. దయాసత్యక్షమలకు పుట్టిల్లు. స్యమంత పంచకమునే కురుక్షేత్రమనిరి. ఇచట స్నానమును చేసిన వారు అక్షయ పుణ్యమును పొందును. మరణించిన వారు విమానము నధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. ఇచట ఆచరించిన ఉపవాసము, దానము, జపము, హోమము, దేవతార్చనము అక్షయత్వమును పొందును. బ్రహ్మ వేదియందు కురుక్షేత్రమునందు మరణించిన వారు మరల పుట్టరు. గ్రహములకు నక్షత్రములకు తారలకు పతన భయముండును. కాని కురుక్షేత్రమున మరణించిన వారికి పతన భయముండదు. దేవతలు, ఋషులు సిద్ధులు ఈ సరస్సును సేవించు కోరికతో నుండు ప్రదేశమును రంతుకక్షేత్రమందురు. పూర్వము ఈ క్షేత్రమును కాపాడుటకు శ్రీ మహావిష్ణువు యక్ష సుచన సూర్య వాసుకి, శంఖుకర్ణక విద్యాధర సుకేశులను రాక్షసులను స్థాపించెను. వీరందరు ధనదుర్బాణధరులై భృత్యులతో కలిసి కురుక్షేత్రమును కాపాడుచు పావులను వారించుచుందురు. రంతుకక్షేత్రమును చేరి పలు మార్లు క్షమాపణను వేడి సరస్వతిలో స్నానమాడి యక్షుని దర్శించి నమస్కరించి పుష్పధూప దీపనైవేద్యములను సమర్పించి ఈ వాక్యమును పలుకవలయును. ఓ యక్షేనై నీ అనుగ్రహమువలన వనములను నదులను తీర్థములను పరిభ్రమించు నొకు విఘ్నము. కలుగ కుండుగాక. ఇట్లు ప్రార్థించి చక్కగా యాత్ర నాచరించవలయును. వనములను తీర్ధములను, నదులను కురుక్షేత్ర పుణ్యతీర్దములను పర్యటించువాడు. ఇహలోకమున పరలోకమున న్యూనత్వమును పొందజాలడు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదము కురుక్షేత్ర మాహాత్మ్యమున క్షేత్రప్రమాణాది నిరూపణ మను అరువది నాలుగవ అధ్యాయము.
