నారద మహా పురాణము - ఉత్తరార్థము
70 - ప్రభాస తీర్థ మాహాత్మ్యమ్
మోహిని పలికెను :
ఓ బ్రాహ్మణోత్తమా! నాకు ప్రభాస మాహాత్మ్యమును తెలుపుము. దానిని వినిన నేను నీ అనుగ్రహముతో ప్రసన్న మనస్కురాలనై ధన్యురాలనగుదును.
వసువు పలికెను :
ఓ మోహినీ ! నరుల పాపములను హరించి భుక్తి ముక్తులను పుణ్యమును ప్రసాదించు ప్రభాస తీర్థ మహాత్మ్యమును చెప్పెదను వినము. ఈ తీర్థమున చాలా తీర్థములు కలవు. గిరిజాపతియగు విశ్వేశ్వరుడు సోమేశుడు నివసించు చుండెను. ప్రభాస తీర్ధమున స్నానమాడి సోమనాధుని పూజించి ముక్తిని పొందును. ప్రభాస తీర్థకుండల విస్తీర్ణము ద్వాదశయోజనములు. ఈ మండలమధ్య భాగమున పంచయోజన విస్తీర్ల ప్రాంతము పీఠిక యనబడును. ఈ మధ్య భాగమున చర్మ మాత్ర ప్రాంతము కైలాసమున కంటే విశిష్టమైనది. ఇచటనే పుణ్యప్రదమగు అర్కస్థలమను తీర్థము కలదు. ఇచట సిద్దేశ్వరాది సహస్రలింగములు కలవు. ఇచట భక్తిచే స్నానము చేసి పితరులను నరులను తృప్తి పరిచి లింగములను పూజించి రుద్రలోకమును పొందును. అట్లే సాగర తీరమున అగ్ని తీర్థము కలదు. ఇచట స్నానముచేసి అగ్ని లోకమున చేరును. ఇచట కపర్దేశదేవుని ఉపవాసముతో పూజించి ఇహలోకమున అభీష్టములను పొంది శివలోకమును చేరును. తరువాత కేదారేశమునకు వెళ్ళి యధావిధిగా పూజించి దేవతల పూజలనందీ విమానముతో స్వర్గమును పొందును. భీమేశుని, భైరవేశుని, చండేశుని, భాస్కరేశ్వరుని, అంగారేశుని, గుర్వీశుని సోమేశుని, భృగుజేశ్వరుని,శని రాహు శిఖేశులను పదునాలుగు మందిని యధాక్రమముగా వెళ్ళ వలయును. భక్తిచే విడి విడిగా వారిని పూజించి నిగ్రహానుగ్రహసమర్థుడై శివలోకమును చేరును. సిద్దేశ్వరాది పంచాన్య లింగములను చక్కగా పూజించి ఇహ పరములందు సిద్ధిని పొందును. వరారోహాను, అజాపాలను, మంగలను, లలితేశ్వరిని, వీరిని క్రమముగా పూజించి పాపరహితుడగును. లక్ష్మీశ్వరుని, బాడవేశుని అర్హ్యశుని, కామకేశ్వరుని చక్కగా పూజించి లోకేశత్వమును పొందును. గౌరీ తపోవనమును చేరి గౌరీశ వరుణేశ్వరులను, ఉషేశ్వరుని పూజించి స్వర్గమును పొందును. గణేశుని కుమారేశుని, స్వాకమేశ మహేశ్వరులను, ఉత్తంకేశుని వహీశుని, గౌతముని దైత్య సూదనుని యధావిధిగా పూజించిన వారు దుర్గతిని పొందజాలరు. తరువాత చక్ర తీర్థమును చేరి యధావిధిగా స్నానమాడి గౌరీదేవిని పూజించి లభీష్టమును పొందును. అచటనే సన్నిహత్య తీర్థమును పొంది స్నానమాడి దేవాదులకు తృప్తి పరిచి సన్నిహత్యా ఫలమును పొందను. తరువాత భూతేశాది ఏకాదశ లింగములను పూజించిన వారు ఇహమున ఉత్తమ భోగములనను భవించి అంతమున రుద్రలోకమును చేరును. ఆదినారాయణ దేవుని చక్కగా పూజించి మోక్షమును పొందును. తరువాత చక్రధరుని చేరి యధావిధిగా పూజించి శత్రు విజయముతో ఉన్నత భోగములను పొందును. తరువాత సాంబాదిత్యుని చేరి నియమ పూర్వకముగా స్నానము చేసి రోగరహితుడై ధనధాన్యయుతుడై యుండును. తరువాత వంటక శోధినీ దేవిని చేరి మహిషఘ్నిని పూజించి భయరహితుడగును.
కపాలీశుని కోటీశుని యధావిధిగా పూజించి సౌభాగ్య వంతుడగును. ఇట్లు మధ్యయాత్రను ముగించవలయును. చాల బ్రహ్మతీర్థమును చేరిన వాడు సర్వదేవ పూజితుడై భుక్తి ముక్తీశుడగును. నరకేశుని చేరి సంవతత్తేశుని నిధీశ్వరుని బలభద్రేశ్వరుని పూజించి భుక్తిముక్తులను పొందును. గంగాగణపతిని చేరి యధావిధిగా పూజించి ఇహపరములందు వాంఛితార్థములను పొందును. తరువాత జాంబవతీ నదిని చేరి భక్తిచే స్నానమాడి సురాదులను పూజించి కృతకృత్యుఁడును. తరువాత పాండు కూపమును చేరి స్నానమాడి పాండవేశ్వరుని పూజించ వలయును. ఇట్లు చేసిన స్వర్గమును చేరి నందనాదులలో విహరించును. శతమేధమును లక్ష మేధమును కోటి మేధమును క్రమముగా లింగత్రయమును పూజించి స్వర్గమున దేవతలవలే ఆనందించును. దుర్వాసాదిత్యకమును చేరి యధావిధిగా పూజించి అశ్వమేధయాగ ఫలమును పొందును. యాదవ స్థలమును చేరి వరేశుని పూజించి ఇంద్రునిచే సత్కరించబడి వాంఛితార్థమును పొందును. హిరణ్యా సంగమమున స్నానమాడి బ్రాహ్మణునకు హేమరథము నిచ్చినవారు అక్షయ లోకములను పొందును. తరువాత నగరార్కుని పూజించి సూర్యలోకమును పొందును. నగరాదిత్య పార్శ్వమున బలరామకృష్ణులను సుభద్రను దర్శించి యధావిధిగా పూజించిన కృష్ణ సాయుజ్యమును పొందును. తరువాత కుమారికను చేరి యధావిధిగా పూజించి వాంఛిత కామనలను పొంది భూమండలమును జయించును. తరువాత క్షేత్రపాలుని పూజించి సర్వకామనలను పొందును. సరస్వతీ తీరమున నున్న బ్రహ్మేశ్వరుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై బ్రహ్మలోకమున విరాజిల్లును. పింగలానదిని చేరి, స్నానమాడి దేవతాదులను శ్రాద్ధాదులచే తృప్తి పరిచిన వారు మరల జన్మనందరు. సంగమేశుని పూజించిన వారు దుర్గతిని పొందరు. శంకరాదిత్యుని ఘటేశుని మహేశ్వరుని చక్కగా పూజించి సకలాభీష్ట మాచరించి అచటి ఋషులను పూజించి సర్వతీర్థ ఫలమును పొందును. తరువాత నందాదిత్యుని పూజించి సర్వరోగ విముక్తుడగును. తరువాత త్రిత కూపమును చేరి స్నానమాచరించి స్వర్గమును చేరును. శశోపానమున స్నానముని చరించిన దేవతలను చూడ గలుగును. వాంఛిత కామనలను పొందును. పర్లాదిత్యమును దర్శించి రోగవర్షితుడు భోగవంతుడగును. తరువాత న్యం కుమతిని చేరి అచట యధావిధిగా స్నానమాచరించి సిద్దేశ్వరుని పూజించి అణిమా సిద్దులను పొందును. వారాహస్వామిని చూచి సంసార సాగరము నుండి విడి వడును. ఛాయాలింగమును చక్కగా పూజించి సర్వపాతక వినిర్ముక్తుగడును. గుల్పమును దర్శించి పూజించిన నరుడు చాంద్రాయణ ఫలమును పొందును. దేవిని కనకనందను చక్కగా పూజించి ఇహమున సర్వకామనలను పొంది దేహాంతమున స్వర్గమును పొందును. కుంతీశ్వరుని పూజించి సర్వపాతక వినిర్ముక్తుడగును. గంగానదిలో స్నానమాడి గంగేశ్వరుని పూజించి త్రివిధ పాపములనుండి విముక్తుడగును. చమగోద్భేదకమున స్నానమాచరించి పిండదానమునాచరించిన గయాకోటి గుణ పుణ్యమును పొందును. తరువాత ఉత్తమమగు విదురాశ్రమమునకు వెళ్ళి తీగను త్రిభువనేశుని చక్కగా పూజించి సుఖమును పొందును. మంఖణేశ్వరుని పూజించినవారు సద్గ తిని పొందుదురు.
త్రైపురమగు త్రిలింగమును పూజించి పాప విముక్తుడగును. షండతీర్థమును చేరి స్నానమాడి స్వర్ణదానమును చేసిన వాడు సర్వపాప విశుద్దుడై శివలోకమును చేరును. సూర్యప్రాచీతీర్థమున స్నానమాడి పాపరహితుడై భగవంతుడగును. త్రిలోచన "తీర్థమున స్నానమాడిన వారు రుద్రలోకమును చేరెదరు. దేవికా తీర్థమున ఉమాకాంతుని చక్కగా పూజించి ఇహమున సకలాభీష్టములను పొంది అంతమున స్వర్గమును పొందును. భూద్వారమును పూజించినవారు వాంఛితార్థములను పొందెదరు. శూలస్థానమున వాల్మీకిని నమస్కరించిన వారు కవలలగుదురు. చ్యవనార్కుని పూజించిన వారు ధనధాన్యాన్వితులగుదురు. బాలార్కుని పూజించిన వారు విద్యావంతులు ధనవంతులగుదురు. కుబేరస్థానమున స్నానమాడి నిధిని పొందును. ఋషితోయనదిలో స్నానమాడి శుచియైనవాడు స్వర్ణదానమును చేసిన వారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. సంగాలేశ్వరుని పూజించి రుద్రలోకమును విహరించును. నారదాదిత్యుని పూజించి త్రికాల జ్ఞానమును పొందును. తరువాత శ్రీమన్నారాయణుని పూజించి మోక్షమును పొందును. తరువాత తప్త కుండోదకమున స్నానమాడి మూల చండీశుని పూజించిన వారు సర్వ పాప వినిర్ముక్తులై వాంఛి తార్థమును పొందెదరు. చతుర్వక్రుడగు వినాయకుని పూజించి కామితములను పొందును. కంబలేశ్వరుని పూజించి ధన ధాన్యసమృద్దులను పొందును. గోపాల స్వామిని పూజించిన వారు గోవులను ధనమును పొందును. బకుల స్వామిని పూజించి పద్ధతిని పొందును. మరుద్దేవిని పూజించిన వారు సర్వకామ ఫలములను పొందును. క్షేమాదిత్యుని పూజించుట వలన క్షామము సిద్దార్థములు సత్యములు కలవాడగును. ఉన్నతాఖ్యుడగు విఘ్నరాజును పూజించిన వారు విఘ్నములను పొందరు. జలస్వామిని కాలమేఘుని పూజించిన సర్వసిద్ధులను ప్రసాదింతురు. రుక్మిణిని పూజించిన వాంఛితార్థములను ప్రసాదించును. దూర్వాసేశుని పింగేశుని పూజించినచో పాపవిముక్తులగుదురు. శంఖావర్తమున స్నానమాడిన సర్వసిద్ధేశ్వరుడగును. మోక్షతీర్థమున స్నానమాడిన సంసార సాగరమునుండి ముక్తులగుదురు. గోష్టదస్నానమున సర్వసౌఖ్యములను పొందను. నారాయణ గృహమునకు వెళ్ళినవారు మరల దుఃఖించరు. జాలేశ్వరార్చన వలన అభీష్ట సిద్ధులు లభించును. హుంకార కూపమున స్నానమాడిన గర్భవాసమును పొందడు. చండీశ్వరుని పూజించిన సర్వతీర్థ ఫలము లభించును.ఆకాశపురగతుడగు విఘ్నేశుని పూజించి విఘ్నములను పొందడు, కళాకుండమున స్నానమాడిన వాడు మోక్షమును పొందును. కపిలేశుని పూజించిన కపిలాగోసమూహమును పొందును. జరధవేశ్వరుని పూజించినవారు జరపీడితులు కారు. నలేశ్వరుని అర్చించినవారు భోగవంతులు, కర్కోటేశుని అర్చించిన వారు ధనవంతులగుదురు. హాటకేశ్వవరుని పూజించుట వలన సర్వకామనలు ఫలించును. నారదేశుని పూజించిన వారు హరిహరులందు భక్తిని పొందెదరు. మన్ర విభూషణాదేవిని పూజించిన వారు స్వర్గ వాసారులగుదురు. దుర్గా కూట గణపతిని పూజించిన వారు సుఖవంతులగుదురు. కౌరవేశ్వరుని పూజించిన వారు ధనధాన్యయుతులగుదురు. సుపర్లేశుని భైరవిని పూజించిన వారు సుఖవంతులగుదురు. భల్లతీర్థమున స్నానమాడిన వారు సర్వకిల్బిష ముక్తులగుదురు. కర్తమూలమున స్నానమాడిన వారు పాతక వినిర్ముక్తుడగును. గుప్త సోమేశ్వరుని పూజించిన వారు దుఃఖములను పొందరు. బహుస్వర్ణేశ్వరుని దర్శించిన వారు స్వర్గమును పొందెదరు. శృంగేశ్వరార్చకులు దుఃఖములను పొందరు. నారాయణ తీర్థమున స్నానమాడిన వారు మోక్షమును పొందెదరు. మార్కండేశ్వరుని పూజించిన వారు దీర్ఘాయుష్యమును పొందును. కోటీహ్రదమున స్నానమాడి కోటీశ్వరుని పూజించినచో సుఖములను పొందును. సిద్దస్థానమున స్నానమాడి అచటి అసంఖ్యా లింగములను పూజించి సిద్దులగుదురు. దామోదర గృహమును దర్శించి ఉత్తమ సుఖమును పొందును. ప్రభాసనాభిస్థానమున వస్త్రాపథమున నున్న శివుని పూజించినవారు సాక్షాత్తు శివసముడగును. వస్త్రాపధ క్షేత్రమున దామోదరము, స్వర్ణరేఖ, బ్రహ్మ కుండము రైవతమున, ఉజ్జయంతమున కుంతీశము, మహాప్రభుడగు భీమేశుడు మృగీకుండము అనునవి కలవు. క్రమముగా వీటి యందు స్నానమాడి యత్నముతో దేవతలను పూజించి పితరులకు జల తర్పణ గావించి సర్వతీర్థ ఫలములను పొందును. దున్నాబిలమున స్నానమాడిన వారు భోగములననుభవించి స్వర్గమును చేరును. గంగేశ్వరుని పూజించి గంగాస్నాన ఫలమును పొందును. రైవత కాద్రిలో చాలా తీర్థములు కలవు. వాటియందు స్నానమాడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇవ్లాది లోక పాలకులను పూజించి భుక్తిని ముక్తిని పొందును. ఇవి ముఖ్యములగు తీర్థములు. అవాంతర తీర్థములు అనేకములు కలవు. వాటిని అన్నింటిని చెప్పజాలము. ఒక్కొక్క తీర్థమునకు చాలా విస్తరకథలు కలవు. కావున పుణ్య ప్రదమగు ప్రభాసమాహాత్మ్యమును సంక్షేపముగా చెప్పితిని. మూడు లోకములలో ప్రభాస సమమగు తీర్థము మరియొకటి లేదు. ఇచట స్నానమాడిన వారు స్వర్గ వాసులతో పోటీ పడుదురు. ప్రభా సమాహాత్మ్యమును వ్రాసి గృహమున ఉంచుకొనిన భూతచోర సరాది భయములు కలుగవు. ఈ ప్రభాస మాహాత్మ్యమును వినిన వారు వినిపించిన వారు కూడా సద్గతిని పొందెదరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున ప్రభాసతీర్థ మాహాత్మ్యమను డెబ్బదియవ అధ్యాయము.
