నారద మహా పురాణము - ఉత్తరార్థము
54 - శ్రీ పురుషోత్తమమాహాత్మ్యమ్
వసువు పలికెను :
ఇట్లు ఇంద్రద్యుమ్నుని చే స్తుతించ బడిన శ్రీహరి ప్రసన్నుడై అతను కోరిన దానినంతటినీ అనుగ్రహించెను. ప్రతి దినము శ్రీహరిని పూజించి ఈ స్తోత్రముచే స్తుతించినచో తప్పక మోక్షము లభించును. ప్రతిదినము ఈ స్తోత్రమును మూడు మార్లు జపించు వారికి ధర్మార్థ కామమోక్షములు లభించును. సావధానము చే ఈ స్తోత్రమును చదివిననూ, వినిననూ, వినిపించిననూ పాప రహితుడై శాశ్వత విష్ణులోకమును పొందును. ఈ స్తోత్రము ధన్యము, పాపహరము, భుక్తి ముక్తి ప్రదము, శుభకరము, గుహ్యము, సుదుర్లభము, పుణ్యము. దీనిని ప్రతివారికి ఉపదేశించరాదు. నాస్తికునకు, మూర్జునకు, కృతఘ్సునికి, అహంకారికీ, దుర్బుద్ధికి, భక్తి రహితునకీయరాదు. భక్తి యుక్తునకు, గుణశీల వంతునకు, విష్ణుభక్తునకు, శాంతునకు, శ్రద్దానుష్టానశీలికి ఉపదేశించవలయును. ఈ స్తోత్రమును సకల పాప సంఘవినాశకము. కారుణ్య సంజ్ఞము. సుఖప్రదము, మోక్షప్రదము. సకలాభీష్టప్రదము. ఉత్తమము. అగు పురుషోత్తమ స్తోత్రమును నేను చెప్పితిని. ఇట్లు అతి సూక్ష్ముడు, విమలాంబర సన్నిభుడు, నిత్యుడు పురాణ పురుషుడు అగు శ్రీహరిని ధ్యానము చేయువారు అధ్వరాగ్నియందు మంత్రములచే హవిస్సును వలె శ్రీహరిని చేరెదరు. మోక్షమును పొందెదరు. సంసార దుఃఖమును తొలగించువాడు ఒక్క శ్రీహరియే. శ్రీహరియే పరులందరికి పరుడు. శ్రీహరికంటే ఇతరుడు లేడు. శ్రీహరియే సృష్టికర్త, రక్షకుడు అంతకర్త. శ్రీహరియే సకలసముడు. అఖిలసారభూతుడు. జగద్గురువు మోక్షానంద ప్రదుడగు కృష్ణుని యందు భక్తిలేనివారి విద్య సుగుణములు, యజ్ఞములు దానములు, ఉగ్రతపములు వ్యర్థములు. పురుషోత్తముని యందు భక్తి కలవాడే ఈలోకమున ధన్యుడు, పవిత్రుడు, విద్వాంసుడు, వక్త, ధర్మశీలుడు. జ్ఞాత, దాత, సత్యవాక్యుడు అగును. ఇంద్రద్యుమ్నుడిట్లు సనాతనుడగు శ్రీహరిని స్తుతించి ప్రణామములాచరించి సర్వ కామ ఫలప్రదుడు జగన్నాధుడగు వాసుదేవుని చింతించుచు, భూతలమున దర్భలను పరిచి, వాటీ పై వస్త్రమును పరిచి పరుండెను. నా చింతను తొలగించు దేవ దేవుడు ఎపుడు ఎట్లు ప్రత్యక్షమగును అని ఆలోచించుచు నిదురించెను. ఇంద్రద్యుమ్నుడు నిద్రించగా స్వప్నములో చక్రధారి జగద్గురువగు వాసుదేవుడు కనిపించేను. ఇంద్రద్యుమ్నుడు స్వప్నములో దేవదేవుని, జగత్పతిని, శంఖచక్రధరుని, శాంతుని, గదాపద్మాగపాణిని శార్దాసి బాణ సంయుక్తుని, జ్వలతే జోగ్రమండలుని, యుగాంతాదిత్య వర్ణాభుని, నీలవైడూర్య సన్నిభుని, సుపర్ల పృష్టమున కూర్చొనియున్న వానిని అష్టభుజుని, శ్రీహరిని దర్శించేను. శ్రీహరి ఇంద్రద్యుమ్నుని చూచి ఇట్లు పలికెను. ఓ మహారాజా బాగు బాగు. ఈదివ్యయాగము చే, భక్తిచే, శ్రద్ధచే నేను ప్రీతి చెందితిని. వ్యర్థముగా ఏమాలోచించు చుంటివి? ఓ రాజా! ఇచట పురాతన మగు ఒక ప్రతిమ కలదు. ఆ ప్రతిమను నీవు పొందు ఉపాయమును నేను చెప్పెదను. ఈ రాత్రి గడిచిన తరువాత నిర్మలమైన ప్రభాతకాలమున సాగర తీరమున నానాద్రుమవిభూషితమగు లవణార్ణవ సమభిప్లుతమగు తీరలంబియగు మహావృక్షము స్థల జలాలంబిగా యున్నది. తీర భవతరంగములచే కొట్టబడుచున్ననూ ఈ' వృక్షము కంపించుట లేదు. చేతిలో ఒక గొడ్డలిని ధరించి జలములోనికి వెళ్ళుము. నీవు ఒంటరిగా అచట విహరించుచుండగా కనపబడిన వృక్షమును నిస్సందేహముగా గొడ్డలి చే ఛేదించుము. అలా ఛేదించు చుండగా ఉన్నతమైన శాఖను చూతువు. ఆ శాఖచే నిస్సంశయముగా ఒక ప్రతిమను నిర్మించుము. మోహింప చేయు చింతను విడువుము. ఇట్లు పలికి శ్రీహరి అంతర్థానము నొందెను. ఇంద్రద్ర్యుమ్నమహారాజు కూడా ఆ స్వపమును వీక్షించి మిక్కిలి ఆశ్చర్యమును చెందెను. స్వపగత విషయమునే ఆలోచించుచు వైదిక మంత్రములను జపించుచు ఆ రాత్రిని గడి పేను. ప్రభాత కాలమున యధావిధిగా సాగర స్నానమాచరించి గ్రామ నగర వాసులగు బ్రాహ్మణులకు దానముల నొసంగి పూర్వాహ్లిక కర్మలనాచరించి బయలు దేరెను. అతని వెంట రథము కాని సైన్యము కానీ గజము కాని సారధి కానీ లేడు. ఒంటరిగా సముద్రమున ప్రవేశించెను. అచట తేజోవంతమగు మహావృక్షమును చూచెను. ఆ వృక్షము మహాంతకము, మహాలోహము పవిత్రము ఫలరహితము, మహోత్సవము, మహాకాయము జలాంతర్భాగమున ప్రసుప్తము, సాంద్ర మాంజిష్ణవర్ణము, నామ జాతి వివర్జితముగా నుండెను. శ్రీహరి చెప్పిన ఆ వృక్షమును చూచి సంతుష్టుడై దృఢము తీక్షము అగు కుఠారముచే ఖండించెను. అంతట ఇంద్రద్యుమ్నునకు ఖండించబడిన కాష్ఠమును చూచి ఆశ్చర్యము సంశయము కలిగెను. అచటికి విశ్వకర్మ విష్ణువు విప్రరూపమును ధరించి సమానరూపులు మహానుభావులు దివ్య తేజోవిరాజితులు, సగంధ లేపనులుగా వచ్చిరి. ఆ బ్రహ్మణులిద్దరూ ఇంద్రద్యుమ్నుని సమీపించి ఓ మహారాజా నీ విక్కడేమి చేయబోవుచున్నావు? ఈ మహా వృక్షమునేల ఖండించితివి? మహా దుర్గము -నిర్జనము గహనమగు ఈ వనమున ఒంటరిగా ఏల వచ్చితివి? మహా సముద్ర తీరమున ఈ మహా వృక్షమునేల ఖండిచితివి? అని అడిగిరి. ఇంద్రద్యుమ్న మహారాజు వారి మాటలను విని సంతోషించి వారితో మృదు మధురముగా ఇట్లు పలికెను.
చంద్ర సూర్యులవలె అచటకి వచ్చిన ఆబ్రాహ్మణులను చూచి వినయముతో నమస్కరించి తలవంచుకొని నిలిచేను. ఆద్యంత రహితుడు దేవదేవుడు, అప్రమేయుడు, జగన్నాధుడగు శ్రీహరిని ఆరాధించుటకు ప్రతిమను నిర్మించ వలయునని నా సంకల్పము. మహానుభావుడగు దేవ దేవునిచే స్వప్నములో ఆదేశించ బడిన విషయమును మీకు తెలిపితిని. అంతట ఇంద్రద్యుమ్నునిమాటలను వినిన యజ్ఞుడు (విష్ణువు) విశ్వేశుడు సంతోషించి ఇట్లు పలికెను. ఓమహారాజా. నీ ఈ సంకల్పము చాలా బాగు. కదళీదల సన్నిభము మహాఘోరము, నిస్సారము. దు:ఖ బహుళము, కామక్రోధ సమాకులము, ఇంద్రియా వర్తకలితము, దుస్తరము లోమహర్షణము, నానావ్యాధి శతావర్తము, చల బుద్బుద సన్నిభము అగు సంసార సాగరమున నున్న నీకు విష్ణువు నారాధించవలయునను సంకల్పము కలుగుట చాలా ఉత్తమము. ఇన్ని సద్గుణములు కలనీవు ధన్యుడవు. ఈ ప్రజలు ఈ భూమి శైలవన పత్తనములు, పురగ్రామ నగరములు, చాతుర్వర్ణ్యములు నీవు రాజుగా ఉన్నందున ధివ్యములు. ఓ మహారాజా సుఖశీతల మగు ఈ వృక్షమున కూర్చుండుము. మాతో కలిసి ఉండుము. ధర్మకధలను వినుము. ఇతను శిల్పశ్రేష్ఠుడు నీ సహాయము కొరకు వచ్చెను. ఇతను విశ్వకర్మంతటి వాడు. సర్వకర్మనిపుణుడు. నా సంకల్పాను సారముగా, ఇతను ప్రతిమను చేయును. నీవు ఈ తీరమును వదులుము. ఆ బ్రాహ్మణుని మాటలను వినిన ఇంద్రద్యుమ్నుడు సాగరతీరమును విడిచి బ్రాహ్మణుని సమీపంచి శీతల వృక్షచ్చాయనాశ్రయించి కూర్చునెను. అంతట శ్రీమహావిష్ణువు విశ్వకర్మను శిల్పము ఖ్యాకారమును చేయుమని చెప్పెను. కృష్ణరూప మును వరము, శాంతము, పద్మ పత్రాయతేక్షణము, శ్రీవత్సకౌస్తుభధరము, శంఖచక్రగదాధరము గౌరము, గోక్షీర వర్ణాభముగా ద్వితీయమును స్వస్తికాంకితము లాంగలాస్త్రధరము, మహాబలమగు అనంతాఖ్యమును, దేవ దానవ గంధర్వ యక్ష విద్యాధరోరగములచే అతని అంతము తెలియ బడనందున అనంతనామము కలిగినది. ఇట్లు రెండవ ప్రతిమను, ఇక వాసుదేవ భగినీ రుక్మవర్ణసు శోభనగా సుభద్రను సర్వలక్షణ లక్షితగా నిర్మించుము అని చెప్పెను.ఇట్లు విష్ణువాక్యమును విని సుకర్మకారియగు విశ్వకర్మ ఆక్షణముననే శుభ లక్షణములు గల ప్రతిమలను సిద్దము చేసెను. మండలములచే శోభించు కర్ణములు కలిగి, చక్రలాంగ విన్యాసములచే తేజోవంతములుగా చేసెను. మొదట- శుక్ల వర్ణములలో శారదేందు సమప్రభము, సురక్తాక్షము, మహాకాయము, ఘటావికట మస్తకము, నీలాంబరధరము, ఉగ్రము, బలరాముని ఆద్భుత కుండలములు కలది, మహాహలధరము, దివ్య మహాముసలధారీగా నిర్మించెను. ఇక రెండవది పుండరీకాక్షము, నీలజీమూత సన్నిభము, అతనీపుష్ప సంకాసము, పద్మపత్రాయ తేక్షణము, శ్రీవత్స వక్షసము, భాజప్పాతవాసము, అచ్యుత రూపమును చక్రశంఖకరము దివ్యము, సర్వపాపహరము అగు హరిరూపమును, ఇక మూడవది స్వర్ణ వర్ణ సన్నిభము, పద్మపత్రాయతేక్షణము, విచిత్ర వస్త్ర సంఛన్నము, హారకేయూర భూషితము, పద్మపత్రాయతేక్షణము, విచిత్ర వస్త్ర సంఛన్నము, హారకేయూర భూషితము, విచిత్రాభరణోపేతము, రత్నమాలావలంబితము, పీవోన్నత కుచము, రమ్యముగా సుభద్రా రూపమును నిర్మించెను. ఇంద్ర ద్యుమ్న మహారాజు ఒక క్షణకాలమున నిర్మించుటను అత్యాశ్చర్యమును చూచెను. దివ్య వస్త్రయుగ ధారులుగా నానారత్నాలంకృతులు, సర్వలక్షణ సంపన్నులు అతి మనోహరములగు ప్రతిమలను చూచి అత్యాశ్చర్యముగా చూచి ఇట్లు పలికెను. మహానుభావులారా? మీరు దేవతలే బ్రాహ్మణరూపమును ధరించి వచ్చితిరా? మీరిద్దరూ అద్బుత కర్మములను చేయు వారు, దేవవృత్తులు, మానుషితీతులు. మీరు దేవతలా? మానువులా యక్షులా? విద్యాధరులా? లేదా బ్రహ్మహృషీకేశులా? వసురుద్రులా లేక అశ్వినీ దేవతలా? మీ నిజస్వరూపమును తెలియ జాలకున్నాను. మీరు మాయారూపముతో నుంటిరి. మిమ్ములనే శరణు వేడుచున్నాను. దయ చేసి మీ నిజ స్వరూపమును తెలుపుడు.
ద్విజుడు పలికెను :
నేను దేవుడను, యక్షుడను, దైత్యుడను, ఇంద్రుడను, బ్రహ్మము, రుద్రుడను కాను. నన్ను పురుషోత్తమునిగా తెలియును. సర్వ లోకార్తిహరుడను, అనంత బలపౌరుష వంతుడను. అంతర హితుడను. సర్వభూతపూజ్యుడను. సర్వ శాస్త్రములందు వేదాంతములందు చెప్పబడువాడను. యోగులు ధ్యానగమ్యుడను వాసుదేవుడనని చెప్పెదరు. నేనే బ్రహ్మను శివుడను, విష్ణువును, ఇంద్రుడను యముడను పృధివ్యాది భూతములు నేనే. అగ్నిహోత్రుడను వరుణను, పర్వతములు నేను. సమస్త వాజ్మయమును, స్థావర జంగమాత్మక లోకమును నేనే. నేనే విశ్వరూపుడను. నాకంటే భిన్నము లేదు. నేను నిన్ను మెచ్చితిని. వరము నడుగుము. నీ మనసులోనిది. ఇష్టమైన దిత్తును. పాపులకు కలలో కూడా నాదర్శనము కాదు. నీవు దృఢ భక్తికలవాడవు కావున ప్రత్యక్షముగా చూడగలిగితివి. ఇట్లు వాసుదేవుని మాటలను వినిన రాజు పులకింతలు కలవాడై ఇట్లు స్తుతించెను.
రాజు పలికెను : -
శ్రీపతీ! నీకు నమస్కారము. పీతాంబరధరా ? శ్రీప్రదా? శ్రీశా ! శ్రీనివాసా ! శ్రీనికేతనా! నీకు నమస్కారము. ఆది పురుషుని, ఈశానుని, సర్వేశుని, సర్వతోముఖుని, నిష్కలుని, పరమదేవుని, సనాతనుని నమస్కరించు చున్నాను. శబ్దాతీతుని, గుణాతీతుని భావాభావ "వివర్జితుని, నిర్లేపుని, నిర్గుణుని, సూక్ష్ముని, సర్వజ్ఞుని, సర్వ భావనుని, శంఖ చక్రధర దేవుని, గదాముసలధారిని, వరదుని, నీలోత్పల దలకాంతి గల వాడిని నమస్కరించు చున్నాను. నాగ పర్యంక శయనుని, క్షీర సాగర వాసుని, హృషీకేశుని, సర్వపాపహరుని, హరిని నమస్కరించు చున్నాను. ఓదేవ దేవేశా! వరదుని, విభుని మరల నమస్కరించు చున్నాను. సర్వలోకేశ్వరుని, విష్ణువును, మోక్షకారణుని, అవ్యయుని నమస్కరించు చున్నాను. ఇట్లు శ్రీహరిని స్తుతించి, నమస్కరించి అంజలి బద్దుడై వినయముతో వంగి భూమి మీద పడి ఇట్లు పలికెను. నాయెడ ప్రీతి చెందినచో ఉత్తమ వరమును కోరుచున్నాను. దేవతలు సురులు. గంధర్వులు, యక్షరాక్షస ఉరగులు సిద్ధులు, విద్యాధరులు, సాధ్యులు, కిన్నరులు, గుహ్యకులు, మహానుభావులగు ఋషులు, నానాశాస్త్ర విశారదులు, సన్యాసులు, యోగ యుక్తులు, వేద తత్వాను చింతకులు, మోక్షమార్గవిదులు ధ్యానించు పరమ పదమును, నిర్మల నిర్గుణ శాంతముగా మనుషుల చే చూడబడు ఆ పరమ పదమును నీయను గ్రహముతో పొంద గోరు చున్నాను.
శ్రీహరి పలికెను :
నీవు కోరినదంతయూ జరుగును. నీ ఇష్టమును పొందుము. నా అనుగ్రహము వలన నీవు కోరికలను పొందగలవు. పదివేల తొమ్మిది వందల సంవత్సరములు అవిచ్చిన్న మహారాజ్యమును నీవు పరిపాలించుము. దేవదానవులకు దుర్లభమగు, దివ్యము, పరమము, పూర్ణము, మనోరథము, శాంతము, గుహ్యము, అవ్యక్తము, అవ్యయము, పరాత్పరతరము, సూక్ష్మము నిర్లేపము, నిర్గుణము, ధ్రువము, చింతాశోక వినిర్ముక్తము, క్రియాకారణ వర్జితము, అగు విజ్ఞేయాఖ్యమగు పరమ పదమును నీకు చూపెదను. పరమానందమును పొంది పరమ గతిని పొందగలవు. ఈ భూమండలమున నీకు గొప్పకీర్తి కలుగును. ఈ భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు, సప్త సముద్రములు, మేర్వాది పర్వతములు స్వర్గమున దేవతలు ఉండు నంతవరకు యజ్ఞ సంభవమగు ఇంద్రద్యుమ్న సరస్సు అను పేరుతో ఈ తీర్థము ప్రసిద్ది చెందును. ఈ తీర్థమున స్నానము చేసిన నరుడు ఇంద్రలోకమును పొందగలడు. పదునలుగురింద్రుల కాలము ఇంద్రలోకమున అప్సరలు గంధర్వులు నృత్యగీతములచే పూజింపబడుచు విమానాలలో సంచరించ గలడు. తీర్థమున పితరులకు పిండ ప్రదానమును గావించిన వారు ఇరువది యొకటి తీరములనుద్ధరించి ఇంద్రలోకమును పొందును. ఈ సరస్సునకు దక్షిణ భాగమున నైరుతి దిశలో ఒక వట వృక్షము కలదు. ఈ వృక్ష సమీపమున ఒక మండపము కలదు. ఈ మండపము కేతకీవన సంఛన్నము, నానా వృక్ష సమా కులము, ఆషాఢ శుక్ల పంచమీ మఘా నక్షత్రమున ఇచటికి వెళ్ళి ఏడు దినములు గడిపి సుభోగులగు వేశ్యలచే ఈ మండపమున బహుక్రీడా విశేషములచే మనోహర నృత్యగీతములచే చామరలచే స్వర్ణదండములచే, వ్యజనములచే రత్న భూషణములచే మాకు వీచుచు పరమాంగనలు నిలుచుందురు. బ్రహ్మచారి, యతి, స్నాతకులగు బ్రాహ్మణోత్తములు, వాన ప్రస్థులు, గృహస్థులు, ఇతర సిద్ధులు, బ్రాహ్మణులు నానా వర్ణ పదములు గల స్తోత్రములచే ఋగ్యజుస్సామ నాదములతో రామకృష్ణుల స్తోత్రములను చేతురు. తరువాత స్తుతించి దర్శించి మరల నమస్కరించినచో పదివేల సంవత్సరములు శ్రీహరిలోకమున నివసించును. అప్సరసలు గంధర్వులు గీతనాదములతో పూజించబడుచు హరికి అనుచరుడై శ్రీహరితో విహరించును. రత్నహారములు గల విమానములలో సంచరించును. అతని భవనమున సర్వ కామనలు నిలుచును. తపస్సు క్షీణించిన తరువాత ఈ భూమండలమున మనుష్యునిగా బ్రాహ్మణునిగా పుట్టును. కోటీశ్వరుడు ధనాధ్యక్షుడు, సర్వ సంపదలు కలవాడు చతుర్వేదజ్ఞుడగును. ఇట్లు ఇంద్రద్యుమ్నునకు వరమునిచ్చి నియమము నేర్పరిచి విశ్వకర్మతో అంతర్థానము నందెను. అంతట ఇంద్రద్యుమ్న మహారాజు సంతోషముతో పులకించి శ్రీహరి దర్శనమువలన తనను కృతకృత్యునిగా తలచేను. అంతట కృష్ణుని బలరాముని వరప్రదయగు సుభద్రను మణికాంచన చిత్రితములగు విమానముల వంటి రథములలో నుంచి జయమంగళ నాదములతో సామాత్యుడు పురోహితుడై నానా వాదిత్ర నిర్దోషములచే, నానావేద నాదములతో తీసుకొని వచ్చిన ' పవిత్రము, మనోహరము శుభకరమగు ప్రదేశమున స్థాపించి, శుభలక్షణకాలమున సునక్షత్రయుత తిథియందు సుముహూర్తమున ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులచే యధావిధిగా ఆచార్యానుమతితో అంతయూ నిర్వహించి ఆచార్యునకు దక్షిణలనిచ్చి ఋత్విజులకు ఇతర ద్విజులకు దక్షిణలనిచ్చి భవనోత్తమమున ప్రతిష్ఠించెను. తరువాత యధావిధిగా సుగంధి పుష్పములచే సువర్ణమణి మన్రాదులచే శోభనములగు నానావస్త్రములచే పూజించి ద్విజులకు పురములను నగరములను దానము చేసెను. ఇట్లు చాలా యజ్ఞములలో బహుదానములనిచ్చి కృత్యుడై సర్వస్వమును విడిచి శ్రీహరి పరమ పదమును చేరెను.
ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణమున ఉత్తర భాగమున మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబదినాలుగవ అధ్యాయము.
