నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

2 - తిథివిచారః

  వసిష్ఠమహర్షిపలికెను :- ఈ విషయమునుద్దేశించి నైమిషారణ్యవాసులగు మునులు మహామతి వ్యాస శిష్యుడగు సూతమహర్షినడిగిరి. ఇట్లు ఏకాదశీవివరమునడుగగా ఏకాదశీమాహత్మ్యమును ఉపవాసవీధిని చెప్పసాగెను. ఇట్లు సూతమహర్షి చెప్పిన సర్వపసాపరాశినాశక మగు చక్రి మాహాత్మ్యమును విని మరల నిట్లడిగిరి. మహానుభావా. నీవు అష్టాదశపురాణములను తెలియుదువు. వ్యాపానుగ్రహమున మహాభారతమును కూడా తెలియుదును. కావున పురాణములలో, స్మృతులలో శతకోటివిస్తరమగు రామాయణమున కూడా నీకు తెలియనిదేదియులేదు. మా మనసున ఒక సంవశయముకలదు. దానినినీవు యధార్ధముగా విస్తరముగా తొలగించ దగుదువు. ఏకాదశితిధి చివర ఉపవసించవలయునా, మొదట ఉపవసించవలయునా? పైత్ర్యమున నీకు తెలియనిది లేదు. కావున తెలుపుము.

సౌతి పలికెను :- దేవతలకు తిధిప్రాంతము ప్రియము. కావున ప్రాంతమున ఉపోషము ప్రీతివర్ధనము పితరులకు తిధిమూలము ప్రియమని కాలజ్ఞులు చెప్పిరి. కావున ఫలమును కోరువారు ఎల్లపుడు తీధిప్రాంతమున ఉపవసించవలయును. ఓ బ్రాహ్మణోత్తములారా? సప్తమిని ఎపుడూ పూర్వవిద్దనే ఆచరించవలయును. అమావాస్యాపూర్ణిమలు పితరులకు సాంవత్సరదినము కావున పితృతృప్తి కొరకు మూలమున ఆచరించవలయును. ద్వితీయ అష్టమి పూర్వవిద్దను ఆచరించరాదు. ధర్మకామార్థములను కోరువారు షష్టి ఏకాదశిని పూర్వ విద్దలను వదిలిపెట్టవలయును. మిగిలిన వాటిని పూర్వవిద్దలనే ఆచరించవలయును. వీటిని పూర్వ విద్దలను వదిలినచో నరకమును పొందును. హాని కలుగును. దౌర్బాగ్యమును పొందును. ఈవిషయమును నేను వ్యాసుని వలన వింటిని. సూర్యోదయకాలమున ఏతిధి కొంచెమున్ననూ పూర్వవిద్దగా నేరుగవలయును. పారణమున, మరణమున మానవులకు తాత్కాలిక తిధినే గ్రహించవలయును. పితరులకు అస్తమయ వేళలో నిస్పర్శ పూర్ణయందురు. ఇచట ఉదయకాలమున నుండి తిధిని గ్రహించ రాదు. దైవకార్యములందు ఉదయతిధిని గ్రహించవలయును. ప్రతిదినము దైవజ్ఞచింతకుని వలన తిధిని పరిశీలించవలయును. తిధికి సూర్యచంద్రులు ప్రమాణము. సూర్యచంద్ర చారమును తెలియుటచే కాలజ్ఞులు కాలమును తెలియుదురు. పూర్వతిధి సంగదోషమున్నచో పూజకు యోగ్యములు కాజాలవు. తెలిసిన వారు నాలుగు రూములను వదిలెదరు. ఇక ఇపుడు స్పానపూజావిధి క్రమమును చెప్పెదను. పగలు శుద్ధిలేనిచో రాత్రి చేయవలయును. పగలు చేయవలసిన దంతయూ సాయంకాలమే చేయవలయును. ఉపవసించునరులు ఈ విధిని అనుసరించవలయును అని నేను చెప్పుచున్నాను. అరుణోదయ వేళలో ద్వాదశిస్వల్పముగా నున్ననూ దానమస్నానార్చనక్రియలనాచరించవలయును. త్రయోదశి శుద్ధమైనపుడు పారణచేయుట అనస్తఫలప్రదము. శతయజ్ఞాధిక ఫలమును మానవుడు పొందగలుగును. కావున ప్రత్యూషకాలమున స్నానము నాచరించవలయును. ద్వాదశీదినమున చూడవలసిన పనిలేకనే పితృతర్పణములను ఆచరించవలయును. ద్వాదశిని లంఘించినచో మహాహానికలుగును. స్నానముచేయని సరస్వతివలె స్నాతకములేని విద్యవలె ధర్మమును హరించును. దీనోదయమును క్షయముకాని వృద్దికాని కలిగినచో ద్వాదశిన ఉపవసించుట పుణ్యావహము. ద్వాదశిపూర్వవిద్దఅయినచో విడువవలయును.

బ్రాహ్మణుడు పలికెను :- ద్వాదశినాడు పూర్వసంభవము ప్రాప్తించినచో అపుడు ఉపవాసమునేట్లు చేయవలయును? ఉపవాసము చేయవలసిన దినము పూర్వవిద్దఅయి మరునాడు ఏకాదశి స్వల్పముగా కూడా లేనపుడు ఎట్లు ఉపవాసమును చేయవలయునో చెప్పుము.

సౌతిపలికెను :- ద్వాదశినాడు పూర్వతిధిరానిచో అపుడు మరునాడు ఉపవసించివలయును. బ్రాహ్మణులలో భేదమున్నపుడు బహ్వాగమ విరోధములున్నపుడు ద్వాదశినాడు పవసించి త్రయోదశిపారణ చేయవలయును. శుక్లకృష్ణపక్షములలో ఏకాదశి విద్దయైనపుడు, శ్రవణా నక్షత్రము వచ్చినపుడు ద్వాదశినాడు పవసించవలయును. శాస్త్రీయానుసారము నేనీనిర్ణయమును చెప్పితిని. ఇంకనూ మీరేమి వినదలచితిరో చెపుడు.

ఋషులు పలికిరి. ఓ సూతపుత్రా! ఉన్నదున్నట్టు రవిసంక్రమణము మొదలగు యుగాది విధిని తెలుపుము. నీకు తెలియని దేదియునూలేదుకదా.

సౌతిపలికెను :- శుక్లపక్షమున రెండు కృష్ణపక్షమున రెండు యుగాదులునున్నవి. శుక్లపక్షమున పూర్వాహ్ణమున కృష్ణ పక్షమున అపరాహ్లామున గ్రహించవలయును. దినభాగమును అనుసరించి అయనము నిర్ణయించబడును. సంక్రమణము షోడశపలాత్మకము. పూర్వకమున దక్షిణభాగము, వ్యతీతమున ఉత్తరభాగము సమ్మతము. విషువమధ్యకాలమున అక్షయాఅనబడును. విప్రులు చక్కగా తిధిని తెలుసుకొని సంవత్సరమును చెప్పవలయును. తిధిని తెలుసుకొని ఉపవసించవలయును లేనిచో నరకమును పొందును. పూర్వవిద్దతిధియందు ఉపవసించినచో ధర్మచ్చేదము, సంతతివినాశము సంపద్ధరణము జరుగును. ఏకాదశికి ఒక పలయైనను దశమావేధ యున్నచో సురాబిందుస్పర్శగల గంగాజలమును వలే విడువవలయును. కుక్క తాకిన పంచగవ్యమును వలే దశమివిద్దయగు ఏకాదశిని విడువవలయును. పూర్వవిద్ధయగు ఏకాదశిని శ్రీకృష్ణుడు మహాత్ములసంతోషముకోరకు రాక్షసులకిచ్చెను. అకాలమున నిచ్చినధనము, ఆపాత్రులకిచ్చిన ధనము, కోపించనవారిచే చేయబడు దానము, అసత్కారపూర్వకముగా నిచ్చినదానమువలె రాక్షసులకిచ్చిన దానము పూర్వవిద్ధతిధియందు చేయబడిన దానము, ఉచ్చిష్టునిచే చేయబడినదానము, పతితులకిచ్చిన దానము, స్త్రీజితులకిచ్చిన దానము, జలవర్జితదానము, ఇచ్చిన తరువాత చెప్పుకొనిన దానము అసురుల కిచ్చిన దానమువంటిది. కావున విద్దయగు ఏకాదశి తిధిన ఉపవసించరాదు. వృషలీపతి శ్రాద్దము పూర్వపుణ్యమును హరించినట్లు దశమివిద్దయగు ఏకాదశితిధిన చేయు దానము జపము హోమము స్నానము హరిపూజ సూర్యోదయమున చీకటివలే హరించబడును. వృద్దుడగు పతిని యౌవన గర్వితయగు స్త్రీలు విడుచునట్లు దశమివిద్ధయగు ఏకాదశిని పండితులు విడిచెదరు. ధర్మవృద్ధికొరకు తిద్వస్తరమును గ్రహింతురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున తిధివిచారమను రెండవ అధ్యాయము సమాప్తము.