నారద మహా పురాణము - ఉత్తరార్థము
43 - పూజాది కధనమ్
వసిష్ఠ మహర్షి పలికెను : అంతట మోహినీ దేవి గంగా మహాత్మ్యమును తెలిపిన వసువు మాటలను విని తన పురోహితుని మరల ఇట్లు అడిగేను.
మోహిని పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా, శుభకరములగు గోదానాదులను చక్కగా వింటిని. ఇపుడు సాటిలేని గంగా వ్రతమును వినగోరుచున్నాను. గంగాది పూజనము, స్థాపనము, తత్పలమును సర్వజ్ఞుడవగు నీవు తెలుపుము. నిన్ను నేను శరణు వేడితిని. ఇపుడు నేను పతిహీనను పుత్రహీనను, బంధు వర్జితను. ఇపుడు నీవే నాకు ఉత్తమగతి ప్రదాతవు. నాతండ్రి గారి మాట మీది గౌరవముతో నిన్నే శరణు పొందిన దానను కావున నీవు నిన్నాశ్రయించిన నాకు సాటిలేని గంగా మాహాత్మ్యమును దేవతారాధనమును తెలుపుము. దానిని విని పాప విముక్తురాలనగుదును.
వసిష్ఠ మహర్షి పలికెను : తేజో వంతుడగు వసువు మోహినీ వాక్యమును విని ఆమెను చక్కగా ఆదరించి వేద విదుత్తముడిట్లు పలికెను.
వసువు పలికెను : ఓ మోహినీ! నీవు లోకహితమును కోరి చక్కగా అడిగితివి. మహా పాప ప్రణాశకమగు సమస్త గంగామాహాత్మ్యమును పూర్వము వృషధ్వజుడగు శివుడు దయచే గంగాతీరమున పార్వతీదేవి యడుగగా చెప్పెను. దేవతలు పూర్వాహ్లామున భుజింతురు. ఋషులు మధ్యాహ్నమున, ఆపరాష్ట్రమున పితరులు, రాత్రిపూట గుహ్యకాదులు భుజింతురు. కావున ఈ అన్ని వేళలను దాటి రాత్రి భోజనము ఉత్తమము. ఉపవాసముకంటే భిక్షావ్రతము ఉత్తమము. భైక్ష్యము కంటే అయాచితవ్రతము మేలు. ఆయా చితవ్రతము కంటే నక్త భోజన వ్రతము మేలు. కావున ఈ నక్త వ్రతము నాచరించ వలయును. హ విష్య భోజనము, స్నానము, సత్యము, ఆహార లాఘవము, అగ్నికార్యము, అధః శయ్యా ఈ ఆరింటిని నక్త భోజి ఆచరించవలయును. మాఘ మాసమున గంగాతీరమున నక్త వ్రతము నాచరించ వలయును. శివాలయ పార్శ్వ భాగమున నువ్వుల అన్నమును ఘృతముతో కలిపి శివునికి నివేదన చేసి కాష్ఠ మౌనముచే భుజించుచు జిహ్వా చాపల్యమును విడువ వలయును. జితేంద్రియుడై శివుని ధ్యానించుచూ మోదుగాకు పాత్రలో భుజించవలయును. ధర్మరాజునకు, దేవికీ విడిగా ముద్దలను కల్పించవలయును. రెండు పక్షములలో చతుర్దశినాడు ఉపవసించ వలయును. పూర్ణిమనాడు గంధములతో గంగాజలముతో పాలు పెరుగు నేయి తేనెలలో శివునికి స్నానము చేయించి (విడిగా), లింగ శిరోభాగమున హోమపుష్పము నుంచవలయును. తరువాత శక్తి కొలది ఘృతపోచితములగు అపూపములను శక్తికి సమర్పించవలయును. తీశాడకమును గ్రహించి శివలింగోపరిభాగమున నుంచవలయును. నీలో త్పలములచే పంకజములచే సర్వేశ్వరుని పూజించవలయును. ఇవి లభించనిచో సువర్ల పంకజములచే పూజించ వలయును. తేనె కలిపిన పాయసమును, ఘృతయుక్తమగు గుగులమును, ఘృతదీపమును చందనాది విలేపనమును, మహేశ్వరునికి భక్తితో సమర్పించ వలయును. అట్లే పత్రములను ఫలములను సమర్పించవలయును. సమాన రూపమగు కృష్ణగో మిధునమును సమర్పించ వలయును. మాసాంతమున ఎనిమిది మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణల నీయ వలయును. ఈ మాసము బ్రహ్మచర్యమును అవలంభించి మద్య మాంసములను విడువవలయును. ఇట్లు యధావిధిగా యమనియమాది యుక్తుడై, శ్రద్ధా భక్తి పరాయణుడై ఒక మారు ఈ వ్రతము నాచరించినవాడు ఇహలోకమున అన్నిభోగములను పొంది అంతమున ఉత్తమ గతిని పొందును. ఇంద్రనీల ప్రతీకాశములు, శిఖిసంయుతములు, దివ్యరత్సమయములు, దివ్యభోగసమన్వితములు, అగు విమానములచే, రమ్యమగు శివపురమునకు స్వకులము వారందరితో కలిసి వెళ్ళి, మిత్రులతో కూడా వేళ్ళి బహు విధాభీప్సితములను అశేష భోగములను అను భవించి ప్రళయ కాలము వర కుండి, తరువాత జంబూ ద్వీపపతిగా ధర్మాత్ముడుగా పుట్టును. కల్మషరహితుడై ఇచట సకల భోగములననుభవించును. సుందరుడు సౌ భాగ్యవంతుడు, అందరిని శాసించువాడు, సర్వరోగ వినిర్ముక్తుడు అగును. అతను కూడా ఈ ఫలమును పొందును. ఇక వైశాఖ శుక్ల చతుర్దశినాడు సావధానుడై క్షీరసంయుక్తమగు శాల్యన్నమును రాత్రిపూట భుజించవలయును. మొదట పుష్పాదులచే శివుని పూజించి, అన్నమును నివేదన చేసి కాష్ఠ మౌనముతో భుజించవలయును. మొదట వటకాష్ఠముతో మౌనముగా దంతధావనమును చేయ వలయును. రాత్రిపూట గంగా తీరమున శివలింగ సమీపమున పరుండవలయును. పూర్ణిమా ప్రాతఃకాలమున యధావిధిగా గంగానదిలో స్నానమాడి ఉపవాసమును సంకల్పించి, రాత్రిపూట జాగరణ చేయవలయును. శివలింగమును ఘృతముతో స్నానము చేయించి, పుష్ప గంధాదులచే ధూప దీపనైవేద్యములచే పూజించి శుభకరమగు వృషభమును శ్వేత పుష్పవస్త్రాదులచే హరిద్రా చందనములచే అలంకరించి శివునికి నివేదన చేయవలయును. శక్తి కొలది బ్రాహ్మణులకు పాయసమును భుజింప చేయవలయును. ఇట్లు భక్తి శ్రద్దలతో ఒకసారి రెండు వేల యుగములు ఒక పాదము తక్కువగా తపస్సు చేసిన కలుగు పుణ్యమును పొందును. హంస కుంద ప్రభా యుక్తములు చన సన్నిభములు, సుశ్వేత వృషయుక్తములు ముక్తా జాలవి భూషితములు అగు విమానములతో తమ పితరులతో కలిసి ఈశ్వర మందిరమును చేరును. అంతట నీలోత్పలసుగంధులు రూప వతులగు యువతులతో పలుభోగములనుభవించును. తరువాత భూలోకమున రాజుగా పుట్టి అనంతకాలము ఐశ్వర్యయు క్తుడై కీర్తి సమన్వితుడై ఏక ఛత్రముగా భూమిని పరిపాలించును. అంతకాలమున వైరాగ్య సంపన్నుడై గంగను పొందును. గంగయందు శ్రద్ధాభక్తులు కలవాడు కావున గంగానదిలో మరణమును పొందును. దానిచే పూర్వజన్మజ్ఞానమును పొంది మోక్షమును పొందును.
జ్యేష్ఠ శుద్ధ దశమి హస్తా నక్షత్రయుక్త మగుచో గంగాతీరమున నరుడు కాని నారీ కాని భక్తి భావము చే రాత్రి జాగరణ కావించి, గంగను పదివిధములగు పుష్ప గంధనైవైద్య ఫలములను దశసంఖ్యచే దీపములను తాంబూలములను సమర్పించి పూజించవలయును. గంగానదిలో పదిమార్లు యధావిధిగా స్నానమాడి భుజించి దశప్రస్థ ప్రమాణములగు నువ్వులను నేయిని దశసంఖ్యచే సత్తుపిండములను, గుడపిండములను గంగా జలమున అర్పించ వలయును. తరువాత సుందరమగు గంగాతీరమున బంగారముచే కానీ వెండిచే కాని, పద్మస్వస్తిక చిహ్నములు కల పూర్ణ కుంభము పైన ఉన, వస్త్ర సగ్లామములు కుంభమునకు కంఠభాగమున చుట్టి యుండగా గంగాదేవి ప్రతిమను నిర్మించి స్థాపించి పూజించ వలయును. స్వర్ణాదులు లభించనిచో మదాదులచే చేయవచ్చును. అది కూడా లభించనిచో పిండిచే వ్రాయవలయును. చతుర్భుజములు కలది, సునేత్ర, చంద్రాయుత సమప్రభ, చామరములచే వీయబడునది, శ్వేత చ్ఛత్రోప శోభిత, సుప్రసన్న, వీరద, కరుణార్ధాంతరంగ, సుధామ్లోవీత భూపృష్ఠ, దేవాదులచే సంస్థూయ మాన, దివ్యరత్న పరీత, దివ్యమాల్యాను లేపన, యగు గంగాదేవిని నిర్మించి స్థాపించి, జలమున ధ్యానించి, ప్రతిమను పూజించవలయును. చెప్ప బోవు మంత్రముచే విశేష పూజగావించ వలయును. ప్రతిమను పంచామృతము తోస్నానమును చేయించ వలయును. ప్రతిమగ్ర భాగమున భూమిని గోమయముతో అలుక వలయును. నారాయణుని, మహేశుని బ్రహ్మను భాస్కరుని, భగీరధ రాజును, హిమవత్పర్వతమును, గంధ పుష్పాదులచే యధా శక్తిగా పూజించవలయును. పదిమంది బ్రాహ్మణులకు దశ ప్రస్థ పరిమాణ తిలలను దానము గావించ వలయును. దశ ప్రస్థయవలను గవ్యముచే కలిపి దానముగావించ వలయును. మత్స్యకచ్చప మండూకమక రాగి జలచరములను స్వర్ణముచే ... కాని రజీతముచే కాని నిర్మించి, స్వర్ణరజతములు లభించనిచో పిష్టముచే నిర్మించి కుసుమాదులచే పూజించి గంగలో పడవేయవలయును. మొదట మంత్రవిత్తే మంత్రముచే విభవమున్నచో రథయాత్రను జరుప వలయును. గంగా ప్రతిమను ఉత్తరాభి ముఖముగా రథారూఢను చేసి తిప్ప వలయును. రధారూఢ యగు గంగాదర్శనము పాపులకు దుర్లభము. దుర్గా రధయాత్ర వలెనే గంగా రధయాత్రను చేయవలయును. ఇట్లు యధావిధిగా విత్తలోభమును విడిచి చేయువాడు ఈ చెప్ప - బోవు పది పాపములనుండి విముక్తుడగును. ఈయని వాటిని గ్రహించుట, అ విధాన హింస, పరదారా భిగమనము, అనునవి మూడు కాయిక పాపములు. కఠినముగా మాట లాడుట, అసత్య భాషణము, చాడీలు చెప్పుట, అసంబద్ధ ప్రలాపములు అను నాలుగు వాచిక పాపములు. పరద్రవ్యములందు ధ్యానము, మనసుచే అనిష్ట చింతనము, అసత్యాభినివేశము అనునవి మూడు మానస పాపములు. కోటి జన్మలలో ఏర్పడిన ఈదశ విధములగు పాపములచే విముక్తుడగునని బ్రహ్మవాక్యము. ఈ మంత్రముచే పూజించ బడిన గంగాదేవి పది పూర్వ తరములను, పది ఉత్తర తరములను, ఇతరములగు పది తరములను ఇట్లు ముప్పది పితరులను తరింప చేయును. “ఓం నమో దశహరాయై నారాయణ్యే గంగాయై నమః” అని మంత్రము. దశవిధపాపములను హరించి నారాయణి యగు గంగకు నమస్కారము అని అని యర్థము. ఈ మంత్రమును ఆదినము రాత్రింబవళ్ళు అయిదు వేలు జపించ వలయును. దశ ధర్మఫలము లభించును. సంసారసాగరమునుండి దశపూర్వులను, దశపరపితరులను తరింప చేయును. చెప్పబోవు ఈ స్తోత్రమును యధావిధిగా గ్రహించి ఆ దినమున గంగాగ్రభాగమున జపించి విష్ను పూజను చేయవలయును. శివరూపురాలికి, గంగాదేవికి, శివదకు నమస్కారము. విష్ణురూపిణి యగు గంగకు నమస్కారము. సర్వదేవ స్వరూపిణికి, ఔషధమూర్తికి, అందరికి అన్ని వ్యాధులకు ఔషధరూపు రాలకి నమస్కారము. స్థాణు జంగమసంభూత విషహారిణికి, సంసార విషనాశనికి, జీవన స్వరూపురాలికి నమస్కారము. తాపత్రయ నివారిణికి, ప్రాణేశ్వరికి, శాంతి స్వరూపిణికి, సంతాప హారిణికి, సర్వమూర్తికి నమస్కారము. సర్వసంశుద్దకారిణికి పాపవిముక్తికి నమస్కారము. భుక్తి ముక్తి ప్రదాయినికి, భోగవతికి, స్వర్గ ప్రదకు, మందాకినికి నమస్కారము. త్రైలోక్య స్వరూపురాలికి, త్రిదశకు, శుక్ల సంస్థకు, క్షేమ వతికి నమస్కారము. త్రిదశాసన సంస్థకు, తేజోవతికి, మందకు, లింగధారిణికి, నారాయణికి నమస్కారము. విశ్వమిత్రకు, రేవతికి, బృహతికీ, లోకధాత్రికి నమస్కారము. విశ్వ ముఖ్యకు, నందినికీ, పృధివికి, శివామృతకు, విరజకు నమస్కారము. పరావరగతాద్యకు, తారకు, సర్వసంస్థకు అభిన్నకు నమస్కారము. శాంతకు, ప్రతిష్ఠకు, వరదకు, ఉగ్ర, ముఖజలకు, సంజీవినికి, బ్రహ్మగకు, బ్రహ్మదకు, దురితఘ్నికి నమస్కారము. ప్రణతార్తి ప్రభజంనికి, జగన్మాతకు, విలుషకు, దుర్గహస్రాకి, దక్షకు నమస్కారము. సర్వాపత్రతి పక్షకు, మంగలకు, పరాపరురాలకు, పరమ మోక్ష ప్రదాత్రికి నమస్కారము. గంగ నా ముందు భాగమున, పార్శ్వము లందు సర్వదిశలందు ఉండు గాక, నా ఉనికి నీయందే ఉండు గాత. ఆది మధ్యాంతములందు భూమి యందు నీవుంటివి. నీవే మూల ప్రకృతివి. నీవే నారాయణ ప్రభువు. నీవే పరమాత్మవు. నీవే శివునివి. నీకు నమస్కారము. ఇట్లు ఈ స్తోత్రమును భక్తి పరుడై ప్రతినిత్యము పఠించువానికి, వినువానికి వినిపించు వానికి కొయిక వాచిక మానస భావములగు దశవిధ పాపములనుండి విముక్తుడగును. రోగి రోగములనుండి, ఆ పన్నుడు ఆపదలనుండి, విముక్తుడగును. శత్రువులనుండి, బంధనములనుండి, భయములనుండి విముక్తుడగును. నలను పొందును. అంతమున బ్రహ్మలో లీనమగును. ఈ స్తోత్రమును లిఖించి ఇంటిలో పూజించబడినచో అగ్ని చోర భయములు పాప భయములుండవు. ఈ దశమినాడు ఈ స్తోత్రమును గంగా జలమున నిలిచి పదిమార్లు జపించినచో దరిద్రుడు, అసమర్థుడు కూడా గంగా పూజను గావించిన వాడు ఆ ఫలమును పొందును. కావున పూర్వోక్త విధానముచే చెప్పబడిన ఫలితము లభించును. గంగ గౌరి వంటిది. కావున గౌరీ పూజనమున చెప్పబడిన విధియే గంగా పూజనమున అనుసరించవలయును. శివుడెట్లో విష్ణువట్లే. విష్ణువెట్లో పార్వతియట్లు. పార్వతి వలె గంగ. ఈ విషయమున భేదములేదు. హరిహరులకు గంగా గౌరులకు, లక్ష్మీపార్వతులకు భేదమును చూచువాడు, చెప్పువాడు మూడబుద్దీయే.
ఉత్తరాయణమున, శుక్ల పక్షమున, భూమి మీద, పగలు, గంగయందు, హృదయమున జనార్ధనుని ఉంచుకొని ధన్యులు మాత్రమే దేహమును విడుతురు. ఓ బ్రహ్మపుత్రీ! గంగయందు ప్రాణములను విడిచిన నరులు దేవతలచే స్తుతించబడుచు విష్ణులోకమునకు వెళ్ళేదరు. గంగానది యందు దప్పితోకాని నిరాహారముతో కాని మరణించువారు పునర్జన్మనందరు. బ్రహ్మసాయుజ్యమును పొందెదరు. సాత్విక బుద్ధి గల వానికి, యోగయుక్తునికి లభించు గతి గంగలో ప్రాణములను విడిచిన వానికి లభించును. ఉపవాసముచే గంగా తీరమున మృతి చెందినవాడు పితరులతో పరలోకమును పొందును. గంగానదిలో ప్రాణములను విడువదలిచిన వాడు పూర్వజన్మలను విడిచిన వాడగును. పూర్వమృతులను విడిచిన వాడగును. చాలా కాలము గడిచిపోవును. ఇచట రెండు యోజనముల దూరము సమీపము సమానమే. తెలిసి, తెలియక, కోరీ, కోరకనైనను గంగ యందు మరణించినవాడు స్వర్గమును మోక్షమును పొందును. ప్రాణములు పోవుచుండగా గంగను తలచినవాడు, లేదా తాకినవాడు పాపశీలుడైనను ఉత్తమగతిని పొందును. గంగకు వెళ్ళి శరీరమును విడిచిన వారు దేవసములగుదురు. కావున అన్నిటిని విడిచి ముక్తి కొరకు శరీర పాతము వరకు గంగను సేవించవలయును. అంతరిక్షమున కాని, క్షితియందుకాని, జలమునందు కాని గంగా సంబంధమునుండగా మరణించినవాడు బ్రహ్మ విష్ణుశివులచే పూజించబడు అక్షయపదమును పొందును. ధర్మిష్ణుడు శిష్ట సమ్మతుడు ప్రాణప్రయాణ సమయమున మనసున గంగను ధ్యానించిన, పరమగతిని పొందును. ఎచట మృతి చెందిననూ మరణకాలమున గంగను భక్తిచే స్మరించువాడు శివలోకమును కాని విష్ణులోకమును కాని పొందును అతి కర్కశమగు శివుని జటా జూటము నుండి బయలువెడలి పాపులను సగరపుత్రులను తడిపి స్వర్గమున చేర్చెను. ఎన్ని అస్థులు గంగలో ఉండునో అన్ని వేల యేండ్లు స్వర్గలోకమున నివసించును. గంగా జలమున అస్థులను పడవేసిన నాటి నుండి అతను స్వర్గమున నివసించును. గంగా జలమున ఆస్తులున్నవాడు మరల బ్రహ్మలోకము నుండి ఇటకు రాబోడు. మరణించిన పది రోజులలోపు గంగలోన అస్తులను కలిపినచో గంగా మరణఫలము లభించును. స్నానము చేసి అస్థులను పంచగవ్యములచే స్నానము చేయించి, హిరణ్యమధు, ఆజ్య తిలలతో కలిపి అస్థి పిండమును హస్త పుటమున నిడుకొని దక్షిణ దిక్కును చూచుచు ధర్మరాజునకు నమస్కారమని పలుకుచు జలమున ప్రవేశించి అతను ప్రీతిచెందుగాక అని గంగలో వేయవలయును. తరువాత స్నానము నాచరించి తీర్థమును అక్షయ వటమును దర్శించి దక్షిణలనిచ్చినచో నరకమున నున్న వానికి స్వర్గమున ఉనికి కలగును. ప్రవాహము నుండి నాలుగు హస్తముల ప్రమాణ ప్రదేశమున నారాయణ మూర్తియే యుండును. ఇచట జలమును గ్రహించరాదు. భాద్రశుక్ల చతుర్దశినాడు జలమాక్రమించు ప్రాంతము వరకు గర్భమనబడును. దూర ప్రాంతము అంతయే తీరమనబడును. నూట యాభైహస్తముల ప్రమాణ ప్రాంతు. గర్బము, తరువాతది తీరమనబడును. ఇది శ్రుతి స్మృతులలో చెప్పబడిన కొందరి మతము. తీరము నుండి రెండు క్రోసుల దూరము క్షేత్రమనబడును. తీరమును విడిచి క్షేత్రమున నివసించవలయును. తీరమున నివసించరాదు. రెండు తటముల నుండి ఒక యోజన విస్తార ప్రాంతము క్షేత్రసీమయనబడును. సమస్త పాపములు గంగాసీమను దాటజాలవు. గంగాసీమను చూచిన పాప ములు సింహమును చూచిన క్షుద్రమ్సగముల వలె పలాయనమును పాటించును. గంగా ప్రాంతమున రామశంభుతపోవనమున్న ప్రదేశము మూడు యోజనముల ప్రాంతము సిద్ద క్షేత్రమనబడును. పుణ్యకాలము లందు, ఆయతనములందు సర్వనిమిత్తము లందు తీర్థము గ్రహించరాదు. పుణ్యములందు ఆయతనము లందు తీర్థము లందు గ్రహించు వాని తీర్థము నిష్పలమగును. గంగా విక్రయణమున విష్ణు విక్రయణము అగును. జనార్ధన విక్రయణమున మూడు లోకములు విక్రయించినట్లగును. గంగా తీరసముద్భవమగు మృత్తికను తల దాల్చినవాడు సూర్యరూపమును ధరించును. గంగాతీర ధూలిని పరిచి పిండ ప్రదానము గావించినచో పితరులను స్వర్గమునకు చేర్చును. ఓ భద్రురాలా నీకు ఈ గంగా మహాత్మ్యమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును చదివిననూ వినిననూ నరుడు విష్ణులోకమును పొందును. ఈ గంగా మాహాత్మ్యమును ప్రతిదినము భక్తిచే శ్రద్ధచే విష్ణులోకమును కాని, శివలోకమును కాని కోరువారు జపించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గంగా మాహాత్మ్యమున పూజాది కధన మను నలుబది మూడవ అధ్యాయము.
