నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

51 - కాశీమహాత్మ్యము

వసురువాచ :-

వసువు పలికెను :

ఇక ఇపుడు వారాణాసిలో నున్న గంగానదీ మాహాత్మ్యమును భుక్తి ముక్తి ఫలప్రదమును చెప్పెదను. ఆవిముక్తమున చేసినదంతయు అక్షయమగును. అవిముక్తమున నివసించు వాడెవ్వడూ నరకమునకు వెళ్ళడు. అ విముక్తమున చేయబడు పాపము కూడా పుణ్యమగును. మూడు లోకములలో ఉన్న సకల మోక్షప్రద తీర్థములు కాశీలో నున్న ఉత్తరవాహినియగు గంగను సేవించు చుండును. దశాశ్వమేధతీర్థమున స్నానమాడి విశ్వేశ్వరుడగు శివుని దర్శించినవాడు వెంటనే పాతక రహితుడై సంసార బంధమునుండి విముక్తుడగును. గంగానది అన్ని విధములుగా పవిత్రమైనది. బ్రహ్మహత్యాపాపమును హరించునది. ఇక వారణాసిలో ఉత్తర వాహిని యగు గంగ విశేషఫలప్రదము. వారణా అసి గంగానదుల సంగమమున స్నానమాత్రముననే సర్వపాతక వినిర్ముక్తుడగును. వారణాసిలో ఉత్తర వాహినిలో గంగానదిలో కార్తీక మాసమున కాని మాఘమాసమున కాని. స్నానమాడిన మహాపాపాది పాతకములనుండి విముక్తుడగును. సమస్త లోకములలో ప్రసిద్ధి గాంచిన 'సకల తీర్థములు కాశీలోని గంగానదిని చేరును. ప్రతి నిత్యము అన్ని పర్వకాలములలోను ఆతీర్థములు చేరును. మహాపాతక దోషాది దుష్టస్పర్శవలన కలుగు పాపములు కూడా ఇచట తొలగి పోవును. మానవులకే కాక పశుపక్ష్యాదుల పాపములు కూడా ఇచట నశించును. ఇతర క్షేత్రములలో శత జన్మలలో సుకృతము చేసిననను మోక్షములభించునో లేదో కాని ఇచట మాత్రము ఒక జన్మలోనే కాశీ గంగా మరణమున మహాపాతకికి కూడా మోక్షములు లభించును. ఇచటనే దర్మనదమను ప్రదము ప్రసిద్ధమైనది. ఇచట యమధర్మరాజే స్వయముగా మహాపాతకములను నశింప చేయును. ఈనది సర్వతీర్థమయి. సర్వ పాపనాశిని. ప్రవాహము తీరమున ఉన్న వృక్షములను కూల్చునట్లు ఈ ప్రదము మహాపాప సంఘములను కూల్చును. కిరణా, ధూత, పుణ్యతోయమగు సరస్వతి, గంగా, యమున అను పంచనదులు పరమ పావనములు. కావున ఈ అయిదు నదులు గల తీర్థము పంచనదమని ప్రసిద్ధి గాంచినది. ఇచట స్నానమును చేసిన వాడు మరల పాంచ భౌతిక దేహమును ధరించడు. ఈ పంచనదతీర్థమున స్నాన మాత్రమున మానవుడు బ్రహ్మాండ మండపమును భేదించి వెళ్ళును. కాశీలోని పంచనద తీర్థమున స్నానముచే మాఘమాసమున ప్రయాగలో స్నానమాడిన ఫలము కలుగును. పంచనద తీర్థమున స్నానమాడి పితృ తర్పణము గావించి శ్రీహరిని పూజించిన వాడు మరల జన్మనందడు. ఇచట జల తర్పణమున పితరులకు ఎన్ని తిలమిచ్చునో అన్ని సంవత్సరములు పితరులకు తృప్తి కలుగును. పంచనద తీర్థమున శ్రద్ధచే శ్రాద్ధమునా చరించినచో వారి పితామహులు బహుయోని గతులైననూ ముక్తులౌదురు. యమలోకమున పితృ గణములు ఇట్లు చెప్పుకొనుచుందురు. మా వంశములోని వాడొకడైననూ పంచనద మహిమను తెలుసుకొని శ్రాద్ధ విధానముతో ఇచట శ్రాద్ధమును చేయును అని. కాశీ పంచనదమును చేరి ఎవరో మమ్ములను తరింప చేయరా అని. ఈ పంచనద తీర్థమున ఏకొంచెము దానము చేసిననూ దాని పుణ్యము కల్పక్షయమున కూడా క్షీణము కాదు. గొడ్డురాలైననూ ఒక సంవత్సరము పంచనదమున స్నానమాడి మంగలగౌరిని పూజించినచో పుత్రవతి యగును. పంచనద జలమును వస్త్రముచే శోధించి స్నానము చేయించిన మహాఫలమును పొందను. అష్టోత్తర శతసంఖ్య కల పంచామృత కలశములచే తోలితమగు బిందు సరస్సు పాంచనదత్వమును పొందెను. ఇచట పంచ కూర్చమాత్ర జలపానము చేసిన శుద్ధిని పొందెదరు. పంచనదీతీర్థ బిందువును శ్రద్దగా ప్రాశనము చేసిన శుద్ధిని పొందెదరు. పంచనద జలముచే స్నానమాడిన వారికి నూరు రాజసూయాశ్వమేధ యాగముల ఫలము కలుగును. రాజసూయాశ్వమేథ యాగములు సర్వసాధకమలు మాత్రమే. బ్రహ్మలోకము వరమన్న సకల బంధవిముక్త పంచనద జలస్నానమున కలుగును. అకాశగంగా స్నానము కూడా ఇట్టి ఫలమునీయ జాలదు. పంచనద జలాభి షేకము అనన్య సాధ్యవరప్రదము. నూరు సంవత్సరములు తప మాచరించిన కలుగు ఫలము కార్తిక మాసమున పంచనదతీర్థ స్నానమున లభించును. జీవిత కాలము ఇష్టా పూర్త ధర్మములనాచరించిన కలుగు ఫలముకంటే అధిక ఫలము పంచనద జలముచే కలుగును. ఈ భూమండలమున ధూత పాప తీర్థ సదృశమగు తీర్థము లేదు. ఈ తీర్థమున ఒక మారు స్నానము చేయుటచే జన్మత్రయార్జిత పాపము నశించును. కృతయుగమున ధర్మనదము, త్రేతాయుగమున. ధూత పాతకము, ద్వాపర యుగమున బిందు తీర్థము, కలియుగమున పంచనదము. పావనములు. బిందు తీర్థమున కృషలోన్మితమగు కాంచనమును దానము చేసిన వానికి దారిద్ర్యము దుఃఖము కలుగదు. ఈ బిందు తీర్థమున గోభూతిలహిరణ్య అశ్వవాసోన్న స్థాన భూషణాదులను ఏ కొంచెము దానము చేసినచో అక్షయ ఫలము నిచ్చును. పావనమగు ధర్మనదీ తీర్థమున జ్వలితాగ్నిలో ఒక ఆహూతి నిచ్చిననూ కోటి హోమ ఫలమును పొందును. పంచనద తీర్థమహిమను చతుర్వర్గప్రాణులలో ఏ ఒక్కరూ వర్ణించజాలరు. ఇట్లు నీకు కాశీ మాహాత్మ్యమును తెలిపితిని. నరులకు సుఖప్రదము, మోక్షప్రదము, మహాపాతక నాశనము. బ్రహ్మఘ్నుడు, మధుపాయి, స్వర్ణచోరుడు, గరుతల్పగతుడు, మహా పాతక యుక్తుడు ఉప పాతక యుక్తుడైనను అవిముక్త మాహాత్మ్య శ్రవణముచే శుద్ధిని పొందును. ఈ మాహాత్మ్యామును వినుటచే బ్రాహ్మణుడు వేదపారగుడగును. క్షత్రియుడు యుద్ధమున జయించును వైశ్యుడు ధనపతియగును. శూద్రుడు విష్ణుభక్త సంగతిని పొందును. ఈ మహాత్మ్యమును చదువుటచే వినుటచే సర్వయజ్ఞపుణ్యము, సర్వతీర్థ ఫలము పొందును. విద్యార్థి విద్యను, ధనార్థి ధనమును,. భార్యార్థి భార్యను, పుత్రార్థి పుత్రులను పొందును. ఇట్లు నీకు నేను అవిముక్త మాహాత్మ్యమును చెప్పితిని. ఈ మాహాత్మ్యమును విష్ణు భక్తునకు కాని, శివభక్తిరతునకు గాని జగజ్జననీ భక్తునకు కాని సూర్యభక్తునకు వినాయక భక్తునకు, గురువును భక్తిచే సేవించు వానికి మాత్రమే చెప్పవలయును. ఇట్లు ఉపదేశించిన అవిముక్త తీర్థ స్నానఫలము లభించును. ఈ మహాత్మ్యమును శఠునకు, నిందకునకు, గోవిప్ర గురువులను ద్వేషించు/వారికీ, గురు ద్రోహమును చేయు వారికి, అసూయకల వారికి ఉపదేశించినచో మృత్యువును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ వసు సంవాదమున కాశీమహాత్మ్యమున యాబది యొకటవ అధ్యాయము.