నారద మహా పురాణము - ఉత్తరార్థము
52 - పురుషోత్తమమాహాత్మ్యమ్.
మోహిన్యువాచ :
మోహిని పలికెను :
నీవు సర్వప్రాణులందు దయచూపు చున్నావు కావున ధన్యుడవు. ఓ బ్రాహ్మణోత్తమా? నీ ముఖ పద్మములనుండి ఉత్తమమగు కాశీ మహాత్మ్యమును వింటిని. నీచే బోధించబడిన. నేను ఇపుడు కృతార్థురాలనైతిని. దయగల నీవు సంసారసాగరము నుండి నన్నుద్దరించితివి. ఇపుడు శ్రీహరి క్షేత్ర మాహాత్మ్యమును విన గోరుచున్నాను. హరిక్షేత్రమునకు వేళ్ళిన నరుడు కృతార్థుడగును. పురుషోత్తముడగు శ్రీహరి క్షేత్రము ముక్తి విధాయకమని పురాణములలో మునులు చెప్పుచుందురు. నేను నీకు ప్రియశిష్యురాలనేని పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యమును చెప్పుడు. సాధుజనులు సర్వకాలములందు సకలలోకోపకారమునే చేయుచుందురుకదా.
వసువు పలికెను :-
ఓదేవీ! ఇపుడు నీకు బ్రహ్మ చెప్పిన పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యమును చేప్పెదను. ఈ భూమండలమున భారత వర్షము కర్మభూమిగా ప్రసిద్ధి గాంచినది. ఈ భారత వర్షమున దక్షిణ సముద్ర తీరమున ఉత్కలమను తీర్థము స్వర్గమోక్ష ప్రదాయకము కలదు. సముద్రమునకుత్తర భాగమున విరజమండలము వరకు వ్యాపించి యున్నది. ఈ ప్రదేశము పుణ్యశీలుల పవిత్ర గుణములచే అలంకరించబడి యున్నది. సకల పుణ్య తీర్థములు, సకల పుణ్యాయతనములు ఉత్కల తీర్థముననే చూడవలయును. సముద్రమునకు ఉత్తర తీరమున సర్వోత్తమ ప్రదేశమున పరమ రహస్యమగు మోక్ష ప్రదము పాపనాశనమగు క్షేత్రము కలదు. ఈ క్షేత్రము అంతటా వాలుకా కీర్ణము. పవిత్రము. ధర్మకామ ప్రదము. ఈ క్షేత్రము పరమ దుర్లభము. దశయోజన విస్తీర్ణము. నక్షత్రములలో చంద్రుడు, సరస్సులలో సాగరము శ్రేష్ఠమైనట్లు ఈ పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో వరిష్ఠము. వసువులలో పావకుని వలె రుద్రులలో శంకరుని వలే ఈ పురుషోత్తమ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. వర్ణములలో బ్రాహ్మణుని వలె, పక్షులలో వైనతేయుని వలె, సేనానులలో స్కందుని వలె, సిద్దులలో కపిలుని వలే, గజేంద్రములలో ఐరావతము వలె, మహరులలో భృగువువలె, అశ్వములలో ఉచ్చైశ్రవము వలె, కవులలో శుక్రునివలె, మునులలో వ్యాసునివలే, యక్షరాక్షసులలో కుబేరుని వలె, ఇంద్రియములలో మనసువలె, భూతములలో భూమివలే, వృక్షములలో అశ్వత్థాము వలె, వీచువాటిలో గాలి వలె స్త్రీలలో అరుంధతి వలె, శస్త్రములలో వజ్రాయుధము వలె అన్ని వర్ణములలో అకారము వలె, ఛందస్సులో గాయత్రి వలే, అన్ని అవయవములలో శిరస్సువలే, అన్ని విద్యలలో మోక్ష విద్యవలె, మనుష్యులలో రాజువలె, ధేనువులలో కామధేనువు వలే, అన్ని ధాతువులలో సువర్ణము వలె, సర్పములలో వాసుకి వలె, దైత్యులలో ప్రహ్లాదుని వలే, శస్త్ర ధారులలో రాముని వలె, ఝషములలో మకరమువలె, మృగములలో సింహము వలె, యాదసులలో వరుణుని వలె, సంయములలో యముని వలె, సముద్రములలో క్షీరసాగరము వలె, దేవరులలో నారదుని వలే, పురోహితులలో బృహస్పతివలే, కలుపు వాటిలో కాలము వలే, గ్రహములలో సూర్యుని వలె, మంత్రములలో ప్రణవము వలె కృత్యములలో ధర్మకార్యము వలె, పురుషోత్తమ క్షేత్రము అన్ని క్షేత్రములలో శ్రేష్ఠము. ఒకసారి పురుషోత్తమ క్షేత్రమును దర్శించి, సాగరాంతమును ఒకసారి దర్శించి, ఒకసారి బ్రహ్మవిద్యను తెలుసుకొని మర లజన్మను పొందడు. ఇట్లు సర్వగుణోపేతము, పరమ దుర్లభమగు. నిది పరుషోత్తమ క్షేత్రము. ఈ క్షేత్రము జగద్వ్యాపి, విశ్వాత్మ, దేహేశుడు, పురుషోత్తముడు, జగత్కారణము, జగన్నాథుడు అన్నియూ ప్రతిష్ఠించబడినవి. బ్రహ్మ ఇంద్రుడు, రుద్రుడు, అగ్నిమొదలగు దేవతలు ఈ క్షేత్రమున ఎల్లపుడూ నివసించుచున్నారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, పితరులు, దేవతలు, మనుష్యులు, యక్షులు, విద్యాధరులు, వ్రతపరులగు మునులు, వాలఖిల్యాది ఋషులు, కశ్యపాది ప్రజాపతులు, సుపర్ణులు, కిన్నరులు, నాగులు, ఇతర స్వర్గవాసులు, సాంగ చతుర్వేదములు, వివిధ శాస్త్రములు, ఇతిహాస పురాణములు, బహుదక్షిణలగు యజ్ఞములు, వివిధ పవిత్రనదులు, వివిధ తీర్థములు, ఆయతనములు, సాగరములు, శైలములు ఇచటనే ఉన్నవి. ఇట్టి పుణ్యతమము, దేవర్షి పితృసేవితము, సర్వోపభోగ సమితమగు క్షేత్రమున ఎవరు నివసించరు? జగద్దేవుడు ముక్తి ప్రదుడగు పురుషోత్తముడు స్వయముగా నివసించుట కంటే క్షేత్ర మాహాత్మ్యము ఏమి కావలయును? ఉత్కలమున నుండు దేవ సన్నిభులగు నరులు ధన్యులు. తీర్థ రాజజలమున స్నానము చేసి పురుషోత్తముని దర్శించు చుందురు. పవిత్రమగు ఉత్కల దేశమున స్నానము చేసి పురుషోత్తమ క్షేత్రము. నివసించు వారు స్వర్గమున వసింతురు. కాని నరకమునకు వెళ్ళరు. ఉత్కల క్షేత్ర వాసులు సుబుద్ధులు. వీరు నిత్యము సుతామ్రాష్ట్రప్రసన్నాయతలోచనుని, చారు భూకేశము కుటుని, చారు కర్ణలతాంచితుని, చారుస్మితుని, చారుదంతుని, చారు కుండల మండితుని, సునాసుని, సుకపోలుని సులలాటుని, సులక్షణుని త్రైలోక్యానంద జనకుని, పద్మముఖుడగు శ్రీకృష్ణుని దర్శించు చుందురు. పూర్వకాలమున కృతయుగమున ఇంద్రతుల్య పరాక్రముడగు ఇంద్రద్యుమ్నుడను మహారాజుండెను. సత్యవాది, శుచి, దక్షుడు, సర్వ శస్త్ర ధారులలోశ్రేష్ఠుడు, రూపవంతుడు, సుందరుడు, శూరుడు, దాత భోక్త, ప్రియవాది, సమస్త యజ్ఞకర్త, బ్రాహ్మణ భక్తుడు, సత్యసంగరుడు, ధనుర్వేదమున, వేదమున, శాస్త్రములలో నిపుణుడు, కార్యశీలి, నరనారీ ప్రియుడు, పున్నమ చంద్రుని వంటివాడు. సూర్యుని వలే చూడశక్యము కానివాడు, చంద్రుని వలె మధురుడు, విష్ణుభక్తుడు, సత్య సంపన్నుడు, జితక్రోథుడు, జింతేంద్రియుడు, అధ్యాత్మ విద్యా నిరతుడు, యుయుత్సువు, ధరతత్పరుడు, సర్వగుణాకరుడగు ఇంద్రద్యుమ్నమహారాజు పృధ్విని పాలించుండెను. ఇతనికి మహావిష్ణువును ఆరాధించవలెనని కోరిక కలిగెను. దేవదేవుడగు జనార్ధనుని ఎట్లారాధించవలయును? ఏక్షేత్రమున, ఏ తీర్థమున, నదీతీరమున, లేదా ఆశ్రమమున ఆరాధించవలయును? ఇట్లు విచారించుచు మనసుచే భూమండలమునంతటిని సమీక్షించెను. పాపాపహములగు సకల తీర్థములను గూర్చి మానసికముగా చింతించి మోక్షప్రదమని ప్రసిద్ధి గాంచిన పురుషోత్తమ క్షేత్రమునకు సబల వాహనుడై వెళ్ళి భూరి దక్షిణలతో అశ్వమేధ యాగము నాచరించెను. ఇట్లు యాగమును పూర్తి చేసి భూరిదక్షిణలనిచ్చి సంకర్షణుని, శ్రీకృష్ణుని, సుభద్రను--ప్రతిష్టించి, యధావిధిగా పంచతీర్థము నాచరించి (స్నానము, దానము, తపము, హోమము దేవతా పేక్షణము ప్రతిదినము భక్తిచే పురుషోత్తము నారాధించి, దేవదేవుని అనుగ్రహము వలన మోక్షము పొందెను.
మోహిని పలికెను :
ఇట్లు శ్రేష్ఠము పావనము అగు పురుషోత్తమ క్షేత్రమున పూర్వము విష్ణు ప్రతిమ యుండెనా? ఇపుడు ఇంద్ర ద్యుమ్నమహారాజు సబల వాహనుడై వెడలి కృష్ణుని రాముని సుభద్రను ఎందుకు ప్రతిష్టించెను. ఈ విషయమున నాకు సంశయము ఆశ్చర్యము కూడా కలగుచున్నవి. కావున దీని నంతటిని వినగోరుచున్నాను. దీని కారణమును దయచేసి తెలుపుము.
వసువు పలికెను :
ఇచటి పూర్వ వృత్తాంతమును సంగ్రహముగా తెలిపెదను. పాప ప్రణాశిని యగు ఈ కథను పూర్వమిచట శ్రీనివాసమును వినుము. సర్వాశ్చర్య సమన్వితమగు సుమేరు శృంగమున ఉన్న జగత్ర్సష్ణ అవ్యయుడగు జగన్నాథునీ లోకహిత కామనచే నమస్కరించి భూమిలో నివాసమును కోరుచు ఇట్లు అడిగెను.
మహాలక్ష్మి అడిగెను. సర్వలోకేశా? నా మదిలో నున్న సంశయమును తొలగించుము. మహాశ్చర్యకరము, కర్మ దుర్లభము, లోభమోహ మహాగ్రహములు కలది, కామక్రోధ మహాసాగరము అగు మర్త్యలోకమున.దుర్లమమగు సంసార సాగరము నుండి మానవుడు ఎట్లు విముక్తి పొందును? ఈ సంశయమును తొలగించ గలవాడు నీకంటే ఇతరుడు లేడు. దేవదేవుడగు జనార్థనుడు ఈమాటలను విని అత్యంత ప్రీతితో అమృతోపమము, సుఖోపాయము, సుసాధ్యము, ఆయాసము మహాఫలప్రదమగు మార్గమును బోధించెను.
శ్రీహరిపలికెను:-
దేవీ! సర్వతీర్థ శ్రేష్ఠము సుప్రసిద్ధమగు పరుషోత్తమమను తీర్థము కలదు. మూడు లోకములలో ఇటువంటి క్షేత్రము మరియొకటి లేదు. ఈ క్షేత్ర నామ కీర్తనము వలన సర్వపాతకములు నశించును. ఈ క్షేత్రమును దైత్య దానవులు నరులు తెలియలేరు. మరీచ్యాది మునిశ్రేషులు దీనిని చూపిరి. దక్షిణ సముద్రతీరమున న్యగ్రోధ వృక్షము కలదు. గొప్ప ఉల్కలను వర్షించు చున్న ప్రళయ కాలమున కూడా ఈ వృక్షము నశించక యట్లే యుండును. ఈ వట వృక్షమును చూచినంతనే బ్రహ్మహత్యా పాతకము కూడా నశించు నన్న ఇక ఇతర పాపములమాటేల? ఈ వట వృక్షమునకు నమస్కారములతో ప్రదక్షిణములు చేసిన వారు సర్వపాపములు తొలగి శ్రీహరిలోకమును చేరెదరు. న్యగ్రోధ వృక్షమునకు ఉత్తర భాగమున కొద్ది దక్షిణమున కేశవ ప్రాసాదము కలదు. ఇది పరమ ధర్మమయము. ఇచట నివసించవలయును. ఇచట స్వయముగా దేవ నిర్మితమగు ప్రతిమను దర్శించి సులభముగా నాలో కమునకు వచ్చెదరు. ఒకసారి యమ ధర్మరాజు అటు వెళ్ళుచు ఆ ప్రతిమను దర్శించి నా వద్దకు వచ్చి శిరసుచే నమస్కరించి ఇట్లు పలికెను. ఓదేవా, లోకనాధా! తేజోరూపా నీకు నమస్కారము శ్రేష్టుని, వరదుని, కర్తను, అక్షయుని, ప్రభువును, విశ్వేశ్వరుని, అజుని, విష్ణుని, సర్వజ్ఞుని, అపరాజితుని, నీలోత్పల దలశ్యాముని, పుండరీక నీళేక్షణుని, సర్వగతుని, నిర్గుణుని, శాంతుని, జగద్ధాతను, అవ్యయుని, సర్వలోక విధాతను, లోకనాధుని, సుఖావహుని, పురాణ పురుషుని, వేద్యుని, వ్యక్తావ్యక్తుని, సనాతనుని, పురాణస్రష్ఠను, లోక తీర్డుని, జగద్గురువును, శ్రీవత్సవక్షుని, వనమాలా విభూషితుని, పీతవస్రుని, చతుర్బాహుని, శంఖచగ్రగదాధరుని, హారకేయూర సంయుక్తుని, మకుటాంగదధారిని, సర్వలక్షణ సంయుక్తుని, సర్వేంద్రియ వివర్జితుని, కూటస్థుని, అచలుని, సూక్ష్ముని, జ్యోతీరూపుని, సనాతనుని, భాషా భావ వినిర్ముక్తుని, వ్యాపిని, ప్రకృతిపరుని, జగన్నాధుని, సుఖప్రదుడగు ప్రభువును నమస్కరించు చున్నాను. ఇట్లు పూర్వము యమధర్మరాజు వటవృక్ష సమీపమున నానావిధ స్తోత్రములచే నమస్కరించేను. ఇట్లు స్తుతించి చేతులు జోడించి నమస్కరించు యమధర్మరాజును స్తోత్రకారణము నడిగితిని. ఓవైవస్వతా? మహాబాహో నీవు సర్వదేవమయుడవు. నీవెందుకిట్లు స్తుతించితివో సంక్షేపముగా తెలుపుము అని.
యమధర్మరాజు పలికెను :
పురుషోత్తమ తీర్థముగా ప్రఖ్యాతి గాంచిన ఈ పుణ్యాయ తనమున ఇంద్రనీలమయమగు సర్వకామ ప్రదయగు ప్రతిమ సృజించ బడినది. ఆ ప్రతిమను నిశ్చల భావముచే దర్శించిన వారు కామనా రహితులై శా శ్వాతలోకమును చేరుచున్నారు. కావున నా కర్తవ్యమును నేను చేయ జాలమన్నాను. కావున నాయందు దయతలచి ప్రతిమనుప సంహరించుకొనుము. అని ఈయముని వాక్యమును విని నేనిట్లు పలికితిని. ఓయమ ధర్మరాజా! ఈ ప్రతిమను సైకతము చే కప్పివేతును. అని అప్పుడంతట వల్లుల చే ఆ ప్రతిమను కప్పి పుచ్చితిని. అచట మానవులు ఈ ప్రతిమను చూడజాలరు. బంగారు వన్నెగల లతలచే ప్రతిమను కప్పి యముని పంపివేసెను. ఇట్లు ప్రసిద్ధిగాంచిన పురుషోత్తమ క్షేత్రమున ఇంద్రనీలమయ ప్రతిమను దాచిన తరువాత జరిగిన వృత్తాంతమును దేవదేవుడగు జనార్దనుడు వివరించెను. ఇంద్రద్యుమ్నుడు వెళ్ళుట, క్షేత్ర సందర్శనము, క్షేత్ర వర్ణము, క్షేత్ర మహాత్మ్యము, బలదేవ కృష్ణ సుభద్రా దర్శనము, నరసింహ దర్శనము, వ్యుష్టి సంకీర్తనము, అనంత వాసుదేవ దర్శనము, గుణకీర్తనము, శ్వేత మాధవ మాహాత్మ్యము, స్వర్గద్వార వర్ణనము, సముద్ర దర్శనము, స్నానము, తర్పణము, సముద్రస్నాన మహాత్మ్యము, ఇంద్రద్యుమ్నుడాచరించిన పంచతీర్థఫలము, మహాజ్యేష్టి విశేషము, కృష్ణ బలరాముల స్నానము, సర్వయాత్రా ఫలము, విష్ణులోక వర్ణనము, క్షేత్ర వర్ణనము దీనినంతటిని పూర్వము మహాలక్ష్మీదేవికి పురుషోత్తముడు వివరించెను.
ఇది శ్రీబ్రహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీసంవాద మున పురుషోత్తమ మాహాత్మ్యమను యాబది రెండవ అధ్యాయము.
