నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

8 - మందరవర్ణనము

బ్రహ్మ పలికెను :- ఓ సుందరీ నీవు జగత్తునంతటిని నీరూపముచే మోహింపచేసితివి. కావున నీకు మోహినియను పేరు సార్థకమగును. నీదర్శనమువలన పురుషుడు దశమన్మధావస్థలనుపొందును. ఒకవేళనీసంపర్కమును పొందగలిగినచో అత్యంత సుఖభాజనుడు కాగలడు. బ్రహ్మ ఇట్లు పలుకగా మోహినీ బ్రహ్మకు నమస్కరించి మార్గమున దేవతలచే చూడబడచు మందరాచలమునకు బయలుదేరేను. మూడవముహూర్తమున మందరపర్వత శిఖరమును చేరుకొనెను. ఈ మందరపర్వతమును చుట్టుటకు వాసుకీకి కూడా శక్యముకాదు. ఈ పర్వతమునే పూర్వకాలమున శ్రీహరి తనమూపున ధరించెను. దేవదానవులు ఈ పర్వతముతోనే సాగరమును మధించిరి ఆరులక్షలయోజనములు గల సముద్రము ఈ పర్వతమునకు గహ్వరమాయెను. కూర్మశరీరముచే చక్కగా ధరించబడినది. అంతగా మధించిననూ భిన్నము కాలేదు. ఈ పర్వతము సముద్రమున పడుటచేసముద్ర రహస్యము బయటపడినది. ఈ పర్వతమునుండియే జలము బ్రహ్మాండమార్గమున బయలుదేరినది. ఈ పర్వత ఘర్షణముచే మహాగ్ని పుట్టెను. ఈ పర్వతమునందే దిగంబరుడగు శంకరుడు భూతములతో కలిసి నివసించును. ఈ పర్వతము దేవతలచే దానవులచే చూడశక్య ముకాదు. పదివేల సంవత్సరములు శ్రీహరి కేదారమును వరిపిడి పెట్టినదీపర్వతమే. ఈ పర్వతము అనన్తరత్ననిలయము. బహుధాతు సమన్వితము. ఇదియే దేవతలకు క్రీడావిహారస్థలము. ఋషులతపస్సులకు మూలము. దేవతాస్త్రీరతి వర్థనము. రత్నములకు ఓషధులకు పుట్టిలు. ఈ పర్వతము మూలమున పదివేల యోజనములచే విస్తరించినది. పదివేల యోజనముల పొడవుగలది మూడు లోకములకు ఆధారదండమువలె నుండును. బంగారు, రత్నమయములగు శిఖరములచే భూమిని ఆకాశమును ప్రకాశింపచేయును. ఈ పర్వతముపైకి వచ్చిన సూర్యభగవానుడు తేజస్సునశించి రశ్మిశూన్యుడగును. ఈ పర్వతమంతయు బంగారు స్వరూపముకలది. బంగారుకాంతులుకలది. తన తేజస్సుచే సూర్యతేజస్సును హరించును. అట్టి పర్వతశిఖరశిలాప్రాంతమున రాజు కోరికను పెంచుటకు మోహిని కూర్చుని యుండెను. ఈ శిల నీలకాంతిమయము. సప్తయోజన విస్తృతము. ఈ శిలయందే కులిశలింగము. దశహస్తపమాణము కలదిగా నున్నది. దీనినే వృషలింగమందురు. ప్రాసాదాభసమముగా నుండును. ఈ శిలయందు మోహిని ఉత్తమసంగీతమును గానము చేయుచుండెను. ఈ సంగీతము తంత్రీలయసమన్వితము. వినువారి శ్రమను తొలగించును. ఆమోహిని శివలింగమునకు సమీపమున నుంటూ మూర్చనాలాలసహితముగా, గాంధారధ్వని సంయుతముగా గానము చేయసాగెను. అట్లు మన్మధుని పెంచు గానము సాగుచుండగా స్థావరములకు కూడా ఆగానమునందు స్పృహకలిగెను. అచట దైవము అదైవము అనుభేదము లేక పాయెను. మోహినీ ముఖమునుండి వెడలిన గానము సర్వప్రాణీ విమోహనమాయెను. ఆమోహినీగీతమును వినిన శంకరుడుకూడా అదేస్థితిలో కామాతురుడై అనుభవించు కోరికచే కదిలేను. పార్వతీదేవి చూపుచే సిగ్గుపడెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ చరితమున మందరవర్ణనమను ఎనిమిదవ అధ్యాయము.