నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

48 - కాశీ మాహాత్మ్యమ్

మాంధాత పలికెను : ఓ మహానుభావా నీవు సర్వజ్ఞుడవు కృపాలుడవు కావున మహా పాతక నాశనమగు పవిత్రమగు మోహినీ చరితమును చెప్పితివి. మోహిని భర్తను పుత్రునీ సవతిని ధర్మరక్షణకు పీతాజ్ఞచే ప్రయత్నించి సంసారము నుండి విముక్తులను చేసెను. ఆ బ్రహ్మపుత్రి సర్వజ్ఞురాలు, సర్వలోకహితకరురాలు, తన పురోహితుని శరణు పొందినది. పితృగతి ప్రదమగు గయామహాత్మ్యమును విని మరల ఏమడిగెను?

వసిష్ఠ మహర్షి పలికెను. ఓరాజా! తీర్థ సేవన కాముకురాలగు మోహినీదేవి వసువునే మడిగెనో చెప్పెదను. వినుము.

మోహిని పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా? బాగు బాగు నీవు లో కోద్దరణ తత్పరుడవు. కరుణాత్ముడవగు నీవు నన్నుద్దరించితివి. ఉత్తమము పావనమగునది, రహస్యము, పితృగతిప్రదము, ధర్మాఖ్యానము, సుఖావహమగు గయామాహాత్మ్యమును వింటిని. ఇక ఇప్పుడు ఉత్తమ మగు కాశీ మాహాత్మ్యమును తెలుపుము. నేను పూర్వము సంధ్యావళిచే కొంత వింటిని. కావున స్మరించితిని. ఇపుడు విస్తరముగా తెలుపుము.

వసిష్ఠ మహర్షి పలికెను : మోహినీ వాక్యమును వినిన పురోహితుడగు వసువు వేదవేదాంగ తత్వజ్ఞుడు కావున వినుమని ఇట్లు చెప్పసాగెను.

వసువు పలికెను : కాశీపురము శుభప్రదము. ధన్యము మహేశ్వరదేవుడు ధన్యుడు. మహేశ్వరుడు విష్ణుపురమగు కాశిని స్వరకాలము లందు సేవించుచుండెను. శ్రీహరి క్షేత్రమును యాచించి సనాతనుడగు హరుడు ఉండెను. హృషీకేశుని పూజించుచు దేవాదులచే స్తుతింపబడుచుండెను. వారాణసీ నగరము అతిసుందరము: భువన త్రయసారభూతము. సేవించినవారికి సద్గతిప్రదము. మహాపాతకులైననూ ఇచటికి వచ్చి పాపక్షయముచే నిష్కల్మషులై సన్మనస్కులగుదురు. ఈ క్షేత్రము అతి రమ్యతమము. సర్వప్రాణి సుఖావహము. సర్వ ప్రాణులకు మోక్ష ప్రదము. విష్ణు క్షేత్రము. శివక్షేత్రము కూడా బ్రహ్మహత్మ గోహత్య గురుతల్పగమనము, మిత్రద్రోహము, న్యాసాపహారము, కుశదాది నిషిద్ధ కర్మలనాచరించువాడు కూడా సంసార భూతదృఢ పాశ విముక్తు దేహుడైననే శివపురియగు వారాణసిని చేరగలడు. సురసిద్ద సేవితమగు ఈ క్షేత్రమును పూర్వజన్మ సుకృతవశమున చేరి దేవదానవులందరీలో ప్రసిద్ధి చెంది మరణించిన తరువాత పరమ పదమును చేరును. హరి భక్తులైననూ హరభక్తులైననూ సుకృతులు ఈ క్షేత్రమున నివసించువారు ప్రతి దినము పవిత్రులై ఆదరముతో చూచువారు శంభుతుల్యులగుదురు. అట్టి మానవులు భయ దుఃఖపాపరహితులై సంశుద్ధ కర్మక్రియులై జనన మరణ రూపమగు సంసార జాలమును భేదించి పరమ పదమును చేరెదరు. ఈ కాశీ క్షేత్రము తూర్పు పడమరలలో రెండున్నర యోజనములు, దక్షిణోత్తరములలో అర్థయోజన విస్తార్లముగా నున్నది. వారణాసి నది వరకు ఆసియను శుష్క నది ఉండును. ఇది క్షేత్ర విస్తారము అని శంకరుడు చెప్పెను. ఉత్తరాయణము తరువాత తిమీ చండీశ్వరము, దక్షిణమున శంకుకర్ణము, తరువాత ఓం కారమున పింగలాతీర్థము ఆగ్నేయము లోలార్కుడున్నది శుష్కనదిగా తెలియవలయును. ఇడాయను నాడి సౌమ్య యనబడును. కేశవుడుండునది వరణానది. ఈ రెంటి మధ్యన నుండునది సుఘమ్నా యనబడును. దీనినే మతోదరీ యందురు. దీనినే విస్వరమని కూడా యందురు. ఈ క్షేత్ర మెప్పుడూ విముక్తము కాలేదు. విముక్తము కాబోదు. కావున ఈ క్షేత్రమును అవిముక్త క్షేత్రమందురు దుస్తరమగు సంసారమును తరింపచేయుటలో ఈ క్షేమము ప్రయాగక్షేత్రము కంటే అతి విశిష్టమైనది. ఇచట ఆయాసము లేకుండగనే మోక్షము లభించును. నానావర్ణులు, వికర్లులు, జుగుప్పితుడు చాండాలులు పాప పరిపూర్ణదేహులు మహాపాతకులు, వీరిందరికి అవిముక్త క్షేత్రము పంమపదము. దుష్టులను, అంధులను, దీనులను కృపణులను, పాపకారులను, దుష్కృతకారులను, అందరిని హరుడు పరమకృపచే పరమగతిని పొందించును. ఈ క్షేత్రమధ్యము నుండి బయలు వెడలిన గంగానది సముద్రుని చేరినట్లు. ఇచటి వారు హరుని చేరెదరు. కావుననే ఈ పురి పుణ్యపురి అయినది. ఇచటి పవిత్ర గంగానది ఉత్తరాభిముఖిగా నుండును. సరస్వతీ నది ప్రాజ్ముఖిగా నుండును ఇచటనే శివుని హస్తము నుండి కపాలము విమక్తమాయెను. ఈ తీర్థమునకు వెళ్ళి పితరులను శ్రాద్ధములందు పిండ ప్రదానముచే ప్రీతి కలిగించువారికి ఉత్తమలోకములు ప్రాప్తించును. బ్రహ్మహంతకుడు ఈ క్షేత్రమును చేరినచో అవిముక్త క్షేత్ర మాహాత్మ్యముచే బ్రహ్మహత్య తొలగిపోవును. పుణ్యాత్ములు అవిముక్త క్షేత్రమును చేరినచో అక్షయులు అజరులు దేహరహితులగుదురు. తెలిసి కాని తెలియక కాని స్త్రీ కాని పురుషుడు కాని చేసిన కొద్ది యశుభకర్మ అవిముక్త క్షేత్రమును ప్రవేశించిన వెంటనే భస్మమగును. అవిముక్త క్షేత్రమున నివసించు మానవుడు ఎప్పుడూ యజ్ఞదానతపములను చేయును. ఆ విముక్త వాసులకు లభించు సద్గతి కురుక్షేత్రమున గంగాద్వారమున, పుష్కరమున సంభవించదు. ఇచట నుండు వారి తపస్సు సత్యము సార్థకములగును. ఆవిముక్తమున నివసించువాడు సాక్షాన్మహేశ్వరుడే. అవిముక్త క్షేత్రమును సేవించని మూఢులు, తామసులు మలమూత్రధూళులలో మాటిమాటికి నివసింతురు. అ విముక్తమున నివసించువారు. ఆవిముక్త క్షేత్ర పాంసువులచే వాయువుచే స్పృశించబడిన పాతకులు కూడా ఉత్తమగతిని పొందెదరు. అవిముక్త క్షేత్రమున నివసించు మానవుడు త్రైలోక్యభోజియైనను వాయు భక్షకునిగా గుర్తించబడును. ఈ క్షేత్రమున ఒక మాసము ఆహారము తీసుకొని నివసించువాడు చక్కగా మహాపాశుపతవ్రతమును ఆచరించినవాడే యగును. జన్మమృత్యు భయమును జయించి పరమ గతిని పొందును. పవిత్రమగు నిశ్రేయసగతిని యోగగతిని పొందును. వేల జన్మలచే కూడా పొంద శక్యము కాని యోగగతి ఈ క్షేత్రమాహాత్మ్యము వలన శంకరుని ప్రభావము వలన పొందగలుగును. ఈ క్షేత్రమున ఒక పూట మాత్రమే భుజించుచు ఒక మాసమున్నచో యావజ్జీవితమున చేసిన పాపము ఒకే మాసమున నశించును.

ఈ క్షేత్రమున పుట్టినవాడు జీవితాంతము ఈ క్షేత్రమును విడువక బ్రహ్మచర్యముచే యుండినచో అతను సాక్షాత్తు శంకరుడే యగును. విఘ్నములు కలుగుచున్ననూ విముక్తమును వదలనివాడు అజరామృత్యువులను నశ్వరమగు జన్మను వదులును. పుట్టినప్పటి నుండి అవిముక్తమును సేవించువారు హంసయానముచే దివ్యలోకములను పొందెదరు. విషయాసక్తచిత్తుడు భక్తి రహితుడైననూ ఈ క్షేత్రమున మరణించినచో మరల సంసారమును చూడడు. ఈ పుణ్యతీర్థము స్వర్గాపరవర్గములకు హేతువు. ఈ తీర్థమున మరణించినవారికి ముక్తి తప్పక లభించును. ఒక యోగి వేల జన్మలచే పొందని దానిని ఈ క్షేత్రమున మరణించినవాడు పొందును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వర్ణసంకరులు, క్రీములు, మేచ్చులు, సంకరులు, పాపులు, కీటములు, పిపీలికలు, ఇతర మగపక్షులు కూడా కాలవశమున నిధనమును పొందిననూ వారు దేవేశ్వరులుగా తలచబడుదురు. వారందరూ చంద్రార్ధమౌళులు, లలాటాక్షులు, వృషధ్వజులుగానౌదురు. ఈ క్షేత్రమున యధార్ధముగా ప్రాణములను విడిచిన వారు రుద్రత్వమును పొంది శివ సన్నిధిలో ఆనందింతురు. అకాముడు కాని, సమకాముడుకాని పశుపక్ష్యాదులలోని వారు కాని అవిముక్తక్షేత్రమున ప్రాణములు విడిచిన ముక్తిని పొందును. ఇతర భక్తులు కాక శివభక్తిపరులు, శివచితులు, శివగత ప్రాణులు జీవన్ముక్తులే. అవిముక్తమున విచారించక అగ్ని ప్రవేశమును చేసినవారు కాలాగ్ని రుద్రుసాయుజ్యమును పొందెదరు. శివభక్తులు దృఢనిశ్చయముతో నిరాహారులుగా నున్నచో వారికి కల్వకోటి శతములకు కూడా పునర్జన్మ కలుగదు. అవిముక్త క్షేత్రమున మృత్యుకాలమున భూతాధితి స్వయముగా శ్రీరామచంద్రుడు శివకారి యగు శివునకు అతి ప్రస్నచిత్తముతో అవిముక్తనివాసికి ఉపదేశించెను. మరణించబోవువాడెవడైననూ వాని కుడిచెవిలో నామన్తమునుపదేశంచినచో ముక్తుడగును. కర్మలు క్షీణించగా అంత్యకాలమున ప్రాణవాయువు గతించుచుండగా స్మృతి కలుగదు. అవిముక్తమున నుండు రుద్రభక్తులు, వారికి ప్రీతిని కలిగించువారు డిమి చండీశ్వరాదులు కర్ణమున మంత్రమును ఉపదేశింతురు. అవిముక్తమున మృతి చెందినవాడెవ్వడు నరకమునకు వెళ్ళడు. అందరూ ఈశ్వరానుగ్రహమున ఉత్తమగతిని పొందెదరు. నీకిపుడిట్లు సంక్షేపముగా అవిముక్త తీర్థ గుణములను వివరించితిని.

సముద్రమున రత్నములవలె అవిముక్తమున గుణవిస్తారము కలదు. జ్ఞాన విజ్ఞాన నిష్టులకు పరమానన్దమును కోరువారికి ఉండు బుద్ధి ఈక్షేత్రమున మృతి చెందినవారికి కలుగును. ఈ క్షేత్రమున ప్రాణములు విడిచిన వాడు మరల పుట్టడు. అట్టి వానికి యోగులకు లభించు అనన్త గతి లభించును. ఇచట స్మశాన మనునదే యోగపీఠము. ఇదియే మణి కర్ణికా తీర్థము. స్వకర్మలచే పతితులగు వారికి ఈ క్షేత్రములలో ముక్తి ఉద్దేశించబడినది. మరియు అన్ని తీర్థములలో మణికర్ణిక ఉత్తమ తీర్థము. ఇచట నిత్యము ధూర్జటి సన్నిహితునిగా యుండును. మణి కర్ణికా తీర్థమున స్నానమాడిన వానికీ దశాశ్వమేధ ఫలములభించును. ఈ తీర్థమున, స్వధనమును దానము గావించిన వాడు శుభగతిని పొందును. అగ్నివలె ప్రకాశించును. ఇచట ఉపవసించి బ్రాహ్మణ సంతర్పణమును గావించిన వాడు ఇంద్ర యాగ ఫలమును పొందును. ఇచట దీప దానమును చేసిన ఇంద్రియము జ్ఞానవత్తుగా శోభించును. ధూప దానముచే రుద్రసేవిత స్థానమును పొందును. తరుణము సౌమ్యము నాలుగు వర్షముల ఈడుగల వృషభమును చిహితము చేసి విడిచినవాడు మోక్షమును పొందును. ఇంకనూ ఏమి చెప్పవలయును. శివాదుల నుద్దేశించి ధర్మాదులను చేయు వారికి ఆనన్త ఫలము కలుగును. పుష్ప దానమున-దశాశ్వమేధ ఫలము, ధూప దానమున అగ్నిహోత్ర ఫలము, గంధార్పణచే భూదాన ఫలము, మార్జనమున గోదాన ఫలము కలుగును. అనులేపనమున పదిరెట్లు, మాల్య సమర్పణము పదిరెట్లు, మహాదేవుని అర్చనలో, స్తుతిలో, గీతములో వేయిరెట్లు వాద్యమున లక్షరెట్లు ఫలము లభించును. వారు సర్వపాప వినిర్ముక్తులై జరామరణ రహితులై స్వర్గమున నుందురు. అవిముక్తమున చేరి లింగమును పూజించువారికి కల్పకోటి శతములకు కూడా పునర్జన్మ రాదు. జరామరణ వర్షితుడై శివసన్నిధిలో ఆనందించును. ధ్యానమును పొంది, జితేంద్రియులై సావధానులై ఇంద్రియములను నిగ్రహించి శతరుద్రీయమును జపించువారు అవిముక్త స్థితులు కృతార్థులగుదురు. ఇచట ఒక దినము ఉపవసించిననూ శతవర్లో పవాస ఫలమును పొందును. ఇక తరువాత చేర వలసినది గంగా వరుణ సంగమము. బుధవారము శ్రవణ ద్వాదశీయోగము కలిగినచో ఆనాడు ఇచట స్నానమాచరించి ఉత్తమ ఫలితమును పొందును. ఈ సమయమున ఇచట శ్రాద్ధమునాచరించిన పితరులను తరింప చేసి విష్ణులోకమునకు వెళ్ళును. వరణాసి జాహ్నావుల సంగమము లోక విశ్రుతము. ఇచట అశ్వదానమును గావించిన వాడు మరల పుట్టడు. భక్తి గలవాడు “ఇచట సంగమేశుని పూజించినచో అతను స్వయముగా దేవదేవేశుడు నిగ్రహానుగ్రహసమరడ గును. దేవేశ్వరునికి పూర్వభాగమున కేశవుడుండును. కేశవున కు పూర్వ భాగమున సంగమేశ్వరుడుండును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున కాశీ మహాత్మ్యమను నలుబది ఎనిమిదవ అధ్యాయము.