నారద మహా పురాణము - ఉత్తరార్థము
49 - తీర్థయాత్రా వర్ణనమ్
వసువు పలికెను:- ఆ పీఠమునకు వాయవ్య దిగ్భాగమున సగరునిచే చతుర్ముఖ లింగము స్థాపించబడినది. సాగరసంగమమునకు వాయుకోణమున భద్రదేహసరస్సు కలదు. ఈ సరస్సు గోక్షీరము చే ఏర్పడినది. సర్వపాతకనాశనము. ఈ భద్రప్రదమున స్నానమాచరించిన సహస్రకపిల గోదాన ఫలము కలుగును. - పూర్ణిమ రోజున పూర్వాభాద్ర నక్షత్రము కలిగినచో అది చాలా పుణ్యతమ కాలము. ఈనాడు స్పామాచరించిన అశ్వమేధ ఫలము కలుగును. ఇచట భీష్మచండిక యను దేవి ప్రసిద్ది చెందినది. శ్మశానమున భీష్మచండికను పూజించినవాడు దుర్గతిని పొందడు. అంతకేశ్వరునకు పూర్వభాగమున సర్వేశ్వరునకు దక్షిణ భాగమున మాతలీశ్వరునకు ఉత్తరమున కృత్తివాసేశ్వరుడు కలడు. కృత్తివాసక్షేత్రమున కృత్తివాసేశ్వరుని దర్శించి, అతనిని చక్కగా పూజించి ఒకే జన్మలో ఉత్తమగతిని పొందును. పూర్వజన్మకృత పాపము తపస్సుతో కూడా నశించదు. కాని కృత్తివా సేశ్వరలింగ దర్శనము వలన నశించును. కృతయుగమున త్ర్యంబకనామమున, త్రేతాయుగమున కృత్తివాసుడని, ద్వాపరమున మహేశ్వరుడని, కలియుగమున హస్తిపాలేశ్వరుడని గానము చేయబడును. కృత్తివాసేశ్వరుని పలుమార్లు దర్శించవలయును. శాశ్వతము అమృతప్రదమగు తారకజ్ఞానమును కోరినచో దర్శనము ఆవశ్యకము. దేవదేవుని దర్శనము వలన బ్రహ్మఘ్నుడు కూడా ముక్తిని పొందును. దేవదేవుని స్పృశించిన, పూజించిన సర్వయజ్ఞఫలము లభించును. సనాతనుడగు ఈ పరదేవుని శ్రద్ధచే అర్చించినవాడు, విశేషించి ఫాలునబహుళచతుర్దశినాడు సావధానులై పత్ర పుష్పఫలములచే భక్ష్యములచే క్షీరదధిఘృత జలముల చే శివలింగమును తర్పణ చేసి పూజించిన వారు, డుండుకార నమస్కారములతో, నృత్యగీతములతో, అనేకవిధముఖ్యవాద్యములచే, స్తోత్రములచే, మంత్రములచే సేవించి ఉత్తమభక్తిచే ఒకరాత్రి ఉపవసించినవారు, పూజించినవారు పరమస్థానమును పొందెదరు. చైత్ర అమావాస్యనాడు పరమేశ్వరుని అర్చించువారు కుబేరుని చేరి కుబేరునివలె విహరించును. వైశాఖ చతుర్దశినాడు భక్తియుతుడై శివుని పూజించినచో వైశాఖలోకమును చేరి విశాఖునికి సేవకుడగును. జ్యేష్ఠ చతుర్దశినాడు శ్రద్ధతో హరుని పూజించినవారు ప్రళయకాలము. వరకు స్వర్గమున నివసించును. ఆషాఢ చతుర్దశినాడు భక్తితో శివుని పూజించువాడు సూర్యలోకమునుపొంది యధేచ్చగా క్రీడించును. శ్రావణ చతుర్దశినాడు ఉద్భవించిన కామలింగమును పూజించినవాడు వరుణలోకమును చేరి అప్పరసలతో క్రీడించును. భాద్రపదమాసమున శంకరుని వివిధ ఫలపుష్పములచే పూజించి ఇంద్రలోకమును పొందును. భాద్రపదబహుళ చతుర్దశినాడు ఈశ్వరుని పూజించి పితృలోకమును పొంది వారితో విహరించును. కార్తీకమాసమున మహేశ్వరుని పూజించి చంద్రలోకమును చేరి యేధేచ్చగా, విహరించును. మార్గశీరబ్రహుళపక్షమున పినాకిని పూజించి. విష్ణులోకమును పొంది అనంతకాలము క్రీడించును. పుష్యమాసమున సంతోషముతో స్థాణువును పూజించి నిఋతిలోకమును చేరి నైఋతులుతో విహరించును మాఘమాసమున పుష్పమూలఫలములచే శివుని పూజించి శివలోకమును చేరును. సంసారసాగరమును వీడును.శంకరలోకమును కోరువారు ప్రయత్నపూర్వకముగా కృత్తివాసేశ్వరుని పూజించవలయును. అవిముక్తమున నివసించవలయును. వ్యాసేశుని పశ్చిమ భాగమున నున్న ఘంటాకర్లప్రదమున స్నానమాడి వ్యాసేశుని దర్శించువారు ఎక్కడ మృతి చెందిననూ వారాణసీ మృతి ఫలము లభించును. దండ ఖాతమున స్నానమాడి స్వపితరులకు తర్పణముగావించి నరకమున నున్న వారు కూడా పితృలోకమును చేరెదరు. పిశాచత్వమును పొందిన పాపకర్ములు కూడా పిండ ప్రదానము చే దేహోద్ధరణము జరుగును. దండఖాతదర్శనము చే కృతకృత్యుడగును. ఇచటనే లోకసుఖప్రదయగు లలితాదేవి కలదు. అచటనుండి లలితాదేవిని పూజించిన వారికి ఆదేవి వివిధ భోగములనిచ్చును. దీపములచే ఆమె ముందు జాగరణమును చేసినవారికి ఆమె అక్షయ లోకములను ప్రసాదించును. ఆలయమును నిర్మించువారికి, మార్జనము చేసినవారికి అష్టసహస్ర సువర్ణముల ఫలము లభించును. లలితాదేవినుద్దేశించి వేద పారగులగు బ్రాహ్మణులను భుజింపచేసిన వారికి, కలుగు పుణ్యఫలమును చెప్పెదను వినుము.
ఒకకలకాలము దుర్గాలోకమున నివసించి మరల భూలోకమునకు వచ్చును. నరునిగా కాని నారిగా కాని పుట్టును. సర్వభోగసమన్వితముగా ధనధాన్య యుక్తముగా పుట్టును. మహా కులములో పుట్టును. సౌభాగ్యము సౌందర్యము రూపయౌవనములు కలిగి సర్వసౌఖ్యములను పొందెదరు. విద్యుత్సంహిత చంచలమగు దుర్లభమగు మనుష్యమును పొందినవారు లీలతాదేవిని పూజించినచో మరలపుట్టరు. భూప్రదక్షిణము వలన కలుగు ఫలము వారాణిసిలో లలితాదర్శనము వలన కలగును. ప్రతిమాసమున చుతుర్థినాడు తత్కాలముగా ఉపవసించి లలితాదేవిని పూజించి జాగరణము చేయవలయును. ఇట్లు చేసినవానికి సకలసమృద్ధి కలుగును. లోకత్రయము చే పూజించబడును. సర్వసిద్ధిప్రదుడగు నలకూబరకేశుని చక్కగా - పూజించిన వాడు కృతకృత్యుడగును. నలకూబరకేశునికి దక్షిణ భాగమును మణికర్ణి 'కలదు. మణికర్ణి అగ్రభాగమును సర్వపాపప్రణాశకమగు తీర్ధము కలదు. కుండ మధ్యనున్న మణికర్ణీశ్వరదేవుని దర్శించి నమస్కరించి చక్కగా పూజించిన వారు మరలగర్భవాసమును అనుభవించరు. ఇచటికి దక్షిణ భాగమును. గంగయందు స్థాపించబడియున్న పరుడగు గంగేశ్వరుని చక్కగా పూజించి సురలోకమును పొందును. వారాణసిలో మరియొక ఆయతనము కలదు. ఇచట దేవదేవుని రుచిర స్థానము కలదు. అంతరిక్షముననుండు రాక్షసులు శివలింగమును తీసుకొని వేగముగ వెళ్ళుచుండగా ఈ ప్రదేశమును చేరగానే దేవదేవుడు ఆలోచించేను. నాకు అవిముక్తక్షేత్రములతో వియోగము సంభవించరాదని తలచేను. ఈ విషయమును దేవదేవుడు విచారించుచుండగా అచట కుక్కుట శబ్దము వినవచ్చెను. ఆ శబ్దమును వినిన రాక్షసులు భీతిచెందిన వారై ప్రభాతసమయమున అచటనే లింగమును విడిచి పారిపోయిరి. రాక్షసులు వెళ్ళిపోగా శివలింగమచటనేయుండెను. అతిరుచిరముస్వచ్చము అగుస్థానమున దేవదేవుడు స్వయం ప్రభువు అవిముక్తక్షేత్రమధ్యమున ఉండుటచే ఆ క్షేత్రము అవిముక్తతరమాయేను. అపుడు దేవదేవునికి దేవతలు ‘అవిముక్త’ అని పుణ్యాక్షరాడ్యమగు నామమును పెట్టిరి. ఈ నామము స్థావర జంగమములకు మోక్షప్రదము. ఇచట మరణించిన వారికి వెంటనే ముక్తిని ప్రసాదించును. ఇచటనే కుక్కుటములు కూడా ఉండును. ఇప్పటికి ఇచట కుకుటములు పుణ్యాత్ములచే పూజించబడుచుండును. కోరి అవిముక్తమును ఆశ్రయించినవానికి కల్పకోటి శతములలో కూడా పునర్జన్మ కలుగదు. ఇచట దేవదేవుని దక్షిణభాగమున నున్న వాపీ జలమును పానము చేసిన వారికి కూడా పునరావృత్తియుండదు. ఇచట పురుషుని హృదయమున నున్న లింగత్రయ జలమును పానముచేసిన వారు కృతార్ధులగుదురు. వారికి తారక జ్ఞానము కలుగును. వాపీ జలమున స్నానమాడి దండకేశ్వరుని దర్శించి తరువాత అవిముక్తదర్శనమును చేసుకొనిన వానికి క్షణకాలమునకైవల్యము లభించును. ఇచట బ్రాహ్మణుడు ఒకమారు సంధ్యోపాసన గావించినచో అరువది అయిదు సంవత్సరములు సంధ్యోపాసన చేసినవాడగును. వారాణసీ పురమును, అవిముక్తక స్మశానమును, అవిముక్తేశ్వరుని దర్శించినవాడు గణపతి యగును. ఇచట అవిముక్తేశ్వరలింగమును దర్శించిన మానవుడు వెంటనే పాపములచే, రోగములచే, పశుపాశముల చే విముక్తుడగును. అవిముక్తక్షేత్రాగ్రభాగమున పశ్చాన్ముఖముగా నున్న లింగమును, ఆ అవిముక్తమును, లక్షణేశ్వరుని దర్శించినంతనే నరుడు జ్ఞానియగును. ఇచటికి ఉత్తరమున చతుర్ముఖలింగము కలదు. ఈ లింగమునకు చతుర్ధేశ్వరుడని పేరు. ఈ నామము పాపమును భయమును తొలగించును. వారాణసీ యను క్షేత్రము భూలోకమున ప్రాణులకుముక్తిని ప్రసాదించునది. ఇక ఇచటి అవిముక్తేశ్వరము జీవన్ముక్తముగా పేరు గాంచినది. ఎచటనున్న వాడైనను దర్శనమాత్రమున గణపతియగును. ఇచట ప్రాణములను విడిచిన వారు ఆత్వంతికముక్తిని పొందెదరు. ఈ అభ్యంతర క్షేత్రమున ప్రధమావరణము కలదు. ద్వితీయావరణమున ప్రాగ్జిశలో మణికర్ణికాతీర్ధము కలదు. ఇచట ఏడు కోట్లలింగములు కలవు. ఈలింగములను దర్శించినంతనే యజ్ఞఫలమును పొందును. ఇవి సిద్ద లింగములు. ఇట్లే పవిత్రములగు కూపములు, ప్రదములు, వాపులు, నదులు, కుండములు, చాలా కలవు. వీటియందు సావధానుడై స్నానమాచరించువాడు, లింగములను స్పృశించువాడు మరల సంసారమున ప్రవేశించ జాలడు. పృథివియందు అంతరిక్షమునందు గల అన్ని తీర్దములలో కొన్ని ముఖ్యతీర్ధములను నీకు తెలిపితిని. పాపనాశినియగు తీర్థయాత్రనుచెప్పితిని. ఈ తీర్ధయాత్రను చేసినవారు చూచినవారు ముక్తిని పొందెదరు. అవిముక్త తీర్ధము మధ్యమావరణమనబడును. దీనినే కంటకమందురు. ఇదియే మృత్యుకాలమున అమృతప్రదమని ప్రసిద్ధి గాంచినది.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున . మోహినీ వసుసంవాదమున కాశీమాహాత్మ్యమున తీర్ధ యాత్రావర్ణనము అను నలుబదితొమ్మిదవ అధ్యాయము.
