నారద మహా పురాణము - ఉత్తరార్థము
45 - పిండదానవిధి
వసువు పలికెను : ఓ మోహినీ ఇపుడు ప్రేతశిలాభవ పుణ్యమును చెప్పెదను. వినుము. ఇచట పిండ ప్రదానము గావించినచో పిత్స సముద్ధరణము జరుగును. ఇచట ప్రభాసాత్రిచే శిలచే పాదము ఆచ్చాదితమాయెను. మునులచే స్తుతించబన ప్రభాసుడు శిలాంగుష్ఠము నుండి బయలు వెడలెను. ఈ అంగుష్ఠమున నున్న ఈశుడు ప్రభాసేశునిగా ప్రసిద్ధి గాంచేను. శిలాంగుష్ట దేశమున ప్రేత శిల కలదు. ఇచట పిండదానమును చేసిన ప్రేత భావము తొలగును. ప్రభాసాత్రి సంగమమున మహానదిలో స్నానము చేయువాడు పవిత్రుడగును. వామదేవుడు స్వయముగా నిలిచినది వామతీర్థమని ప్రసిద్దము. ఇచట ఈ మహానదిలో ప్రార్థించబడిన రాముడు స్నానమాచరించెను గాన రామతీర్థమని ఏర్పడినది. ఇది స్వరలోకపావనము. ఈ రామ తీర్థమున స్నానమాడినచో వేయి జన్మల పాపము నశించును. ఈ మంత్రముచే స్నానము చేసి శ్రాద్దము చేసి రామతీర్థమున పిండప్రదానము చేసిన విష్ణులోకమున నివసించును. “రామ రామ మహాబాహో దేవానామభయంకర త్వాం నమస్యేతు దేవేశ మమ నశ్యతుపాతకమ్” అనునది మంత్రము. దేవతలకునభయమునిచ్చు ఓ రామచంద్రా! మహాబాహూ నీకు నమస్కరించెదను. నా పాపము నశించుగాత. ఇచట ప్రభాసేశుని నమస్కరించి ప్రకాశించు శివుని సమీపించవలయును. శివునికి నమస్కరించి యామ్యబలిని గావించవలయును.
అనుమంత్రముచే బలిని గావించవలయును. ఓ దేవేశా! నీవు జలరూపుడవు జ్యోతిష్పతివి. నా మనోవాక్కాయ సంభవములగు పాపములను త్వరగా నశింపచేయుము. అని పై మంతమునకర్ధము. శిలాజమున ప్రాంతమును యమధర్మరాజు ఆక్రమించి యుండెను. ధర్మరాజు ఆ పర్వతమును వెళ్ళకు అని అనుటచే అది అదృశ్యానగమోయేను. ఈ పర్వతమున యమరాజధర్మరాజులు నిశ్చలముగా నుండిరి. వీరిద్దరిని పూజించక చేసిన శ్రాద్దము వ్యర్థమగును. “ఈ శ్వానములు శ్యామ బలములు. వైవస్వతకులోత్పన్నములు. ఈ రెంటికీ పిండ ప్రదానము చేయుచున్నాను. ఈ రెండు హింసిచక ఉండనిమ్ము.” అని పలుకవలయును. ప్రేత శిలాతీర్థమున నేయి కలిపిన చరువుచే పితరుల నావాహన గావించి మంత్రములచే పిండ ప్రదానము గావించవలయును. పేత పర్వతమున సావధానుడై పితరులను ధ్యానించి ప్రాచీనావీతి కుడై ధక్షిణాభిముఖముగా స్మరించుచు, కవ్యవాహుడు, అనలుడు, సోముడు, యముడు, అర్యమా, అగ్విషాత్తా, బర్హిషదులు, సోమపులు, పితృదేవతలు మీరందరు మహానుభావులు ఇటకు రండు. మీచే రక్షించబడు నా పితరులు నాకులజాతులు సగోత్రులు వీరందరికి పిండప్రదానమును చేయుటకు ఇచటికి వచ్చితిని. ఈ శ్రాద్ధముచే వారందరు శాశ్వతమగు తృప్తిని పొందుదురు గాక. అని పలికి అచమనము గావించి పంచాంగమును వినిపించి ప్రాణాయామము చేసి పునరావృత్తి రహిత బ్రహ్మలోకాప్తి హేతువుగా సంకల్పించి యధాక్రమముగా శ్రాద్ధము నాచరించవలయును. పితరుల నావాహన చేసి అర్చించి, మంత్రములచే పిండ ప్రదానము గావించవలయును. మొదట హోమమును పంచగవ్యములచే చేసి, సపిండులకు శ్రాద్ధమును చేసి, వారికి దక్షిణ భాగమున దర్భలను పరిచి తిలోదకమును ఇచ్చి, చేతులు జోడించి అంజలిలో తీసుకొని పితృతీర్థముతో ప్రయత్న పూర్వకముగా ముష్టి మాత్ర సక్తువులచే అక్షయ్య పిండమును పెట్టవలయును. పిండ ద్రవ్యములలో తిలాజ్యదధి మధాదులను కలుపవలయును. దర్భలలో తిలాదులచే సంబంధుల నావాహన చేయవలయును. ఈ మూడు మంత్రములచే మూడు లింగములను నర్చించవలయును. పూర్వము వలె పితరుల నావాహన గావించి యధా పూర్వముగా పిండప్రదానమును గావించవలయును. స్వగోత్రమున కాని ఏ గోత్రమున కాని దంపతులకు కలిపి పిండ ప్రదానమును చేసినచో శ్రాద్ధమునిష్పలమగును. పిండ ప్రదానము ఉదక తర్పణమును చేయుచు. పిండపాత్రలో తలల నుంచి శుభోదకములచే నింపి ఈ మంత్రముచే ప్రదక్షిణముగా పిండములను మూడు మార్లు పరి షేచనము చేయవలయును. నమస్కరించి క్షమాపణ వేడవలయును. పితరులను విడిచి ఆచమనము చేసి సాక్షులగు దేవతలకు వినిపించవలయును. అన్ని స్థానములలో ఇట్టే పిండ ప్రదానము గావించవలయును. గయా పిండదానమునకు కాల విచారమును చేయరాదు. అధిక మాసమున, జన్మదినమున, గురు శుక్రమూఢములలో, బస్పతి సింహారాశిలో ఉన్ననూ పిండ ప్రదానమును విడువరాదు. గయకు వెళ్ళి పిండ ప్రదానము చేయని వానికి భిక్షువు కూడా దండమును చూపును. విష్ణు పదమున దండము నుంచి పితరులతో విముక్తుడగును. గయయందు, పాయసముతో సత్తుచే, పిండిచే చరువుచే, తండులాదులచే పిండదానమును చేయవలయును. మహాపాపి అయిననూ గయా దర్శనమున పరిశుద్దుడగును. గయా శ్రాద్దమునాచరించిన వాడు బ్రహ్మలోకమును పొందును. ఫలుతీర్థమున పిండ ప్రదానము చేసిన వారికి కలుగు ఫలము సహస్రాశ్వమేధములచే కూడా కలుగదు. గయను చేరగానే పితరులకు ప్రియములుగ పిండప్రదానము గావించవలయును. ఆలస్యమును చేయరాదు. విఘ్నములను కలిగించరాదు. పిత, పితామహులు, ప్రపితామహులు. మాత, పితామహి ప్రపితామహి మాతామహుడు, అతని పిత, ప్రమాతామహాదులు. వీరందరికి నాచే ఈయబడు పిండము అక్షయ్యమును కలిగించనిమ్ము. నాకులమున మరణించిన వారిని, గతిలేని వారిని ఉద్దరించుటకు ఈ పిండము నిచ్చుచున్నాను. బంధు వర్గ కులములోని వారికి గతిలేని వారి ఉద్దరణ కొరకు ఈ పిండమునిచ్చుచున్నాను. దంతములు రాని వారిని, గర్బపీడితులను ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. అగ్ని దగ్గులను అనగ్నిదగ్గులను, విద్యుచ్చోరహతులను ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. దావ దాహ మృతులకు, సింహవ్యాఘ్రహతులకు, దండ్రులచే శృంగులచే హతులైన వారికి పిండమునిచ్చుచున్నాను. వురిచే మరణించిన వారికి, విషశస్త్రహతులకు, ఆత్మఘాతకులకు పిండ ప్రదానము చేయుచున్నాను. అరణ్యమున, దారిలో, అడవిలో మరణించిన వారికి, ఆకలి దప్పులచే మరణించిన వారికి, భూతప్రేత పిశాచహతులకు పిండమునిచ్చుచున్నాను. రౌరవనరకమున, తామిస్రమున, కాలసూత్రమున నున్నవారికి ఉద్దరణ కొరకు ఈ పిండమునిచ్చుచున్నాను. అనేక యాతనాస్థితులకు, ప్రేతలోకగతులకు ఉద్దరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. దుర్గతిని పొంది అభిశాపాదులచే హతులైన వారినుద్ధరించుటకు ఈ పిండము నిచ్చుచున్నాను. సమస్త నరకములలో యమదూతవశులైన వారిని ఉద్ధరించుటకు ఈ పిండమునిచ్చుచున్నాను. పశుయోనిగతులకు పక్షికీట సరీసృపయోనిగతులకు, వృక్షయోనిగతులకు ఈ పిండము నిచ్చుచున్నాను. స్వకర్మవశమున జాత్యంతర సహస్రములలో భ్రమించువారికి, మానవజన్మ దుర్లభమగు వారికి పిండము నిచ్చుచున్నాను. దివ్యంత రిక్ష భూమిగతులగు పితరులకు బాంధవాదులకు సంస్కారహీనముగా మరణించిన వారికి పిండమనిచ్చుచున్నాను. ప్రేతరూపములో నున్న పితరులందరూ పిండదానముచే తృప్తి పొందుదురుగాక. బంధువులకు, బంధువులు కాని వారికి, ఇతర జన్మలలో బంధువులకు, నాచే ఈయబడు పిండము అక్షయముగా చేరనీ. పితృవంశమున మరణించిన వారికి, మాతృవంశమున మరణించిన వారికి గురుశ్వశుర బంధువులకు, మరణించిన ఇతర బంధువులకు, నా కులమునలుప్త పిండుల కు, పుత్రదారవర్జితులకు, క్రియాలోపము జరిగిన వారికి, జాత్యంధులకు, పంగువులకు, విరూపులకు, ఆమగర్బులకు, నాకులమున తెలిసిన వారికి, తెలియని వారికి వారందరికి నాచే ఈయబడిన ఈ పిండము అక్షయము కానిమ్ము. బ్రహ్మ నుండి నా పితృవంశమున పుట్టిన వారికి, మాతృవంశీయులకు రెండు కులములలో సంగతులకు నేను పిండమునిచ్చుచున్నాను. నేను గయను చేరి పితరులకు నిష్కృతిని గావించితిని. బ్రహ్మేశానాది దేవతలు నాకు సాక్షులుగా నుందురు గాత. ఓ దేవా గదాధరా! గయా తీర్థమునకు వచ్చితిని. ఇచట నీవే సాక్షివి. ఇచట రుణత్రయము నుండి నేను విముక్తుడనైతిని.
మరునాడు శుచియై ప్రేత పర్వతమునకు వెళ్ళవలయును. బ్రహ్మకుండమున స్నానము గావించి దేవాదులకు తర్పణమును గావించవలయును. శ్రద్ధాలులై ప్రేత పర్వతమున పితరులనాహ్వానించి పూర్వము వలె సంకల్పించి పిండ ప్రదానము గావించవలయును. స్వమంత్రములతో పరమ పితృదేవతలను చక్కగా పూజించవలయును. పితృకర్మలలో గ్రహించిన తలల సంఖ్యతో అసురులు గరుడుని చూచిన సర్పముల వలే భయపడి పారిపోదురు. ఇచట కూడా అంతయూ పూర్వము వలెనే ఆచరించవలయును. ప్రేత పర్వతమున తిలమిశ్రితములగు సప్తును చల్లవలయును. ప్రేత రూపములోనున్న నా పితృదేవతలు అందరూ తిల మిశ్రిత సక్తులచే తృప్తిని చెందుదురుగావుత. బ్రహ్మ నుండి స్తంభము వరకున్న చరాచర సకల జగత్తు నేనిచ్చు పిండముచే తృప్తిని పొందనిమ్ము. మొదట పంచతీర్థములలో ఉత్తర మానసమున ఆచమనమును గావించి దర్భలచే శిరస్సున నీరు చల్లుకొని, ఉత్తర మానసమునకు వెళ్ళి మంత్రముచే స్నానమాచరించవలయును. ఆత్మ శుద్ధి కొరకు ఉత్తరమానసమున స్నానము చేయుచున్నాను. సూర్యలోకాది సంప్రాప్తిసిద్దికి, పితృముక్తికి స్నానము చేసి దేవాదులకు యధావిధిగా తర్పణము చేయవలయును. బ్రహ్మ నుండి స్తంభ పర్యంతము దేవర్షి పితృమానవులు పితరులందరు మాతృమాతామహాదులు తృప్తి పొందెదరు గాత, స్వసూత్రోక్త విధానముగా శ్రాద్ధమున సపిండకమును చేయవలయును. అష్టకం యందు, వృద్ధి యందు, గయయందు, అక్షయ దినమున విడిగా తల్లికి శ్రాద్ధమును చేయవలయును. ఇతరత్ర స్వామితో చేయవలయును “ఓం నమోస్తు భానవే భర్రే సోమభౌమ జ్ఞరూపిణే, జీవ భార్గవ శనైశ్చర రాహుకేతు స్వరూపిణే” అని మంత్రమును జపించి, సూర్యునికి నమస్కరించి, అర్చించినచో పితరులను సూర్యలోకమునకు చేర్చును. ఇచట మానససరోవరము కలదు. దాని తరువాత ఉత్తర మానసము కలదు. ఉత్తర మానసము నుండి మౌనముగా దక్షిణ మానసమునకు వెళ్ళవలయును. ఇది ఉత్తర తీర్థమని చెప్పబడినది. కావున ఉత్తర దిక్కు మోక్షప్రదము. మండపృష్టమునకు ఉత్తర భాగమున దేవర్షి పితృతర్పణమును చేయవలయును. మధ్యలో కన ఖల తీర్థము పితరులకు గతిదాయకము. ఇచట స్నానము చేసిన నరుడు కనకము వలె భాసించును. పవిత్రుడుగును. కావున కనఖల తీర్థము ఉత్తమ తీర్థముగా ప్రసిద్ధిగాంచినది. కావున దక్షిణ భాగమున దక్షిణ మానసతీర్థము కలదు. దక్షిణ మానసమున తీర్థత్రయము చెప్పబడినది. వీటిలో యధావిధిగా స్నానము చేసి విడివిడిగా శ్రాద్ధమును చేయవలయును. ఓ దివాకరా! ఇచట దక్షిణ మానసమున స్నానమును చేయుచున్నాను. బ్రహ్మహత్యాది పాపరాశి నాశమునకు, విముక్తికి స్నానము చేయుచున్నాను. అను ఈ మంత్రముచే స్నానపూజాదికమును సపిండ శ్రామును చేయవలయును. పితరులను తృప్తి కొరకు తరింపచేయుటకు సూర్యునికి నమస్కరించుచున్నాను. పుత్రపౌత్ర ధనైశ్వర్య ఆయురారోగ్యవృద్ది కొఱకు నమస్కరించుచున్నాను అని పలికి దర్శించి సూర్యుని పూజించి ఈ మంత్రమునుచ్చరించవలయును. కవ్యవొడాదులు పితృదేవతలు నా పితృదేవతలతో కలిసి స్వధాభుజులై తృప్తి పొందుదురు. ఇట నుండి ఫలు తీర్థమునకు వెళ్ళవలయును. ఈ ఉత్తమ తీర్థమున పితృ శ్రాద్దమునాచరించిన వారికి పితరులకు ముక్తి కలుగును. బ్రహ్మ ప్రార్థించగా విష్ణువు పలుకుడాయెను. దక్షిణాగ్నిలో చేయబడినది ఫలు తీర్థకమైనది. ఇచటనే ఫలులో గోవు కామధేనువు జలము, మహిమ ఫలించును ఇది యుగ సృష్ట్యంతర్గతము. కావున ఫలు తీర్థము నిష్పలము కాదు. అఖిల భువనములలో నున్న సమస్త తీర్థములు స్నానము చేయుటకు ఫలు తీర్ధమునకు వచ్చును. గంగ విష్ణుపాదోదకము. ఫలుతీర్థము సాక్షాత్తు గదాధురుడే. హిమము ద్రవమైనపుడు ఫల్గుతీర్థమైనది. కావున ఇది గంగ కంటే అధికము. ఫలు తీర్థమున స్నానము చేసినచో సహస్రాశ్వమేధ ఫలితము కలుగును. ఫలు తీర్థమున విష్ణు జలమున ఈ రోజు స్నానమును చేయుచున్నాను. దీనితో పితరుల కు విష్ణులోకము భుక్తి ముక్తులు సిద్దించును. వలు తీర్థ మున స్నానము చేసి తర్పణమును శ్రాద్ధమునాచరించవలయును. ఈ శ్రాద్ధమును సపిండకముగా నాచరించి పితామహునికి నమస్కరించవలయును. శివునకు దేవునకు, ఈశాన పురుషునికి అమౌరవామదేవునకు సద్యోజాతునకు శంభునకు నమస్కారము. పితామహునికి నమస్కరించి ఈ మంత్రముచే పూజించ వలయును. ఫలు తీర్థమున స్నానమాడి గదాధరుని దర్శించి, పితరులతోపాటు విష్ణులోకమును చేరును. వాసుదేవునకు నమస్కారము. సంకర్షణునకు, ప్రద్యుమ్నునకు, అనిరుద్దునకు, శ్రీధరునకు, విష్ణువునకు, నమస్కారము. పంచతీర్థమున స్నానమాచరించి పితరులను బ్రహ్మలోకమునకు చేర్చును. గదాధరుని పంచామృతముతో స్నానము చేయించి పుష్ప వస్త్రాదులచే అలకరించి శ్రాద్ధమును చేయవలయును. ఇట్లు గదాధురుని పూజించక చేసిన శ్రాద్ధము నిరర్ధ మగును. నాగకూటము, గృధ్రకూటము, విష్ణువు ఉత్తర మానసముల కంటే ఇది గయాశీరమనబడును. దీనినే ఫలు తీర్థమందురు. ముండ పృష్ఠ పర్వతాభో భాగమున ఫలు తీర్థము కలదు. ఈ ఫలుతీర్థమున శ్రాద్ధము చేయుటచే పితరులు మోక్షమును పొందెదరు. గయా శిరమున శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానమును చేయువలయును. ఎవరి పేరుతో పిండమర్పించిన వారు బ్రహ్మలోకమును చేరెదరు. అవ్యక్తరూపముగా నున్న దేవుడు మండ పృషాద్రి రూపమున ఫలు తీర్థాది రూపమున గదాధరుని నమస్కరించును. శిలాపర్వత ఫల్వాదిరూపముతో ఆవ్యక్తముగా నుండి, గదాధరుని రూపముగా వ్యక్తముగా నుండును. ఆటనుండీ ధర్మారణ్యమునకు వెళ్ళును. ఇచటనే ధర్ముడున్నాడు. మతంగవాపీలో స్నానము చేసి తర్పణమును శ్రాద్దమును ఆచరించవలయును. వెళ్లి మతంగేశునికి నమస్కరించి ఈ మంత్రమును పలుకవలయును. దేవతలు. శంభువు ప్రమాణము. లోకపాలకులు సాక్షులు. నేను మతంగక్షేత్రమున కొచ్చి పితరులకు నిష్కృతిని చేసితిని. మొదట బ్రహ్మతీర్థమున కూపమున శ్రాద్ధాదుల నాచరించవలయును. కూపయూపముల మధ్యన శ్రాద్ధము నాచరించి పితరులను తరింప చేయును. ధర్ముని, ధర్మేశ్వరుని నమస్కరించి, మహా బోధితరువును నమస్కరించవలయును. ఇట్లు ద్వితీయ దివసమున చేయవలసిన స్నానతర్పణ పిండనమస్కారాదికృత్యములను వివరించితిని. ఈ కృత్యము పితృసౌఖ్యమును కలిగించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మాహాత్మ్యమున పిండదాన విధియను నలుబదియైదవ అధ్యాయము.
