నారద మహా పురాణము - ఉత్తరార్థము
17 - మోహినీ వచనమ్
పుత్రుడు పలికెను:- కావున ఓ తల్లీ! ఈర్యను వదిలి మోహినిని భుజింపచేయుము. ఇటువంటి ధర్మము మూడులోకములలో లభించదు. భర్తకు ప్రియురాలగు తన సవతిని ఏభార్య భుజింప చేయునో, లేదా కొంచెము అన్నమిచ్చునో అది అననఫలమునిచ్చునని బ్రహ్మ చెప్పియున్నాడు. కావున మహారాణీ! నీవు నామాటను అనుసరించుము. మన మిద్దరము తండ్రిసుఖమునే చూడవలయును. ఇట్లు చేసిన పాపములు నశించి స్వర్గము లభించును. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన సంధ్యావతీ దేవి పుత్రుని అభినందించి పలుమార్లు ఆలింగనము చేసుకోని శిరస్సును మూర్కోని ఇట్లు పలికెను. ఓ కుమారా! ధర్మబద్ధమగు నీ మాటను తప్పక నాచరించెదను. ఈర్యను అభిమానమును వదిలి మోహినిని భుజింప చేసెదను. నీవంటి ఒక్కపుత్రుని చేతనే నేను నూర్గురు పుత్రులు కలదాననైతిని. దేహమునకు కష్టమును కలిగించు ఎన్నో నియమములనాచరించుటచే నీవు పుట్టితివి. ప్రతరాజములనెన్నింటినో చేసిన వెంటనే నీవు లభించితివి. లోకమున ఇంతటి ఫలము నీయగల ఇటువంటి వ్రతము మరియొకటి లేదు. ఈ వ్రతము వెంటనే విశ్వాసమును కలిగించునది. ఫలమును ప్రసాదించునదిగా చూడబడినది. శోకమును సంతాపమును కలిగించు పదిమంది పుత్రులకంటే కులమునకు ఆధారభూతుడగు - ఒక పుత్రుడు చాలును. నిన్ను గర్భమున ధరించిన నేను మూడులోకములకంటే ఉన్నతస్థితిని పొందితిని. నీకు పుట్టుక నిచ్చిన నా నొప్పులు ధన్యములు. సప్తద్వీపాధిపతి, శూరుడు, పితృవాక్యపాలకుడు, తలిదండ్రులను ఆనందింపచేయువాడు మాత్రమే నిజమగు పుత్రుడని ఇతరులు కేవలము పుత్ర నామమును మాత్రమే పొందుదురని పండితులు చెప్పియున్నారు. సంధ్యావతీదేవి ఇట్లు పలికి భాండములను షడ్రసపదార్థముల కోజుకు చూచెను. సంధ్యావలి చూపు పడిన వెంటనే ఆభాండములు షడ్రస యుక్తములుగా సుఖోష్ణకములుగా మోహినిని భుజింప చేయవలయునని పరిపూర్ణములుగా మారెను. అమృతము వలే రుచికరములుగా నుండెను. అంతట సంధ్యావలీ దేవి రత్న ఖచితమగు బంగారు గరిటను తీసుకొని మోహినీ దేవికి చిరునవ్వుతో వడ్డించెను. మృదు స్పర్శమగు బంగారు పాత్రలో వడ్డించిన పదార్ధములను ఇష్టము సుసంస్కృతమగు అన్నమును మోహినీ దేవి మెలమెల్లగా భుజించెను. మోహినీ దేవి శుభకరము స్వర్ణమయమగు ఆసనమున కూర్చొని, ధర్మాంగదుడు స్వయముగా నెమిలి పింఛముల వీవన వీచు చుండగా అమృతము వంటి ఆయన్నమును భుజించినది. తరువాత నాలుగు విధముల శీత జలముచే శౌచము నాచరించి ధర్మాంగదుడిచ్చిన సుగంధియగు తాంబూలమును శ్రేష్ఠమగు చందనము నలదిన హస్తముచే స్వీకరించెను. అపుడు ఒక చిరునవ్వు నవ్వి సంధ్యావలితో ఇట్లు పలికెను.
ఓదేవీ ! నీవు ధర్మాంగదుని తల్లివా? శ్రమచే చెమటపట్టి యుండుటచే నేను తెలియ జాలకపోయితిని. ఇట్లు బ్రహ్మ సుతయగు మోహిని పలుకుచుండగా ధర్మాంగదుడు మోహినీ దేవికి నమస్కరించి ఇట్లు పలికెను. ఓ తల్లీ! ఈ దేవి నన్ను తన కడుపులో మూడు సంవత్సరములు మోసినది. నీ భర్త యను గ్రహముచే నేను పెరిగితిని. నాకు కొన్ని వందల మంది తల్లులు కలరు. కాని నేను ప్రేమతో పెల్లుబికి వచ్చిన ఈమె చను బాలనే త్రాగితిని. ఈ దేవియే నన్ను ప్రసవించునపుడు తీవ్రమగు ప్రసవవేదనను భవించినది. దానితో ఈమెకు బంథములుడిగి వార్ధక్యము సంకమించినది. ఈమె ఋణమును తీర్చుటకు ఈయగలదేదియు ఈ మూడు లోకములలో కనపడుట లేదు. మాతా పుత్రులకు ఋణవిమోచన మనునది లేదు. ఇది ముమ్మాటికీ నిజము. కావున నేను అందరికంటే ధన్యుడను. ఈ లోకమున నాకంటే అధిక పుణ్యశాలి లేడు. నేను చాలా మంది తల్లుల వడులలో ఆడుచున్నాను. తల్లివడిలో చేరని తనయుడు కన్య భర్త సౌఖ్యమును తెలియనట్లు మాతృసౌఖ్యమును తెలియజాలడు. తల్లి వడిని చేరిన తనయుడు దర్పముతో విలసిల్లును. తల్లి కంఠ సీమలో నుండు హారమును చేతులతో హరింప జూచును. పిత్సహీనుడైననూ తల్లిచే పోషించబడువాడు దర్పముతోనే యుండును. ఈ జగమును జయించు నాబలమంతయూ తల్లి చను బాలచలువే. ఈమె కడుపులో పుట్టినవాడు ఈమె వడిలో శంకలేకనే ఆడును. ఈమెకు ఇతర మాతలకు నేను భేదమును చూడలేను. కావున మా తండ్రి నూరు సంవత్సరములు జీవించనిమ్ము. ధర్మాంగదుడిట్లు పలుకగా విస్మయమును చెందిన మోహిని తన మనసులో నేను దయను వీడి, వినయ సంపన్నుడు పరమ పుణ్యుడు, పితృ సేవా పరాయణుడు, సర్వగుణాధికుడు అగు పుత్రునికి తల్లినై ఎట్లు జుగుప్సితమగు శిరః ఖండనమును చేయించగలను. ఇట్లు పలువిధములుగా తనలో తాను పరిశీలించుకొని మోహినీదేవి పుత్రుడగు ధర్మాంగదుతో నా భర్తను త్వరగా తోడ్కొనిరమ్ము. భర్త లేనిదే ఒక ముహూర్త కాలము కూడా నేను నిలువ జాలను. అని పలికెను. అంతట ధర్మాంగదుడు త్వరగా తండ్రి వద్దకువెళ్ళి, తండ్రికి నమస్కరించి మా చిన్నతల్లి మిమ్ములను చూడగోరుచున్నది. ఆమెను అనుగ్రహించుడు. బ్రహ్మపుత్రికను ఆదరించుడు. అని పలికెను. పుత్రుని మాటను విని వెంటనే సంతోషముచే బయలుదేరి సంధ్యావలీ గృహమున ప్రవేశించి తప్తకాంచన సన్నిభ మోహయుక్తయగు మోహిని శయ్యపై నుండగా చూచెను. సంధ్యావలిచేసేవించబడు చుండెను. సంధ్యావలి కూడా పుత్రుని మాటలతో సవతియను భావమును విడిచి యుండెను. వచ్చిన రుక్మాంగద మహారాజును చూచి శయ్యపై ఒక ప్రక్కకు తిరిగి సంతోషము నిండిన మోముతో రాజుతో ఇట్లు పలికెను. ప్రియా ! మెత్తని ఈ పర్యంకమున కూర్చొనుడు. రాజా ! రాజకార్యములను చాలా సేపు పరిశీలించితిరి. ఇప్పటికీ మీకు రాజ్యముపై కోరిక ఉడుగలేదు. సమర్థుడగు పుత్రుడుండిననూ రాజకార్యములను మీరు స్వయముగా చూచుట వలన ఈ భూమండలమున మీరొక్కరే దుష్కృతి యని భావించుచ్నూను. కావున ఈ లోకమున మిమ్ములను మించిన దుఃఖి వేరొకడు లేడు. మంచి పుత్రుడు గల తండ్రికి జీవనము సుఖముగా సాగును. పాపమును దుఃఖరూపముగా ననుభవించువారైనను, విషయాసక్త చిత్తులైనను సత్పుత్రులు గల వారికి ఆనందమే మిగులును. పరిపూర్ణ పుణ్యముచే పుట్టిన ప్రజలందరూ నీ కిష్టులుగా నున్నారు. ధర్మాంగదుడు పరిపాలించుచుండగా మరల మీరెందుకు చూచుచున్నారు? ప్రియా సౌఖ్యమును దుర్బలుడగు కీనాశునివలె ఏలవదులు కొనుచున్నారు? ఒక వేల మీరు రాజ్యపాలన చేయుచున్నచో నాతో మాకేమి ప్రయోజనము. మందర పర్వతము నుండి నన్ను నిప్రయోజనముముగా తోడ్కొని వచ్చితిరి. పక్షులకు మాంసమువలే నేను క్రిములకు ఆహారము కాగలను. యౌవనవతి యగు భార్యను కార్యక్రగ్రుడై సేవించని దుర్మతికి భార్య యెట్లుండును? సేవించనిచో భార్య వెళ్ళి పోవును. దానము చేయని ధనము నశించును. రక్షించబడని రాజ్యము తొలగును. అభ్యాసము చేయని శాస్త్రము నశించును. సోమరులకు చదువురాదు. వ్రతముల నాచరించువారికి భార్య యుండదు. అనుష్టానము లేనిదే లక్ష్మిరాదు. భక్తులు కాని వారికి కీర్తిరాదు. ప్రయత్నమును చేయనివాడు సుఖమును పొందజాలడు. భార్యలేనివాడు సంతానమును పొందజాలడు. అపవిత్రుడు ధర్మమును పొందజాలడు. అప్రియమును మాటలాడు బ్రాహ్మణుడు ధనమును పొందజాలడు. అడగనివాడు తెలియజాలడు. నడవనివాడు వెళ్ళజాలడు. శిష్యుడు కానివాడు చేయవలసిన పనిని తెలియజాలడు. మేలుకొని యుండు వానికి భయము కలుగదు. కావున ఓ రాజా నన్ను ధర్మాంగదుని ఇంటిలో విడిచి, సమర్థుడగు తనయుడుండి కూడా నీవెందుకు రాజ్యతంత్రమును చూచుచున్నావు? ఇట్లు మాటలాడు చున్న బ్రహ్మపుత్రిక. రతియందు ప్రీతి కలది, చక్కని విశాలమగు నేత్రములు కలది యగు మోహినిని చూచి పుత్రుడు దగ్గరలో నున్నందున సిగ్గు పడుచు మోహినితో ఇట్లు పలికెను :
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తర భాగమున మోహినీ వచనమను పదునేడవ అధ్యాయము.
