నారద మహా పురాణము - ఉత్తరార్థము
67 - బదరికాశ్రమ మాహాత్మ్యమ్
మోహిని పలికెను - ఓ బ్రాహ్మణోత్తమా! గంగాద్వార మాహాత్మ్యమును చెప్పితిరి. ఇక ఇపుడు పాపనాశకమగు బదరీ మహాత్మ్యమును తెలుపుము.
వసువు పలికెను. భద్రురాలా ఇపుడు బదరీమాహాత్మ్యమును చెప్పెదను. వినుము ఈ మాహాత్మ్యమును వినినచో మానవుడు జన్మ సంసార బంధము నుండి విముక్తుడగును. బదరియను శ్రీహరి క్షేత్రము సర్వపాతక నాశనము. సంసార భీతులకు కలి దోషహరము. మోక్షప్రదము ధర్మునీ నుండి మూర్తి యందు జన్మించిన నరనాయణులు గంధమాదనమునకు వెళ్ళిరి. ఇచటనే బహుగంధ ఫలాన్వితమగు బదరీ వృక్షమును స్థానమున కల్పాది నుండి తపస్సు చేయుచుండిరి. ఇచట వీరు గ్రామవాసులగు నారదాది మునివరులచే, సిద్ధసంఘములచే పరీవృతులై లోకస్థితి కొరకు తపమును చేయుచుడిరి. ఇచటనే సర్వసిద్ధి ప్రదమగు అగ్నితీర్థము కలదు. మహాపాతకులు కూడా ఇచ్చట స్నానమాడి పాతకములనుండి విముక్తులగుదురు. కలుషితమైన బంగారము అగ్నిలో దహించబడిన బంగారము శుద్ధి పొందినట్లు అగ్నితీర్థమున స్నానమాడిన నరుడు పాప విముక్తుడగును. వేల చాంద్రాయణ వ్రతములచే కోటిక్సచ్చ వ్రతములచే పొందబడు ఫలము అగ్ని తీర్థ స్నానము వలన లభించును. ఇచట అయిదుశిలలు కలవు. ఈ శిలలమధ్యలో అగ్ని తీర్థము కలదు. అగ్ని తీర్థ దర్శన మాత్రముననే సర్వ పాతకములు నశించును. నారద మహర్షి ఘోర తపము నాచరించిన శిల నారదీ శీల యనబడును. నారదీ శిలా సందర్శముననే ముక్తిని ప్రసాదించును. ఇచటనే నారద కుండము కలదు. ఇచటనే స్నానమాడిన నరుడు పరిశుద్దుడగును. భుక్తిని ముక్తిని శ్రీహరి భక్తిని సకలాభీష్టములను పొందును. ఈ కుండమునందు చేయబడు స్నానము దానము సురార్చనము హోమము, జపము, ఇతర పుణ్యకార్యములు అక్షయమగును. ఈ క్షేత్రముననే మరొయొకటి శుభావహమగు వైనతేయ శిలక లదు. ఇచటనే గరుడుడు మహాతపమును శ్రీహరి ధర్శనము కొరకు ముప్పది వేల సంవత్సరములు చేసెను. అంతట ప్రసన్నుడగు శ్రీహరి దైత్యగులను అజేయునిగా, భయంకరునిగా వరమునిచ్చి తనకు వాహనముగా చేసుకొనేను. ఈశిలకూడా నా పేరుతోనే ప్రసిద్ధి పొందును. దర్శన మాత్రముననే నరులకు పుణ్యమును కలిగించును. ఇచట నాప్రీతి కొరకు గంగాతీర్థము ఆవిర్భవించెను. స్నానము చేయువారికి పుణ్యమునిచ్చును. పంచగంగలో స్నానమాడి దేవాదులకు తర్పణములనిచ్చిన వారు సనాతనమగు బ్రహ్మలోకము నుండి మరల తిరిగిరారు. ఇట్లు వరమునిచ్చి శ్రీహరి అంతర్ధానము నందెను. గరుడుడు కూడా శ్రీహరి ఆజ్ఞచే శ్రీహరి వాహనమాయెను. అప్పటినుండి ఈ తీర్థము పాపనాశనమాయెను. స్మరణ మాత్రముననే పుణ్యప్రదము. వైనతేయగతి ప్రదము. ఇచటనే మరియొక శిలవారాహి అని కలదు. ఇచటనే శ్రీహరి హిరణ్యాక్షుని వధించి మహిని ఉద్ధరించి శిలారూపముచే ఆక్రమించి యుండెను. పాపనాశకమగు ఈ శిల పై యున్న గంగాజలమున స్నానమాడి భక్తితో ఈశిలను పూజించిన వారు దుర్గతిని పొందజాలరు.
ఇచటనే ఆగ్నేయ కోణమున ఇంద్ర పదమను తీర్థము సుప్రసిద్ధము.ఇ చట స్నానమాడినవాడు ఇన్జలోకమును పొందును. ఇచటనే మనోహరమగు మాన సోద్బేధకమను తీర్థము కలదు. హృదయ గ్రంధీని భేదించును. అఖిల సంశయములను భేదించును. సకల పాపములను హరించును. అందువలననే ఇది మానసోద్భేదము. ఇచటనే మరియొకటి కామకామతీర్థము కలదు. కోరికలు కల వారికి కోరికలను తీర్చును. కోరికలు లేనివారికి మోక్షమును ప్రసాదించును. ఇచటికి పశ్చిమమున వసుధారా తీర్థము కలదు. ఇచట భక్తితో స్నానమాడిన వారు వాంఛితఫలమునుపొందెదరు. ఇచట పుణ్యాత్ములు మాత్రమే జలమధ్యగతమును చూడగలుగుదురు. ఈ దర్శనముతో ప్రాణి మరల గర్భ వాసదు:ఖమును పొందజాలరు. ఇటకు నైఋతి దీగ్భాగమున క్రింద అయిదు ధారలు పడుచుండును. ప్రభాస, పుష్కర, గయానైమిషారణ్య సంజ్ఞలు కలవి, విడి విడిగా ఈ తీర్థములలో స్నానమాడిన వారు ఆయా తీర్థముల ఫలములను పొందెదరు. తరువాత సోమకుండమని మరియొక పేరుకల విమలతీర్థము కలదు. ఇచట తీవ్రమగు తపము నాచరించి చంద్రుడు నక్షత్రాధిపతి ఆయెను. ఇచట స్నానము చేసిన వారు దోషరహితులగుదురు. ఇచటనే మరియొకటి పాపహరమగు ద్వాదశాదిత్య తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు సూర్య సన్నిభతేజస్కులగుదురు. ఇచటనే గల చతుస్సోలతీర్థమున స్నానమాడిన వారు ధర్మార్థ కామ మోక్షములలో కోరిన వాటిని పొందగలరు. ఇచటనేయున్న సప్త పదమను మనోహర తీర్థమును దర్శించుట తోడనే మహాపాతకములు కూడా నశించుననగా ఇక స్నానము చేసిన ఏమి చెప్పవలయును? ఇచటనే లోకత్రయ ప్రసిద్దమగు బ్రహ్మ విష్ణు మహేశ్వర కుండము కలదు. ఇచట మరణించిన వారు సత్య పదమును పొందెదరు. నర నారాయణ క్షేత్రమున ఊర్వశీ కుండమను మరియొక తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు రూపవంతులగుదురు. నారాయణ ప్రియులు విశ్వవశంకరులు అయ్యేదరు. ఇచటికి దక్షిణ దీగ్బాగమున అస్త్ర తీర్థము కలదు. ఇచటనే నర నారాయణులు శస్త్రములనుంచి తపస్సును చేయు చుండిరి. ఇచట దివ్యములగు శంఖ చక్రగదా ద్యాయుధములు ఆకారమును ధరించి పుణ్యాత్ములకు కనపడును. ఇచట స్నానమాడిన వారికి, శత్రుభయము కలుగదు. ఇచటనే మేరు తీర్థము కలదు. ఇచట స్నానమాడి ధనుర్లురుని చూచి సకలా భీష్టములను పొందును. ఇచటనే లోకపాల తీర్థము కలదు. ఇచటనే లోకపాలకులు తప మాచరించిరి. ఇచట స్నానమాడిన వారు సర్వతీర్థ స్నానఫలమును పొందెదరు. ఇచట శ్రీహరి దండముతో కొట్టి తీర్థమును నిర్మించెను. కావున దండపుష్కరిణియని పేరు పొంది లోకపాలులకు ఆనందమునిచ్చును. అలకనందతో భాగీరధి సంగమమును పొందినది. బదరికాశ్రమమున ఈ తీర్థము సర్వతీర్థ శ్రేష్ఠము. ఇచట స్నానమాడి పితరులను దేవతలను ఋషులను చక్కగా పూజించి తర్పణములిడి సర్వదేవనమస్కృతుడై విష్ణులోకమును పొందును. ఈ సంగమమునకు దక్షిణ భాగమున ధర్మ క్షేత్రము కలదు. ఈ తీర్థము పరమపావనము సర్వతీర్ణోత్తమోత్తమము. ఇచట స్నానమాడిన వాడు సాధ్యసన్నిధిని చేరును. ఇచటనే సర్వపాపహరమగు ఉర్వశీ సంగమ తీర్థము కలదు. హరి భక్తిని చక్కగా కలిగించు కర్మోద్దర తీర్థము కూడా కలదు. బ్రహ్మలోకమును పొందించు బ్రహ్మావర్త తీర్థము కలదు. ఈ తీర్థము లన్నియు గంగనాశ్రయించిన తీర్థములు. ఇచటనున్న అన్ని తీర్థములను బ్రహ్మా కూడా చెప్పజాలడు. ఈ బదరికాశ్రమ మాహాత్మ్యమును వినని వారు వినిపించిన వారు సర్వపాప వినిర్ముకులై విష్ణు లోకమును చేరెదరు. ఇచట వ్రతమును స్వీకరించి ఒక మాసము నివసించిన వాడు ప్రత్యక్షముగా నర నారాయణ రూపుడగు హరిని చూడ గలుగును. ఈ బదరీ మాహాత్మ్యమును వ్రాసిన వారికి అకాలమృత్యువు కలుగదు. ఆధి వ్యాధి సర్పభయములు కలుగవు. శ్రీహరి అనుగ్రహము వలన సకల శుభములు సమకూరును. సకల సంపదలు వృద్ధి చెందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున బదరికాశ్రమ మాహాత్మ్యమను అరువది యేడవ అధ్యాయము.
