నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

10 - రుక్మాంగద వామదేవ సంవాదః

వసిష్టమహర్షిపలికెను:- అంతట విశాలనేత్ర యగుసంధ్యావలీదేవిభర్తవాక్యములను విని ఇట్లుపలికెను. ఓరాజా! నీవు నిజమునే పలికితివి. పుత్రసౌఖ్యమును మించినసుఖము ఈలోకమున మరొకటిలేదని మునులు చెప్పియున్నారు. పరమాత్మయగు శ్రీమహావిష్ణు స్మరణతో కలుగు ఆనందము పుత్రానందము సమానమగును. మీరు సప్తద్వీపభారమును పుత్రుని పై నుంచితిరి. మృగముల హింసను విడిచి జనార్ధనుని యజ్ఞములతో పూజించుడు. భోగములయందు స్పృహను వీడి గంగానదిని సేవించుడు. ఇదియే న్యాయము. మృగముల హింస న్యాయముకాదు. ఓరాజా పుత్రులు కలపితరులు విషయముల సేవించుట వృద్దస్త్రీహృదయమున నఖపాతము వంటిది. లేదా ఇంటిలోనే హృషీకేశుని పూజించుము. అంతేకాని నిర్దోషులగు మృగసమూహములను సంహరించుట యుక్తముకాదు. అహింసయే పరమధర్మమని పురాణములలో చెప్పబడినది. హింస చేయువాని ధర్మము వ్యర్థమగునని కూడా చెప్పబడియున్నది. ధర్మముల నాచరించుచున్ననూ హింసను ఆచరించినచో అతని ధర్మములు వ్యర్థములగును. పరోపహతమును సాధువులు భుజించరు. విద్వాంసులు జీవహింస ఆరువిధములని చెప్పియున్నారు. జీవహింసను ఆమోదించువారు, హింసించువారు, విశ్వాసమును కలిగించు వారు, భక్షించువారు, వండువారు, భూమియందుపాత్రను ఏర్పరిచి గ్రహించువారు ఈ ఆరుగురు జీవఘాతకులే. హింసతో కూడిన ధర్మము అధర్మమనబడును. పుత్రుని యందుభారమును ఉంచి పాపమునాచరించరాదు. తలపండిన తండ్రి ధర్మమును ఆశ్రయించవలయును. కావున మృగములను హింసించవలయునను భావమును విడిచి పెట్టుము. వేటాడు స్వభావముకలరాజులు చాలామంది నశించిరి. కావున మృగహింస అనితలచుచున్నాను. రాజులకు మృగములయందు దయకలిగి యుండుటే ఉత్తమము. ధర్మాచరణులకు కూడా ఇదియే ముఖ్యము. నేను హితబుద్దితో వారించు చుంటిని. ఇట్లు పలుకు భార్యను రాజు ఇట్లు పలికేను. ఓదేవీ! వేటయను నేపముతో మృగములను హింసించను. ధనువును ధరించి అరణ్యమున కంటకములను శోధించుచు తిరిగెదను. నాపుత్రుడు జనమధ్యమున నుండనిమ్ము. నేను అరణ్యమున నుందును. రాజు మృగముల నుండి, చోరులనుండి ప్రజలను కాపాడవలయును. రాజుకాని రాజపుత్రుడు కాని ప్రజారక్షణమును గావించవలయును. ప్రజలను రక్షించని ప్రభువు ఎన్ని ధర్మములనాచరించిననూ అధోగతిచెందును. కావున నేను ప్రజారక్షణకై అరణ్యమునకు వెళ్ళుచున్నాను. భారము తొలగినది కావున మేరు శిఖరమున సూర్యనివలే విహరించెదను. ఇట్లు సంధ్యావలికి బోధించినరాజు చంద్రునివలే శుభ్రము, దోషరహితము, భూభూషణము, రూపమున ఇంద్రుని వాహనము వంటిది, వేగము వాయుసమము, అగు అశ్వము నధిరోహించెను. రాజు భూమిని పూజించి, సహస్రకోటి దాత, కామినీకుచపీడనము, అశోకపల్లవాకారము, వజ్రాంకుశలాంఛనము, అగు దక్షిణకరమునిచ్చి, భూమిని కంపింపచేయుచు బయలుదేరెను. దేశములను దాటుచు అరణ్యమునకు వెళ్ళేను. అశ్వవేగముతో గజములు, రధములు, గుఱ్ఱములు త్రోసిపుచ్చబడినవి. బాటసారులు భూమండలమున మూర్చనంది పడిపోయిరి. ఆరాజు త్వరలో మునుల ఆశ్రమమును చేరెను. నూటాఎనిమిది యోజనములను దాటి, కదలీఖండమండితము, రమ్యము, అశోకవకులోపేతము, పున్నాగసరలామృతము, మాతులుంగ, కపిత్థ ఖర్జూర పనసాదులతో , నారికేళ తమాలసాలపిప్పలములతో చంపక క్రముక దాడి మధాత్రీ వృక్షసహస్రములతో, నింబ తామ్ర లో ధ్రవృక్షములతో కూడియున్న, మనోహరవాయుసహితము పుష్పగంధావృతము అగస్త్యము న్యాశ్రమమును చేరెను. అచట అగ్నిహోత్రునివలె తేజోవంతుడు, బహుశిష్య సమావృతుడు, బ్రాహ్మణ శ్రేష్టుడగు వామదేవమహర్షిని చూచెను. రధమునుండి దిగి, ఆదరముతో నమస్కరించెను. వామదేవమహర్షి రాజును ఆర్ఘ్యాదులచే అతిధి పూజగావించెను. దర్భాసనమున కూర్చొని రుక్మాంగదమహారాజు సంతోషముతో ఇట్లు పలికెను. ఈరోజు నాపొతకము నశించినది. నా కర్మఫలము ఈనాడు లభించినది. ఎల్లపుడు ధ్యానమగ్నులైన మాపాదపద్మ సందర్శనముచే ధన్యుడనైతిని. ఇట్లు పలికిన రుక్మాంగదమహారాజు మాటలను విని వామదేవమహర్షి సంతోషముచే కుశలమునడిగి ఇట్లు పలికెను. ఓరాజా! పరమ పవిత్రుడవు, విష్ణుభక్తుడవు అగు నీచే చూడబడిన నా ఆశ్రమము పావనమైనది. ఈభూమండలమున నీకు సాటిరాగల రాజులెవరు కలరు. నీవు యముని గేలిచి యమధర్మరాజు మార్గమును భగ్నము గావించితివి. జనులందరిని వైకుంఠమునకు చేర్చితివి. పాపనాశనియగు ద్వాదశీవ్రతము నాచరింపచేసితివి. సామదానభేద దండోపాయములచే భూమండలమును ప్రజలను నియమించుచు కర్మాచరణ పరులను కర్మభ్రష్టులను శ్రీహరిస్థానమును చేర్చితివి. నిన్ను చూడవలయునని కోరుచున్న మాకు నీ దర్శనము లభించినది. విష్ణుభక్తిగల ఛండాలుడు కూడా బ్రాహ్మణాధికుడు. విష్ణుభక్తిలేని బ్రాహ్మణుడు కూడా ఛండాలాధికుడు. ఈ భూమండలమున విష్ణుభక్తిగల రాజులు దుర్లభులు. భూమి సౌభాగ్యమును పెంచు రాజుగా విష్ణుభక్తిలేని వాడు కొజాలడు. విష్ణువు నందుకాక ఇతర దైవములందు భక్తిగల రాజులు భర్తను విడిచి జారునియందు ఆసక్తురాలగు స్త్రీవంటివారు. విష్ణుభక్తిరహితుడగు రాజునకు ధర్మార్థకామములకు ప్రజ్ఞకు వ్యతిక్రమము కాగలదు. కావున నీవుమాత్రము శాస్త్ర విహితముగా శ్రీహరిపూజనమును చేయుచున్నావు. కావుననీవు ధన్యుడవు. నిన్ను చూడగలుగుటచే మేము కూడా ధన్యులమైతిమి. ఇట్లు పలుకుచున్న వామదేవమహర్షితో సహజముగా వినయసంపన్నుడగు రుక్మాంగద మహారాజు మరింత వినయముతో వంగి ఇట్లు పలికెను.

ఓ బ్రాహ్మణోత్తమా నిన్ను క్షమాపణ వేడుచున్నాను. నేనలాంటి వాడిని కాను. నేను మీ పాదపరాగముతో కూడా సమానుడను కాజాలను. బ్రాహ్మణుల కంటే దేవతలు కూడా అధికులు కాజాలరు. బ్రాహ్మణులు ప్రీతులైనచో మానవునికి మాధవుని యందు భక్తి కలుగును. బ్రాహ్మణులు కోపించినచో సర్వజన ద్వేష్యుడగును. ఇది నిజము. అపుడు వామదేవుడు నీకేమి కావలయునో కోరుకోమనెను. ఓ రాజా? ఇంటికొచ్చిన అతిధికి ఈయరానిది ఉండదు. ఈ భూమండలమున, భేరిని మ్రోగించుచు హరి వాసరమున ఉపవాసము నుంచి సకల జనాభీష్టముల నిచ్చు నీకు ఈయరానిదేదియును లేదు. అపుడు రుక్మాంగద మహారాజు చేతులు జోడించి ఇట్లు పలికెను. మీ పాద పద్మ సందర్శనము చేతనే నేనన్నింటిని పొంద గలిగితిని. నా మనసున ఒక సందేహము చాలాకాలము నుండి కలదు. సర్వ సందేహ నివారకుడవు, బ్రాహ్మణోత్తముడవగు మిమ్ములను ఆ సందేహము నడిగెదను. నేను పూర్వజన్మలో ఏ సుకృతము నాచరించుటచే నాకు త్రైలోక్యసుందరి భార్యగా లభించినది? ఆ భార్య నన్నెపుడు మన్మధునికంటే అధికునిగా చూచును. నా భార్య అడుగుపెట్టిన ప్రదేశమున సకల నిధులు ఆవిర్భవించును. నాభార్య శరీరము వార్థక్య రహితము, ముడుతలు లేనిది. తలపండదు. సర్వకాలమున శరత్కాల చంద్రికవలె శోభించుచుండును. అగ్నిహోత్రము లేకుండగనే ఆమె షడ్రసోపేతములను వంటలను చేయును. ఆమె వండిన స్వల్పాన్నమునే కోటిమంది భక్షించెదరు. ఆమె పతివ్రత. సౌభాగ్యవతి. సర్వభూత సుఖప్రదురాలు. దానశీలురాలు. నిదురలో కూడా అవజ్ఞావాక్యములను పలుకదు. ఆమె యందు కలిగిన పుత్రుడు ఎపుడూ నా యాజ్ఞలో నిలుచువాడు. ఈ భూమండలమున నేనొక్కడనే పుత్రవంతుడను. నా పుత్రుడు పితృభక్తుడు. సద్గుణరాశి ఈ భూమండలమున నేను ఏకద్వీపాధిపతిని. నా పుత్రుడు సప్తద్వీపాధిపతి. నా పుత్రుడు నా కొరకు విద్యుల్లేఖ యను రాజకన్యను యుద్ధమున బలిశాలులగు రాజులతో ఆరెనెలలు యుద్ధముచేసి పరరాజులనందరిని నిరాయుధులనుచేసి, యుద్దమున గెలిచి తీసుకొని వచ్చాను. నా పుత్రుడగు ధర్మాంగదుడు ప్రమదా రాజ్యమునకు వెళ్ళి వారిని ఓడించి వారల ఉత్తమరూప సంపన్నలగు ఎనిమిది మంది యువతులను తీసుకొని వచ్చి నాకు సమర్పించి నమస్కరించెను. ఈ భూమండలమున గల దివ్య వస్త్రములను, రత్నములను తీసుకొని వచ్చి నాకు సమర్పించును. ఈ భూమండలమునంతటిని ఒక పూటలో తిరిగి మరల రాత్రి వరకు నా పాదములకు నమస్కరించుటకు వచ్చును. రాత్రి పాద సంవాహనమును చేసి ద్వారమున నిలుచును. నిద్రించుచున్న సేవకులను లేపుచుండును. అట్లే నా శరీరము కూడా రోగవర్జితముగా నున్నది. నాకులభించు సుఖము ఇంతయని చెప్పరానిది. ప్రియులు నావశమున నుండిరి. రాజులు, అశ్వములు గజములు ధనధాన్యములు అనన్తములుగానున్నవి. ఈ భూమండలమున ప్రజలందరూ నా ఆజ్ఞను పాలించుచున్నారు. ఈ సుఖమంతయు నాకు ఏ సుకృత విశేషముతో లభించుచున్నది? ఈ జన్మలో చేసినదా? పూర్వజన్మలో చేసియున్నదా? మీరు మీ జ్ఞాన బలముతో విచారించి చెప్పుడు. శరీరమున రోగములు లేకుండుట, ప్రియురాలు వశములో నుండుట, ఇంటిలో సంపదలు, శ్రీహరి యందు భక్తి, విద్వాంసులను పూజించుట, బ్రాహ్మణులకు దానము చేయగల శక్తి ఇవియన్నియు సుకృత విశేషముచేతనే లభించునని నేను భావించుచున్నాను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున రుక్మాంగద వామదేవ సంవాదమను పదియవ అధ్యాయము.