నారద మహా పురాణము - ఉత్తరార్థము
20 - ధర్మాంగద దిగ్విజయః
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు సురతము నందు మోహితుడగు రుక్మాంగద మహారాజునకు ఎనిమిది సంవత్సరాలు సుఖముగా గడిచినవి. తొమ్మిదవ సంవత్సరమున బలవంతుడగు ధర్మాంగదుడు అయిదుగురు విద్యాధరులను మలయ పర్వతమున గెలిచి సర్వకామ ప్రదములు, శుభకరములు అగున యిదు మణులను తెచ్చెను. ఆ అయిదింటిలో ఒక మణి కోటి గుణమగు బంగారమును ఇచ్చునది. రెండవది లక్షకోట్ల వస్త్రములను ఇచ్చునది. మూడవది మరల యౌవనమును ప్రసాదించు అమృతమును స్రవించునది. నాలుగవది అన్నసాధకము, సభా గృహప్రకర్త. అయిదవది మూడు లోకములను సంచరించు ఆకాశగమనమనుమును ప్రాదించునది. ధర్మాంగద మహారాజు ఆ మణులను విద్యాధరులను తీసుకొని కన్నీటితో విలపించుచున్న విద్యాధర స్త్రీలచే వెంబడించబడుచు వచ్చి, తండ్రియగు రుక్మాంగదునకు తల్లియగు మోహినికి ప్రణమిల్లి, అయిదు మణులను సమర్పించి, పాదాభివందనము నాచరించి ఇట్లు పలికెను. ఓ తండ్రి నేను యుద్ధమున మలయ పర్వతము నందు వైష్ణవాస్త్రముచే ఈ అయిదుగురు విద్యాధరులను గెలిచితిని. స్త్రీ జన పరివృతులగు ఈ విద్యాధరులు నీకు సేవకులైరి. ఈ అయిదు మణులను మోహినీ దేవికి భుజాలంకారములుగా సమర్పించుము. ఈ మణులు సర్వాభీష్ట ప్రదములు. పునర్యౌవనకారకములు. జీర్లదంతులు మరల బాలులగుదురు. ఈ మణులు వస్త్ర హర్మ్య సువర్ల స్వర్గ అమృత ప్రదములు. ఒక మాసము యుద్దము గావించి నీ పరాక్రమముచే నేను సంపాదించితిని. నీ యనుగ్రహము వలన నేను చాలా కష్టించి ఏడు ద్వీపములను సాధించితిని. అన్ని ద్వీపములు నీకు పన్ను చెల్లించునట్లు చేసితిని. నేను సముద్రమున ప్రవేశించి ఒక సంవత్సర కాలము యుద్ధముచేసి నాగ సమావృతయగు భోగవతీ పురిని గెలిచితిని. పదివేల మంది నాగకన్యలను హరించితిని. అచట నుండి చాలా హారములను రత్నములను కొని తెచ్చితిని. అట నుండి దానవ పురమునకు వెళ్ళితిని. అచట దానవులను జయించి రూపవతులు కొంతిమతులు అగు ఎనిమిది వేల మంది దానవ కన్యలను కొని తెచ్చితిని. రాత్రి పూట దీపములుగా పనిచేయు పదికోట్ల రత్నములను కొని వచ్చితిని. అట నుండి నేను రసాతలమున నున్న వారుణలోకమునకు వెళ్ళితిని. అచట వరుణదేవునితో నీవు జీవించదలచితిని నా తండ్రియగు రుక్మాంగద మహారాజు అధీనములో నుండుము. అని యంటిని. ఆ మాటతో వరుణుడు కోపించి యుద్ధమునకు వచ్చెను. రసాతలమున వరుణునితో సంవత్సరకాలము ఘోర యుద్ధము జరిగెను. చివరికి నేను నారాయణాస్త్రముచే జల నాయకుని జయించితిని. స్త్రీల ప్రార్థనచే చంపకుంటిని. అంతట వరుణదేవుడు వాయువేగము గల పదివేల గుర్థములను శ్యామ కర్ణములు గల, శుభ్రములు, చంద్రకాంతి గల వాటిని, గడ్డినీరు లేకనే చాలా సంవత్సరములు బ్రతుక గల వాటిని కానుకగా ఇచ్చెను. ఒక చక్కని కన్యను చక్కగా అలంకరించి నాకు భార్యగా నుండుటకు బహూకరించెను. ఆమెను కూడా తీసుకొని వచ్చితిని. బహు విత్త సమన్వితముగా కన్యను తీసుకొని వచ్చితిని. బహు విత్త సమన్వితముగా కన్యను తీసుకొని వచ్చితిని. ఓ తండ్రీ ! నాకు ఈ మూడు లోకములలో వెళ్ళజాలని స్థానము గెలవ శక్యము కాని ప్రదేశము నీ యను గ్రహము వలన ఒక్కటి కూడా లేదు. కావున నీ యనుగ్రహము వలన సంపాదించిన సంపదను ఒకసారి లేచి పరీక్షించుము. ఓ రాజా? నేను ఈ సంపదలు నీ వశములు. ఈ సంపదనంతా నేను సంపాదించితిని అని కాని, బ్రాహ్మణులకు దానము చేయరాదు. అని కాని అను పుత్రుడు నరకమునకు వెళ్ళును. పుత్రుడు తనను తాను గౌరవించుకొనరాదు. సంపదను పెంచుటలో పుత్రుడు కుఠారము, దాత్రము వంటి సాధనము వంటివాడే. తండ్రి పరాక్రమముచేతనే పుత్రులు ధనరాశులు పెరుగును. కొడవలిని తీసుకొని గడ్డిని కోయుదురు. గాలి నిండిన వస్త్రము జలమున పడవను దాటించును. నడిపించు వాని ఇష్టము ననుసరించి చెక్కబొమ్మ ఆడును. అట్లే తండ్రి పరాక్రమముచే పుత్రుల తేజో బల సమన్వితులగుదురు. కావున నాచే కొనితేబడిన ఈ సంపదలను ఒకసారి చూడుము. మీ ఇష్టానుసారముగా దానము చేయుడు. లేదా దాచుకొనుడు. అది యంతయూ మీ చిత్తము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ధర్మాంగద దిగ్విజయ మను ఇరువదియవ అధ్యాయము.
