నారద మహా పురాణము - ఉత్తరార్థము
4 - యమవాక్యమ్
యమధర్మరాజు పలికెను :- ఓపితామహా! స్వామీ! నామాటను వినుము. ప్రతాపమును తగ్గించుట మరణము కంటే అధికమైన బాధ. ఓ పద్మసంభవా. స్వామి ఆజ్ఞను నిస్పృహతో ఆచరించనివాడు తప్పక అంధకూపనరకమున పడిపోవును. సేవకుడు ప్రభువాజ్ఞను పాటించకనే యజమాని ధనమును అనుభవించినచో అతను కాష్ఠకీటముగా పుట్టును. ప్రజలనుండి కాని ప్రభువునుండి లోభముతో ధనమును తీసుకొని అనుభవించువాడు మూడు వందల కల్పములు నరకములో నుండును. తన పనిని పూర్తి చేసుకొనుటలో యజమాని కార్యమును నెరవేర్చని వాడు మూడు వందల కల్పములు యెలుకగా నుండును. సేవకుడై కూడా తన ఇంటిలో తన భృత్యులను చేయరాని పనికి నియోగించిననూ రాజు మార్జారమగును. కావున! ఓదేవా నేను నీ ఆజ్ఞచే పుణ్యము చేసిన వారిని పుణ్యముతో పాపములను చేసినవారిని పాపముతో ప్రజలను శాసించుచున్నాను. మునులతో, ధర్మశాస్త్రాదులతో చక్కగా విచారించి కల్పాదిలో నుండు నీకు ఎంతవరకు ఒకదినముండునో అంతవరకు నీఆజ్ఞను పాలించు నేను రుక్మాంగద మహారాజుచే ఈనాడు పరాభవించబడితిని. రుక్మాంగదుని భయమువలన సమస్త భూమండలము ఏకాదశినాడు భుజించటలేదు. ఇదియే వారి సర్వపాపములను నశింపచేయుచున్నది. అన్ని ధర్మములను వదిలి, పితృపూజను వదిలి, దేవపూజలను,తీర్థస్నానాది సర్రియలను విడిచి, యోగసాంఖ్యములను విడిచి జ్ఞానమును, జ్ఞేయమును విడిచి స్వాధ్యాయమును, హోమములను విడిచి బహు పాపపముల నాచరించి కూడా, ఏకాదశినాడు ఉపవసించి మానవులు తండ్రులతో తాతలతో ముత్తాతలతో వారి తండ్రులతో, తాతలతో, మాతామహులతో, వారీ జనకులతో విష్ణులోకమును చేరుచున్నారు. ఇదియే నాకు మర్మభేదకమగు మహాదుఃఖము. ప్రియురాలి తండ్రులు కూడా నావ్రాతను తుడిచి వైకుంఠమును చేరుచున్నారు. తండ్రి బీజముతో తల్లి కడుపులో ధరించును. కర్మచేయు వాడొక్కడే ఫలితమును అనుభవించును. ఇతరులు చేసినది బీజరూపముగా ధాత్రీసముద్భవము. కావున యేపిండము ఏ ఆకార ముండునో ఆరెండు పక్షములను తరింపచేయవచ్చును. భార్యాబిజముకాదు. భార్యగర్భధారిణి కాదు. అయిననూ ఆపక్షము వారెట్లు పరమపదమును చేరుచున్నారు? అల్లుని పుణ్యమహాత్మ్యముతో మామ విష్ణులోకమును చేరుచున్నాడు. అదియే నాతలనొప్పి. ఇటువంటి అధికారముతో నాకు ప్రయోజనములేదు. ఏకాదశిన ఉపవసించువాడు నన్నోదిలి కులత్రయము నుద్ధరించి తనతోపాటు హరిని చేరుచున్నాడు. యజ్ఞములతో, తీర్థములతో, దానములతో వ్రతములతో అట్టి విష్ణులోకప్రాప్తి లభించదు. జలమున అగ్నిలో మరణించు వారు కూడా విష్ణువ్రతమునాచరించువారు చేరు లోకమును చేరుటలేదు. ఇది నిజము. ఏకాదశీదినమున ఊర్థ్వపుండ్రమును ధరించి భోజనమునందు వాంఛను వదిలినచో పాపకర్ముడైనను విష్ణులోకమును చేరుచున్నాడు. కావున నేను నిరాశచెంది నీ పాదపద్మములను చేరితిని. నా విజ్ఞప్తితో అభయము నొసంగుము. పాపము చేసి కూడా నాభటుల బంధమును తప్పించుకొని, నా పాశములను తప్పించు కొను వారుండక నావశములో నుండవలయును. రవితాపముతో నాలోకపుదారి భగ్నమాయెను. అతి తీవ్రహస్తులగు విష్ణు భక్తులు కుంభీపాకమును విడిచి పరంధామమును చేరుచున్నారు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున యమవాక్యమను నాలుగవ అధ్యాయము ముగిసినది.
