నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

21 - శిక్షా నిరూపణమ్

మాంధాత పలికెను :-

పుత్రుని మాటలను విని రుక్మాంగద మహారాజు ఏమి చేసెను. రుక్మాంగదుని ప్రియురాలగు మోహిని కూడా ఏమి చేసినది? మీరు అమృతము వంటి రుచిగల ఆశ్చర్యమును కలిగించు, సర్వసందేహములను తొలగించు, పవిత్రమగు ఆఖ్యానమును చెప్పుచున్నారు.

వసిష్ఠ మహర్షి పలికెను:-

కుమారుని మాటలను వినిన రుక్మాంగద మహారాజు సంతోషించి ప్రియురాలితో పాటు లేచి ఆ సంపదలను చూచెను. విష్ణు భక్తుడగు మహారాజు ఒక క్షణకాలము సంతోషమున పరవశించెను. వరుణ పుత్రికతో పాటు నాగకన్యలందరిని ప్రేమతో పుత్రునికి భార్యలుగా ఇచ్చెను. మిగిలిన దానవ కన్యలను కూడా ఇచ్చెను. రత్నరాశులను సంపదలను మోహినికీ కానుకగా ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు సంపాదించిన సంపదను రుక్మాంగద మహారాజు విభాగము చేసి, సకాలమున పురోహితుని పిలిచి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా? నా పుత్రుడు ఈ కన్యల. పాణి గ్రహణము చేయవలయును. సర్వకామ ప్రదము శుభకరమగు వివాహ లగ్నమున బ్రాహ్మణులకు గోకాంచన వస్త్రాభరణములనిచ్చి, స్వస్తి వాచనము గావించి, నా పుత్రుడగు ధర్మాంగదునకు వివాహమును చేయుము. తండ్రి మంద బుద్దియై పుత్రుని వివాహమును చేయనిచో పదివేల యుగములు నరకమున నుండును. కావున ధర్మాత్ముడగు తండ్రి పుత్రునకు వివాహమును చేయవలయును. పుత్రుని స్థాపించినచో తనను స్థాపించుకొనువాడే యగును. పుత్రుని వివాహమును జరిపించినచో సర్వ యజ్ఞ ఫలము లభించును. ధర్మమును కోరు తండ్రి గుణవంతుడైనను, గుణ రహితుడైనను పుత్రుని వివాహమును చేయవలయును. పుత్రునకు భార్యలను ధనము నీయని తండ్రి పురుషుడుగా పరిగణించబడడు. ఇహ పరములలో నిందించబడును. కావున తండ్రి పుత్రునకు వివాహమును చేయవలయును. పుత్రులు ఆనందయుక్తులుగా నుండునట్లు చూడవలయును. ఇట్లు రుక్మాంగదుని మాటలను వినిన పురోహితుడు సంతోషముతో ధర్మాంగద వివాహమును జరుపుటకు ఉద్యుక్తుడాయెను. ధర్మాంగదుడు బిడియముచే స్త్రీ సౌఖ్యమును కోరకున్ననూ తండ్రి ఆజ్ఞచే వారిని వరుణ కన్యకతో పాటు మనోహరలగు నాగకన్యలను వివాహము చేసుకొనెను. యధావిధిగా వారిని వివాహమాడి సంతోషముతో గోరత్న ధనములను బ్రాహ్మణలకు దానము గావించెను. ఇట్లు వివాహమాడి తల్లిదండ్రులకు పాదాభివందనమును గావించెను. అపుడు తల్లియగు సంధ్యావలితో ధర్మాంగదుడు ఇట్లు పలికెను. ఓ తల్లీ ! తండ్రి ఆజ్ఞచే నాకు వివాహము జరిగెను. వివాహము చేసుకొన వలయునని నా మనసులో లేకుండెను. జ్ఞాని అవ్యయుడు అగు తండ్రిని సేవించవలయుననియే నా కోరిక. నాకు దివ్యభోగములపై కాని స్వర్గముపై కాని ఆశలేదు. నేను రాత్రింబవళ్ళు తండ్రికి మీకు సేవలు చేయుచుందును. ఇదియే నా కోరిక.

 సంధ్యావలి పలికెను :-

ఓ పుత్రా ! చాలా కాలము జీవించుము. నీకు నచ్చిన భోగములనను భవించుము, తండ్రి అనుగ్రహముచే దీర్గాయుష్మంతుడవై నా మనసునకానందమును కలిగించుము. గుణవంతుడవగు నీచే నేను సుపుత్రిణినైతిని. నేను అందరు సవతుల హృదయములలో నిలిచితిని. ఇట్లు పలికి ఆ లింగనము చేసుకొని, శిరసు మూర్కొని, పుత్రుని రాజ్య కార్యములను చూచుటకు పంపెను. ఇట్లు తల్లి ఆజ్ఞను పొంది ఇతర మాతృ దేవతలకు కూడా నమస్కరించి పిత్రాఙ్ఞా పాలకుడై సకల రాజ్య తంత్రములను చూచుచుండెను. దుష్ట నిగ్రహమును శిష్ట పరిపాలనమును చేయసాగెను. అన్ని దేశములలో తిరుగుచు, అన్ని పనులను చూచుకొనుచు, ప్రతినెలకొకసారి అన్ని కార్యములను సమీక్షించు చుండెను. హస్త్యశ్వములను పోషించుచుండెను. చార చక్రమును సమీక్షించు చుండెను. వాద సంవీక్షణమును, తులామాన పరీక్షణమును ప్రతిదినము చేయుచుండెను. ప్రతి ఇంటిలోను ప్రతి నరుని కాపాడుచుండెను. పాలు త్రాగు శిశువులు పాలులేనివాడై ఏడ్చుటలేదు. కోడలిచే అవమానించబడి ఏ ఒక్క అత్తకూడా రోదించుట లేదు. సమర్థుడగు పుత్రుడెవ్వరూ తండ్రిని యాచించుట లేదు. ధర్మాంగదుని రాజ్యమున ఏ ప్రాంతమున కూడా వర్ణసంకరము జరుగలేదు. ప్రజలెవరూ సంపదను దాచుకొనుట లేదు. ఎవ్వరూ ధర్మమును నిందించుట లేదు. ముత్తయిదువయగు స్త్రీ రవిక లేకుండగా యుండుట లేదు. నా రాజ్యమున స్త్రీలు ఇంటి నుండి వీధిలోనికి రారాదు. భర్తృహీనలు సకేశలుగా, భర్తృమతులు వికేశలుగా నుండరాదు. వ్రతము చేయువాడెవడు ఆక్రోశించ రాదు. నగరమున యుద్దములు  జరుగరాదు. సామాన్య వృత్తులు కలవారెవ్వరూ దానములు చేయక నా నగరమున నుండరాదు. గోపాలకుడు నగరమున నుండరాదు. ఉపదేశము చేయువాడు గుణహీనునిగా నుండరాదు. శాస్త్ర జ్ఞానములేని ఋత్విజులు నా నగరమున నుండరాదు. నీలిని సిద్దము చేయువాడు, నీలి రంగాతి సేచకుడు నా గరము నుండి బహిష్కృతులు కావలయును. అట్లే మద్యమును చేయువాడు కూడా నగరము నుండి వెడలగొట్ట బడవలయును. నిష్ప్రయోజనముగా మాంసమును భుజించు వానిని, పృష్ఠమాంస ప్రియుని, భార్యను విడిచిన వానిని నారాజ్యము నుండి వెడలగొట్ట వలయును. శ్రీ మహా విష్ణువును విడిచి ఇతర దేవతల నారాధించు వానిని, గర్భవతియగు యువతిని సంగమించువానిని, ప్రసవించిన యువతిని పొందు వానిని దండించవలయును. వధించవలయును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున శిక్షా నిరూపణము ఇరువది యొకటవ అధ్యాయము.