నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

14 - గోధావిముక్తి

వసిష్ఠ మహర్షి పలికెను :

ఓరాజా ! మోహినీ రుక్మాంగదులు గిరి దుర్గము నుండి బయలుదేరి బహు విధ భావములను మనోహరములను పర్వత సంభవములను చూచుచుండిరి. అచట కొన్ని పగడములవలెనున్నవి. కొన్ని వెండివలెనున్నవి. కొందరు నీల సమములు. కొన్ని కాంచన సన్నిభములు. కొన్ని స్ఫటిక వర్ణప్రభలు, మరికొన్ని హరితాలనీభలు అవి యన్నియు ఇతరస్థావరములతో వలె పరస్పరము సంశ్లేషమును పొందియున్నవి. భూమిమీద చేరి వజ్రమువలె వాడియగు డెక్కతో భూమిని త్రవ్వుచున్న ఉత్తమాశ్వమును చూచెను. వాడిడెక్కతో ఆ యశ్వము భూమిని త్రవ్వుచుండగా భూ అంతర్భాగమున ఒక బల్లి యుండెను. బయటికి వచ్చుచు గుఱ్ఱపుడెక్కతో చీల్చబడెను. చీల్చబడు చుండగా రాజు చూచుచుండెను. అయ్యో ! చనిపోయేను అనుచు పరుగెత్తెను. వెంటనే సుకుమారమగు ఒక పత్రముతో ఆబల్లిని ప్రక్కకు జరిపెను. గడ్డిమీద పడవేసెను. మూర్చిల్లిన బల్లిని చూచి మోహినితో పద్మాక్షీ! త్వరగా జలమును తెమ్ము! బల్లి పై చల్లెదను. అని పలికెను. భర్తమాటతో మోహిని త్వరగా నీరును తెచ్చెను. ఆ జలము బల్లిపై చల్లెను. చల్లని నీరు చల్లుటచే బల్లికి స్పృహ కలిగెను. గాయములన్నిటిపై చల్లని నీరు చల్లేను. తడిబట్టతో శరీరమును తుడిచెను. అట్లు స్పృహ వచ్చిన బల్లి ఎదురుగా రాజును చూచి వేదనతో ఆర్తురాలై మెలమెల్లగా ఇట్లు పలికెను. ఓ మహావీరా! రుక్మాంగద మహారాజా! నా కధను తెలియుము. నేను శాకల నగరమున ఒక బ్రాహ్మణోత్తముని భార్యగా ఉంటిని. రూపముతో యావనముతో ఉన్ననూ, నా భర్తకు ఇష్టురాలను కాకపోతిని ఎపుడు నాయందు ద్వేషముతో నిష్ణురముగా మాటలాడుచుండెను. ఇతరులనెవ్వరినీ ద్వేషించెడి వాడు కాడు. అపుడు నేను కోపము గల దాననై భర్తలచే విడువబడిన యువతులను వశీకరణ మంత్రముకాని, ఔషధము కాని లబించు ప్రదేశమును అడిగితిని. వారు నీకు భర్త వశము కాగలడు. మాకు భర్తలు విడిచిన అవమానము తొలగుటచే నమ్మకమేర్పడినది. సన్యసించిన భర్తలుకూడా ఔషధములచే వశులైరి. నీవు కూడా ఆమె వద్దకు వెళ్ళుము. అడుగుము. నీకు మంచి ఔషధము నీయగలదు. ఈ విషయమున సందేహించ వలదు.నీ భర్త నీకు దాసుడగును. అపుడు నేను వారి మాటలతో ఆమె ఇంటి మార్గమును తెలుసుకొని వెళ్లితిని. అచట ఆమె శతస్తంభ సమాయుక్తము, కాంతి మత్సుధతో కూడియున్న భవనమున ప్రవేశించితేజో వంతురాలగు బ్రహ్మచారిణిని చూచితిని. దీర్ఘవస్త్రమునుకప్పుకొని సంధ్యారాగ వర్ణముతో నుండెను. పరిచారికలు వీవనలతో వీచుచుండిరి. ఆమె పేరు భగమాలిని. చేతిలో జపమాలను ధరించి సర్వవశ్యకరము, సర్వక్షోభకరమును జపించుచుండెను. అపుడు నేను ఆమెకు నమస్కరించి పాదముల యందు ఒక ఉంగరమునుంచితిని. ఆమె నన్నడుగకనే నా భర్త నన్నవమానించేనని తెలుసుకొనెను. అపుడు ఆ తాపసి రక్షతో కూడిన ఈ చూర్ణము సర్వప్రాణులను వశము చేయును. నీవు నీభర్తకిమ్ము. భర్తకంఠమును మాత్రము కాపాడుము. భర్త నీవశమగును. ఇతర స్త్రీని కోరడు. అని పలికెను. అంతట నేను రక్షా చూర్ణమును తీసుకొని ఇంటికి వెళ్ళితిని. ప్రదోష కాలమున రక్షా చూర్ణమును పాలతో కలిపి భర్తకు ఇచ్చితిని. కంఠవిషయమున రక్ష చేసితిని. ఇంక ఇతరమునాలోచించలేదు. రక్షా చూర్ణము త్రాగిననాడే అతనికి క్షయరోగము సంక్రమించినది. రోజురోజుకు క్షీణించసాగెను. గుహ్యమున పుండుపుట్టి, దాని నుండి క్రిములు పుట్టినవి. కొన్ని దినములు గడిచిన తరువాత సూర్యుని ముందు దీపమువలె, కాంతి హీనుడాయెను. కలతతో నాతో ఇట్లనెను. పగలు రాత్రి ఆక్రోశించుచుండెను. ప్రియురాలా! నేను నీకు దాసుడనగుదును. నిన్నే శరణు వేడుచున్న నన్ను కాపాడుము. పరస్త్రీని కోరను అతని ఆక్రందనను విని భయముతో వణుకుచు యోగిని వద్దకు వెళ్ళి జరిగినదంతయు నివేదించితిని. నా భర్త సంతాపమును తొలగించమని ప్రార్థించితిని. అపుడామె దాహశాస్త్రి కోరకు మరొక ఔషథమునిచ్చెను. ఆ ఔషథమును భర్తకీయగా రోగము శాంతించెను. మొదటి చూర్ణము వలన కలిగిన దాహము శాంతించెను. అప్పటి నుండి నా భర్త నావశమాయెను. కొంతకాలమునకు నేను మరణించి నరకమును చేరితిని. పది హేను యుగములు రాగి మూకుడులో నువ్వుగింజంత ఖండములుగా నా శరీరమును చేసి కాల్చబడితిని, కొంచెము పాతకము మిగిలియుండగా భూమి మీద పుట్టితిని. యమ ధర్మరాజు నన్ను బల్లిగా పుట్టించేను. ఈ రూపముతో ఇచటనే పదివేల యేండ్ల నుండి యుంటిని. ఇట్లు భర్తను వశమున నుంచుకొనుటకు ప్రయత్నించు ప్రతి స్త్రీ ధర్మాచరణము వ్యర్థమై, దురాచారపరురాలై రాగి మూకుడులో కాల్చబడును. భర్తయే నాథుడు. భర్తయే గతి. భర్తయే దైవము, గురువు. అట్టి భర్తను వశమున నుంచు కొనవలయునని ప్రయత్నించు స్త్రీ ఎట్లు సుఖము నొందగలదు. కుష్టురోగము కలదై నూరు జన్మలు పశుపక్ష్యాదులుగా పుట్టును. కావున స్త్రీలు భర్తమాటను పాటించవలయును. కావున నేను మరల కూడా కుత్సిత జన్మనే పొందెదను. ఈ రోజు నిన్ను శరణు వేడిన నన్ను ఉద్ధరించుము. పాపమును నశింప చేయు గంగా సరయూసంగమమున విజయయనబడు శ్రవణ ద్వాదశీ వ్రతము నాచరించితివి. ఆ ద్వాదశి ప్రేతత్వముక్తి ప్రదాయిని, ఆభీష్ట ఫలదాయిని, శ్రీహరిని స్మరించు ఇంట్లో సర్వతీర్థ ఫలప్రాప్తి కలుగును. విజయాద్వాదశిన చేసిన దానము, జపము హోమము, దేవపూజ అన్నియూ అక్షయములగును. కావున విజయా ద్వాదశీ వ్రత ఫలమును నాకిమ్ము. ద్వాదశినాడుపవశించి, త్రయోదశిన పారణము చేసిన ద్వాదశవత్సరోపవాస ఫలమును పొందును. నీవీ భూమి మీద దయా మూర్తివి. కావున నాయందు దయ జూపి యమ మార్గమును ధ్వంసము చేయువాడవు గావున దుఃఖించు నన్ను కాపాడుము. ఇట్లు పలికిన బల్లి మాటలను విని మోహిని ఇట్లనెను.

ప్రతి ప్రాణి తాను చేసిన కర్మఫలమునే సుఖదుఃఖ రూపముగా అనుభవించును. కావున భర్తకు ద్రోహము చేసిన ఈమెతో మనకేమి పని? రక్షాచూర్ణమునిచ్చి భర్తను వశము చేసుకున్న పొతకి ఈమే. మంచి వారికి చేసినది కీర్తినిచ్చును. పాపులకు చేసిన ఇద్దరూ భ్రష్టులగుదురు. శర్కర కలిపిన పాలను పాముకు ఇచ్చిన విషమును పెంచినట్లు పాపులకు మేలు హానిని చేయును. కావున ఈ పాతకిని విడువుము. మనము నగరమునకు వెళ్ళెదము. బ్రతుకంతా ఇతరులకు మేలు చేసినవారికి సౌఖ్యము నశించును.

రుక్మాంగదమహారాజు పలికెను:- ఓ బ్రహ్మపుత్రికా? నీవెట్లు ఇటువంటిమాటను పలుకుచున్నావు. ఇది సాధువుల పనికాదు. తన సుఖమును మాత్రమే చూచుకొందురుపాపులు. పరులను బాధించేదరు. పరోపకారమును చేయుటకిష్టపడరు. చంద్రుడు, సూర్యుడు, మేఘము, భూమి, అగ్ని, జలము, చందనము, వృక్షములు, సత్పురుషులు పరోపకారమునకే సృజించబడుదురు. పూర్వకాలమున హరిశ్చన్లుడను మహారాజు అసత్యమునకు భయపడి భార్యను విక్రయించి, చండాలగృహమున నివసించి ఘోర దుఃఖమును పొందెను. అతని సత్యవ్రతమునకు సంతసించిన " ఇంద్రాదిదేవతలు అతనిని వరమును కోరమని అడిగిరి. అపుడు హరిశ్చంద్ర మహారాజు బ్రహ్మదిదేవతలను గూర్చి ఇట్లు పలికెను. దేవతలు నాయెడ సంతోషించినచో నానగరము వృక్షములతో, సర్పములతో బాల వృద్ద యువ నర నారీ యుతముగా పశుపక్ష్యాది యుతముగా పాపములనాచరించియున్ననూ స్వర్గమును చేరవలయును. అయోధ్యానగరములోనివారు చేసిన పాపమును నేను స్వీకరించి నరకమునకు వెళ్ళేదను. నా ప్రజలను వదిలినేనొంటిగా స్వర్గమునకు వెళ్ళజాలను అని. అతని స్థిర నిశ్చయమును గ్రహించి ఇంద్రాదులు అయోధ్యా పురవాసులందరు హరిశ్చంద్రమహారాజుతో స్వర్గమును చేర్చబడిరి. హరిశ్చంద్ర మహారాజు కూడా కామగతిగల విమానముతో దేవతలచే పూజించబడుచు స్వర్గమున విరాజిల్లేను. దధీచిమహర్షి అస్థిదానమును చేసెను. శిబిచక్రవర్తి కూడా కపోతమును కాపాడుటకు డేగకు తన శరీరమాంసమును ఖండించి ఇచ్చెను. పూర్వకాలమున జీమూతవాహనుడను రాజు పామును కాపాడుటకై తన జీవితమునే అర్పించెను. కావున రాజులు దయాపరులు కావలయును. మేఘము పవిత్రస్థలమున అపవిత్రప్రదేశమున కూడా వర్షించును. చండాలులను పతితులను కూడా చంద్రుడు ఆనందింప చేయును. కావున దౌహిత్రులు నహుషుని ఉద్దరించినటుల ఈ బల్లిని నాపుణ్యములచే ఉద్దరింతును. ఇట్లు మోహినితో పలికి రుక్మాంగద మహారాజు బల్లితో ఇట్లు పలికెను. ఓ గోధా! నేను విజయావ్రతాచరణము వలన కలిగిన పుణ్యమును నీకిచ్చితిని. కావున అన్ని పాపములనుండి విముక్తిని పొంది విష్ణులోకమును చేరుము. రుక్మాంగదమహారాజు ఆమాటను పలికిన వెంటనే ఆబల్లి తన దేహమును విడిచి దివ్యాభరణ భూషితురాలై, రుక్మాందుని అనుజ్ఞను పొంది, పదిదిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశమున పొపిటను కల్పించి విష్ణులోకమును చేరెను. యోగులకు మాత్రమే చేరదగినది అగ్నివలె తేజోమయము, ఉత్తమములలో కెల్ల పరమోత్తమము పరమాత్మ భూతము అగు విష్ణులోకమున రుక్మాంగదమహారాజు చేసిన పుణ్యము జగత్తును ప్రకాశించుచు ఉత్తమ దీపముగా బల్లిరూపమును విడిచి దివ్యదేహమున విలసిల్లెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున గోధావిముక్తి యను పదునాలుగవ అధ్యాయము.