నారద మహా పురాణము - ఉత్తరార్థము
53 - పురుషోత్తమమాహాత్మ్యమ్
మోహిని పలికెను :
ఓ మునిశ్రేషా ! పురాతన విషయమును నేనడిగిన దానిని తెలుపుము. పూర్వము ఇంద్రద్యుమ్నుడు ఆ ప్రతిమలను ఎట్లు నిర్మించేను. శ్రీహరి ఎటు సంతోషించెను. దానినంతటినీ వివరించుము. నాకు వినవలయునని చాలా కుతూహలమున్నది.
వసువు పలికెను :- సునేత్రా ! పురాణము వేద సమ్మీతము అగు ప్రతిమా సంభవేతిహాసమును చేప్పెదను వినుము. మహాయజ్ఞము జరుగు చుండగా ప్రాసాదము నిర్మించ బడుచుండగా ఇంద్ర ద్నుమ్నునకు రేయి బవలు ప్రతిమల కోరకు చింత కలుగును. ఏ ఉపాయముచే సర్వలోక విభావసుడు సర్గస్థిత్యంత కర్తయగు పురుషోత్తముని దర్శించగలను? ఇట్లు చింతా విష్టుడగు నరేంద్రుడు రాత్రి పగలు పరుండలేదు. స్నానము లేదు. భోగాను భవము లేదు. అలంకరణ లేదు. శైలజ, ధాతుజ, దారుజ ప్రతిమలు మాత్రమే సర్వలక్షణ లక్షితములు విష్ణువునకు యోగ్యములు. ఈ మూడు విధములగు ప్రతిమలనే దేవతలర్చింతురు. వీటిని స్థాపించిన చో ప్రభువు ప్రీతి చెందునని చింతా పరుడాయెను. పాంచరాత్ర విధానము చే పురుసోత్తముని పూజించి చింతాకులుడై స్తుతించ సాగేను.
ఇంద్రద్యుమ్నుడు పలికెను :
వాసుదేవా! నీకు నమస్కారము. మోక్షకారణా! నమస్కారము. సర్వలోకేశా నన్ను సంసార సాగరమునుండి కాపాడుము.నిర్మలాంశుక సంకాశా! పురుషోత్తమా! నమస్కారము సంకర్షణా! నీకు నమస్కారము. ధరణీధరా! నన్ను కాపాడుము. హోమగరునకు మకర ధ్వజునకు నమస్కారము. రతికాంత! నీకు నమస్కారము. శంబరాంతకా! నన్ను కాపాడుము. మేఘ సంకాశా! భక్తవత్సల ! అనిరుద్దా! నమస్కారము. నన్ను కాపాడుము. వరదుడవు కమ్ము. విబుధావాస! విబుధప్రియ! నారాయణా నమస్కారము. శరణాగతుడను కాపాడుము. బలిశ్రేషా ! లాంగలాయుధా! విబుధ శ్రేషా! కమలోద్భవా! నమస్కారము! చతుర్ముఖా! జగద్ధాత ! ప్రపితామహా! నన్ను కాపాడుము. నీల మేఘాభ! త్రిదశార్చిత ! విష్ణో! జగన్నాథా! సంసార సాగరమున మునిగియున్న నన్ను కాపాడుము. ప్రళయానల సంకాశ! దితిజాంతకా! నమస్కారము. నరసింహ! మహావీర్య! దీప్తలోచనా! నన్ను కాపాడుము. ఓ మహావరాహా! నీటిలో మునిగి యున్న భూమిని రసాతలమునుండి ఉద్ధరించి నటుల నన్ను దుఃఖ సాగరము నుండి ఉద్దరించుము. నీ అవయవ స్వరూపములు వరదలగు దేవతలను స్తుతించితిని. నీవు ఈ బల దేవాదులు పృథగ్రూపముతో నుంటిరి. నీ అవయవములు గరుడాదులు, దిక్పాలాదులు సాయుధులగు ఇంద్రాదులు, ఇతర దేవతలు వీరందరూ నీ భేధములు. ప్రసన్నాయత లోచనా! వీరందరిని స్తుతించితిని. నమస్కరించితిని. నాకు ధర్మకామార్థమోక్షప్రదమగు వరము నిమ్ము. శ్రీహరీ ! నీ భేదములుగా కీర్తించబడిన సంకర్షణాదులునీ పూజ కొరకు ఆరంభించి బడినవి మాత్రమే. నిన్ను ఆశ్రయించి యుండునవి మాత్రమే. పరమార్థమున నీకే భేదములు లేవు. నీ బహువిధ రూపములు ఉపచారము మాత్రమే. అద్వైతముగా ఉన్న నిన్ను ద్వైతముగా ఎట్లు చెప్పగలరు? శ్రీహరీ! నీవు ఒకడివే. సర్వవ్యాపకుడవు. చిత్స్వభావుడవు. నిరంజనుడవు. నీరూపము పరమము. భావాభావవివర్జితము. నిర్లేపము. నిర్మలము. సూక్ష్మము.కూటస్థము. అచలము ధ్రువము. సర్వోపాధి వినిర్ముక్తము. సత్తామాత్రముగా వ్యవస్థితము. ఈ విషయము దేవునికే తెలియును. నేనేట్లు తెలియుదును? ఇక నీ మరియొక రూపము పీతాంబరము, చతుర్భుజము, శంఖ చక్రగదాపాణి, మకుటాంగదధారి, శ్రీవత్సవక్షసము, వనమాలావిభూషితము. ఈ నీ రూపమును నిన్ను ఆశ్రయించిన వారు దేవతలు పూజింతురు. హే దేవా! సర్వసురశ్రేష్టా! భక్తాభయ వరప్రద! చారు పద్మాక్ష! విషయసాగరమున మునిగి ఉన్న నన్ను కాపాడుము. నిన్ను తప్పనేనెవరిని శరణు పొందగలను? కావున నాయెడ ప్రసన్నుడవు కమ్ము. జరచే వ్యాధిశతములచే కూడియుండి, సోనాదుఃఖములచే పీడితుడనై హర్ష శోకాన్వితుడనై కర్మపాశయంత్రితుడనై రౌద్రము మహాఘోరమగు సంసార సాగరమున పడియుంటిని. ఈ సాగరము విషయ జలములు గలిగి దాటరానిదీ. రాగద్వేష సమాకులము. ఇంద్రియములను సుడి గుండములచే గంభీరము. తృష్ణాశోకము అను తరంగములచే సంకులము. నిరాశ్రయము, నిరాలంబము, నిస్సారము. అత్యంత చంచలము. మాయచే మోహితుడనై ఈ సాగరమున భ్రమించు చున్నాను. నానాజాతీ. సహస్రములలో పుట్టు చుంటిని. నేను కొన్నివేల జన్మలను పొందితిని. ఈ సంసారమున బహువిధాను భూతులను పొందితిని. సొంగ వేదములను బహువిధ శాస్త్రములను చదివితిని. ఇతిహాస పురాణములను చదివితిని. అనేక శిల్ప శాస్త్రములను అధ్యయనము చేసితిని. సంతోషములను, దుఃఖములను చాలా చవి చూచితిని. చాలాక్షయములను, వృద్ధులను, ఉదయములను పొందితిని. భార్యామిత్ర బంధు వియోగములు సంగమములు సంభవించినవి. చాలా మంది తండ్రులను తల్లులను చూచితిని. బంధువులను సోదరులను, జ్ఞాతులను పొందితిని. మల మూత్ర భూయిష్టమగు స్త్రీల దేహమున నివసించితిని. గర్భవాసమున మహా దుఃఖముననుభవించితిని. బాల్యమున, యౌవన గర్వమున, వార్థక్యమును బహుదుఃఖములను అనుభవించితిని. మరణ దుఃఖములననుభ వించితిని. గుప్త వర్గ ముగల యు మాలయమున సూత నా కులమగు నరకమున నానాయాతనలననుభవించితిని. క్రిములుగా, కీటకములుగా, వృక్షములుగా, యేనుగులుగా, అశ్వములుగా, మృగములుగా, పక్షులుగా, మహిషములుగా, గోవులుగా, ఇతర వనచరములుగా, బ్రాహ్మణులుగా,శూద్రులుగా.ధనవంతులుగా,క్షత్రియులుగా, దరిద్రులుగా, తపస్వులు, రాజులుగా రాజ భృత్యులుగా, ఇతర దేహులుగా వారి వారి ఇండ్లలో పుట్టితిని. చాలామంది రాజులకు దాస్యమును చేసితిని. దరిద్రత్వమును, ఈశ్వరత్వమును, స్వామిత్వమును కూడా పొందితిని. నేను చాలా మందిని చంపితిని. చాలామందిచే చచ్చితిని. ఇతరులు నాకిచ్చిరి. ఇతరులకు నేనిచ్చితిని. తల్లి, తండ్రి, మిత్రులు, భార్య మొదలగు వారి కొరకు సంతోషించితిని. చాలామార్లు రోదించితిని. దేవతిర్యజ్మనుష్య స్థావర జంగమములన్నిటిలో నేను పుట్టని స్థానము లేదు. నేను ఎపుడు నరకములో నుందునో, ఎపుడు స్వర్గములో నుందునో, ఎపుడు మనుష్య లోకములో నుందునో, ఎపుడ తిర్యగ్టన్మనందుదునో, జలయంత్రములందు, చక్రమునందు, గోతులలో, బంధనములలో నుంటినో, క్రింద పడవేయబడితినో ఊర్థ్వ భాగమునకు వెళ్ళితినో, మధ్యలో నుంటినో, ఇట్లు కర్మలతా పాశమునాశ్రయించి యుంటిని. ఇట్లు మహాభయంకరము, శరీరమును గగుర్పొడుచు ఈ సంసార చక్రమున చాలాకాలమునుండి తిరుగు చున్నాను. ఎచటా అంతము కనపడుట లేదు. నేను వ్యాకుల మనస్సుతో ఏమి చేయుచున్నానో తెలియ లేకున్నాను. శోకముచే ఆశచే అభిభూతుడనై కాందిశీకుడను విచేతనుడనైతిని. ఇపుడు వ్యాకులుడనై నిను శరణు వేడితిని. కావున సంసార సాగరమగ్నుడను దుఃఖితుడనగు నన్ను కాపాడుము. నన్ను భక్తునిగా తలచితివేని నాయందు దయ తలచుము. నీవు తప్ప నా గురించి విచారించు వారు లేరు. నిన్ను ప్రభువుగా పొందిన నాకు భయము లేదు. జీవితమున మరణమున యోగక్షేమము లందు నాకు సంశయమే కలుగదు. నిన్ను యథావిధిగా పూజించని వారికి సంసార బంధనము నుండి సద్గతి ఎట్లు లభించును? వారి కులము శీలము విద్య జీవితములచే ఏమిప్రయోజనము? జగద్ధాతవగు నీయందు భక్తిలేని వారి జీవితము వ్యర్థము. అసురప్రకృతినవలంబించి నిన్ను నిందించు వారు మాటి మాటికి పుట్టుచు మౌరనరకముల పాలగుదురు. వారికి నరకసముద్రమునుండి నిష్కృతి లభించదు. చెడు నడవడి కలవారై నిన్ను దూషించువారు నరాధములు. కర్మానుసారముగా నా పుట్టుక కలుగు ప్రతిచోట నీయందు అక్షతమగు భక్తి అన్నివేళలా ఉండనిమ్ము. నిన్ను పూజించిన దైత్యులు మానవులు పరమ సిద్ధిని పొందిరి. కావున నిన్నెవరు పూజించ కుందురు? ప్రకృత్య తీతుడవగు నిన్ను బ్రహ్మాదులు కూడా స్తుతించజాలరు. అయిననూ నేను అజ్ఞానముచే నిన్ను స్తుతించు నా అపరాధమును నాయందలి దయ కలదేని క్షమించుము. సాధువులు తప్పు చేసిన వారిని కూడా క్షమింతురు. కావున నాయందు ప్రసన్నుడవు కమ్ము. నా భక్తిచే నాయందు స్నేహమును చూపుము. భక్తి భావముచే నేను స్తుతించు చుటీంని నా స్తోత్రము సమగ్రము కానిమ్ము. ఓ వాసుదేవా నీకు నమస్కారము.
ఇతి శ్రీ బృహన్నారాదీయ పురాణోత్తరభాగమున వసుమోహినీ సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యబది మూడవ అధ్యాయము.
