నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

44 - గయా మాహాత్మ్యమ్

వసిష్ఠ మహర్షి పలికెను : అంతట మోహిని పాపనాశిని యగు గంగా మహాత్మ్యమును విని మరల పురోహితునితో ఇట్లు పలికెను.

మోహిని పలికెను. పూజ్యుడా! నీవు దయచే నన్ను అనుగ్రహిచితి. పాప శోధనమగు పవిత్రమగు గంగా ఆఖ్యానమును చెప్పితివి. ఈ లోకమున గయాతీర్థము ఎట్లు ప్రసిద్ధి పొందినదో వినగోరుచున్నాను. నా యందు దయ యుంచి ఇపుడు చెప్పుము.

వసువు పలికెను : గయా తీర్థము పితృతీర్థము. సర్వతీర్ణోత్తమముగా తలచబడుచున్నది. ఇచట దేవ దేవేశుడగు పితామహుడే స్వయముగా ఉన్నాడు. యోగమును కోరు పితరులు ఈ గాథను గానమును చేసిరి. చాలా పుత్రులను పొందవలయును. వారిలో ఒకడైనను గయకు వెళ్ళును. అశ్వమేధయాగమును చేయును. నీల వృషభమును విడువవలయును. అట్లే గయా మహాత్మ్యమును వినవలయును. అన్ని సారముల కంటే సారతరము భుక్తి ముక్తి ప్రదమగు ఉత్తమమగు గయా మహాత్మ్యమును సంగ్రహముగా చెప్పెదను. వినుము. పూర్వము గయుడను పేరుగల అసురుడు అమిత బలపరాక్రమవంతుడుగా నుండెను. సర్వప్రాణులను తపింప చేయు ఘోరతపమును అతడాచరించెను. అతని తపస్సుచే పరితపించిన దేవతలందరు గయాసురుని సంహారమునకు శ్రీహరిని సమీపించిరి. శ్రీహరి వారికి అభయమునిచ్చెను. మీరందరూ శివ రూపులు కండని పలికెను. గయాసురుని దేహమున శివరూపముతోనుండుడనగా దేవతలు అట్లేఅనిరి. ఒకపుడు శివపూజ కొరకు క్షీరసాగరము నుండి కమలములను గొని తెచ్చి సమీప ప్రాంతమున శ్రీహరికి శయ్యనేర్పంచేను. విష్ణుమాయా విమూఢుడగు గయాసురుడు శ్రీహరి గదచే హతుడాయెను. అప్పటి నుండి గదాధరుడగు విష్ణువు గయలో మోక్షప్రదుడుగా చెప్పబడుచున్నాడు. అతని దేహమున శుద్దడగు పితామహుడు లింగరూపమున నుండెను. విష్ణు వాహార్ధ మర్యాదగా పుణ్యక్షేత్రముగా గయ ప్రసిద్ది చెందినది. ఈ క్షేత్రమున యజ్ఞమును, శ్రాద్దమును, పిండదానమును, స్నానాదికమును కాని చేసినచో స్వర్గమును కాని బ్రహ్మలోకమును కాని పొందును. నరకమును చూడడు. గయాతీర్థము ఉత్తమమని తలిచి పితామహుడు యోగమును చేసెను. బ్రాహ్మణులను, వచ్చిన ఋషులను పూజించెను. సరస్వతీ నదిని సృజించి దిగంతముల వరకు వ్యాపించి యుండెను. భక్ష్య భోజ్య ఫలాదులను, కామ ధేనువులను సృజించెను. గయాతీర్థము పంచ కోశ వ్యాప్తము. బ్రాహ్మణులకు ధనమునిచ్చెను. ధర్మయాగమున విత్తలోభముచే ధనాధికమును గ్రహించిన బ్రాహ్మణులను బ్రహ్మ శపించెను. మీవిద్య పురుష వ్యాప్తము కాదు. మీ ధనము త్రిపురుష కాలము నిలువదు. మీ విషయమున ఈ నది వీరసమై పాషాణ పర్వత మయముగా నుండును. అపుడు ఆవిప్రులు ప్రార్థించగా అచట తీర్థములను సృజించెను. గయాశ్రాద్ధమున లోకులందరు పావనులై బ్రహ్మలోకమును చేరెదరు. మిమ్ములను పూజించినచో నేను పూజించ బడుదును. బ్రహ్మజ్ఞానము, గయాశ్రాద్ధము, గోశాల యందు మరణము, కురుక్షేత్ర నివాసము అని ముక్తి నాలుగు విధములు. సముద్రములు, అన్నీ నదులు వాపీ కూపప్రదములన్నియూ స్నానము చేయుటకు గయాతీర్థమునకు వెళ్ళును. బ్రహ్మహత్య, సురాపానము, స్తేయము, గుర్వంగనాగమనములను మహాపాతకములన్నియూ గయాశ్రాద్ధముచే నశించును. చనిపోయి సంస్కరించ బడని వారు, పశువులచే హతులైన వారు, సర్పదష్టులు కూడా గయాశ్రాద్ధమున ముక్తులై స్వర్గమును పొందెదరు. గయా తీర్థమున పిండదానముచే పొందు ఫలితమును నేను శతకోటి కల్పములలో కూడా చెప్ప జాలను. ఓ మోహినీ! ఇచట ఒక పురాతన మగు ఇతిహాసము ప్రసిద్దిగాంచినది. ఇపుడా ఇతిహాసమును చెప్పెదను. ఏకాగ్రమనుస్కురాలపై వినుము.

త్రేతాయుగమున విశాలుడను రాజుండెను. అతను విశాలాపురిని నిర్మించి ధన్యుడు ధైర్యవంతుడుగా రాజ్యపాలనమును గావించెను. కాని పుత్రులు లేనందున బ్రాహ్మణులను పుత్ర సంతానమునకు చేయవలసిన దానిని అడిగెను. అంతట ధైర్యముగల బ్రాహ్మణులు ఇట్లు పలికిరి. ఓరాజా! గయకు వెళ్ళి యధావిధిగా పిండదానముచే పితరులను తృప్తి పరుచుము. అపుడు నీకు నిశ్చయముగా వీరుడు సహస్రదాత సకలక్షితీశుడగు పుత్రుడు కలుగును. బ్రాహ్మణులిటు పలుకగా విశాలరాజు బ్రాహ్మణులతో గయకు వెళ్ళెను. గయలో పితరులకు యధావిధిగా పిండ ప్రధానము చేయునంతలో ఆకాశము సిత రక్త - కృష్ణమూర్తులగు పురుషులను చూచెను. వారిని చూచి రాజు ఇదేమి? మీరెవరు? చెప్పుడు. మోహమును పొందు నాకు కుతూహలము కలుగుచున్నది.

సితుడు పలికెను : ఓ రాజా! నా పేరు సితుడు. నీ తండ్రిని. నేను పేరుచే వర్ణముచే పనిచే సితుడనే. ఇతను రక్తవర్ణుడు నా తండ్రి హీనకర్మల నాచరించినవాడు. బ్రహ్మహత్యలు చేసినవాడు. పాపకారి. ఇక మూడవవాడు నా తాత. నీకు ముత్తాత. పేరుతో వర్ణముచే కర్మలచే కృష్ణుడు. ఈ కృష్ణుడు పూర్వ జన్మలో అనేక ఋషులను చం పెను. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఆవీచియను నరకమును పొందిరి. ఇతని తండ్రి కృష్ణవర్ణుడు దీర్ఘ కాలమునుండి నరకమున నివసించుచున్నాడు. నేను మాత్రము నాసత్కర్మలచే సుదుర్లభమగు ఇంద్రాసనమును పొంది యుంటిని. మంత్ర విదుడవైన నీవు గయా తీర్థమున పిండదానమును చేయుటచే ఉత్తమ తీర్థ మహిమ వలన వీరిద్దరూ అ వీచియను నరకమునుండి విముక్తిని పొందిరి. పితరులను పితామహులను ప్రపితామహులను ప్రీతినొందింప చేయు చున్నానని నీవిడిచిన జలముచే నీ వాక్యముచే మేము మువ్వురము ఒక సారి కలిసితిమి. ఈ తీర్థ ప్రభావముచే పితృలోకమునకు వెళ్ళెదము. నీవు చేసిన పిండ ప్రదానముచే ఈ నీ పితామహులు నరకములో నున్ననూ శుద్దులై వెళ్ళుచున్నారు. ఇట్టి వీరిని తీసుకొని నిన్ను చూచుటకు వచ్చితిని. ఇపుడు వెళ్ళుచున్నాను. ఈ తీర్థ ప్రభావమువలన బ్రహ్మఘ్నుడగు తండ్రిని కూడా గయాపిండదానముచే పుత్రుడుద్ధరించగలుగును. ఇట్లు విశాలుని తండ్రి మాటలాడి పితామహులతో కలిసి విశాలుని ఆశీర్వదించి స్వలోకమునకు వెళ్ళెను. ఒకసారి గయకు వెళ్ళుట, ఒకసారి గయలో పిండ ప్రదానము చేయుట చాలా దుర్లభము. ఇక నిత్యము గయాగమనము, గయా పిండ ప్రధానము గురించి ఏమి చెప్పవలయును. పతీతులు మరణించగా ఒక సంవత్సరము తరువాత లేదా ఆయా దేశకాల ప్రమాణములననుసరించి గయాకూపమున స్వబంధువులచే తర్పణాదులు చేయబడును. ప్రేతరాజు వణిజుని గూర్చి స్వముక్తి కొరకు ఇట్లు పలికెను. నీవు గయాతీర్థమును చూచి స్నానమాడి శుచిపై నా పేరుతో పిండప్రదానమును చేయుము. గయలో పిండ ప్రదానము చేయుట వలన నేను సులభముగా ప్రేత భావమును విడిచి దాతలు పొందులోకమును పొందగలను. ఇట్లు ప్రేతరాజు వణిజునితో పలికి అనుచరులతో తన పేర్లను రహస్యముగా స్పష్టముగా తెలిపేను. వణిజుడామాటలను విని గయాతీర్థమునకు వెళ్ళేను. " అచట యధాక్రమముగా ప్రేతలకు పాంసు నిర్వాపణమును చేసెను. పితృపురస్సరముగా వసుదానమును చేసెను. మహా బుద్దియగు ఇతను యధావిధిగా తిలలు లేకనే తనకు ఇతరులకు కూడా పిండ నిర్వాపణమును చేసెను. ఇట్లు పిండ ప్రదానమును చేయగా వణిజులు (ప్రేత భావము నుండి విముక్తులై బ్రాహ్మణత్వమును పొంది బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. పాయసము, ఖడ్గ మృగమాంసము కృష్ణమృగము లోహము పితరులకు సమర్పించిన ఆనన్త్యమునిచ్చును. గయలో చేసిన శ్రాద్ద ము, జపము, హోమము, తవ స్సు, పుత్రులచే చేయబడినవి పితరులకు ఆనన్యమును ప్రసాదించును. నరకభయపీడితులకు పితరులు పుత్రులు గయకు వెళ్ళి మమ్ములను తరింపజేతురని కోరుచుందురు. గయలో ధర్మపృష్ఠమున సదస్సులు బ్రాహ్మణులు పితరులను తరింపజేతురు. గయాశీర్షమున అక్షయవటమున పితరులకిచ్చినది అక్షయమగును. బ్రహ్మారణ్యము, ధర్మపృష్ఠము, ధేనుకారణ్యము ఈ క్షేత్రములను దర్శించి పితరులనర్చించి ఇరువది తరములనుద్ధరించును. మహాకల్పకాలమున చేసిన పాపము కూడా గయను చేరి నశించును. గోక్షేత్రమున, గృహవటమున చేసిన శ్రాద్దము మహాఫలమును ప్రసాదించును. ఇచటనే మతంగ పదమున్నది. ఇది ధర్మసర్వస్వముగా ప్రసిద్ధిచెందినది. ఇచటనున్న పవిత్రమును పంకజవనమును పుణ్యాత్ములు సేవింతురు. ఇచట పాండువు ప్రవేశించుటయే సర్వనిదర్శనము. తృతీయపాదమున నిక్షీరమండలమున మహాప్రదమున కౌశికీలో చేసిన శ్రాద్ధము మహాఫలప్రదము. మహాదేవుడు ముండపృష్ఠమున పాదమునుంచెను. ఆయాతీర్థములలో బహువర్షకాలము దుర్లభమగు తపస్సు నాచరించెను. ఇచట కొద్ది కాలము తపము చేసిననూ పాము కుబుసమును విడిచినట్లు పాపమును విడుచును. ఇచటనే కనకందయను ప్రసిద్ధ క్షేత్రము కలదు ఇట స్నానము ముండపృష్ఠమునకు ఉత్తరముదే వర్షిగణ సేవితలు చేసిన శరీరముగా స్వర్గములో చేరెదరు. ఇచట చేసిన శ్రాద్దము అక్షయఫలప్రదము. నిక్షీరమండలమున మూడు దినములు స్నానమాడి, మానస సరోవరమున స్నానమాడి ఇచట శ్రాద్ధమునాచరించవలయును.

ఉత్తర మానసమునకు వెళ్ళి సాటిలేని సిద్ధిని పొందును. ఈ ఉత్తర మానసమున యధాశక్తిగా యధాబలముగా శ్రాద్దమునాచరించినవాడు దివ్యకామనలను మోక్షోపాయములను పొందగలుగును. తరువాత బ్రహ్మవశ్యోపశోభితమగు బ్రహ్మసరస్సునకు వెళ్ళవలయును. రాత్రి గడిచిన వెంటనే బ్రహ్మలోకమును పొందును. ఈ సరస్సున బ్రహ్మ యూపమును కల్పించెను. ఈ యూపమునకు ప్రదక్షిణము గావించినచో వాజపేయ యాగఫలమును పొందును. తరువాత లోకవిశ్రుతమగు ధేనుకమునకు వెళ్ళవలయును. ఇచట ఒక రాత్రి యుండి తిలధేను దానము గావించవలయును. సర్వపాప వినిర్ముక్తుడై చంద్రలోకమును పొందును. ఇచట ఒక అద్భుతమగు నిదర్శనము ఇప్పటికీ కానవచ్చుచున్నది. ఈ పర్వతమున కపిల గోవు దూడతో తిరుగుచుండును. ఈ పర్వతము దూడతో తిరుగుచున్న కపిలా గోపదములు కనపడుచుండును. దూడతో నున్న కపిలాగోపదములను పూజించిన మానవులు తాము చేసిన ఆశుభకర్మలను నశింపచేసుకుందురు. తరువాత దేవస్థానమగు గృధ్రవటమునకు వెళ్ళవలయును. ఇచట వృషధ్వజుని దర్శించి భస్మస్నానమునాచరించవలయును. ఇచట బ్రాహ్మణులు ద్వాదశవర్షవ్రతమునాచరించవలయును. ఇతర వర్ణముల వారికి దర్శన మాత్రముననే సర్వపాపములు నశించును. తరువాత గీతనాదితమగు ఉద్యతపర్వతమునకు వెళ్ళవలయును. ఇచట ఒక మారు సంధ్యోపాసన చేసిన ద్వాదశవర్ష సంధ్యోపాసన చేసినట్లగును. ఇచటనే యోని ద్వారము కలదు. ఇచట చేరి మానవుడు జన్మసంకటము నుండి విముక్తుడగును. గయాతీర్థమున శుక్లకృష్ణపక్షములు నివసించినవాడు ఏడు తరములను తరింపచేయును. తరువాత మహాఫలప్రదమగు ధర్మపృష్టమునకు వెళ్ళవలయును. ఇచట సాక్షాత్తు పితృలోకపాలకుడగు ధర్మరాజుండును. ఇచట యమధర్మరాజును దర్శించినవాడు అశ్వమేధఫలమును పొందును. తరువాత ఉత్తమమగు బ్రహ్మతీర్థమునకు వెళ్ళవలయును. ఇచట బ్రహ్మను దర్శించి రాజసూయ ఫలమును పొందును. ఇచటనే బహుమూలఫలాన్వితమగు ఫలు తీర్థము ప్రసిద్ధము. ఇచటనే కౌశికానది యున్నది. ఇచట చేసిన శ్రాద్దము అక్షయఫలప్రదము. తరువాత ధర్మజునిచే రక్షించబడు మహీధరమునకు వెళ్ళవలయును. పుణ్యకారి రాజర్షియను గయుడు ఉపయోగించిన క్షేత్రమిది. ఇచటనే గయశిరమను సరస్సుకలదు. ఇదియే పవిత్రమగు మహానది. బ్రహ్మసరోవరమను తీర్థము మహాపుణ్యము. సకలర్షిసేవితము. ఇచటనే అగస్త్యమహర్షి యముని వద్దకు వెళ్ళేను. ఇచట సనాతనుడగు ధర్మరాజు నివసించును. ఇచట అన్ని నదులుద్దరించును. ఇచట ఎల్లవేళలా పినాకపాణియగు మహాదేవుడు వసించుచుండును. ఇచటనే లోకప్రసిద్ధ మగు అక్షయవటము కలదు. ఇచట గయాసురుడు యజ్ఞమును గావించేను. గయయజ్ఞములలోనిది సురక్షితముగా నుండెను. ముండప్పష్టము, గయారేవతమనుదేవపర్వతము, క్రౌంచపొదము వీటిని దర్శించిన వారు పాపవిముక్తులగుదురు. శివనదిలో శివకరుని, గయయందు గదాధరుని, అంతట పరమాత్మను దర్శించి పాప సంఘమునుండి విముక్తుడగును. వారణాశిలో విశాలాక్షి, ప్రయాగయందు లలిత, గయయందు మంగలా, కృతశాచమున సింహికా ప్రసిద్ధులు. గయలో నివసించి చేయు దానమంతయూ ఆనన్య ఫలప్రదమగును. ఇతని సుకృతముచే పితరులు సంతోషింతురు. గయకు వెళ్ళి అన్నదానము చేయువారితో పితరులు నిజముగా పుత్రవంతులగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మహాత్మ్యమను. నలుబది నాలుగవ అధ్యాయము.