నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

35 - శాపప్రాప్తిః  

సర్వయత్నేన సుభగే దోషః కోత్ర తవాధునా

ఏతస్మాద్వరదా స్సర్వే సంప్రాప్తా విబుధా శ్శుభే ।

సిద్ధౌ వాప్యధవాసిద్ధౌ కర్మకృత స్యా ద్వధ్యానహి

భర్తవ్యో భృత్యవర్గశ్చ భూభుజా ధర్మ మిచ్ఛతా ।

యమధర్మరాజు పలికెను : దేవేశా! జగన్నాధా! చరాచర విభో గొడ్రాలు సంతానమును పొంద జాలనట్లుగా మోహినీ దేవి నిష్పలు రాలాయెను. ఓ కుశలాంఛనా రుక్మాందు డేర్పరిచిన దారిలో లోకములన్నియూ వైకుంఠమునకు వెళ్ళుచున్నవి. నా వద్దకు ఒక్కడు కూడా వచ్చుట లేదు. రుక్మాంగద మహారాజు శ్రీహరి దేహమును చేరిననూ 'సర్వ భూతముల బుద్ధి మాత్రము మారుటలేదు. రాజకుమారుని వలన మానవులందరు విష్ణువాసరమున ఉపవసించి పాపములను నశింప చేసుకొని పరమ పదమునకు వెళ్ళు ' చున్నారు. నీ పుత్రికయగు మోహిని సిగ్గుపడి మూర్చనందినది. నీ సమీపమునకు రాలేక పోవుచున్నది. లోకముచే నిందించబడి భుజించుటలేదు. నేను క్రియా శూన్యుడనైతిని. ఏమి చేయవలయునో ఆజ్ఞాపించుము. ఇట్లు యమధర్మరాజు మాటలను వినిన బ్రహ్మ ఇట్లు పలికెను. మన మందరము మోహినిని లేపుటకు వెళ్ళెదము. మోహినికి స్పృహ వచ్చిన తరువాత నీ పని చేయుదము. సందేహించ వలదు. ఈ తత్తరపాటును విడువుము. అంతట ఇంద్రుడు మొదలగు దేవగణములన్నియూ బ్రహ్మతో కలిసి సూర్య సన్నిభములగు విమానములచే మోహినిని లేపుటకు భూమండలమునకు వచ్చిరి. వారందరూ విమానములతో శుభానన, తేజోహీన, నిరానన్ద, శుష్కతోయయగునది వలె, చంద్రుడులేని రాత్రి వలె, బుత్విజులు లేని యజ్ఞమువలె, ఓడిన మనిషి వలె, పాడిన పూవు వలె, ఉత్సవము ముగిసిన వేదిక వలె, తెల్లని పగడమువలె, ధాన్యములేని పైరు వలె, పీతమండ యగు సురవలె, జలము లేని సరస్సు వలె, వెన్న తీసిన కవ్వము వలె, సంస్కార హీనమగు వాక్కువలె, పీడించబడిన సైన్యము వలె, భర్త మరణించిన యువతి వలె, ధాన్యహీనమగు ప్రజవలె, మగ్ర హీనమగు విధి వలె, ఆలోచన లేని యుద్ధమువలె, దయలేని ధర్మము వలె, రాజులేని రాజ్యమువలె, మన్త హీనమగు క్రియ వలె, ధనధాన్య విహీనమగు గృహము వలె, బలహీనమగు కుంభమువలె, బురదలో చిక్కుకొనిన వృషభము వలె, భార్యా హీనుడగు గృహస్థుని వలె, రాజ్యభ్రష్టుడగు రాజువలె, భగ్నక్రియయగు చికిత్సవలె, భగ్నశాఖమగు వృక్షము వలె, తేజోహీన మగు గృహము వలె, నిర్జలమగు ధనము వలే, పొగలేని నిప్పు వలె, కిరణములు లేని సూర్యుని వలె, మతి భ్రష్టుడగు మనిషి వలె, పర్వసంగియగు మానవుని వలె ప్రియురాలిచే తృప్తిని పొందని ప్రియుని వలె, విషమును విడిచిన పాము వలె, రెక్కలు తెగిన పక్షివలె, వృత్తిహీనుడగు బ్రాహ్మణుని వలె, తలనుండి జారిన మాలవలె, ధాతువర్జిత మగు పర్వతము వలె, లిపి చెరిగిన శాస్త్రమువలె, విస్వరమగు ఋగ్యజుస్సుల వలె, స్వరహీన మగు సామము వలె, పద్మహీన మగు సరస్సు వలె, తృణములచే నిండిన దారి వలె, రేకులు లేని పద్మము వలె, మమతతో నిండిన జ్ఞానము వలె, ప్రకృతిలేని పురుషుని వలె, తత్త్యహీనమగు సాంఖ్యము వలె, దంభాన్వితమగు ధర్మము వలె, నున్న తేజోహీనురాలగు మోహినిని దేవతలందరూ, చూచిరి. ఆనంద శూన్యముగా ధ్యానించుచు జనులచే చూడబడుచు పుత్రహత్యగావించిన క్రూరురాలని క్రూరవచనములచే దూషించ బడుచున్న, దుష్టశీల, ధర్మమును విడిచినది, వారి వాక్యముల చే మోహిత, స్వవాక్యపాలన చేయునది, చండియగు మోహినిని గూర్చి వచ్చిన దేవతలిట్లు పలికిరి. ఓ సుందరీ! దుఃఖించకుము. నీవు నీ ప్రయత్నమును చేసితివి. మాధవ భక్తులకు అవమానము కలుగదు. హరిణాక్షివగు నీవు దేవకార్యము కొరకొచ్చితివి. ఆ కార్యము సిద్ధించలేదు. ఇపుడతను వెళ్ళి పోయెను. పూర్వమే రుక్మాంగద మహారాజు విఘ్ననాశకము, మహాపుణ్య ప్రదమగు ఏకాదశి వ్రతము నాచరించి యుండెను. ఒక సంవత్సరము కృచ్చవ్రతము నాచరించెను. ఆ వ్రత ప్రభావము వలననే రుక్మాంగదుడు సత్యమును తప్పలేదు. లోకమున నారి విఘ్నరాజిగా చెప్పబడును. కాని సంధ్యావలీ దేవి మనోవాక్కాయములచే పుత్రసంహారమును సంకల్పించి, స్నేహమును విడిచి, స్వయముగా ఖడ్గము నందించెను. అంతటి దృఢ దీక్షను చూచిన భగవంతుడగు మధు సూదనుడు సంతోషించెను. ప్రియుడగు పుత్రుని చంపును కాని ఏకాదశి నాడు భుజించడు. పుత్రుని, భార్య యొక్క, రాజు యొక్క అభిప్రాయమును చూచి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తన లోకమునకు గొని పోయెను. క్షీణకర్ములై అంగార సహితముగా నుండు ఆహితాగ్ని వలె దేహముతో పాటు వెల్పిరి. పని ప్రారంభించిన తరువాత ఫలము సిద్ధించనిచో చేసిన ప్రయత్నములన్నియూ విఫలములైనచో నీ దోషమేమి కలదు. కావుననే వరములనిచ్చు. దేవతలందరూ నీవద్దకు వచ్చి యున్నారు. సిద్దించిననూ సిద్దించక పోయిననూ పనిచేసిన వాడు వ్యర్ధుడు కారాదు. ధర్మమును గోరు రాజు భృత్య వర్గమును పోషించ వలయును. కర్మ సిద్ధించక పోయినను సద్భావమున్నచో వేతనమును మాత్రమీయ వలయును. బహుమానములు లభించవు. భృత్యుడు బతుకుటకు వేతనము నీయని వాడు గోహత్యా పాతకమును పొందును. కావున సద్భావముచే పని చేసిన వారికి ఫలమునీయ వలయును. దేవతలు నీకన్ని విధములా సహకరించి ఏ పని చేయలేదు. విఘ్ననాశిని యగు ద్వాదశీ తేజస్సుచే భగ్నులైరి. ఇట్లు దేవతలు పలుకగా పతిహీనురాలై అతి దుఃఖముతో, ఆనంద శూన్యయగు మోహిని ఇట్లు పలికెను. 

కార్యమును సాధించలేని నా ఈ జీవితము వ్యర్థము, యమ మార్గమున జనసమూహములను నిలుపలేక పోతిని. హరిదినమును లోపింప చేయలేక పోతిని. హరి వాసరమున భుజింప చేయలేక పోతిని. ఆరుక్మాంగద మహారాజు సంతోషముతో పుత్ర వధ గావించెను. నా శిరమున పాదమునుంచి రుక్మాంగద మహారాజు శ్రీహరిని చేరెను. అప్రమేయ గుణుడు, నిర్మలుడు, నిర్మలాశ్రయుడు, హంస భూతుడు శుచిపదుడు, ప్రణవరూపుడు, బీజ భూతుడు, అవ్యయుడు, నిరాకారుడు, నిరాభాసుడు, నిష్క్రపంచుడు, నిరంజనుడు, శూన్య రూపుడు, ఆకాశ స్వరూపుడు, ధ్యేయము, ధ్యాన వర్జితుడు, ఉన్నాడు లేడు అనబడువాడు, దూరమున దగ్గరలో ఉన్నవాడు, లేనివాడు, పరంధాముడు, మనసుచే గ్రహించబడని వాడు, పురుషాభిధుడు, జగన్మయుడు, హృత్సంకజ సమాసీనుడు, తేజోరూపుడు, సనాతనుడు అగు శ్రీహరియందు నా భర్త లీన మయినపుడు నా జీవితమున ఫలమేమున్నది. కార్యమును సాధించకనే యజమానిని విడిచి వేతనమును తీసుకొను భృత్యుడు నరకమును చేరును. స్వామికార్యమును సాధించకనే వేతనమును అనుభవించు భృత్యులు భూలోకమున అశ్వములుగా పుట్టెదరు. ఇపుడు నేను కూడా కార్యమును సాధించజాలక పోతిని. భర్తను పుత్రుని నశింప చేసితిని. అట్టినేను దేవతల నుండి వరమునేట్లు గ్రహించగలను. 

దేవతలు పలికిరి:- ఓ మోహినీ! నీ హృదయమున నున్న దేమిటో చెప్పుము ఇచ్చెదను. నీకు ఉపకారమును చేసి ఋణ విముక్తులమగుదుము. రాజప్రయోజన విషయమున నీవు పరిశ్రమించితివి. కావున నీ పరిశ్రమకు తగిన ఫలమును పొదుటకు యోగ్యురాలవు. ఇట్లు దేవతలు పలుకుచుండగా అగ్ని సమతేజో వంతుడగు రాజపురోహితుడు వచ్చెను. ఈ పురోహితుడు పన్నెండు సంవత్సరములు జలమధ్యమున ప్రాణయామ పరుడై యుండి జలమధ్యమునుండి బయలువెడలి మోహినీ చేష్టితమును విని క్రోధముతో దేవబృన్దమును సమీపించెను. మోహినీ దేవికి వరమునీయ సంకల్పించిన దేవతలతో ఇట్లు పలికెను ఈమోహిని వ్యర్ధురాలు ఈ దేవసంఘము వ్యర్ధము ఈమె చేసిన పాపపు కర్మ నిత్యము మీ భావనాశము కొరకే పురుషార్ధ ప్రరోహణము చేయ సంకల్పించిరి మీరు మోహినికి వరమునీయ సంకల్పించితిరి. హత్య చేసినది. భర్తను పుత్రుని చంపినది. వృత్తిని విడిచినది రాక్షసిరూపమును ధరించినది. ఈ మోహిని బాగుగా జ్వలించు అగ్నిలో పడినను శుద్ధురాలు కాజాలదు. హత్య చేసినది వ్యర్ధముగా భర్తవధను గావించినది. ఈమె మండు అగ్నిలో పడిననూ శుద్ధినొందజాలదు. రుక్మాంగద మహారాజును, ధర్మాంగదుని అమృతోపములగువచనములచే మోహింప చేసి, ప్రియురాలితో పాటు మోక్షమునకు పంపి రాజు లేని రాజ్యమును చేసెను. ఈ అల్పబుద్ధికి నరకమునకూడా నివాసము లభించదు. ఇక స్వర్గమున నెట్లుండును? రాజుసమీపమున నుండ జాలదు. అవ్యయమగు విష్ణుపదమునకు అర్హురాలుకాదు. లోకవాదదూషితయగు స్త్రీకి ఏలోకమున కూడా వసతి ఉండదు. ఎప్పుడూ పాపరతురాలు నింద్యకర్మచేయు స్త్రీ జీవితము వ్యర్ధము. భర్తను చంపి, పుత్రుని చంపి, తల్లివంటి సవతిని చంపి భూమిని శూన్యము చేసిన ఈమె ఏలోకమునకు వెళ్లును. ఈ మోహిని పాపరతురాలు. శ్రీహరిధర్మమును ధ్వంసము చేసినది. ఈమె ఎపుడూ హరివాసరమున భుజించమని పలికినది. ప్రాణములను కాపాడుకొనుటకు కూడా హరివాసరమున భుజించుము అని, గోవును బ్రాహ్మణుని వధించమని పలికినవారికి అధోగతియే ప్రాప్తించును. పానము చేయరానిదానిని త్రాగమనిననూ స్వర్గమున వాసము లభించదు ఇది తెలియక పలికినవారిగతి. ఇక తెలిసి పలికిన వారేమగుదురో నిర్ణయించిబడలేదు. తెలియక హరివాసరమున భుజించమని పలికిన వారికి శత ప్రాణాయామములతో శుద్ది చెప్పబడినది. లేదా ఏకాదశ . ఉవ వాన ములతో శుద్ది లభించును. జ్యేష్టా నక్షత్రయుతైకాదశ్యుపవాసమునకాని, కుండప్లవము చేకాని, శౌకరస్పర్శచేకాని, దేవార్చనముతో కాని శుద్దిలభించును. కాని ఈమె పరమ నికృష్ణురాలు. విష్ణుదినమున భోజనమును చేయమని నిరోధించెను. భర్తమాటను కాదని, ప్రియపుత్రుని చంపించెను. ఆ పుత్రుడు కూడా వాక్యకోవిదుడు, వాక్యనిరతుడు, మాతృహిత రతుడు. విష్ణుధర్మలోపకారిణి. బహుపాపసమన్విత, అసలు ఈమెను స్పృశించరాదు. ఇక వరములనెట్టిత్తురు. మీరు న్యాయ ధర్మతత్పరులు. దేవతలు పాపులను రక్షించరు. దేవతలకాధారము ధర్మము. ధర్మమునకాధారము వేదము. ఆ వేదమున స్త్రీలధర్మము పతిని సేవించుట యని చెప్పబడినది. భర్త పలికిన దానిని సందేహించక నా చరించవలయును. తెలుపు అన్న తెలుపు అని నలుపు అనిన నలుపు అని చెప్పుటయే శుశ్రూషయనబడును. సేవించుట శుశ్రూషకాదు. తన ఆజ్ఞను స్థాపించు కోరికచే భర్త ఆజ్ఞను తిరస్కరించబడినది. కావున స్త్రీలందరిలో మోహిని పరమపాపాత్మురాలు. సత్యమును పాలించమని శపధముచే రాజును నిర్బంధించినది. ఎన్నిమాటలు చెప్పిననూ ఈమె అంగీకరించలేదు. పుత్రఘాతిని అయినది. కావున రాజు ఈమేయందు పాపమునుంచి మోక్షమును చేరెను. కావున ఈమోహిని రెండుహత్యలను గావించి పాపశరీరురాలైనది. సర్వదానములు చేయువాడు, బ్రాహ్మణ ప్రియుడు, శ్రీహరి భక్తుడు, ప్రజారంజన శీలుడు, హరివాసర సేవకుడు, పరదారలందు ప్రీతిలేనివాడు, విషయస్పృహలేనివాడు, పరార్ధమునకు కామనలను వదిలినవాడు, సర్వకాలములందు యజ్ఞసేవకుడు, భూమండలమున ఎల్లపుడు దుష్టదమనము చేయువాడు, సప్తఘోర వ్యసనదూరుడు, అగు మహారాజునునిరసించిన దురాచార పరురాలు వరయోగ్యురాలెట్లగును. ఈమె పక్షమున నున్న దేవతులుకాని దానవులుకాని క్షణకాలమున భస్మము చేతును. మోహినిని రక్షించుటకు ప్రయత్నించు వానికి కూడా మోహినీ పాపము ప్రాప్తించును. పురోహితుడిట్లు పలకి చేతిలో తీర్థజలమును స్వీకరించి మోహినిని కోపముతో చూచి ఆమె శిరస్సున అగ్నితేజముకల జలమును చల్లెను. జలమునుచల్లినంతనే మోహినీ శరీరము మండసాగెను. దేవతలందరూ చూచుచుండగనే ఈ మంటలంటిన గడ్డిపోచవలె మోహిని ఆయెను. ఆకాశమున మరుత్తులు కోపమును ఉపసంహరించుకోనుము, ఉపసంహరించుకొనుము అని అనుచుండగనే బ్రాహ్మణవాక్యసృష్టయగు అగ్ని మోహినిని భస్మము గావించెను. 

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున పప్రాప్తియను ముప్పదియైదవ అధ్యాయము.