నారద మహా పురాణము - ఉత్తరార్థము
71 - పుష్కరమాహాత్మ్యము
మోహిని పలికెను : -
ఓ బ్రాహ్మణోత్తమా ! అతి పుణ్య ప్రదమగు ప్రభాస్ మాహాత్మ్యమును వింటిని. ఇపుడు పుష్కర మాహాత్మ్యమును వినగోరుచున్నానను. పుష్కరము సర్వతీర్థములకు ఆదితీర్థము. పరమ పవిత్రము పాపనాశనము. నాతండ్రియగు బ్రహ్మకు యజ్ఞభూమి. అట్టి పుష్కరమాహాత్మ్యమును విస్తరముగా చెప్పుము.
వసువు పలికెను :
శుభకరురాలా ! మానవులకు అభీష్టప్రదము బహుతీర్థ సమన్వితమగు పుణ్యప్రదమగు పుష్కరమాహాత్మ్యమును చెప్పెదను వినుము. పుష్కర తీర్థమున విష్ణు సహీతులగు ఇశ్రాదిదేవతలు గణపతి కుమార స్వామి ఉందురు. రైవతుడు దివాకరుడు కూడా ఉందురు. ఇచట శివదూతి యను దేవి ఈ క్షేత్రమునకు క్షేమమును కలిగించు చుండును. జ్యేష్ట మాసమున పుష్కరారణ్యమున నుండు వానికి అష్టాంగ యోగ పుణ్యము లభించును. ఈ భూమండలమున ఇంతకంటే ఉత్తమమగు క్షేత్రము మరియొకటి లేదు. కావున సర్వప్రయత్నములలో ఈ క్షేత్రమును సేవించవలయును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనను క్షేత్రవాసులైన చో బ్రహ్మభక్తులు సకలప్రాణులను అనుగ్రహించు వారు అగుదురు. వీరు యోగులు వేళ్ళు బ్రహ్మలోకమునకు వెళ్ళేదరు. ఒకసారి జ్యేష్ఠ కుండమున స్నానమాడిన వారు సర్వతీర్థస్నాన ఫలమును పొందును. పుష్కరారణ్యమును చేరి అచటనున్న ప్రాచీ సరస్వతిని మతి స్మృతి దయాప్రజ్ఞా మేధా బుద్ధి అను పేర్లుకల తీర్థాధకమును దర్శించుచు తీరమున ఉన్న వారు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమును చేరెదరు. ఇచట మూడు శృంగములు, మూడు ప్రస్రవణములు జ్యేష్ఠమధ్య కనిష్ఠములీను మూడు సరస్సులు కలవు. ఇచటనే నందాయను పేరుగల సరస్వతీ తీర్థము కలదు. మొదటి సరస్సునకు పశ్చిమ భాగమున ఒక యోజన దూరము కలదు.ఈ తీర్థమున స్నానమాడి పాలిచ్చు గోవును వేద విదుడగు బ్రాహ్మణునకు దానము చేసిన వారు అక్షయమగు బ్రహ్మలోకమును చేరెదరు. ఋషి సమూహము నివసించు కోటి తీర్థము ఇచటనే యున్నది. ఇచట స్నానమాడి బ్రాహ్మణులను పూజించిన వారు సర్వపాతక వినిర్ముక్తులగుదురు. ఇచటనే యున్న అగస్త్యా శ్రమమును చేరి అగస్త్య మహర్షిని పూజించి దీర్ఘాయుష్మంతుడు భోగి అయి దేహాంతమున స్వర్గమును పొందును. ఇచటనే యున్న సప్తర్షి ఆశ్రమమును చేరి స్నానమాడి భక్తిచే సప్తర్షులను పూజించిన వారు సప్తర్షిలోకమును చేరెదరు. మన్వాశ్రమమున స్నానమాడిన వారు అంతట పూజలను పొందెదరు. గంగా వినిర్గమమున స్నానమాడి బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారు ఇహమున అఖిల భోగములననుభవించి బ్రహ్మలోకమున నివసించును. మధ్యమ పుష్కరమున స్నానమాడి బ్రాహ్మణమునకు భూదానము గావించ వలయును. ఇట్లు చేసిన విమానశ్రేష్ఠము నధిరోహించి విష్ణులోకమును చేరును. కనిష్ఠ పుష్కరిణిలో స్నానమాడి బ్రాహ్మణునకు కాంచన దానము చేసిన ఇహమున సర్వకామనలను పొంది అంతమున రుద్రలోకము చేరును. తరువాత విష్ణు పదమున స్నానము చేసి బ్రాహ్మణునకు ఏదేని దానము చేసిన శ్రీవిష్ణు అనుగ్రహమువలన సకల కామనలను పొందును. తరువాత నాగతీర్థమున స్నానమాడి నాగులను పూజించి బ్రాహ్మణులకు దానము చేసిన స్వర్గమును యుగకాలము ఆనందించును. పిశాచ తీర్థమున స్నానము చేసి బ్రాహ్మణుని భుజింప చేసి పిశాచత్వమునకు దూరమై స్వర్గమును చేరును. శివదూతీ ప్రదమున స్నానము చేసి అచట శివుని పూజించి బ్రాహ్మణులను మిష్టాన్నము భుజింప చేసి స్వర్గలోకమున విరాజిల్లును. ఆకాశ పుష్కరమున స్నానమాడి నరుడు మోక్షమును చేరును.
ఆకాశస్థుని ధ్యానము చేయుచు అపోహిషాది మంత్రములచే పుష్కరారణ్యమున స్నానమాడిన వారు శాశ్వతపదమును చేరును. కార్తిక మాసమున పూర్ణిమనాడు కృత్తికానక్షత్రమున వచ్చిన మహాతిథియనబడును. ఆనాడు ఆకాశపుష్కరమున స్నానము విశేష ఫలప్రదము. కార్తిక పూర్ణిమనాడు భరణీ నక్షత్రము వచ్చినచో మధ్యమ పుష్కరిణిలో స్నానమాడిన వారు ఆకాశ పుష్కర ఫలము లభించును. కార్తిక పూర్ణిమనాడు రోహిణీ నక్షత్రము వచ్చినచో కనిష్ఠ సరస్సున స్నానమాడిన ఆకాశ పుష్కర స్నాన ఫలము కలుగును. సూర్యగురు సమాగమమున చంద్రశని సమాగమమున కుజచంద్రయోగమున ఆకాశపుష్కర స్నానము సకల ఫల ప్రదము. విశాఖా నక్షత్రమున సూర్యుడు, కృత్తికా నక్షత్రమున చంద్రుడున్నపుడు ఆకాశ పుష్కరిణిలో స్నానమాడినచో స్వర్గమును చేరును. అంతరిక్షమునుండీ అవతరించిన ఈ బ్రహ్మ పుష్కరిణిలో స్నానమాడిన వారికి సనాతన లోకములు కలుగును. పుష్కరారణ్యమునగల సరస్వతీ నదిలో పంచ సరస్సులు మునులచే ఏర్పరచబడినవి. ఇట్లే దేవతాయతనములు కూడా ఏర్పడినవి. వీటన్నిటిలో సరస్వతి ధర్మ హేతువని తెలియుము. ఇచట స్వర్ణ భూ గోదానములు మహా ఫల ప్రదములు.ఇ చట ధాన్యమును కాని తిలలను కొని బ్రాహ్మణునకు దానము గావించిన ఇహ లోకమున సకల భోగములననుభవించి అంతమున ఉత్తమ గతి లభించును. గంగా సరస్వతీ సంగమమున స్నానమాడి బ్రాహ్మణులను పూజించిన వారు ఇహమున ఈప్సిత భోగములననుభవించి పరమున ఉత్తమ గతిని పొందును. అవియోగాభిధా వాపియందు స్నానమాడి యధావిధిగా పిండ ప్రదానము గావించిన వారు పితరులను తరిపం చేతురు. ఇట్లే సౌభాగ్య మాపమున స్నానమాడి పూర్వజులకు తర్పణము గావించి అతులసౌభాగ్యమును పొంది అంతమున సద్గతిని పొందును. మర్యాదా పర్వతమున స్నానమాడి స్పృశించి పూజించిన వాంఛి తార్థములను సంపూర్ణయాత్రా ఫలమును పొందును. అజగంధ శివుని చేరి యధావిధిగా పూజించి ఇహమున వాంఛితార్థములను పొంది పరమున పద్ధతిని పొందును. సరోదక్షిణ భాగమున పర్వతోపరితలమున నున్న సావిత్రిని పూజించిన వాడు వేదవిదుడగును. ఇచట వరాహస్వామి, నృసింహస్వామి, బ్రహ్మ, శ్రీహరి, శివ, సూర్య, చంద్ర, గుహ పార్వతీ, అగ్ని తీర్థములు కలవు. వీటి యందు విడివిడిగా స్నానమాడి విప్రులకు దానములనిచ్చి ఉత్తమ గతిని పొందెదరు. పుష్కర స్నానము దుర్లభము. పుష్కరమున తపము దుర్లభము. పుష్కరమున దానము దుర్లభము. పుష్కర నివాసము దుర్లభము. శతయోజన దూరమున ఉన్న వారు కూడా స్నాన కొలమున పుష్కరమును స్మరించినచో పుష్కర స్నాన ఫలము లభించును.మంకణాది తపస్సిద్దులు కూడా సంతోషముతో పుష్కరమును సేవింతురు. పుష్కర స్నాతులు ఎచట వెళ్ళిననూ కామితార్థ సిద్ధిని పొందెదరు. పుష్కరనామమును పలికిననూ పుష్కర స్నానజన్య ఫలము లభించును. పుష్కరస్నాన మాహాత్మ్యమును వినిని వారు కూడా పుష్కర స్నాన ఫలమును పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున పుష్కర మాహాత్మ్యమను డెబ్బది యొకటవ అధ్యాయము.
