నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

15 - పితాపుత్రసంవాదః

వసిష్టమహర్షిపలికెను :- రుక్మాంగదమహారాజు చిరునవ్వుతో బల్లిని పాపము నుండి విముక్తురాలను చేసి మోహినితో త్వరగా అశ్వము నధిరోహించుమనెను. ఈ అశ్వము శ్రీ కృష్ణుని అశ్వమువలె క్షణములో పదివేల యోజనముల దూరమువేళ్ళును. అని చెప్పగా మదలాలసయగు మోహినీ రుక్మాంగదమహారాజు మాటలను విని వాయువేగముగల అశ్వమును భర్తతో కలిసి అధిరోహించేను. అందమైన చిరునవ్వుగల మోహిని భర్తతో ఇట్లు పలికెను. ఓరాజా! ఈ అశ్వమును నీ నగరమునకు సాగించుము. నీకు పుత్రుని ముఖమును చూడవలయునను ఉత్కంఠ అధికముగా నున్నది. నేను నీ యధీనమున నుండుదానను. నీకు నచ్చిన ప్రదేశమునగొని పోమ్ము! మోహిని మాటలను వినిన రాజు నగరమునకు బయలు దేరెను. సంతోషముచే వృక్షములను, పర్వతములను, నదులను, విచిత్రములగు వనములను, పలువిధములగు మృగములను, గ్రామములను, దుర్గములను, దేశములను, నగరములను, విచిత్రములగు సరస్సులను, మనోహరములగు భూభాగములను, చూచుచు త్వరలో వామదేవహర్షి ఆశ్రమమును చూచి, త్వరలోనున్న రాజు ఆకాశమునుండియే వామదేవునకు నమస్కరించి, మరల వాయువేగముతో వెడలసాగేను. దారిలో ధనధాన్య సమృద్ధములగు పలు ప్రదేశములను చూచుచు తన ఆధీనములో నున్న విదిశానగర ప్రాంతమును చేరెను. అంతట చారులచే రుక్మాంగద మహారాజు రాకను తెలిసిన ధర్మాంగదుడు సంతోషముతో తోటి రాజులను చూచి ఇట్లు పలికెను. ఓరాజవర్యులారా? ఉత్తరదిక్కు నుండి వెలుగొచ్చుచున్నది. ఆవెలుగు నా తండ్రిగారి అశ్వమునకు సంబంధించినది. కావున మనమందరము రాజుగారికి అభిముఖముగా వెళ్ళెదము. వచ్చుచున్నతండ్రి ఎదుటకు వెళ్లనిపుత్రుడు పదునాల్గురు ఇంద్రుల కాలము నరకమున నివసించును. వచ్చుచున్నతండ్రి అభిముఖమునకు వెళ్ళు పుత్రునకు ప్రతిక్షణము యజ్ఞఫలము లభించునని. పౌరాణిక ద్విజులు చెప్పియుండిరి. కావున రండు. నాపాలిట దేవదేవుడగు పితృదేవుని నమస్కరించుటకు మీతో కలిసి వెళ్ళేదను. ఆ రాజులందరూ అయని లేవగా వారందరితో కలిసి కాలినడకన ఒక కోసు దూరము వెళ్ళేను. రాజ సహస్రముతో కూడి ధర్మాంగదుడు రూపు దాల్చిన మన్మధునివలె ప్రకాశించుచు చాలా దూరము నడిచి దారిలో తండ్రిని చేరుకొనెను. తండ్రిని చేరుకొని రాజులందరితో కలిసి భూమిపై పడి తండ్రికి సాష్టాంగ ప్రణామమాచరించెను. ప్రేమతో వచ్చి రాజులతో కలిసి నమస్కరించుచున్న పుత్రుని చూచి, అశ్వము నుండి దిగి, పుత్రుని లేపి ధృఢమగు భుజములతో ఆలింగనము చేసుకొని, శిరస్సును మూస్కొని పుత్రునితో ఇట్లు పలికెను. ఓకుమారా? ప్రజలందరిని చక్కగా పరిపాలించుచున్నావా? శత్రువులను దండన చేయుచున్నావా? న్యాయముగా వచ్చుధనముతో కోశమును నింపుచున్నావా? బ్రాహ్మణులయందు తరగనీ భక్తిని చూపుచున్నావా? నీస్వభావము అందరికి ప్రియముగా నున్నదా? పరుషముగా మాటలాడుట లేదుకదా? చండాలగృహమున ఆపులకు పాలు పితుకుటలేదు కదా. రాజ్యమున పుత్రులు తండ్రిమాటను వినుచున్నరా? కోడలు అత్తగారి ఆజ్ఞను, భార్య భర్త ఆజ్ఞను పాటించుచున్నదా? బ్రాహ్మణులతో వివాదమునకు దిగుటలేదుకదా? ఆవులను పలు విధముల తృణములను భక్షించునపుడు అడ్డగించుట లేదుకదా?. అన్నాదులను సిద్ధము చేయుపదార్థములను తూచు పరికరములు కొలచు పరికరములు సక్రమముగా నున్నవో లేదో చూచుచున్నావా? బహుసంతానవంతులను పన్నులతో బాధించుట లేదుకదా? నీరాజ్యమున ద్యూతపానాది దుర్వ్యసనములు లేవుకదా? నీపురమున మతిభేదముతో, రుచిభేదముతో, వాక్యభేదములతో, దాన లబ్ధపదార్థములతో, జీర్ణవస్త్రములతో ప్రజలు జీవించుటలేదు కదా? నీవు స్వయముగా పర్యవేక్షించుచు హయాశ్వములను కాపాడుతున్నావా? నీ తల్లులందరిని సమానముగా చూచుచున్నావా? శ్రీహరి వాసరమున మానవులు భుజించుట లేదుకదా? రాత్రికాలమున ఎవరూ శ్రాద్ధము నాచరించుటలేదుకదా. అపరరాత్రియందు నిద్రించుట లేదు కదా? నిద్ర అధర్మమునకు మూలము. నిద్రయే పాపమును పెంచును. నిద్ర దారిద్ర్యమును కలిగించును. నిద్రయే అన్ని శ్రేయస్సులను నశింపచేయును. నిద్రనెక్కువగా పొందురాజు చాలాకాలము ప్రజలను పాలించజాలడు. పుంశ్చలివలె నిద్ర రాజునకు ఇహపరములను నశింప చేయును. ఇట్లు పలుకుచున్న తండ్రిని గూర్చి పుత్రుడగు ధర్మాంగదుడు పలుమార్లు నమస్కరించుచు ఇట్లు పలికెను. ఓ తండ్రీ! మీరు చెప్పిన వన్నీ చేసితిని. ఇక ముందు కూడా చేయగలను. ఈజగత్రయమున తండ్రి మాటలను పాటించు పుత్రులు ధన్యులు. తండ్రిమాటలను అతిక్రమించుట కంటే గొప్ప పాతకము మరొకటి లేదు. తండ్రి మాటను అతిక్రమించి గంగానదీ స్నానమాచరించిననూ గంగాస్నానఫలములభించదు. నాశరీరము, నాజీవితము, నాధర్మము మీ అధీనము. మీరే నాకు పరదైవము. మూడు లోకములను దానము గావించిననూ తండ్రి ఋణముతీరదు. అయినపుడు దేహముతో, ధనముతో, క్లేశదానములతో ఎట్లు తీరును. ఇట్లు చాలామంది రాజులతో కూడి పలుకుచున్న పుత్రుని రుక్మాంగద మహారాజు మరల ఆలింగనము చేసుకొని, ఇట్లు పలికెను. ధర్మమును తెలిసిన నీవు సత్యమునే పలికితివి. పుత్రునకు తండ్రిని మించిన దైవములేదు. తండ్రిని అవమానించు పుత్రునకు దేవతలు పరాజ్మఖులగుదురు. కావున ఇపుడు నీవు సప్తద్వీపవతియగు భూమిని గెలిచితివి. ఈ భూమండలమున తండ్రిని మించిన తనయుడుండుటయే అధికసౌఖ్యము. ఇదియే మానవులకు స్వర్గప్రదము. కావున ఈనాడు సద్గుణములరాశివై సద్ధర్మపాలకుడవై నీవు రాజులను గెలిచి, హరివాసరమును చక్కగా పాలింప చేయుటచే నేను ధన్యుడనైతివి. ఇట్లు తండ్రి పలికిన మాటలను విని ధర్మాంగదుడిట్లు పలికెను. ఓ తండ్రీ! నాయందు రాజ్యసంపదలనుంచి మీరు ఎటు వెళ్ళితిరి. ఎచట పదివేల సూర్యుల ప్రకాశముగల ఈయువతి లభించినది? ఈ యువతిని సృష్టించి బ్రహ్మసంతృప్తి పొంది యుండునను కొందును. ఈ మూడు లోకములలో ఇటువంటి రూపము కల యువతి లేదు. ఈమె పార్వతి వంటిది. లేదా లక్ష్మీదేవి వంటిది అనుకొనుచున్నాను. లేక మయుని మాయయే రూపు దాల్చి వచ్చి యుండును. ఇంతటీ రూపసిని నిర్మించిన బ్రహ్మ చక్కని నిపుణుడు. ఈమేలో నూరవ అంశమును నిర్మించిన వాడు కూడా చతురు డేయగును. ఇతరులు చేయలేరు. ఈ స్వర్ణకాంతులను విరజిమ్ముసుందరి మా ఇంటిలో యుండదగినది. ఈ సుందరి నాకు తల్లియగుచో నాకంటే ధన్యుడగు పుత్రుడు ఈ ముజ్జగములలో మరియొకడుండడు.

ఇది శ్రీ బహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ చరితమున పితాపుత్రసంవాదమను పది హేనవ అధ్యాయము.