నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

63 - ప్రయాగమాహాత్మ్యమ్

వసువు పలికెను:- మోహినీ! వేదసంమ్మతమగు ప్రయాగక్షేత్ర స్నాన విధానమును తెలి పెదను. వినుము. గంగలో నిచట స్నానముచేసిననూ కురుక్షేత్ర సమఫలము కలుగును. గంగ వింధ్యసంగతయైన చో పదిరెట్లు అధిక ఫలము నిచ్చును. కాశిలో ఉత్తరవాహినీ యగుగంగ నూరురెట్లు అధిక ఫలము నిచ్చును. యమునా నదీతో కలిసి యున్న గంగ కాశీ గంగ కంటే నూరు రెట్లు అధికఫలమునిచ్చును. పశ్చిమ వాహినీ గంగయైనచో వేయిరెట్లు అధికఫలము నిచ్చును. పశ్చిమవాహిని గంగా దర్శనమాత్రముననే బ్రహ్మహత్యాది పాపములను హరించును. పశ్చిమాభిముఖియగు గంగ యమునతో కలిసియున్నచో నూరు కల్పముల పాపములను నశింప చేయును. మాఘ మాసమున ఇట్టి గంగ దుర్లభము. భూమండలమున గంగాయమున సంగమ తీర్థము అమృతముగా కీర్తించబడును. ఇట్టి తీర్దము మామమాసమున దేవతలకు కూడా దుర్లభమే. ఈ భూమండలమున నున్న సమస్త తీర్ధములు, పవిత్రక్షేత్రములు మాఘమాసమున మకర భాస్కరుడున్నపుడు వేణిలో స్నానముచేయుటకు వచ్చును. బ్రహ్మవిష్ణుమహాదేవులు, రుద్రాదిత్యమరుద్గణములు, గంధర్వులు, లోకపాలకులు, యక్షకిన్నర గుహ్యకులు, అణిమాది గుణోపేతులగు తత్త్యదర్శులు, సరస్వతి, పార్వతి, లక్ష్మి, శచి, మేధ, అదితి, రతి, సకలదేవపత్నులు నాగాంగనలు, ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశీ, తిలోత్తమ, అప్సరోగణములు, పితృగణములు, అందరు మాఘమాసమున వేణీ సొనమునకై వత్తురు. కృతయుగమున ప్రత్యక్షరూపముతో, కలియుగమున ప్రచ్ఛన్నరూపముతో వచ్చెదరు. వేణిలో దీగుచున్నపుడు పాపులసంగదోషముతోనల్ల బారిన సర్వతీర్థములు మాఘమాసమున ప్రయాగమజ్జనమున శుక్లవర్ణములగును. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘమాసమున “గోవిన్ద, అచ్యుతా! మాధవా నాస్నానముచే నాకు యధోక్త ఫలమునిమ్ము” అనుమస్తమునుచ్చరించీ మౌనముగా స్నానమునాచరించవలయును. మరల వాసుదేవుని, హరిని, కృష్ణుని మాధవుని స్మరించవలయును. సూర్యుడు మకరరాశిలో ఉండగా ఇంటిలో వేడినీరుతో స్నానము చేసినచో అరువదిసంవత్సరముల ఫలము కలుగును. వేలుపలనున్న పాప్యాదులలో స్నానమాచరించిన ద్వాదశాబ్దస్నానఫలము కలుగును. తటాకమున స్నానము ద్విగుణఫలమును, తద్యాదులందు చతుర్గుణఫలము, దేవఖాత స్నానము దశగుణఫలమును, మహానదీస్నానము శతగుణ ఫలమును, మహానదీసంగమస్నానము చతుశ్శతగుణఫలము కలుగును. సూర్యుడు మకరరాశిలో నుండగా చేయు అన్ని విధములస్నానము సహస్రగుణ ఫలమునిచ్చును. గంగాస్నానము, ప్రయాగ స్నానము సమాన ఫలమునిచ్చును. మాఘమాసమున గంగాస్నానమును చేయువారు నాలుగువేలయుగములు స్వర్గములో నివసింతురు. గంగాస్నానము శతగుణము, ప్రయాగ స్నానముసహస్రగుణిత ఫలమునిచ్చునని గంగాయమున సంగమమున స్నానమునునిర్దేశించిరి. భూమండలమునగల పాపసమూహ భారదాహము కొరకు ప్రజాహితమును కోరి ప్రజాపతి ప్రయాగను సృజించెను. తెలపు నలుపు జలము కలిగి తీర్థము స్నానస్థానము. పాపరూప పశునాశమునకు ఈ స్థానమను బ్రహ్మనిర్మించేను. సితాసిత జలయగు ధారను సరస్వతితో కలిగి బ్రహ్మలోకమార్గమును సృష్టికర్త ఏర్పరిచెను. మానససరోవరస్నానము జ్ఞానప్రదముని మోక్ష ప్రదముకా జాలదు. హిమవత్పష్టతీర్ధములన్నింటిలో సర్వపాప ప్రణాశనముగా ఇంద్రలోక ప్రదమని వేదవిదులు నిర్దేశించిరి. మాఘ మాసము సర్వమాసములలో ఉత్తమము. బదరీవనమున మోక్షప్రదము, పాపహారి, దుఃఖహారి, సర్వకామఫలప్రదము. నర్మదానది మాఘమాసమున రుద్రలోకప్రదము. సకలపాపనాశకము సర్వలోకసుఖప్రదము. మాఘమాసమున విశాలా నది విశాఫలప్రదము. పాపసమూహమునకు దవాగ్ని. జన్మనాశకము, మాఘమాసమున గంగానది విష్ణులోక ప్రదము. మోక్ష ప్రదము. సరయు, గండకీ, సింధు, చన్దభాగా, కౌశికి, తాపీ, గోదావరి, భీమా, పయోష్ణీ, కృష్ణవేణి, కావేరి, తుంగభద్ర, ఇతరసముద్రగతనదులు అన్నియూ మాఘమాసమున స్వర్గలోక ప్రదములు.

నైమిషమున విష్ణుసారూప్యమును, పుష్కరమున బ్రహ్మసామీప్యమును, కురుక్షేత్రమున ఇంద్రలోకమును ప్రసాదించును. దేవప్రదమున మాఘమాసము యోగసిద్ధి ఫలప్రదము. మకరాదిత్యకాలమున ప్రభాసస్నానము రుద్రగణత్వప్రదము. దేవికానదిలో మానస్నానము దేవదేహమును ప్రసాదించును. గోమతీ స్నానము మున్షన్మ హరము. హేమ కూటమున,మహాకాలమున, ఓంకారమున, నీలకంఠార్బుదమున మాఘస్నానము రుద్రలోకప్రదము. సూర్యుడు మకరరాశిలో నుండగా సర్వనదులు కలియును గాన అపుడు చేయుస్నానము సర్వకామప్రదము. మాఘమాసమున ప్రయాగను ధన్వులు చేరెదరు. అచట సీతాసిత జలముండును గాన పునర్జన్మును హరించును. మాఘమాసము ప్రయాగలో మాకు గడువవలయునని స్వర్గమున నుండు దేవతలు గానము చేయు చుందురు. ప్రయాగలో మాఘస్నానమును చేయువారు. మరల గర్బవేదనను పొందరు. విష్ణుసన్నిధిలో ఉందురు. పూర్వము బ్రహ్మ తీర్ధవ్రత స్నానతపోయాగ మాఘప్రయాగలను తలతూచేను. వాటిలో మాఘమాసము ప్రయాగ అధికమాయెను. ఈ రెంటిలో మాఘము ఇంకనూ శ్రేష్ఠమాయేను. గాలి, నీరు ఆకులు, ఆహారముగా తీసుకొని దేహశోషణముచే ఉగ్రతపములచే, చిరకాల సంచితయోగములచే పొందుగతిని మాఘప్రయాగ స్నానమున పొందెదరు. మకర భాస్కరోదయకాలమున గంగాసంగమమగు ప్రయాగలో స్నానము చేయువారి గృహద్వారమున కుంజరకర్ణతాడిత భృంగావళి అలంకార మగును. మాఘప్రయాగస్నానము రాజసూయాధ్వర సమఫలప్రదము సర్వపాపహరము. అట్టి ప్రయాగనేలస్తుతించరు? నాలుగువేదములను చదివినవారికి కలుగు ఫలము, సత్యవాది ఫలము, గంగాయమునాసంగమ స్నానమున లభించును. ఈ సంగమమున వ్రతమును స్వీకరించి స్నానమాడవలయును. ఇట్లు చేసిన రాజసూయాశ్వమేధముల ఫలమును పొందును. ప్రయాగమండలము పంచయోజనవివస్తీర్ణము. ఈ భూమిలో ప్రవేశించి నంతనే ప్రతిపదమున అశ్వమేధ ఫలము లభించును. ఇచట మూడు కుండములుండును. వీటి మధ్యలో జాహ్నవి యుండును. ప్రయాగతీర్ధ ప్రవేశమాత్రముననే తత్ క్షణమే సకలపాపములు నశించును.

ఒక మాసము జితేద్రియడై ప్రయాగస్నానమాచరించిన సర్వపాపములు నశించుటను బ్రహ్మ ప్రత్యక్షముగా చూచెను. పాపియైననూ శుచియై ఏకాగ్రమనస్కుడై శ్రద్ధతో ప్రయాగలో స్నానమాడినచో సర్వపాపములు తొలగి పరమపదమును పొందును. నైమిషము, పుష్కరము, గోతీర్థము, సింధుసాగరము, గయా, ధేనుకము, గంగాసాగర సంగమము ఇవి, ఇతరబహు పుణ్యశిలోచ్చయములు, దశసహస్రతీర్ధములు, ఇతరములగు ముప్పదికోట్ల తీర్ధములు, ఇవన్నియూ ప్రయాగలో ఎపుడూ నిలిచియుండును. ఇచట మూడు అగ్ని కుండములు కలవు. వీటి మధ్యలో జాహ్నవి కలదు. ప్రయాగనుండి సర్వతీర్థ పురస్కృతయై బయలువెడలిన యమునానది లోకత్రయ ప్రసిద్ధిని పొందినది. లోకపావనియగు యమునానది గంగతో కలిసెను. గంగాయమునల మధ్య భూభాగమున నున్న సకలపుణ్యక్షేత్ర తీర్థరాజములన్నియూ ప్రయాగషోడశాంశకు సాటిరావని చెప్పిరి. ఈ భూమండలమున మూడు కోట్ల యాబదిలక్షల తీర్ధములు, ఇంకను అంతరిక్షమున స్వర్గమున జాహ్నవ్యంతములుగా కలవని వాయువు తెలిపెను. ఇవన్నియూ ప్రయాగలో కలియును. మరియూ కబలాశ్వతరములు రెండు, భోగవతి, వేది, వేధ్యము, ప్రజాపతి, వేదములు యజ్ఞములు అన్నియూ ఆకారమును దాల్చి ప్రయాగలో నుండును. తపోధనులగు ఋషులు ప్రజాపతిని సేవించుచుందురు. యాగములచే-దేవతలను పూజింతురు. కావున ప్రయాగకంటే పుణ్యతమ మగునది ఈ భూమండలమున మరియొకటి లేదు. ప్రయాగప్రభావమున అన్ని తీర్ధములను అతిశయించును. ఇచట ప్రయాగతీర్థమును చూచిన వారు సర్వపాప వినిర్ముక్తులై పరమపదమును పొందెదరు. కావున సర్వదేవాభిరక్షితమగు ప్రయాగ కు వెళ్ళి బ్రహ్మచర్యముతో ఒకమాసముండి పితరులను, దేవతలను తృప్తులను చేయవలయును. ఇట్లు చేసిన సకలాభీష్టములను పొందును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున ప్రయాగలో స్నానమాడినవాడు మరల పుట్టడు.

విష్ణుమాయ దేవతలచే కూడా జయించ రానిది. కాని మాఘప్రయాగస్నానమున విష్ణుమాయ కూడా దహించబడును. మాఘప్రయాగస్నానమునాచరించినవారు ఆయాలోకములలో బహు భోగములననుభవించి శ్రీ విష్ణువులో లీనమగుదురు. మకరార్కకాలమున ప్రయాగస్పర్శవలన కలుగు పుణ్యరాశులను చిత్రగుప్తుడు కూడా లెక్కించ జాలడు. సహస్రరాజసూయముల ఫలము, శత వాజపేయముల ఫలము మాఘ ప్రయాగస్నానమున కలుగును, మాఘప్రయాగస్నానమున కల్పారంభమునుండి బహుజన్మలలో చేసిన పాపరాశులు భస్మమగును. గంగాయమునాసంగమము లోక ప్రసిద్ధము. దీనినే కామిక తీర్ధ మందురు. ఇచట భక్తిచేస్నానముచేయువారి కోరికలన్నియూ తీరును. భోగములకు భోగము, రాజ్యకాములకు రాజ్యము, స్వర్గకామికి స్వర్గము, మోక్షకామికి మోక్షము కలుగును ఈ భూమండలమున గల కామప్రద తీర్ధములన్నియూ మాఘమున ప్రయాగలో లీనమగును. హరిద్వారమున, ప్రయాగలో, గంగా సాగర సంగమమున స్నానము చేసినవారు బ్రహ్మ విష్ణు శివలోకములను పొందెదరు. మాఘమాసమున ప్రయాగస్నానము చేసినవారికి పునర్జన్మ కలుగదు. సత్యవాది, జితక్రోధుడు, ఆహింసా శీలుడు, ధర్మానుసారి, తత్వజ్ఞుడు, గోబ్రాహ్మణహితకారి, గంగాయమునా సంగమస్సానమాత్రమున పాపముక్తుడగును. మనసులో చింతించిన కామనలన్నింటినీ పొందును, సూర్యగ్రహణకాలమున కురుక్షేత్రమున స్వర్ణభారసహస్రదానమును చేసినవానికి కలుగు ఫలము మాఘప్రయాగస్నానమున లభించును, సహస్రగోదాన జన్మఫలము మాఘప్రయాగమున త్రిదిన స్నానము వలన కలుగును. త్రిశతవత్సరములు యోగాభ్యాసమువలన కలుగు ఫలము మాఘమాసమున ప్రయాగలో త్రిదినస్నానమున కలుగును. మాఘమాసమున దినత్రయము ప్రయాగస్నానమువలన కలుగు ఫలము, అశ్వమేధ సహస్రముచే కూడా లభించదు. పూర్వము కాంచనమాలినీ మాఘమున త్రిదిన ప్రయాగస్పానఫలమును రాక్షసునకిచ్చుటచే రాక్షసుడుపాపముక్తుడాయెను. మూడు దినములలో పాపక్షయము జరిగెను. ఇరువదియేడు దినములు స్నానముచేయుటచే దేవత్వమును పొందెను.

పార్వతీ ప్రియసఖి కైలాసమున క్రీడించునది ప్రయాగస్నానమువలన పూర్వజన్మ జ్ఞానమును పొందెను. పూర్వము అవంతిదేశమున వాన రాజుండేను. ఇతను నర్మదా తీర్థ మును చేరి  రాజసూయయాగ మునాచరించెను. స్వర్ణయూప విరాజితములను పదహారశ్వములచే అశ్వమేధయాగమునాచరించెను. బ్రాహ్మణులను పర్వతోమధాన్యరాశిని దానము చేసెను. శ్రద్ధకలవాడు, దేవతా భక్తుడు, గోదానమును, స్వర్ణదానమును చేసినవాడుగా నుండెను.

ఇట్లే భద్రకుడను బ్రాహ్మణుడు మూర్లుడై, హీనకులసంగతితో కృషీవలుడై, అధమాచారుడు, సర్వధర్మబహిష్కృతుడు, హలకర్మయందాసక్తిగలవాడు బంధువులచే వంచించబడి అంతటా తిరుగుచు, అదృష్టవశమున బయలుదేరి దైవవశమున జ్ఞానమును పొంది ప్రయాగతీర్ధమునకొచ్చెను. మహామాఘే సందర్భమున ప్రయాగలో మూడుదినములు స్నానమాడెను. ఇట్లు అనఘస్నానమాత్రమున భద్రకుడు బ్రాహ్మణోత్తముడాయెను. ప్రయాగనుండి బయలుదేరి స్వదేశమునకు వెడలెను. వాసరాజు భద్రక బ్రాహ్మణుడు ఒకేసారి మృతి చెందిరి. వారిద్దరూ ఇంద్ర సమీపమున సమానస్థానమును పొందిరి. తేజస్సు, రూపము, బలము, స్త్రీజనము, దేవయానము, విభూషణము, పారి జాతమాల, నృత్యము, గీతము అన్నియూ సమములుగా నుండెను. ఇట్లు ప్రత్యక్షముగా మాహాత్యమును చూచిన తరువాత మాఘమున ప్రయాగస్నానము రాజసూయసమముకాదని ఎట్లు చెప్పెదరు? వింశతిధనుర్విస్తీర్ణప్రాంతమున గంగాయమున సంగమమున మాఘమాసస్నానమున పునర్జన్మకలుగదు. రాజసూయమున పునర్జన్మ కలుగును. విపులమగు యమునాతీరమున కబలా అశ్వ తర అనురెండు నాగములు కలవు. ఇచట స్నానపానములనుచేసినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. ఇచటికి వెళ్లి నివసించినచో మహాదేవుని ప్రసాదము వలన దశపూర్వులను, దశాపరులను తరింపచేయును. ఇచటనే ప్రతిష్టాన మనుకూపము కలదు. ఇచట స్నానముచేసి పితరులను దేవతలను, తర్పణము గావించి బ్రహ్మచారియై, జితక్రోధుడై మూడురాత్రులున్న చో సర్వపాపవిశుద్ధాత్మయై అశ్వమేధఫలమును పొందును. ప్రతిష్టానమునకు ఉత్తరమున, భాగీరధికి పూర్వమున హంసప్రతపనమను తీర్ధము లోకప్రసిద్ధము ఇచట స్నానమాచరించిన అశ్వమేధ ఫలమును పొందును. ప్రళయకాలము వరకు స్వర్గమున నుండును. ఇక వాసుకికి ఉత్తరమున భోగవతీ సమీపమున దశాశ్వమేధికమను ఉత్తమతీర్ధము కలదు. ఇచటస్నానము చేసిన అశ్వమేధఫలము లభించును. ధనాఢ్యుడు, రూపవంతుడు, దక్షుడు, దాత, ధార్మికుడు అగును. చతుర్వేదాధ్యయన పరులను కలుగు పుణ్యము, సత్యవాదులకు కలుగు ఫలము, అహింసలో నుండు ధర్మము దశాశ్వమేధగమనమున కలుగును.

పాయత్యుత్తరతీరమున ప్రయాగకు దక్షిణ భాగమున ఋణమోచనకమను తీర్థము కలదు. ఇచట స్నానము చేసి ఒకరాత్రి ఉన్నవారు ఋణవిముక్తులగుదురు. స్వర్గలోకమును పొంది అమరతమునందెదరు. మూడుపూటలా ఒకమారు స్నానముచేయుచు నిరాహారియై మూడునెలలున్నచో విశ్వాసఘాతక పాపమునుండి శుద్ధి పొందును. ఈ తీర్థమును కీర్తించుట వలన పుణ్యమును పొందును దర్శించి శుభములను బడయును. స్నానము పానముచేసి ఏడుతరములనుపావనము చేయును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున సూర్యోదయమునకంటే స్నానము చేయనిచో ఎట్లు పాపవిముక్తి కలుగును? ఎట్లు స్వర్గమును పొందును? ప్రయాగలో వపనము, గయలో పిండదానము, కురుక్షేత్రమున దానము, కాశిలో దేహత్యాగము చేయవలసిన పనులు. ప్రయాగలో ముండనము చేసుకొన్నవానికి గయా పిండదానముతో కాశీమరణముతో కురుక్షేత్రదానముతో పనిలేదు. పదినెలల తరువాత మరల తీర్ధమునకు వెళ్ళిననూ ముండనమును ఉప వాసమును ప్రయత్నముచే నాచరించవలయును. ప్రయాగకు వెళ్ళిన స్త్రీలకు ముండన విధి ఇట్లు చెప్పబడినది. అన్ని కేశములను ఒకచో చేర్చి రెండంగుళములను ఛేదించవలయును. మానవులకు కేశాంత్యభాగమునాశ్రయించి సర్వపాపములుండును. కావున తీర్ధ స్నానకాలమున కేశాంత్య భాగములను ఛేదించవలయును. పుష్యమాఘమాసములలో అమావాస్య అర్కపాత శ్రవణములతో కలిసి వచ్చేనేని అరోధయమని తెలియవలయును. ఈ అక్టోదయము శతసూర్య పర్వల కంటే అధికము. కొద్దిగా న్యూనమైనచో మహోదయమనబడును. మాఘశుక్లసప్తమినాడు అరుణోదయవేళయందు ప్రయాగలో ఉన్నవారికి వేయి సూర్యగ్రహణములతో సమానము. అయనకాలమున కోటి పుణ్యము, విషువమున లక్షగుణము, షడశీతియందు సహస్రఫలము ఇట్లే విష్ణుపదులలో కూడా ఫలము కలుగును. ప్రయాగలో విభవానుసారముగా దానము చేయవలయును. దానముచే తీర్ధ ఫలము పెరుగును. గంగాయమునా సంగమమున గోదానమును గావించిన స్వర్ణదానము, మణిముక్తాది దానములను గావించిననూ, పాటలగోవును కాని కపిలగోవునుకాని స్వర్ణశృంగిని రౌప్య ఖురను, ఏలకంఠిని యస్వినిని సవత్సను శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు యధావిధిగా దానము గావించవలయును. శుక్లాంబరధరుడు, శాంతుడు, ధర్మజుడు, వేదపారగుడు అగువానికి గోవునీయవలయును. అట్లే మహార్హములగు వస్త్రములను ఆభరణములను బహువిధరత్నములను దానము చేయవలయును. ఆ గోవునకు వత్సమునకున్నరోమకూపముల సంఖ్యననుసరించి అన్నివేలసంవత్సరములు స్వర్గమున నివసించును. అతనుపుట్టిన ప్రదేశముననే ఆ గోవుకూడా పుట్టును. దాత తన సుకృత వశమున నరకమును చూడడు. ఉత్తర కురుదేశములను పొంది. అక్షయ కాలము భోగములననుభవించును. వందలవేల ఆవులకంటే ఒకపాలిచ్చు ఆవును దానము చేయవలయును. పుత్రులను భార్యలను భృత్యులను ఒక గోవే తరింపచేయును. కావుననే అన్ని దానములలో గోదానము విశిష్టము దుర్గమము విషమము ఘోరము అగు మహాపాతక సంక్రమమున గోవే రక్షించును. కావున గోదానమును చేయవలయును. తీర్ధ మున పుణ్యాయతనములందు ప్రతిగృహమును వర్ణించి బ్రాహ్మణుడు అప్రమత్తునిగా ఉండవలయును. స్వకార్యమున కాని పితృకార్యమున కాని దేవతారాధనలో కాని ప్రతిగ్రహధనానుభవము వరకు ఆ తీర్థయాత్ర విఫలమగును. గంగాయమున మధ్యలో కన్యాదానమును చేసినవాడు నరకమును చూడజాలడు. ఉత్తర కురుదేశములకు వెళ్లి అక్షయకాలము భోగాను భవమును పొందును. ధార్మికులు రూపసంయుతులు అగు భార్యాపుత్రులను పొందును. అధశ్శిరమునుంచి ఊర్ధ్వబాహులై అచటి యజ్ఞధూమమును పానము చేయవలయును. అక్ష సంవత్సరములు స్వర్గమున నివసించును. స్వర్గమునుండి దిగివచ్చి అగ్నిహోత్రిగా పుట్టి విపులభోగములననుభవించి మరల ఈతీర్ధమును చేరును.

ప్రయాగ నుండి ప్రతిష్టానము వరకు వాసుకి హృదము నుండి బహుమూలకసాగము వరకు కబలాశ్వతర నాగములుండును. ఇంత వరకు ప్రజాపతిక్షేత్రమనీ లోకత్రయ ప్రసిద్ధము. ఈ క్షేత్రమున స్నానమాచరించి స్వర్గమునకు చేరెదరు. ఇచట మరణించిన వారు మరల పుట్టరు. వేద వచనము వలన కాని, లోకవచనమువలనకాని ప్రయాగమరణ విషయమున బుద్ధిని తొలగించరాదు. ప్రయాగయందు పదివేల తీర్ధములు అరువది కోట్ల తీర్థములు సన్నిహితములుగా నుండును. యోగయుక్తునకు సన్మార్గగతునకు లభించుగతి గంగాయమునా సంగమమున ప్రాణములను విడిచిన వానికి లభించును. బాధితుడు, దీనుడు కోపించిన వాడు కానీ గంగాయమునా సంగమమును చేరి ప్రాణ పరిత్యాగము గావించినచో దీప్తకాంచన వర్ణములు సూర్యకాంతి సన్నిభములు అగు విమానములతో గంధర్వాప్సరసల మధ్యన స్వర్గమున ఆనందించును. అభీష్టకామనలను పొందును. నిదురించిన వాడు గీత వాద్యనాదములచే మేలు కొనును. పుట్టుకను కోరు వరకు స్వర్గములోనే నివసించును. కర్మక్షయమున స్వర్గ పరిభ్రష్టుడై హిరణ్యరత్నసంపూర్ణ కులమున పుట్టును. పూర్వసుకృతమును స్మరించుచు విష్ణులోకమును చేరును. ఇచట వట మూలమును చేరి ప్రాణపరిత్యాగమును చేయువాడు సర్వలోకములనతిక్రమించి రుద్రలోకమును పొందును. అచట రుద్రుని ఆశ్రయించి ద్వాదశాదిత్యులను తపింపచేయును. జగత్తును వెడలి వచ్చిన ద్వాదశాదిత్యులు వటమూలమున దహించబడును. ప్రజాపతి పురస్కృతుడగు శ్రీహరి వటపత్రమున పాదాంగుష్టమును పానమును చేయుచు ఉండును. విపులము హంసపాండురము అటు ఉర్వశీపులినమున ప్రాణములను విడుచువాడు అరువది యారు వేల సంవత్సరములు పితరులతో కలిసి స్వర్గలోకమున నివసించును. దేవలోకమున ఉర్వశిని చూచినపుడు దేవ ఋషిగంధర్వులచే పూజించబడును. కర్మక్షయమున స్వర్గ భ్రష్టుడై ఇచటికొచ్చి ఊర్వశీతుల్యులగు యువతులను నూరు మందిని పొందును. నారీ సహస్రమునకు భర్తయగును. పది వేల గ్రామములకు భోక్త శాస్తయగును. ఇతను నిదురించినచో కాంచీనూపుర శబ్దములచే మేలుకొనును. వీపుల భోగములననుభ వించి మరల అదే తీర్థమును చేరును. నిత్యము శుక్లాంబరధరుడు, నియమబద్దుడు, జితేన్టియుడు, ఒక పూట మాత్రమే భుజించుచు ఒక మాసము భోగపతియగును. సువర్ణాలంకృతలగు నారీ శతమును పొందును. సముద్రాన్తపృధివిలో మహాభోగపతి యగును. ధనధాన్యసమాయుక్తుడు దాతగా విపులభోగములననుభవించి మరల క్షేత్రమును స్మరించును. కోటి తీర్ధమున మరణించిన వారు వేయి కోట్ల వర్షములు  స్వర్గములో నుందురు. తరువాత ఇటకొచ్చి సువర్ణమణి ముక్తా భూయిష్ఠకులమున పుట్టును. ఇష్టముండికాని లేకకాని గంగలో మరణించిన వాడు స్వర్గమును చేరును. నరకమును చూడడు. హంసయుక్త విమానమున విహరించును. అప్సరగణమధ్యన నిదురించి మేల్కొనును. స్వర్గము నుండి ఇటకొచ్చి పరిశుద్దులు శ్రీమంతులగుయోగుల కులములో జన్మను పొందును.

గంగాయమునల మధ్యన పిడకలు అగ్నిలో దహించబడవలయును. అట్లు దహించబడువాడు హీనాంగుడు రోగయుక్తుడు కారాదు. పంచేంద్రియుడు కావలయును. అట్టి వాని శరీరమున గల రోమకూపములు ఎన్ని యుండునో అన్ని వేల వర్షములు స్వర్గలోకమున నివసించును. స్వర్గమునుండి తిరిగి వచ్చి జంబూద్వీప పతి యగును. ఇచట విపుల భోగములననుభవించి మరల ఆ తీర్థమును చేరును. ఇచట తనదేహమును ఖండించి పక్షులకు వేసిన వాడు లక్ష సంవత్సరములు చంద్రలోకమున నివసించును. అట నుండి ఇట కువచ్చి ధార్మికుడగు రాజగును. గుణవంతుడు రూపవంతుడు విద్యావంతుడు, ప్రియవాక్కుగలవాడు. పరిశుద్ధుడుగా నుండి విపుల భోగములననుభవించి మరల ఈ తీర్థమునకు చేరును. పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమున అనశనవ్రతముతో మరణించిన వారు గడిచిన ఏడు తరములను, రాబోవు పదునాలుగు తరములను తరింపచేసి తాను కూడా తరించును. యమునా దక్షిణ తటమున అగ్ని తీర్థము కలదు. ధర్మరాజ నరకతీర్ధము పశ్చిమ భాగమున కలదు. ఇచట స్నానము చేసినవారు స్వర్గమును పొందెదరు. మరణించిన వారు మరల పుట్టరు. యమునా నదికి ఉత్తర తీరమున పాపహరములగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్థములను చాలా మంది మునులు సేవించి యుండిరి. ఈ తీర్థములలో స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వీటిలో మరణించిన వారు మరల జన్మను పొందరు. గంగాయమునానదులు రెండు సమాన ఫలములనిచ్చునవిగా ప్రసిద్ధిని పొందినవి. జ్యేష్ఠ భావనతో గంగ అంతట పూజించబడును. సర్వరత్నములను బ్రాహ్మణులకు దానము చేసిన వారికి కూడా యోగము లభించునో లేదో కాని ప్రయాగలో మరణించిన వారికి మాత్రము అన్నియూ లభించును. దేశములో నుండి కాని, అరణ్యములో నుండి కాని, విదేశములలో లేదా గృహములో నుండు వాడైనను ప్రయాగను స్మరించుచు ప్రాణములను విడిచినచో హిరణ్మయ భూప్రాంతము కల బ్రహ్మలోకమును పొందును. అచట సర్వకామ ఫలములు గల వృక్షములుండును. ఋషులుందురు. స్త్రీ సహస్ర పరివేష్టితమగు శుభకరమగు మందాకినీ తటమున సిద్దులతో గంధర్వులతో కలిసి క్రీడించును. అచటి నుండి మరల ఇటకొచ్చి జంబూద్వీప పతియగును. ధర్మాత్ముడు గుణ సంపన్నుడుగా ఉండి మరల ఆ తీర్థమును పొందును. ఇట్లు నీకు సమగ్రముగా సుఖ ప్రదము, మోక్ష ప్రదమగు ప్రయాగమాహాత్మ్యమును తెలిపితిని. ఇంకనూ ఏమి వినదలచితినో చేప్పుము.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున బృహదుపాఖ్యానమున వసుమోహినీ సంవాదమున ప్రయాగమాహాత్మ్యమున అరువది మూడవ అధ్యాయము.