నారద మహా పురాణము - ఉత్తరార్థము
18 - మాతృ సన్మానమ్
రాజు పలికెను :-
ఓ భయశీలా ? నేను రాజరికమును గ్రహించుటకు ప్రయత్నము చేయుటలేదు. శ్రమచే అలసిన నాకు ఆనందమును కలిగించు నిద్ర వచ్చినది. మోహినిని సర్వరత్న విభూషితము, తగినంతగాలి వెలుతురు కల, అన్ని ఋతువుల అనుభూతిని కలిగించు నీ మందిరమునకు తోడ్కొని పొమ్ము. ఈమె నాకు అత్యంత ప్రియమగు భార్య. కావున యధావిధిగా పూజించుము. అని పుత్రుని ఆదేశించి నేను శయ్యను చేరి దరిద్రుడు ధనమును పొందినట్లుగా, ఏ ప్రయత్నము లేకనే నిద్రను పొందితిని. మెలకువ రాగానే నీ వద్దకు వచ్చుచున్నాను. నీవెట్లు చెప్పిన అట్లే చేసెదను. అని పలికెను.
మోహినీ పలికెను :
ఓ రాజేంద్రా! నన్ను వివాహ మాడినందు వలన దుఃఖితులై కామభోగములందు నిరాశలైన నీ భార్యలను మొదట ఓదార్చుము. ఓ రాజా రూపవతులగు పెద్ద భార్యల శిరమున చిన్న భార్య యనేడు మొలను నాటిన వాడు సద్గతిని పొదజాలడు. ఆనందమును పొందజాలడు. పతివ్రతల కన్నీటితో దహించబడు నాకు శాంతియెట్లు కలుగును? పతివ్రతా స్త్రీలు నన్ను పుట్టించిన బ్రహ్మను కూడా భస్మము చేయగలరు. ఇక సామాన్యులైన మన విషయమున ఏమి చెప్పవలయును. ఓ రాజా? సంధ్యావలి వంటి స్త్రీ ఈ మూడు లోకములలో లేదు. నీ మీది ప్రేమతో నన్ను షడ్రసములతో భుజింప చేసెను. నీ మిది గౌరవముతో నాతో ప్రియముగా మితముగా మాటలాడుచున్నది. ఇటువంటి పతివ్రతలు వందల మంది నీ ఇంటిలో కలరు. నేను వారి కాలి దుమ్ముతో సరికా జాలను. అంతట రుక్మాంగద మహారాజు మోహిని మాటలను విని బిడియ పడెను. పుత్రునితోనున్న పెద్ద భార్యయగు సంధ్యావలిని చూచి మరి కొంత సంకోచించెను. అంతట ఇంగితము నెరిగిన ధర్మాంగదుడు తండ్రి దశావస్థలను పొందుట, కామ సంతప్తుడగుట, మోహిని యందు మోహము కలిగి యుండుట తెలిసి సంధ్యావలి మొదలగు తల్లులందరిని పిలిచి చేతులు జోడించి ఇట్లు పలికెను. తల్లులారా? నా తల్లియగు మోహిని కొత్తగా పెళ్ళి యాడినది. బ్రహ్మపుత్రిక. ఆమె తనతో క్రీడించుటకు రాజును రహస్యముగా ఉండవలయునని కోరుచున్నది. కావున మీరు సంతోషముతో ఆమోదించుడు.
తల్లులు పలికిరి :
ఓ పుత్రా ! తనను సంపూర్ణముగా భక్షించుటకు ఎవరు అంగీకరింతురు? తన దేహమున తామే అగ్నిని ఎవరు వెలిగింతురు? ఘోరమగు విషమునెవరు భక్షించెదరు? తన శిరమును తానుగా ఎవరు ఖండించు కొందరు. మేడకు పెద్ద శిలను కట్టుకొని ఎవరు సముద్రమును దాటగరు? పులినోటిలోనికి ఎవరు ప్రవేశించెదరు. సింహము కేశముల నెవ్వరు లాగెదరు? ఆకాశమున ప్రకాశించు ఖడ్గము అంచుపై ఎవరు కూర్చుందురు? అట్లే తమ భర్త సవతితో క్రీడించుటకు ఏ స్త్రీ ఆమెదించును? అన్నిటిని ఈయవచ్చును కాని భర్తను ఈయజాలము. దీనికన్నా ఖడ్గముతో శిరము ఛేదించుకొనుటమేలు. మరొక స్త్రీచే ఆదరించబడిన ప్రియుడగు భర్తను ఏ యువతి ప్రేమతో చూడజాలదు. తన ప్రాణసముడగు భర్త అన్యస్త్రీ కుచపీడనమును చేయుటకు ఏ స్త్రీ అంగీకరించ జాలదు. ఈ విషయమును వినియే సహించజాలదు. ఇక కంటితో ఎట్లు చూడగలదు? తన భర్త పర స్త్రీ యందు ఆసక్తుడగుటను తన కంటితో చూచుటయే అన్ని దుఃఖములలో గొప్ప దుఃఖము. ఈ దుఃఖమున కంటే నీ తల్లులందరూ ఒకేసారి చనిపోవుట మేలు. అంతే కాని మా భర్త మోహినితో కలిసి యుండగా చూడజాలము.
ధర్మాంగదుడు పలికెను:-
ఓ తల్లులారా? మీరు నా తండ్రికి సౌఖ్యమును కలిగించనిచో విషమును బాగా కలిపి త్రాగ గలను. నేను మరణించిన తరువాత మీరు ఆనందించుడు. నా తండ్రికి కర్మచే కాని, మనసుచే కాని, వాక్కుచే కాని దుఃఖమును కలిగించు వారు సంధ్యావలీ దేవి అయిననూ నాకు వధించదగిన శత్రువే యగును. మీ అందరిలో నా తండ్రికి మోహిని ఎక్కువగా ప్రియమైనది. చిన్న వయసులో నున్నది. నా తండ్రితో క్రీడించుటకు మందర పర్వత శిఖరము నుండి వచ్చియున్నది. ఇట్లు పలికిన ధర్మాంగదుని మాటలు వినిన తల్లులందరూ భయముచే కంపించుచు తనయుని హితమును కోరి డగ్గుత్తికతో ఇట్లు పలికిరి. పుత్రా ! నీ మాటను న్యాయ సమత్మము కావున తప్పక పాటించ వలయును. కాని మాకు తగిన విధముగా సంపదలనిచ్చి నీ తండ్రి మోహినితో క్రీడించవచ్చును. భర్త ఒక భార్య యుండగా రెండవ దానిని పెళ్ళి యాడినచో పెద్ద భార్య రెండు రెట్లు సంపదల నీయవలయును. లేనిచో ఋణగ్రస్తుడగును. పెద్ద భార్య అనుమతిని పొంది మరోక యువతిని వివాహమాడినచో పెద్ద భార్య కోరినదానిని ఈయవలయునని పెద్దలు చెప్పెదరు. ఇష్టా పూర్తములను మాత్రము పెద్ద భార్యతో కలిసి ఆచరించవలయును. ఇది ధర్మము. అట్లు చేయనిచో అన్యాయము ధర్మ సంక్షయము జరుగును. ఇట్లు చెప్పిన తల్లుల మాటలను విని సంతోషము నిండిన మనసుతో ఒక్కొక్క తల్లికి కోటి కోటిని సువర్ణములను సహస్ర నగరములను, గ్రామములను ప్రదానము చేసెను. నాలుగశ్వములతో కూర్చిన ఎనిమిది రధములను కాంచనమాలలు కలవాటినిచ్చెను. శతాధిక మూల్యము గల పదివేల వస్త్రములను ఇచ్చెను. పరిశుద్ధము, మేరు పర్వత సంజాతము, అక్షయము అగు లక్ష బంగారు ముద్రలను ఒక్కొక్క తల్లికిచ్చేను. నూరుమంది దాసులను, నూరుమంది దాసీ జనమును అర్పించెను. కుంభము నిండపాలు నిచ్చెడు పదివేల ఆవులను ఒక్కొక్కరి కిచ్చేను. యుగంధర గజములన వేయి ఒక్కొక్కరికిచ్చెను. పది విధముగు ధాన్యములను ఇచ్చెను. లక్ష వాటులను నూనే కుండలను, నేతికుండలను ఇచ్చెను. సంఖ్యలేని మేకల నిచ్చెను. వేల కొలది స్వర్ణ భూషణముల నిచ్చెను. వజ్రములు పొదిగిన భూషణములను దానము చేసెను. ప్రకాశవంతములగు ధాత్రీ ప్రమాణములైన హారములను, అయిదు ఏడు చొప్పున కంకణములను ఇచ్చెను. చంద్రునివలే ప్రకాశవంతములైన రెండు వందల యాభై ముత్యములు కల రెండు హారములను ఒక్కొక్కరి కిచ్చెను. ప్రస్థ- సంఖ్యతో కుంకుమను, చందనమును, కస్తూరిని ఎక్కువగా ఇచ్చెను, తండ్రి సుఖమును కోరి తల్లులందరికి భేద దృష్టిని విడిచి భోజన పాత్రలను, జలపాత్రలను, ఘృతక్షీర పాత్రలను, వివిధ పాన పాత్రులను వేలకొలది పదునాలుగు వందలను ఇచ్చెను. కొంచన స్థాలులను కుంభములతో ఎనిమిది వండలు ఇచ్చెను. బాగుగా బలిష్టములగు ఇరువది ఇరువది ఆడ ఏనుగులనిచ్చెను. వంద ఆడ ఒంటెల నిచ్చెను. బలిష్ణులగు పురుషులచే మోయబడు పల్లకులను చాలా ఇచ్చేను. చాలా వేగము గల పదిఏడు అశ్వములను ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు తల్లులందరకి చాలా ధనములనిచ్చి ధన పతిసముడుగా ఖ్యాతి పొంది, ధన్యత నంది వారికి ప్రదక్షిణల నాచరించెను. చేతులు జోడించి ఇట్లు పలికెను. నేను శిరసు వంచి ప్రణామము నాచరించి ప్రార్థించితిని కావున మీరందరూ కలిసి మా తండ్రి గారితో యధేచ్ఛముగా మోహినిని అనుభవించుడు అని పలుకుడు. ఈ విషయమున మిరే మాత్రము సంకోచించ వలదు. మాకు ఈర్య కొంచెము కూడా లేదు. సుశీల బ్రహ్మ సుతయగు మోహినిని రహస్యముగా చాలా కాలము ఆనందముగా రమించుము. అని చెప్పుడు. అట్లు ధర్మాంగదుని మాటలను విని తల్లులందరు ఆనందముతో పులకించి భర్తతో సీతాదేవితో రామచంద్రునివలె బ్రహ్మ పుత్రికతో చాలా కాలము రమించుము అని పలికిరి. నీ సంగమమును పొందు మోహిని మాకు ప్రతికూల కాదు. పుత్రుని తేజస్సుచే మా దుఃఖము తొలగి ఇట్లు చెప్పుచున్నాము అని పలికిరి.
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తరభాగమున మాతృ సన్మానమను పదునెనిమిదవ అధ్యాయము.
