నారద మహా పురాణము - ఉత్తరార్థము
37 - అధ్యాయము
మోహిని పలికెను:- ఓ దేవతలారా ఏకాదశితో సమానమగు పావనము మరొకటి లేదు. ఏకాదశిచే మహాపాపులు కూడా పవిత్రులై శ్రీ హరిలోకమును చేరెదరు. కావున ఏకాదశీ సమీపమున నాకు స్థానముచితమని తోచుచున్నది. ఆలోచించుడు.
దేవతలు పలికిరి:- ఏకాదశినిశీథకాలమున విద్ద అయినచో దేవతలకు, సూర్యోదయకాలవేధ సురలకు అని శ్రీహరియే కల్పించెను. త్రయోదశి పారణ ఉపవాసమును నశింప చేయును. వైష్ణవాగమమున ఎనిమిది మహాద్వాదశులని చెప్పబడినవి. ఎనిమిది ద్వాదశులు ఏకాదశీ భిన్నములుగా వైష్ణవులచే ఉపవసించబడును. మహాత్ములగు విష్ణుభక్తులకు రెండు పక్షములలో యథావిధిగా ఏకాదశీ వ్రతము భిన్నముగా త్రిదానాత్మకముగ నుండును. ప్రాతః కాలము సాయంకాలము భోజనము చేయరాదు. యధాక్రమముగా పూర్వాహ్లాపరాహములలో విసర్జించవలయును. ఏకాదశి విద్ద అయినచో మరునాడుప వసించవలయును. ద్వాదశినాడు నిర్జలముగా ఉపవసించవలయును. ఉపవసించ శక్తిలేనివారు జలమును, శాకమును, ఫలమును, పాలను, శ్రీహరి నైవేద్యమును కాని తన ఆహారములో నాలుగవ భాగమును భుజించవచ్చును. సూర్యోదయకాలమున విద్ద అయినచో స్మార్తులు ఏకాదశిని విడిచెదరు. నిష్కాములు మధ్య రాత్రి విద్దను విడిచెదరు. అన్నిలోకములలో దశమి యమధర్మరాజతిధియని తెలిసి యున్నది. దశమీ ప్రాంతమున నీవు ఉండవలయును. దీనితో దేవకార్యముకూడా సిద్ధించును. సూర్య చంద్రులతో తిరుగుచు దశమీ ప్రాంతమున నివసించుము. నీపాపనాశమునకై సర్వతీర్ధములలో సంచరించుము. అరుణోదయమునుండి సూర్యోదయమగువరకు సంచరించుము. ఆమధ్యలో వ్రతమున చేరి ఏకాదశీఫలమును పొందుము. దశమీ విధ్ధ యగు ఏకాదశిన వ్రతము నాచరించువాడు నీకు ఉపకారకుడగును. ఈనాడు అరుణోదయకాలము ముహుర్తద్వయపరిమితమని తెలియుము.
రాత్రికి పగలుకు పదిహేను ముహుర్తములుండును. తైరాశిక విధానము ననుసరించి రాత్రింబవళ్ళు హ్రస్వములు దీర్ఘములు అగును. పదమూడవ ముహుర్తము తరువాత రాత్రిపూట వచ్చును అపుడుపవసించువారి పుణ్యమును నీవు పొందెదవు. స్వస్థురాలవు కమ్ము, యముని స్థాపించుటకు వైకుంఠధ్వంసమునకు పాషండవృద్ధి కొఱకు, పాపమును పెంచుటకు నీకు ప్రత్యూషసమయ సమీప ప్రాంతమునిచ్చుచున్నాము. ఈ లోకమున దశమీవిద్దయగు ఏకాదశినాడు వ్రతము నాచరించువారి పుణ్యము నీకు లభించును. ఆ ఫలమును నీవు అనుభవించుము. , ప్రసన్నురాలవు కమ్ము. బ్రహ్మాదులు ఇట్లు చెప్పగా మోహినీ మిక్కిలి సంతోషించెను. తన పాపపరిహారమునకు తీర్థ సేవనము చేయుటచే తన జీవితము కృతార్థమగునని తలచెను. దేహము భస్మావశేషమైననూ దేవకార్యమును సాధించితిని. చైతన్యమాత్రముండి వాయురూపముగా నుండి కూడా రాజు చేసిన మార్గమును తుడిచివేసితిని. నేను సంతోషముతో పలికిన మాటనాచరించితిని. ఇట్లు విచారించి బ్రాహ్మణులను పురోహితుని నమస్కరించి సూర్యవిహీనమగు దశమిప్రాంతకాలమున జనమోహనము కొరకు నివసించెను. కృచ్చాంతరూపముగా దినమున భుజించువారికి ప్రకృష్టరూపముగా, నరకమును
ప్రసాదించును. దశమీప్రాంతమున నున్న మోహినిని చూచిన యమధర్మరాజు సంతోషముచే విప్పారిన మోము కలవాడై ఇట్లు పలికెను. ఓ చారునేత్రి! నీవు' మరల ఈ లోకమున నా ప్రతిష్టను నిలిపితివి. రుక్మాంగదుని మత్తేభము పై నున్న పటహమును ఛేదించగలిగితివి. కార్యము దృష్టముగాన జనులందరూ విశ్వసింతురు. కావున సూర్యోదయకాలమును స్పృశించు దశమీ ఎపుడూ నిందితమే. స్పర్శలేని ఉదయము నరులను మోహింప చేయును. పావు భాగము ఉన్ననూ అదృశ్యరూపముగా నున్న ప్రియయోగభుక్తిని విడిచి ఉంటివి. కావున నిజముగా నిన్ను మోహిని అని జనులు పిలుచుచున్నారంటే నీ పేరు సార్థకమే. సమస్త జనమును మోహింప చేసినా పటమున వ్రాయించుచున్నావు. ఇట్లు యమధర్మరాజు పలికి ఆ బ్రహ్మపుత్రికను నమస్కరించి సంతోషించెను. దేవతలతో కలిసి చిత్రగుప్తుని చేత పట్టుకొని తన లోకమునకు వెళ్ళెను. ఇట్లు దేవతలందరూ వెళ్ళిన తరువాత మోహిని సురాసురనాయకుడగు బ్రహ్మను సమీపించి ఇట్లు విజ్ఞాపన చేసెను. ఓ తండ్రీ! ఈ పురోహితుడు చాలా భయంకరుడు. ఇతని కోపముచే నా శరీరము దగ్గమాయెను. మరల శరీరమును దాల్చునట్లు చేయుము. దశమీప్రాంతమున నిలిచి నేను జగత్తును మోహింపచేసితిని. పూర్వము రాజు యముని గెలిచెను. నేడు నీ ప్రభావముతో యముడు విజయి ఆయెను. నేను మరల దేహమును ధరించునట్లు నీవు చేయవలయును. పురోహితుని శాంతింపచేయుము. లోకకర్తయగు బ్రహ్మ మోహినీ వాక్యమును విని పుత్రిక కొరకు మరల పురోహితుని ఓదార్చసాగెను. ఓ బ్రాహ్మణా! నేను
నీకు ఈ మోహినికి సర్వలోకమునకు హితము కలుగుటకు చెప్పుమాటను వినుము. నీ
కోపముచే ఈ మోహిని భస్మమైనది. మరల శరీరమును యాచించుచున్నది. కావున అనుమతినిమ్ము. నాపుత్రిక నీకు కూడా గౌరవించదగినదే. ఇపుడు దుర్గతిని చెందుచున్నది. నేను నీవు ఆమెను కాపాడవలయును. ఆమె దీక్షతో దేవకార్యమునాచరించినది. నీవు పరిశుద్ధభావముచే అనుమతించినచో నేను ఈమెకు మరల దేహమును కల్పించెదను. కాని హరివాసరమును ద్వేషించి పాపమునాచరించినది కావున ఈమె పరిశుద్దికి ఉపాయమును ఆలోచించుము. బ్రహ్మ మాటలను వినిన పురోహితుడు పరిశుద్దాంతకరణముతో
మోహినికి దేహకల్పనకనుమతించెను. బ్రాహ్మణవాక్యమును వినిన లోకపితామహుడగు బ్రహ్మ కమండలు జలమును మోహినీ దేహభస్మము పై చల్లెను. ఇట్లు కమండలు జలమును చల్లిన వెంటనే మోహిని దేహమును దాల్చెను. తండ్రియగు బ్రహ్మను నమస్కరించి పురోహితుని పాదములను పట్టుకొనెను. అంతట రుక్మాంగద పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు పలికెను.
వసువు పలికెను:- ఓ మోహినీ! బ్రహ్మవాక్యము వలన నేను కోపమును విడిచితిని. తీర్థస్నానాదికర్మలచే నీకు గతిని కల్పించెదను. ఇట్లు పలికి బ్రహ్మను పంపివేసెను. ఇట్లు. మోహినిని పురోహితుని సంతోషింపచేసి బ్రహ్మ తమస్సునకు దూరముగా నున్న తనలోకమునకు ఆవ్యక్తమార్గముచే వెళ్ళెను. రుక్మాంగద పురోహితుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడగు వసువు మోహినిని అనుగ్రహించవలయునని తలచి హృదయమున ఆలోచించుచు ముహూర్తకాలము ధ్యానించి గథి కారణమును తెలుసుకొనెను.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున ముప్పది యేడవ అధ్యాయము.
