నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

66 - హరిద్వార మాహాత్మ్యమ్

మోహిని పలికెను :- బ్రాహ్మణోత్తమా! పాపహరమగు గొప్ప కురుక్షేత్ర మాహాత్మ్యమను వింటిని. ఇది సర్వసిద్ది ప్రదమని నీ నుండి తెలిసితిని. గంగాద్వారమని ప్రసిద్ధి పొందిన పుణ్యావహతీర్థమాహాత్మ్యమును తెలుపుము. వినుటకు నాకు కోరిక యున్నది.

వసువు పలికెను : వినువారికి చదువు వారికి పాపనాశమగు పుణ్యప్రదమగు గంగాద్వార మాహాత్మ్యమును చెప్పదను. వినుము. భగీరధుని రథముననుసరించిన గంగ వేలకొలది పర్వతములను భేదించుకొని భూమికి చేరిన ప్రదేశము అలకనందయనబడు చున్నది. పూర్వము ఇచటనే దక్షప్రజాపతి యజ్ఞేశుని పూజించెను. ఈ యజ్ఞమునకు ఆహ్వానించబడిన ఇంద్రాది దేవతలు యజ్ఞభాగమును గ్రహించగోరి తమ తమ పరివారములతో వచ్చిరి. అట్లే బ్రహ్మర్షులు శిష్యప్రశిష్యులతో, రాజర్షులు అందరూ వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సిద్ద విద్యాధరోరగులు అందరూ యజ్ఞభూమికి వచ్చిరి.ఒక శంకరుడు మాత్రము రాలేదు. అంతట దక్షయజ్ఞోత్సవమునకు ప్రియులతో కలసి విమానములలో వెళ్ళువారిని చూచిన సతీదేవి ఉత్కరంఠతో మహాదేవుని తాను వెళ్ళుటకు ప్రార్థించెను. మహాదేవుడు సతీదేవి ప్రార్థనను విని వెళ్ళుట మంచిది కాదని పలికెను. జరుగవలసిన దానిని గౌరవించిన సతీదేవి మహాదేవుని మాటను ఆదరించక ఒంటరిగా తండ్రి యజ్ఞమును చూచుటకు వెళ్ళెను. కాని సతీదేవితో అచట ఎవరూ మాటాడలేదు. ఆ అవమానమును భరించలేని సతీదేవి అచటనే ప్రాణములను విడిచెను. ఆ ప్రదేశము పవిత్ర క్షేత్రమాయెను. ఈ తీర్థమున స్నానము చేసి దేవతలకు పితరులకు తర్పణము చేసినవారు సతీదేవి ప్రీతిపాత్రులై భోగములను మోక్షమును పొందుదురు. ఇచట నిరాహారాదులచే ప్రాణములను విడిచినవారు శివుని చేరి మరల జన్మను పొందరు. అంతట తన ప్రియురాలి దేహత్యాగమును నారదునివలన వినిన శంకురుడు వీరభద్రుని సృజించెను. వీరభద్రుడు. ప్రమధ గణములతో వేడలి ఆయజ్ఞమును ధ్వంసము గావించెను. బ్రహ్మ ప్రార్థనచే మృతులను జీవింపచేసి మరల యజ్ఞమును చక్కబరచెను. ఇట్లు చేసిన ఈ ప్రదేశము సాటిలేని ఉత్తమ తీర్థమాయెను. ఇచట స్నానమాడిన చంద్రుడు రోగవినిర్ముక్తుడాయెను. ఇచట స్నానమాడి కోరిన ప్రతి కోరిక తీరును. ఇచటనే దక్షప్రజాపతి దేవతలు యజ్ఞేశ్వరుడగు శ్రీహరిని స్తుతించిరి. ఇదియే శ్రీహరి క్షేత్రమాయెను.ఈ హరిక్షేత్రమున స్నానమాడిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై భుక్తిని ముక్తిని పొందెదరు. ఇచట నుండి పూర్వదిగ్భాగమున త్రిగగమను తీర్థము కలదు. ఇచట గంగ ప్రత్యక్షముగా అందరికి త్రిపథగా కనిపించును. ఇచట శ్రద్దతో స్నానమాడి దేవతలకు పితరులకు ఋషులకు దేవతలకు తర్పణము నిచ్చినవారు స్వర్గమున దేవతల వలె ఆనందింతురు. ఇచట ప్రవాహమున పడి మరణించిన వారు దేవతల వలె ఆనందింతురు. ఇచట ప్రవాహమునపడి మరణించినవారు దేవతల పూజనంది విష్ణులోకమును చేరెదరు. ఇచటికి దక్షిణ దిశలో నున్న కనఖల తీర్థమున మూడు రాత్రులుపవసించి స్నానమాడి సర్వపాప వినిర్ముక్తుడగును. ఇచట వేదపారగుడగు బ్రాహ్మణునకు గోదానమును చేసినవారు వైతరణీనదిని యముని చూడజాలరు. ఇచట చేసిన జపము తపము దానము యజ్ఞము అక్షయమగును. ఇచటనే జహ్నుతీర్థము కలదు. ఇచటనే పూర్వము జహ్నుమహర్షి గంగానదిని గండూషముగా చేసి పానము చేసెను. తరువాత దేవతలు ప్రార్థించగా చెవి నుండి విడిచెను. ఇచట శ్రద్ధగా స్నానము చేసినవాడు ఉపవాసముతో దేవపారగుడగు బ్రాహ్మణుని పూజించి పరమాన్నముతో భుజింపచేసిన కల్పకాలము స్వర్గమున నివసించును. ఇచటికి పశ్చిమమున ఉన్న కోటీ తీర్థమునకు వెళ్ళి కోటీశుని దర్శించుటచే కోటి గుణముగు పుణ్యమును పొందును. ఇచట ఒక రాత్రి ఉపవసించి పుండరీకఫలమును పొందును. ఇచటికి ఉత్తర దిగ్భాగమున సర్వపాతక నాశనమగు సప్తగంగయను ప్రసిద్ధ క్షేత్రము కలదు. ఇచటనే పవిత్రములగు సప్తర్షుల ఆశ్రమములు కలవు. వీటిలో ఒక్కొక్క తీర్థమున వడిగా స్నానమాడి దేవతలకు తర్పణముగావించి పితృతర్పణము చేసి సనాతనమగు ఋషిలోకమున చేరును. భగీరధుడు గంగను తీసుకొని వచ్చినపుడు ఋషుల ప్రీతి కొరకు ఇచటనే సప్తధారలుగా మారెను. అందువలన సప్త గంగ తీర్థమని ప్రసిద్ధిగాంచినది. ఇచట నుండి ఆవర్తమున చేరి దేవపిత్రాదులను తృప్తిపరచి స్నానమాడి ఇంద్రలోకమున యుగములు నివసించును. తరువాత కపిలాప్రదమును చేరి బ్రాహ్మణునకు గోదానమును చేసి సహస్ర గోదానఫలమును పొందును. ఇచటనే పరమపావనమగు నాగరాజు తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు సర్పములనుండీ అభయమును పొందును.

తరువాత లలితకమను శంతను తీర్థమును చేరి స్నానమాడి దేవాదులను యధావిధిగా తృప్తి పరిచి ఉత్తమ గతిని పొందును. ఇచటనే శంతనుడు మనుష్యభావమును పొందిన గంగను పత్నిగా పొందెను. ఇచటనే అష్ట వసువులను సంవత్సర క్రమములో ప్రసవించి దేహమును విడిచెను. ఆ దేహము ఇచటనే పడెను. ఇచటనే ఋక్షజన్మ కలిగెను. ఇచట స్నానమాడి ఈ ఔషధిని భక్షించినచో గంగాదేవి ప్రసాదమువలన దుర్గతిని పొందజాలరు. తరువాత భీమస్థలమును చేరి స్నానమాడినవాడు ఇహమున సకల భోగములను పొంది అంతమున స్వర్గమును చేరును. ఇవి ఇచట ముఖ్యమగు తీర్థములు. ఇచట ఇంక నూర్లకొలది తీర్థములు కలవు. బృహస్పతి కుంభరాశిగతుడైనపుడు, సూర్యుడు మేషరాశిగతుడైనపుడు ఈ క్షేత్రమున స్నానమాడినవాడు సాక్షాత్తుగా వాక్పతి అపరసూర్యుడుగా విరాజిల్లును. ప్రయాగాది పుణ్య తీర్థములకు పృథూదకములకు వెళ్ళినపుడు వారుణయోగమున మహావారుణయోగమున ఇచట యధావిధిగా స్నానము చేయవలయును. బ్రాహ్మణులను భక్తిచే పూజించి బ్రహ్మలోకమునుపొందును. సంక్రాస్తియందు అమావాస్యయందు, వ్యతీపాతమునందు, యుగాదియందు, ఇతర పవిత్ర దినములందు ఏ కొంచెము దానము నాచరించిననూ అది కోటి గుణమగును. దూరముననున్నవాడు కూడా గంగాద్వారమును స్మరించినచో అంత కాలమున హరిని స్మరించినవాని వలె సద్గతినిపొందును. హరిద్వారమున పూజించిన ప్రతిదేవుడు పూజంచినవారి మనోరథములను తీర్చును. ఇదియే తపస్నానము. జపస్నలము. హోమస్థానము. ఇచట నియమబద్ధుడై గంగా సహస్రనామమును త్రికాలములందు పఠించువారు అక్షయసంతానమును పొందును. గంగాద్వారమున భక్తితో పురాణమును వినువారు అవ్యయపదమును పొందును. హరిద్వారమాహాత్మ్యమును వినువారు, పఠించువారు కూడా స్నానఫలమును పొందుదురు. గంగా మాహాత్మ్యమును వ్రాసి ఇంటిలో ఉంచుకొనిన సర్పచోరాగ్నిగ్రహ రాజభయములు కలుగవు. శ్రీహరి అనుగ్రహము వలన అతని ఇంటిలో సంపదలు పెరుగుచుండును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున వసుమోహినీ సంవాదమున హరిద్వారమాహాత్మ్యమను అరువదియారవ అధ్యాయము.