నారద మహా పురాణము - ఉత్తరార్థము
27 - కాష్ఠీలోపాఖ్యానమ్
వసిష్ఠ మహర్షి పలికెను :-
ఇట్లు పలికిన తండ్రి మాటలను వినిన ధర్మాంగద మహారాజు త్వరగా పరమ పవిత్రురాలగు తల్లియగు సంధ్యావతీ దేవిని పిలిచెను. ఆ సంధ్యావలీ దేవి పదివేల సూర్యుల కాంతి గలది. రుచిరస్తన. పాద విన్యాసములచే ఈ భూమండలమంతటిని పాలించుచున్నది. పుత్రుని పిలుపుతో వెంటనే రాజు సమిపమునకు వచ్చెను. మోహినీ వాక్యమును, రుక్మాంగద మహారాజు వాక్యమును తల్లికి వినిపించెను. రాజునకు మోహినికి సంధిని చేయుము. మోహినిని ఓదార్చుము. ఏకాదశినాడు భుజించవలయునని పట్టుపట్టుచున్నది. రాజు సత్యభ్రష్టుడు కాకూడదు. ఏకాదశినాడు భుజించకూడదు. మోహిని కోరిక తీరవలయును. ఇట్లు ఇద్దరికి కుశలమగునట్లు చేయుము. అని ధర్మాంగదుడు తల్లిని ప్రార్థించెను. అపుడు సంధ్యావలీ దేవి పుత్రుని మాటలను విని బ్రహ్మపుత్రికయగు మోహినితో మృదువుగా ఇట్లు పలికెను. ఓ సుందరీ ! పట్టు పట్టకుము, రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు ఎట్టి పరిస్థితులలోనూ పాపాన్నమును భుజించడు కావున రాజును అనుసరించుము. ఇతను సనాతనుడగు గురువు, భర్త మాటను పాలించు స్త్రీకి సావిత్రీ దేవికీవలే పవిత్రములగు పరలోకములు అక్షయములగును. పూర్వము కామారుడై మోహితుడై ఈ రాజు ఇచ్చిన దక్షిణ హస్తమును గూర్చి ఆలోచించరాదు. ఈయదగిన దానిని ఇతను తప్పక ఇచ్చును. ఈయరాని దానిని కోరకుము. సన్మార్గమున నున్న వానికి ఆపదలు కలిగిననూ మేలేకాని సన్మార్గమును వీడరాదు. శిశువుగా నున్నపుడు కూడా ఈ రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు భుజించలేదు. ఇక ఇపుడెట్లు పుణ్యప్రదమగు ఏకాదశినాడు భుజించును. కావున నీవు నీకు నచ్చిన పరమ దుర్లభమగు మరొక వరమును కోరుకొనుము. ఆ వరమును రాజు తప్పక ఇచ్చును. కావున ఏకాదశీ భోజనమును కోరకుము. ధర్మాంగదుని తల్లిగా నన్ను తలచినచో మా ప్రాణములతో పాటు ఈ రాజ్యమును కోరుము. సప్త ద్వీప సహితముగా నదీవన పర్వత సమేతముగా భూమండలమునంతటిని కోరుము. పెద్ద దాననగు నేను చిన్నదానవగుణీకు భర్త కొరకు పాధవందనమును చేతును. ప్రసన్నురాలవు కమ్ము, శపథములను చేసి కఠిన వాక్కుచే పతిని నిర్బంధించి ఆ కార్యమును చేయించిన స్త్రీ నరకమును పొందును. నరకము నుండి వచ్చి పన్నెండు జన్మలు సూకరముగా పుట్టును. తరువాత చండాల జన్మను పొందును. ఈ విషయమును తెలిసి నీపై స్నేహముతో నిన్ను పాప కార్యము నుండి వారించుచున్నాను. ఓ పద్మముఖీ ! ధర్మమును కోరువారు శత్రువులకైననూ సద్బుద్ధిని నేర్పవలయును. ఇక మిత్రురాలవు నీకేల బోధించరాదు. సంధ్యావలి మాటలను వినిన మోహయుక్తయగు మోహినీదేవి భర్తకు ప్రియురాలు పెద్దభార్య కనక సన్నిభయగు సంధ్యావలితో ఇట్లు పలికెను.
ఓ సుందరీ! నీవు నాకు గౌరవించదగినదానవు నీ మాటను పాటింతును. పండితులు నారదాదిమునులు చెప్పిననూ రుక్మాంగద మహారాజు ఏకాదశినాడు భోజనము చేయనిచో నీకు మరణముకంటె ఎక్కువ దుఃఖమును కలిగించు మరియొక దానిని చేయుమనుము ఇది నాకు కూడా దుఃఖప్రదమే. కాని నేను దైవవశమున పలుకు చున్నాను. ఆత్మహత్య ఎవరికి ఇష్టముండును. విషభక్షణము గిరిశిఖరమునుండి పడుట సర్పములతో క్రీడించుట, వ్యాఘసింహములకు ఎదురుగా వెళ్ళుట, సముద్రమును దాటుట, దురుక్తములను, అసత్యములను పలుకుట, పరదారాభిమర్శనము, అపధ్యభిక్షణము, అభక్ష్యభక్షణము, వేట, ద్యూతము, సాహసము, తృణకాష్టచ్చేదనము, లోష్టమర్దనము, సూక్ష్మజీవుల హింస, జలాగ్ని క్రీడ, ఎవరికీ ఇష్టముండును. దైవవశమున మానవుడు వీటిని చేయును. త్రివర్గ చ్యుతములు ఘోరములు యశోహరములు, దేహహారములు అగువాటిని దైవవశమున చేయును. నరకారుడై అశుభకర్మలను చేయును. కావున నేను పాపురాలను దురాచార పరురాలను నిర్ణయగా చేప్పదలచుచున్నాను. ఏ భావముతో యోనియందు శుక్రమును విడుచునో ఆభావముతోనే సంతానము కలుగును కావుననేను రుక్మాంగదమహారాజుతో కలహించుటకే బ్రహ్మచే స్త్రీ రూపముగా సృజించబడితిని. దుష్టభావము చే పుట్టితిని. రాజునకు అపకారములే చేయుచున్నాను. లగ్నము, గ్రహములు, హోర ఇవేవియు పనికిరావు. సమాగమకాలమున నుండు భావననే గ్రహించవలయును ఆ భావముతోనే నరుడు పుట్టును. అట్టి భావముతో పుట్టిన వారికి దయ యుండదు. బిడియము, స్నేహము, ధర్మము ఉండవు. అయుక్తమని తెలిసి కూడా ఆ భావమునే అనుసరించును. కావున ఇపుడు నేను నీవు ప్రాణహరము, నీతోటి స్త్రీలకు, నీభర్తకు, ప్రజలకు దుఃఖప్రదము, మనసులో కూడా ఆలోచించలేనిది నాకు కూడా చెప్పరానిదియగు మాటను చెప్పెదను, నామాటను నీవుచేసినచో నీకు ఈలోకమున గొప్పకీర్తి కలుగును. నీభర్తకు యశస్సు వచ్చును నీకు స్వర్గగమనము లభించును. నీ పుత్రునికి ప్రశంస కలుగును. నాకు నింద వచ్చును.
వసిష్ఠ మహర్షి పలికెను:
మోహినీ దేవి మాటలను వినిన సంధ్యావలీదేవి ధైర్యమును వహించి ఆమెను చెప్పుము చెప్పుము అని ప్రేరేపించేను. నాకు దుఃఖమను కలిగించుమాటను ఏమి చెప్పెదవు? నాభర్తను. అసత్యమునుండి కాపాడుటలో నాకు దుఃఖము కలుగదు. నామరణమున నాపుత్ర మరణమున కూడా, భర్త కొరకు చేయునపుడు రాజ్యనాశమున కూడా నాకు బాధ కలుగదు. సర్వసంపదలున్ననూ పాపాత్మురాలగు స్త్రీ వలన భర్త దుఃఖించినచో ఆస్ట్రీకి అధోగతియే లభించును. అట్టి స్త్రీ డెబ్బదియుగములు వూయమను నరకమును చేరును. తరువాత ఏడు జన్మలు చండాలురాలుగా జన్మించును. తరువాత కాకిగా, ఎలుకగా, బల్లిగా పుట్టి చివరికి గోజన్మతో శుద్ధిపొందును. భర్త కొరకు తన వద్ద ఉన్న ధనమును ఈయని స్త్రీ ప్రాణములను అర్పించనీ స్త్రీ మలమున క్రీమీగా పుట్టును. 'క్రిమిజన్మనుండి కట్టెలో పుట్టు పురుగుగా పుట్టును. నా చిన్నతనమున నా తండ్రి వద్ద కట్టెలను కొట్టువాడు అగ్నిని చేయుటకు కట్టెను చీల్చు చుండెను. నేను చెలికత్తెలతో ఆడుచు కట్టెలను కొట్టుచున్న ఆతని దగ్గరకు చేరితిని. అచటనేను అతను చీల్చిన కట్టెనుండి బయటకు వచ్చిన కాన్డీలా అను పురుగును చూచితిని. వెన్నవలేమెత్తనిది, కాటుకవలె నల్లని దేహమును ధరించునదిగా యుండెను. కనిష్ఠ మంత పొడుగు, బొటనవేలు లావుగా యున్నది. అట్లు పడిన ఆ పురుగును చూచి చంపుటకు ఒక కాకి వచ్చెను ఆకలిగొన్న ఆకాకి ఆ పురుగును. గ్రహించుటకు రాగానే నేను రాయి విసిరి కాకిని పారద్రోలితిని. ఇట్లు కాకినుండి విడువ బడినది. కాని కాకి ముక్కు దెబ్బతిని గాయ పడినందున పరుగెత్త జాలకపాయెను. వణుకుచు ప్రాణములు విడుచు స్థితికి చేరెను. అపుడు నేను కొన్ని చల్లని నీటిని చల్లగా స్వాస్థ్యమును పొందెను. అంతట ఆకాషీలా చెలికత్తెల మధ్యనున్న నన్ను మనుష్యవాక్కుచే సంధ్యావలీ అని పిలచి ఇట్లు పలికెను. నేను పూర్వ జన్మలోసర్వజ్ఞుడగు సుమంతుడను మహర్షికి పుత్రికగా యుంటిని. కౌండిన్యుడను బ్రాహ్మణోత్తమునకు భార్యనైతిని కాన్యకుబ్జ నగరమున సర్వసంపత్సమృద్దురాలనై దర్పముతో జీవించుచుంటిని తల్లికి బంధువర్గమునకు తండ్రికి అత్యంతము ఇష్టురాలనైతిని. తండ్రి నన్ను కౌండిన్యునకు భార్యగా ఇచ్చెను. ఆ కౌండిన్యుడు మహానుభావుడు, కులీనుడు, రూపవంతుడు, స్త్రీ సంగరహితుడు కూడా. నా తండ్రి అల్లునికి కానుకగా శయ్యాదులనిచ్చెను నా మామగారు కూడా నాకు పదివేల బంగారు నాణెముల నిచ్చెను. అపుడునేను తండ్రి మామలు ఇచ్చిన ధనముతో పరిపూర్ణురాలనైతిని గోమఋష్యాదులతో ధనధాన్యములతో సమృద్ధిగా నుంటిని. అత్త మామాలకు ఇష్టురాలనుగా ఉంటిని. సౌశీల్యముతో జనులకు ఇష్టురాలనైతిని కొంతకాలమునకు వేద తత్వజుడ్డగు మా మామగారు మృతి చెందిరి. మరణించిన భర్తను తీసుకొని అత్తగారు కూడా అగ్నిలో ప్రవేశించెను. తరవాత నా భర్త తిలజలమును తర్పణమును చేసి శ్రాద్ధమును చేసెను. రెండునెలల తరవాత నా భర్త కామపీడితుడై కుతూహలముతో రాజమందిరమునకు వెళ్లాను. అచట యౌవన వతులు రూప వతులు అగు వేశ్యలను రాజగృహమున ప్రవేశించువారిని చూచెను. వారిలో ఇద్దరిని డబ్బిచ్చి తీసుకొని క్రీడించుటకు తన ఇంట్లో ఉంచుకొనెను. ఆ ఇద్దరు వేశ్యలు ధనమునంతటిని వ్యయము చేసిరి. మూడు సంవత్సరములలో నొ భర్త ధన హీనుడాయెను. అంతట నా భర్త నన్ను ఆభరణములను రాయమని యడిగెను. కానీ నేను వ్యసనపరుడైన నా భర్తకు ఆభరణముల నీయలేదు. నా సంపదనంతా తీసుకొని తల్లిగారిల్లు చేరితిని. తరువాత నా భర్త తండ్రి సంపదనంతా అమ్మి అవేశ్యలకిచ్చెను అది కూడా వ్యయ మాయెను. భూమిని ధాన్యమును పాత్రలను వస్త్రములను చాలా తక్కువ వెలకు అమ్మి సముద్రమునకు వెళ్ళెను. సముద్రమున అద్భుతములను చూచుచు చాలాదూరము వెళ్ళేను. సముద్రములో పుట్టిన ప్రాణుల చేష్టలను చూచుచుండెను. వాయువేగమున అనౌక నూరుయోజనముల దూరము పయనించెను. గాలివేగమునకు నౌక పగిలి అందులోని వారందరూ చనిపోయిరి. నా భర్తమాత్రము దైవవశమున ఒక పెద్ద కాష్ఠము నాశ్రయించెను. అతని పూర్వజన్మ కర్మవశమున గొని పో బడుచు రత్నశిఖర విభూషిత మగు చాలా కొండ వాగులు కలది, బహుపక్షిసమన్వితము, బహువృక్షసమాకీర్ణము, నానాపుష్ప ఫల సంయుతము, తమ శిఖరములచే ఆకాశము నంటుచున్న పర్వతమును చేరెను. ఆ పర్వతమునుచూచి నౌకాష్ఠమును విడిచి సంతోషముతో ధనకాంక్షియై పర్వతమునధిరోహించెను.
ఆకలి దప్పులతో ముహుర్తకాలము విశ్రమించెను. తరవాత ఆకలిని తీర్చుకొనుటకు లేచి అచటి వృక్షములను చూచేను. ఆ చెట్లకు చక్కగా పండిన ద్రాక్షపండ్లనుచూచి చక్కగా ఆరగించి సంతోషముతో శాంతిని పొంది ఒక నిర్మలమగు సాలవృక్షమును చూచెను. దట్టమైన నీడ గలది మేఘసన్నిభము, యాభైమంది పురుషప్రమాణము కలదిగా నుండెను. ఆ చెట్టు క్రింద తన ఉత్తరీయమును పరుచుకొని నిదురించేను. మోహమును కలింగించు నిదురతో మూసుకొని పోయిన కనులుగలవాడై బాగా అలసి నందున సూర్యాస్తమయము వరకు నిదురించేను. సూర్యుడస్తమించి రాత్రి రాగా మేఘమువలె గర్జించుచు ఒక రాక్షసుడొచ్చెను. . రావణాసురుడు సీతను తెచ్చునట్లుగా ఒకయువతిని తీసుకొని వచ్చెను. అయువతి కాశీరాజు పుత్రిక రత్నావళి కాళ్ళు కడుగకనే ఉత్తరదిక్కున తలచేసి పడుకొని యున్న దాననుతెచ్చెను. ఆ కన్య పతిని కోరుచుండెను. కానీ అనురూపుడగు పతి లభించలేదు. స్త్రీలందరిలో ఉత్తమురాలు నిద్రాకులురాలై ఏడ్చుచుండెను. కాశీరాజు తన పుత్రికా వివాహమును గూర్చి రాత్రింబవళ్ళు చితించుచుండెను. దీప పు నీడ నాశ్రయించియున్న శయ్యపై పరుండియుండెను. అంతటా తిరుగుచున్న పాపియగు రాక్షసుడు చూచెను. దీపరత్నములు పొదిగిన కంకణములను ధరించియుండెను. ఆ రెండు కంకణములను పదిరత్నములు పదిహేను నిష్కములు కలది. సీమంతమున ఏడురత్నములు, కేయూరమున పదమూడురత్నములు కలవు. ఇట్లు రత్నములచే పొదగ బడిన ఆభరణములను దాల్చిన కాంచనసమాన ప్రతిభగల చారుహాసినియగు బాలను రాజభవనమునుండి అపహరించెను. ఆకాశ మార్గముననుసరించి క్షణకాలమున తన గృహమును చేరెను. నా భర్త పడుకొనియున్న సాలవృక్షముగల పర్వతమును చేరెను. ఆ పర్వతమున అతని గుహ సువర్ణ సదృశకాంతి గలది గానుండెను. ఆరాక్షసుని భయమును సహించజాలక నా భర్త చూచుచుండగనే గుహలో ప్రవేశించెను. ఆ గుహలో చాలా మణులరాశులు కలవు. చిత్రమందిరములు కలవు. నానా ద్రవ్యసమాకీర్ణము, శయానాసనసంయుతము, భోజనములచే పాన పాత్రలచే బహువిధ భక్ష్యభోజ్యములచే కూడి యున్నది. ఇట్లు గుహలో ప్రవేశించి ఆ యువతిని శయ్యపై విడిచెను. ఆ యువతి మిక్కిలి భయముచే రోదించు చుండెను. బలిసిన పిరుదులు, బలిసిన చన్నులు కలది ఆ యువతిరోదనమును విని రాక్షసుని భార్య త్వరగా రాక్షసుడున్న ప్రదేశమున కొచ్చేను. తప్త కాంచన సన్నిభ, చారుసర్వాంగి యగు యువతిని చూచి, కోపముచే భర్తను బెదిరించుచు, నేను బ్రతికి యుండగా ఈ యువతి నేందుకు కొనివచ్చితివి? నేను నీకు భార్యను కానా ఇంకొక భార్యను కోరుచున్నావా? అని అడిగెను. ఇట్లు పలుకుచున్న తన భార్యను చూచి సంతోషముతో ఇట్లు పలికెను. ఓ శుభాననా, నీ ఆహారము కొరకు కాశీనగరము నుండి కొని వచ్చితిని. దైవముసమాకూర్చిన రెండవ ఆహారము నా కొజుకు ద్వారమున సిద్దముగా నున్నది. ఓ వరాననా ఒక బ్రాహ్మణుడు శాలవృక్షమునాశ్రయించి యున్నాడు. నీవు త్వరగా వెళ్ళి అతనిని కొనిరమ్ము. అతనిని నేను భక్షించెదను రాక్షసుని మాటలివి ఆకుమారి ఇట్ల పలికెను. ఓ రాక్షసీ! నీ భయముతో నీ భర్త అసత్యమును చెప్పుచున్నాడు. నీవు వృద్దురాలవని కురూపివని, కుటిలస్వభావురాలవని తెలిసి రాత్రిపూట తండ్రి గారింట్లో నిదురించి యున్న నన్ను కామారుడై చేరి, వివాహము కాని దానినని ఏడ్చుచున్న దానిని తన భార్య చేసుకొనుటకొరకు కొని తెచ్చెను. అని ఇట్లు రాజకుమారి చెప్పిన మాటలను విని మిక్కిలి కోపముకలపై మాటలుతబడుచుండగా ఆరాజకన్య సౌందర్యమును చూచి ఆమె మాటలు నిజమే యని నిశ్చయించుకొనెను. ఈ యువతిని భార్యగా చేసుకొనుటకే తెచ్చుకొనెను. ఇతను తప్పక నా శిరమున కీలనునాటగలడు. ఈ మూడులోకములలో సవతిదుఃఖముతో పీడించ బడుచుకూడా బ్రతికి యుండు స్త్రీ ఉండకూడదు. అన్ని దు:ఖములలలో సపత్నీదుఃఖ ము సహించజాలని గొప్ప దుఃఖము ఈ విషయమున సంశయముతో పనిలేదు. సామాన్యద్రవ్యములు భోగములు కోరుట లభించకపోవుట వేరు. దుఃఖము. ఇట్లు చాలా విషయముల నాలోచించి భర్తతో ఇట్లు పలికెను.
ఓనాధా! నా ఆహారము కొరకు నీవుతెచ్చితివి. నీ ఆహారముకొరకు ఆ బ్రాహ్మణుని నేను తెచ్చెదను. అని పలికెను. అంతట ఆరాక్షసుడు నీవు వెళ్ళుము త్వరగా వెళ్ళుము నా నోరూరుచున్నది. అని పలికెను అపుడు ఆరాక్షసి భర్తమాటను విని దురాశగలదై బయలుదేరి వెళ్ళి బ్రాహ్మణోత్తముని చేరెను. ఆ బ్రాహ్మణుడు అతిలోకసౌందర్యయుక్తడు విద్యారత్న విభూషితుడుగా కనిపించెను. ఆ బ్రాహ్మణయువకుని చూచి మాయచే పదునారు సంవత్సరముల సుందరిగా మారి కామపీడితురాలై బ్రాహ్మణుని సమీపమున చేరెను. ఎంతో ప్రీతితో ఆ సుందరి బ్రాహ్మణునితో ఇట్లు పలికెను. నీవెవరవు? ఎచటినుండి వచ్చితివి? ఇచటేందు కున్నావు? నేనురాక్షసిని పతిని కోరుదానను. కామాతురను. నా భర్త నన్ను విసర్జించేను. నిన్ను భర్తను చేసుకొన గోరుచున్నాను. అపుడు రాక్షసి మాటలను వినిన నా భర్త ఎటులో ధైర్యమును కూడగట్టుకొని ఇట్లు పలికెను. రాక్షసమానవ సంయోగము ఎట్లు సంభవించును? రాక్షసులకు మానవులు భోజనములు. ఆ మాటలను వినిన రాక్షసి ఇట్లు మరల పలికెను. అసంభవములగు కార్యములు దైవయోగమువలన సంభవించును. భారతమున ఇట్లు జరుగునని పురాణమున వినబడుచున్నది. హిడింబ యను రాక్షసి భీమునికి భార్య కాగలదు. ఆ దంపతులకు ఘటోత్కచుడను పుత్రుడు కలుగగలడు. ఏ శస్త్రములచే వధ్యుడు కాడు. శక్తిచే చనిపోవును అని. కావున నీవు విచారించకుము. దైవయోగమును అంగీకరించుము. నేను నీకు దేవయోగమున భార్యనైతినిద్రు దైవము బలవత్తరము పూర్వము ఇంద్రడు బలిచక్రవర్తిని చూచుటకు మానవలోకమునకు వెళ్లగా అ సమయమున ఘోర రాక్షసుడగు నాభర్త ఇంద్రుని ఇంటినుండి జ్వలించు అగ్ని శిఖవలె నున్న శక్తిని అపహరించెను. ఆశక్తిని ఈ శాలవృక్షమున దాచి ఉంచెను. ఆ శక్తి ఎవరినో ఒకరిని చంపనిదే ఇంద్రుని చేర జాలదు. శక్తి ప్రయోగించినచో అమరుడు కూడా మరణించును. కావున నేను శాలవృక్షమునధి రోహించి ప్రకాశించు శక్తిని తీసి నా భర్తకు మరణమును కోరి నీ చేతికందించగలరు. ఒకవేళ నీవీ శక్తి చే రాక్షసుని చంపజాలనిచో ఆశక్తి నిన్ను నన్ను భక్షించగలదు. ఈ రాక్షసుడు నీకు నాకు మహాశత్రువు. నా భర్త భార్యను చేసుకొనుటకు ఒక కన్యను అపహరించి తెచ్చెను. దుర్మార్గుడగు నా భర్త నాకు సవతిపోరును కలిగించెను. అతనిని చంపినచో మనము ఆనందముతో క్రీడించవచ్చును. ఓ రతివర్ధనా? నీవు నామాటను కాదన్నచో నేను చేసియున్న పుణ్యముల ఫలితములు నాకు చేరవు. నామాట అబద్దమైనచో నాకు బ్రహ్మహత్యాపాతకము సంక్రమించును. మద్యపానమనుచేయు బ్రాహ్మణునకు కలుగు దుర్గతి నాకు సంక్రమించును. గురుదారరతునకు కలుగు పాపము నాకు సంక్రమించును. దాచి ఉంచిన బంగారమును హరించినచో కలుగు పాపము, భూమిని హరించుటలోకలుగు పాపము, ఆత్మహత్యాపాపము నేనబద్ధము పలికినచో నాకు సంక్రమించును. పంచమీ, అష్టమీతిధిన మాంసభక్షణము వలన కలుగు పాపము, అమావాస్య నాడు సీసంగమముచేసిన చెట్టును కొట్టిన కలుగు పాపము, ఉచ్చిష్టఘృతభోజనునకు కలుగు పాపము, దివామైధునము వలన కలుగు పాపము, గృహస్థుడగు బ్రాహ్మణుడు వైశ్వదేవము చేయనిచో కలుగు పాపము, భిక్షుకులకు భిక్షపెట్టనివారికి కలుగు పాపము, విధవకు రెండుపూటలభోజనము వలన కలుగు పాపము, సంక్రాస్తి, సమయమున శైలభోజికి కలుగు పాపము, గోవులతో తీర్థమునకు వెళ్లుటలో కలుగు పాపము, ఇతర జలాశయమున మన్ను నుద్దరించక స్నానము చేసిన వానికి కలుగు పాపము, ని షేధించబడిన వృక్షము యొక్క దంత కాష మునుప యోగించు వానికి కలుగు పావ ము, గోవును సేవించని వానికి కలుగు పావ ము, పాషండమార్గముననుసరించువానికి కలుగు పాపము, కాష్ఠమునందు, శిలయందు పితృదేవతనర్చించువానికి కలుగు పాపము, గోవులు లేకుండగా మహిషములను పోషించువానికి కలుగు పాపము, నగ్న స్త్రీని వీక్షించిన వారికి కలుగు పాపము, అభక్ష్యభోజికి కలుగుపాపము, శ్రీహరికధకు విఘ్నము చేయువానికి కలుగు పాతకము నేను అబద్ధమునుచెప్పినచో నాకు కలుగును. ఇట్లు చెప్పిన పాపములు, చేప్పని పాపములు కూడా అబద్ధమును చెప్పినచో నాకు కలుగును. ఇట్లు పాపురాలగు రాక్షసి బోధించగా నా భర్త దైవము చే మోహితుడై అట్లు చేయుటకు నిశ్చయించేను. ద్రవ్యహీనుడు వ్యసనాసక్తుడు. నామాటలచే బాధపడినవాడు కావున రాక్షసితో కార్యసిద్ధి ప్రదాయక మగు మాటలను పలికెను. ఆ శక్తిని త్వరగా తెమ్ము. నీమాటనాచరించేదను నేనురాక్షసుని చం పెదను. కాని నాకు ఈ సంపదనంతా ఈయవలయును. ద్రవ్యమును సంపాదించవలయునను ఆశతోనే నేను సముద్రమున ప్రశేవించితిని నా భర్త మాటను వినిన రాక్షసి వృక్షము పై నున్న శక్తిని తీసి నాభర్తకు కార్య సిద్దికొరకిచ్చెను. ఇంతలో కామమోహితుడగురాక్షసుడు కన్యను పొందుటకు సిద్దపడెను. అంతట భీతిచెందిన రాజకుమారి ఇట్లు పలికెను. కన్యను పొందినచో మహాపాపము సంక్రమించును. తండ్రిగృహమున నిదురించియున్న నన్ను కాశీనుండి మోసముతో అపహరించితివి. ఇందులో నీ దోషమేమియునులేదు. నాకిట్లు జరుగవలసియున్నది. గుహమధ్యలో నున్న నన్ను రక్షించువారెవ్వరు? దైవయోగమువలననే భర్త లభించును. దైవయోగమువలననే ప్రియురాలు లభించును. విధి ప్రేరణచేతనే ప్రాణులు అంతటా తిరుగు చుందురు. ఓ రాక్షసా నీవే నాకు భర్తవు కావలసియున్నది. దైవ విహిత విధానమున పండితుడేమి చేయగలడు? కావున శాలవృక్షమునాశ్రయించియున్న యీ బ్రాహ్మణుని తెమ్ము, ఘృతమును, జలమును, దర్భలను, అగ్నిని తెచ్చి శాస్త్రోక్త విధిచే వివాహమును చేసుకొనుము. దర్బాదులులేకున్ననూ యధోక్త విధిననుసరించకున్ననూ బ్రాహ్మణ వాక్యముచే వివాహము సఫలమగును. నీ భార్య ఆ బ్రాహ్మణుని చంపనిచో అతనితో హోమమును జరిపించుము. హోమసమాప్తి తరువాత అతనిని నీవు భక్షించుము. ఆ రాజకన్య ఇట్లు పలుకగా మనసున విశ్వాసము కలిగి దర్పముతో బయలుదేరెను. కామార్తుడై త్వరగా ఆ బ్రాహ్మణుని తెచ్చుటకు బయట నిలిచేను. అట్లు బయటకు వెడలుచున్న రాక్షసునకు తుమ్ము వచ్చెను. ఎడమ కన్ను అదిరెను. వస్త్రము జారెను. ఆశకునములను లెక్కించకనే గుహ నుండి బయలువెడలెను. బయట మానుషస్త్రీ రూపమును ధరించి యున్న తన భార్యను చూచెను. ఆ బ్రాహ్మణునితో భార్యాభర్త సంబంధమును కూర్చుట చూచెను. అంతట ఆరాక్షసి క్రూరకర్ముడవు పాపిని, మనుష్యకన్యాసక్తుడవు నా శరీరమును దూషింపచేసిన నిన్ను విడుచుచున్నాను. అని పలికెను. ఆ కఠిన వాక్యములను విని ఈర్ష్యాకోపములచే వారిని చంపుటకు పరుగుతీ సెను. చేతులను చాచి, నోరు తెరిచి, కాలవశముతో వచ్చు వాయు వేగముతో అనర్ధవాక్యములను పలుకుచు వారిని భక్షించుటకు పరుగుతీసెను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున
కాష్టీలోపాఖ్యానమను ఇరువదియేడవ అధ్యాయము.
