నారద మహా పురాణము - ఉత్తరార్థము
25 - మోహినీ చరితమ్
వసిష్ఠ మహర్షి పలికెను:-
మోహిని పలికిన మాటలను వినిన బ్రాహ్మణులు నీవు చెప్పినది నిజమే. యనిరి. తరువాత రాజుతో ఇట్లు పలికిరి.
బ్రాహ్మణులు పలికిరి:-
ఓ రాజా? రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించరాదని నీవు చేసిన శపథము శాస్త్ర దృష్టిచే చేసినది కాదు. నీ బుద్ధిచే కల్పించుకొనినదే. అగ్నిహోత్రులకు రెండు పూటలా భోజనము విధించబడినది. హోమ శేషమును భుజించువారు మూడు వర్ణముల వారని చెప్పబడినది. విశేషించి రాజులకు ఉపవాసము ఉచితమైనది కాదు. క్షత్రియులు ఎపుడూ దుష్టులను శాసించుటకు శస్త్రమును ధరించి యుండవలయును. శాస్త్ర విధిగాకాని అశాస్త్ర విధిగాకాని నీవుచేసిన శపథము ఈనాడు బ్రాహ్మణ వాక్యము వలన పరిపూర్ణ మగును. నీకిచట వ్రత భంగము జరుగదు. బ్రాహ్మణులతో కలిసి భుజించుము. నీవు విచారించవలదు. బ్రాహ్మణ వాక్యము అన్నిటిలో ఉత్తమము. బ్రాహ్మణ వాక్యమును వేరుగా భావించు వాడు పదిహేను జన్మలు రాక్షసునిగా పుట్టును. ఇట్లు బ్రాహ్మణులు పలికిన రౌద్ర వాక్యములను వినిన రాజు కోపము కలవాడై పెదవులదుగుచుండగా వినయముగా బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ప్రాణులందరికి మీరు మార్గదర్శకులు. యతులకు విధవలకు ఈ శ్లోకము చెప్పబడినది. మీరు చెప్పినది చెడు దారిన నడుచు వారిది కాని సాత్యికులది కాదు. రాజులకు ఉపోషణము ఉచితము కాదని మీరు చెప్పిన దానికి వైష్ణవాచార లక్షణమున ఇట్లు చెప్పబడినది. వినుడు. శంఖముతో నీరు త్రాగరాదు. కూర్మమును,సూకరమును చంపరాదు. రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించరాదు. మద్యపానము చేయరాదు. బ్రాహ్మణుని చంపరాదు. ధర్మజ్ఞులు పాచికలాడరాదు. ఏకాదశినాడు భుజించరాదు. తినరాని దానిని తినుట పాపము. పరదారాభి మర్శనము పాపము. ఏకాదశీ భోజనము పతనమునకే కారణము. చేయరాని పనులను చేయుచు నూరు సంవత్సరములు బ్రతుకనేల? చేతనుడగు మానవుడు ఎవడు ఏకాదశినాడు భుజించును? ఏకాదశినాడు చతుష్వాద జంతువులకు కూడా జనులు ఆహారము నీయరాదు. ఉత్తర దిక్కున నుండు బ్రాహ్మణులు విష్ణు ధర్మపరాయణులు జంతువులకు కూడా ఏకాదశినాడు ఆహారము నీయరు. కావున నేనీ నాడు తినరాని దానినెట్లు తిందును? నా శరీరము క్షీణించలేదు. నాకే రోగము లేదు. అట్టినేను బ్రాహ్మణుల మాటలతో విమార్గమున సంచరించి వ్రతమునెట్లు విడుతును? ఈ రాజ్యమును ధర్మాంగదుడు రక్షించుచున్నాడు. నేను రక్షణలేని వాడను కాను. నాకు శత్రువెవ్వరూ లేరు. కావున ఇట్లు తెలిసి విష్ణువతము నాచరించు నాతో వ్రతభంగమును చేయు మాటలు మాట్లాడరాదు. చక్కగా పరిశీలించక బ్రాహ్మణులు ప్రాయశ్చిత్తమును బోధించినచో స్మృతిని అతిక్రమించిన పాపము బోధించిన బ్రాహ్మణులదే యగును. దేవతలు కాని దానవులు కాని, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు, బ్రాహ్మణులు, స్వయముగా నా తండ్రి చెప్పిననూ, హరిహర బ్రహ్మలు, సూర్యుడు, లోకపాలకులు చెప్పిననూ ఏకాదశినాడు భుజించను. ఓ బ్రాహ్మణోత్తములారా? ప్రఖ్యాతి గాంచిన రుక్మాంగద మహారాజు ఎన్నడూ సత్యప్రతిజ్ఞను విఫలము గావించజాలడు. సూర్యుని తేజస్సు తరుగవచ్చును. హిమవంతుడు మారవచ్చును. సముద్రము ఇంకి పోవచ్చును. అగ్ని వేడిని వీడుచును గాక. నేను మాత్రము ఏకాదశీ వ్రతమును వీడజాలను. ఈ మూడు లోకములలో ఇది ప్రసిద్ధము. నా రాజ్యమున పటహముతో గ్రామములలో, పట్టణములలో, ఇతరుల దేశములందు కూడా రుక్మాంగదుని రాజ్యమున ఏకాదశినాడు భుజించువారు సపుత్రులుగా దండించబడుదురు. వధించబడుదురు. దేశ బహిష్కృతులగుదురు. సర్వయజ్ఞ ప్రధానము, పాపనాశకము, ధర్మ వర్దకము, మోక్షప్రదము, అధర్మచ్చేదకము, తేజోనిధి, సర్వజన ప్రసిద్దమగు శ్రీహరి వాసరమున భుజించరాదని ప్రకటించుచుండగా నేను భుజించినచో పాపకారినగుదును. నా పటహమునకు కూడా పాపమంటును. నల్లని వస్త్రముతో కప్పబడును. ప్రాణి తాను సంపాదించుకొనిన కీర్తిని ప్రాణభయముతో కాని పాపబుద్ధితో కాని స్వయముగా నశింపచేయువాడు క్రిమీదంశమను నరకమున అరువది యుగములు నివసించును. నా తల్లి నన్ను వ్యర్ధముగా ప్రసవించినదగును. బ్రాహ్మణులు పితృదేవతలు నిరాశచెందెదరు. యమధర్మరాజు కూడా సంతోషించును. నా వ్రత భంగమును చిత్రగుప్తుడు వ్రాయును. శత్రు స్త్రీలకు ఆనందమును కలిగించువాడు పుట్టుక వ్యర్ధమే. చెడు కర్మచేయువాడు, పాపము నందాసక్తి కలవాడు, కుజాతి అందరిని నశింప చేయువాడు, అపవిత్రుడుగా నుండువాడు పరమ మూర్ఖుడు. వేద పురాణ శాస్త్రములను గౌరవించని వాడు అంతకాలమున యమపురికి వెళ్ళును. వ్రతమును భంగపరుచుకొనువాడు వాంతి చేసుకొనిన దానినే మరల భుజించు వానితో సమానము. పరమ పవిత్రమగు ఏకాదశినాడు భోజనము చేయమని చెప్పువారు వేదములను, శాస్త్రములను పురాణమును సత్పురుషులను స్మృతులను గౌరవించనివారు. అట్టివారు చేయు శ్రాద్ధముతో తృప్తిచెందరు. విష్ణుపదమును ప్రసాదించు ఏకాదశీ వ్రతమును ఆచరించవలదని మూరులు మాత్రమే చెప్పెదరు. ఇట్లు పలికిన రాజు మాటలను వినిన మోహిని మనసు మండగా, కోపముతో ఎఱ్ఱబారిన కనులు గలదై భర్తతో ఇట్లు పలికెను. నా మాటను పాటించనిచో ధర్మ బాహ్యుడవగుదువు. ధర్మబాహ్యుడగు పురుషుడు ధూళికణముతో సముడగును. ఇంకా చెప్పవలయునన్నచో ధూళికణము కన్న హీనమగును. ధూళికణములతో గర్తము పూరించబడును. కాని ధర్మ బాహ్యుడు గర్తమును త్రవ్వు వాడగును. నాకు వరమునిచ్చుటకు నాకిచ్చిన చేతిని కాదని నీ ప్రతిజ్ఞను నీవే పాలించనిచో నీ ధర్మమును పొందిన నేను కృతకృత్యురాలనై వెళ్ళిపోదును. ఇక నేను +నీకు ప్రియమగు భార్యను కాను. నీవు నాకు భర్తవు కావు. ఇక నేను నా బాహువును నీకు ఉపధానముగా చేయజాలను. స్వ వాక్యమును లోపింపచేసి ధర్మక్షయము చేయు నీకు నింద. నీ వంటి ధర్మలోపకారకుడు మ్లేచ్చులలో కూడా ఉండడు. సత్యమును తప్పి పాతకుడవగు నిన్ను ఈనాడు వదులుచున్నాను. మోహిని ఇట్లు పలికి త్వరలో లేచెను, హరుని విడిచి వెళ్ళుసతీ దేవివలే మోహినీదేవి బ్రాహ్మణులతో కలిసి బయలుదేరెను. మద్యమును స్పృశించుట మేలుకాని ఇతని సంగము యుక్తము కాదు. నీలాంబరమును స్పృశించవచ్చును కాని ధర్మచ్యుతుడగు ఈ రాజుతో ఉండరాదు. ఇట్లు కోపించిన మోహిని పలుకుచు గౌతమాదులతో కలిసి ఇంటి నుండి బయటికి వెడలెను. ఓ తండ్రీ ! ఓ జగన్నాథా! ఓ సృష్టి స్థితి లయములను చేయువాడా? అని బ్రహ్మపుత్రిక ఆక్రోశించుచుండెను. ఇదే సమయమున ఉత్తమాశ్వము నధిరోహించి భూమండలమంతయూ పర్యటించి ధర్మాంగద మహారాజు వచ్చెను. మాత్సర్యములేనివాడై త్వరగా వినయముతో తల్లి ఎదుటపడెను. పితృవత్సలుడగు ధర్మాంగదుడు మోహిని మాటలను చెవులారా వినెను. మోహిని మాటలకు బ్రాహ్మణ వాక్యములు వంత పాడినవి. రుక్మాంగద పుత్రుడు ధర్మమూర్తియగు ధర్మాంగద మహారాజు అశ్వమును దిగి తండ్రి పాదముల చెంతకు వెళ్ళి లేచి చేతులు జోడించి నమస్కరించెను. అంతలోనే కోపముతోనున్న మోహినిని చూచి త్వరగా చేతులు జోడించి ఇట్లు పలికెను. ఓ తండ్రి ప్రియురాలా? నిన్నెవరు అవమానించిరి? ఏల కోపించితివి? ఈ బ్రాహ్మణులతో కలిసి ఎటకు బయలుదేరుచున్నావు? ధర్మాంగదుని మాటలనువ విని మోహిని ఇట్లు పలికెను. నీ తండ్రి అసత్యవాక్యుడు. వ్యర్థముగా నాకు చేయిచ్చెను. ఎంతో సుకృతమును చేసిన నీ తండ్రి రక్తా శోకాకారముతో కదలక నిలిచెను. మా తండ్రియగు రుక్మాంగదునితో నేను కలిసి ఉండదలచుకోలేదు.
ధర్మాంగద మహారాజు పలికెను :-నీవు చెప్పిన దానిని నేను చేతును. ఓ తల్లీ ! నీవు కోపించకుము. మరలిరమ్ము.
మోహినీ పలికెను :-
ఓ పుత్రా! ఇట్టి శపథముతోనే సురాధిపుడగు శివుని సాక్ష్యముగా మందరాచలమున మీ తండ్రికి భార్యనైతిని. ఇపుడు నీ తండ్రియగు రుక్మాంగదుడు సత్యము నుండి భ్రష్టుడాయెను. నా కీయవలసిన దానిని ఇచ్చుటలేదు. నేను కూడా అతని అభివృద్దినే కాంక్షించుచున్నాను. నేను బంగారమును, ధాన్యమును, యేనుగులను, అశ్వములను, గ్రామములను, వస్త్రములను కోరుట లేదు. అతనికి హాని కలిగించు దానిని కోరుటలేదు. నా కోరిక అతని దేహమునే ప్రీతి యుక్తముగావించును. నేనడిగినది అతని దేహారోగ్యమునే కాని మా తండ్రి మోహముచే ఇచ్చుట లేదు. అతని ఉపకారముకు, అతని శరీరము కొరకు, అతని సుఖము కొరకు మాత్రమే కోరితిని. కాని మా తండ్రి ఈనాడు సురాపాన తుల్యము, పరమ ఘోరమగు అసత్యమున నిలిచియున్నాడు. సత్యభ్రష్టుని, నిష్టుర వాక్యములను మాటలాడు. వానిని, ధర్మమును వదిలిన వానిని, అసత్యశీలిని, శకుని నీ తండ్రిని నేనొదులుచున్నాను. నేనతనితో ఉండజాలు. ఇట్లు మోహిని వాక్యములను వినిన ధర్మాంగదుడు ఓ తల్లీ ! నేను బ్రతికి యుండగా నా తండ్రి అసత్యవాది కాజాలడు. మరలిరమ్ము. నేను నీ కోరికను ఇప్పించేదను. నా తండ్రి ఇదివరకెన్నడూ అసత్యమును మాటాడలేదు. ఇక ఇపుడు నేను పుట్టినతరువాత ఎట్లు అబద్ధ మాడును. అతని సత్యముననే దేవాసురమానవ లోకములు నిలిచి యున్నవి. నా తండ్రే యమలోకమును శూన్యమును చేసెను. నా తండ్రి కీర్తి బ్రహ్మండ మండలము వరకు వ్యాపించియున్నది. అట్టి రాజు ఎట్లు అబద్దమునాడగలడు? నా తండ్రి మాటను వినకనే పరోక్షముగా నేనెట్లు విశ్వసింతును? నా మీద దయనుంచి తిరిగి రమ్ము. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన మోహిని ధర్మాంగదుని భుజము పట్టుకొని మరలెను. సూర్యతేజస్కుడగు రుక్మాంగద మహారాజు మృతకల్పునిగా పరుండియున్న ప్రదేశమునకు వచ్చెను. ఆ బంగారు శయ్యమీద దీపరత్నములతో ప్రకాశించుచుండగా పగడములు పొదిగియున్న ఉత్తమమగు, వజ్రఖచిత పాదములచే శోభించు చున్న, కోమలమగు, దీర్భవిస్తారయుక్తమగు, సాటిలేని మనోహరమగు పర్యంకమున మోహినిని కూర్చుండబెట్టి చేతులు జోడించి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ ! ఈ నా తల్లి నిన్ను అసత్యవాక్యుడవనుచున్నది. నీవెందుకు అసత్యవాది వగుచున్నావు. కోశరత్న సమన్వితము, గజాశ్వరధ సంయుతము అగు రాజ్యమును పాలించు నీవు ఏడు సముద్రములచే చుట్టబడిన భూమండలమునకు అధిపతివి నీవు. నీవు ప్రతిజ్ఞచేసినదంతయూ ఈమెకిమ్ము. నేను ధనుర్ధారినై యుండగా నీకు అపకారమును ఎవడు చేయగలడు? ఈమెకు ఇంద్రపదవినిమ్ము. ఇంద్రుని నేను జయించెదను. యోగి గమ్యము నిరజంనము అగు బ్రహ్మసాయుజ్యమును కూడా నేను తపస్సుచే బ్రహ్మకు ప్రీతిని గావించి ఇచ్చెదను. నాతల్లి భూమిలో కొని రసాతలమునకాని, స్వర్గమునకాని, పరలోకమునకొని దేనిని కోరిననూ నరదానవులను యుద్ధమున గెలిచి ఈయగలవాడను. ఓ రాజా? నేను నీకు దాసుడను. నీవు కోరినచో నన్ను గడ్డిపోచకమ్ముము. నన్ను చండాలునకమ్ముము. అతని పనిచేయుచు అతని వద్ద ఉండగలను. మూడులోకములలో దుష్కరమైనదేదియూ లేదు. ఈయరానిదైనను ఈమెకిమ్ము. నా జీవితమును నా తల్లి జీవితమును కొని ఇమ్ము, నీవు ఇదివరకున్న సత్కీర్తిచేతనే విరాజిల్లుము. సూర్యుడు తన కిరణములచే లోకములను ప్రకాశింప చేయును. కీర్తి భంగమైనచో పాపము వచ్చును. ప్రజానాశము జరుగునని మనువు నిజమునే చెప్పెను. నీస్వచ్ఛమగు కీర్తిని తుడిచి వేసి నేనెట్లు సంతోషముతో నుండగలుగుదును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ చరితమున ఇరువది యైదవ అధ్యాయము.
