నారద మహా పురాణము - ఉత్తరార్థము
11 - మోహినీ దర్శనమ్
వసిష్ఠ మహర్షి పలికెను :-
రుక్మాంగద మహారాజు మాటలను విని మహాజ్ఞాని యగు మునీశ్వరుడు క్షణకాలమాలోచించి కారణమును తెలుసుకొని ఆ కారణమును ఇట్లు చెప్పెను.
వామదేవ మహిర్షి పలికెను :-
ఓ రాజా! నీవు పూర్వజన్మలో శూద్రజాతిలో పుట్టితివి. దారిద్ర్యముతో దుష్టురాలగు భార్యతో బాధల ననుభవించితివి. పరుల సేవించుటవలన వచ్చిన వేతనముతో భోజనము లభించెడిది. ఇట్లు చాలా సంవత్సరములు దుఃఖములనను భవించుచుండి, ఒకపుడు బ్రాహ్మణుల వెంట తీర్థయాత్రలకు వెళ్ళితివి. వారితో అన్ని తీర్థములందు పర్యటించి, బ్రాహ్మణ సేవా పరుడవైతివి. వారి వెంట మధురకు వెళ్ళి వారితో యమునా జలమున స్నానమాడితివి. సర్వతీర్ధోత్తమమగు విశ్రాంతి యను తీర్థమున వరాహ మందిరమున పురాణోక్తమగు ఆ శూన్యశయన వ్రత కధను వింటివి. నలుగురి పారణతో ఈ వ్రతము సిద్ధించును. ఈ వ్రతము నాచరించినచో లక్ష్మీ భర్త, జగన్నాధుడు సకల పాపనాశకుడు నీలమేఘశ్యాముడగు శ్రీహరి ప్రసన్నుడగును. ఆ కధను వినిన నీవు మరల వరాహమందిరమునకు వచ్చి గృహవల ఎను వృద్ధి పరచగల పవిత్రనుగు ఆ శూన్యశయన వ్రతము నాచరించితివి. గృహస్థాశ్రమమున నుండువాడు ఈ వ్రతము నాచరించక చేయు గృహస్థ ధర్మములన్నియూ గొడ్రాలివలె వ్యర్ధములగును. ఈ వ్రతము వలన లభించు సుఖము ఈ భూమండలమున దుర్లభము. శ్రావణమాస ద్వితీయనాడు పరమపవిత్రము, జన్మమృత్యు జరాపహమగు ఈ వ్రతమును స్వీకరించవలయును. ఈ వ్రతమున లక్ష్మీ సహితుడగు జగన్నాధుని పూజించవలయును. పుష్పములను ఫలములను, ధూపదీప చందనాద్యనులేపనములను సమర్పించవలయును. బ్రాహ్మణులకు శయ్యాదానములను వస్త్రదానములను, భోజనములను సమర్పించవలయును. ఇట్టి కష్టసాధ్యమగు, నీ వ్రతమును యధావిధిగా నాచరించితివి. ఇపుడు నీవు చెప్పిన భోగములన్నియు ఆ అశూన్యవ్రతమువలన లభించినవే. ఇంకను విస్తరముగా వినుము. జగన్నాధుడు ప్రసన్నుడు కానిచో ఇన్ని భోగములు లభించవు. ఇది నిజము. నీ పూర్వజన్మలో అశూన్యశయన వ్రతముతో లక్ష్మీనాధుని పూజించితివి. ఇక ఈ జన్మలో ద్వాదశీ వ్రతముచే శ్రీహరిని పూజించుచున్నావు. కావున నీవు తప్పక శ్రీహరి సాయుజ్యమును పొందగలవు. ఓ రాజా! నీవడిగిన ప్రశ్నను వివరించితిని. దీని వలననే నీవు సర్వసపందలను పొందితివి. బంధులకు హితమును కూర్చుచున్నావు. ఓరాజా నీకు ఇంకను ఏమి చేయవలయును? దేనినీయవలయును. నీవు శ్రీహరికి భక్తుడవు కావున అన్నిటికి యోగ్యుడవు.
రుక్మాంగద మహారాజు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? నేను మందర పర్వతమునకు వెళ్ళదలిచితిని. అచటనున్న చాలా ఆశ్చర్యములను చూడకోరుచున్నాను. మీ ఆజ్ఞను అభిలషించుచున్నాను. పుత్రునిపై రాజ్యశాసన భారమును వదిలి తేలికపడి, స్వేచ్ఛాసంచారినై బయలు దేరితిని. నా పనులను నా పుత్రుడాచరించును. ఇట్లు పలికిన రాజు మాటలను విని వామదేవుడిట్లు పలికెను. ఇది పుత్రునికి పరమ కర్తవ్యము. ఎల్లపుడు ప్రేమచే తండ్రిని క్లేశముల నుండి విడిపించవలయును. మనోవాక్కాయములచే శక్తి కొలది పితృవాక్య పరిపాలన గావించ వలయును. ఇట్లు చేసిన పుత్రుడు ప్రతిదినము గంగాస్నాన ఫలమును పొందును. పితృవాక్యమును ఉల్లంఘించి గంగాస్నానమునకు వెళ్ళిన పుత్రునికి శుద్ధి కలుగదని శ్రుతి చెప్పుచున్నది. కావున నీవు కృతకృత్యుడవు కావున యధేచ్చగా వెళ్ళుము. శ్రీహరి అనుగ్రహము వలన నీకు పుణ్యకార్యములనాచరించుపుత్రుడు కలిగెను. ఇట్లు వామదేవుని అనుమతిని బడసి, అశ్వము నధిరోహించి వాయువు వలె శీఘ్రముగా వెళ్ళెను. అన్ని పర్వతములను, వనములను, నదులను, బహ్వాశ్చర్యములను, సరస్సులను, ఉపవనములను చూచుచు అతి త్వరలో మందరాచలమును చేరెను. శ్వేత పర్వతమును, మందరాచలమును చుట్టి, మహామేరువును దాటి, ఉత్తర కురుదేశములను చూచి, నూరుమంది సూర్యులతో సమానముగా వెలుగొందుచున్న, అంతటా బంగారముతో ఆవరించబడియున్న శ్రీహరి బాహువులచే అదుమబడిన, కాంచన రసమును స్రవించుచున్న, బహుపర్వత సమాకీర్ల భూభాగము కలది, బహుధాతు విభూషితము, బహు నిర్ఘర సంయుక్తము, బహుకందర భూషితము, బహునదీ సంయుతము, శుభములగు గంగాజలములచే గౌతము, ప్రియులకు సుఖముల నందించు యువతులకు విశ్వాస పాత్రము, యువతులకుచముల బోలిన, ఘటప్రమాణములగు, పరిపక్వములు, సుగంధులు అగు ఫలములతో నిండియున్న వృక్షములు కలది భ్రమర ధ్వని సంయుతము, కోకిల స్వర నాదితము, అనేక ప్రాణి రావములచే నాదిత సమస్త ప్రాంతము అగు పర్వతమును చూచుచు మందర పర్వతమును చేరెను. కుతూహలముచే ఆ పర్వతము నధిరోహించుటకు రుక్మాంగద మహారాజు మార్గమును వెతుకుచుండగా, అంతలో అచటనున్న ద్రుమపక్షి సంఘమంతయూ మోహినీ ముఖము నుండి వచ్చు మధురధ్వనిచే స్తంభితమాయెను. మహారాజు కూడా ఔత్సుక్యముచే ఆ ధ్వని వచ్చు మార్గముననుసరించియే బయలు దేరెను. రుక్మాంగదుని చెవిలో కూడా మోహినీ ముఖము నుండి వచ్చు ధ్వని పడెను. ఆ గానమునకు మోహితుడై త్రివిక్రమునివలె లంఘించు చున్న అశ్వమును వదిలి మోహినీ గానముచే మోహితమగు మార్గమున వెళ్ళి క్షణ కాలములో ఆశ్చర్యముతో పర్వతము మీద చక్కగా అగ్నిలో కాల్చి వన్నెపెట్టబడిన బంగారము కాంతిగల, మన్మధ యష్టివలే నిర్మించబడిన, ఆకాశముననున్న ఇంద్ర ధ్వజమును లోకహితము కొఱకు పూజించుచున్న, భూమిరూపు దాల్చినట్లుగా, పార్వతీవలే రూపరాశి అయిన, రూపమును దాల్చిన సముద్రపు చెలియలి కట్టవలెనున్న, రతిమందిరముగానున్న శరీరము కలది, లింగముగా నాశ్రయించియున్న త్రినేత్రుని దేవవినోదము కొరకు ఆకర్షించుచున్న, బ్రహ్మ మనసులోని అభిలాషయే మూర్తీ భవించియున్నటులనున్న మోహినిని చూచెను. మోహినీ రూపమును దర్శించి మోహినీ కామ శరములచే కొట్టబడి మూర్ఛనంది అచటనే పడిపోయెను. శరీరమును కామ జ్వరము ఆక్రమించగా మోహిని సమీపమునకు చేరెను. తనను సమీపించుచున్న రుక్మాంగద మహారాజును మోహినీ కటాక్షములతో పరికించెను. వీణను వదిలి గానమును ఆపివేసెను. తానొచ్చిన పని ఆసన్నమైనదని తలచెను. తన వస్త్రముచే మృగపక్షి సంఘములను తిరస్కరించుచు, గండ భుజములను శ్వాస సుగంధమునకు మోహించి అనుసరించియున్న తుమ్మెదలను వారించుచు రాజు సమిపమునకు వెళ్ళెను. శివలింగమును విడిచి రుక్మాంగద మహారాజు ప్రక్కన చేరి ఉదారచేష్టలుకల, పద్మపత్రనేత్రయగు మోహినీ దేవి మధురముగా మనోజ్ఞముగా ఇట్లు పలికెను. కామ శరాభితప్తుడగు రుక్మాంగద మహారాజును గూర్చి ఓ రాజా ! లెమ్ము నేను నీ వశములో నుండుదానను. మూర్చచే ఈ దేహమును ఏల క్షీణింప చేయుచున్నావు? ఇంత గొప్ప భూభారమును తృణముగా భావించిన నీవు మనసును హరించు నారూపమును చూచి సహించజాలవా? నా రూపమును చూచి ఏల మూర్చిల్లుచున్నావు? నీవు దృఢముగా నుండుము. ధీరుడవు. వీరుడవు. ఉదార చేష్టుడవగు నిన్ను నీవేల చులకన చేసుకొనుచున్నావు? ఒకవేళ నీకు నా సమాగమము నందు కోరికయున్నచో ధర్మయుక్తముగా నేనడిగిన దానిని దానము చేసి రతిజ్ఞురాలనగు నన్ను దాసిని అనుభవించునట్లు యధేచ్ఛముగా అనుభవించుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ దర్శనమను పదునొకండవ అధ్యాయము.
