నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

60 - అభిషేకః

వసువు పలికెను :- ఓ బ్రహ్మపుత్రీ! తరువాత యజ్ఞాంగ సంభవమగు ఇంద్రద్యుమ్న సరమను పరమ పావనమగు తీర్థమునకు వెళ్ళవలయును. అచటికి వెళ్ళి పరిశుద్ధుడై జ్ఞానియై, ఆచమనము చేసి మనసులో శ్రీహరిని ధ్యానించి విభువును సేవించి ఈ మంత్రమును జపించవలయును.

అని ఓ అశ్వమేధయజ్ఞాంగ సంభూతా! సర్వపాపహరతీర్థరాజమా! ఇపుడు నీ యందు స్నానమును చేయుచున్నాను. నా పాపమును హరించుము. నీకు నమస్కారము అని ఈ మంత్రమునకర్థము. ఇట్లు పలికి యధావిధిగా స్నానమాచరించి దేవతలకు, పితరులకు, ఋషులకు, ఇతరులకు తిలోదకముచే తర్పణముగావించి, మరల ఆచమనము చేసి, మౌనముగా పితరులను పిండ ప్రదానము గావించి, పురుషోత్తముని పూజించి దశాశ్వమేధ యాగ ఫలమును పొందును. ఏడు ముందు తరములను, ఏడు తరువాతి తరములను ఉద్దరించి దేవతల వలే కామగతి గల విమానముచే విష్ణులోకమునకు వెళ్లును. అచట ప్రళయకాలము వరకు ఉత్తమ భోగముననుభవించి మరల భూలోకమున జన్మించి మోక్షమును పొందును. ఇట్లు  పంచతీర్థములను పర్యటించి, ఏకాదశి నాడు ఉపవసించి, జ్యేష్ఠ పూర్ణిమనాడు పురుషోత్తముని దర్శించినచో పూర్వోక్తఫలమును పొంది శ్రీహరిలోకమున విహరించి మరల తిరిగిరాని పరమపదమును పొందును. భూమండలమున కల సమస్త తీర్థములు, నదులు, నరస్సులు, పుష్కరిణులు, తటాకములు, వాపులు, కూపములు, ప్రదములు నానానదులు, సముద్రములు జ్యేష్ఠ శుక్లదశమి నుండి ఏడు దినములు పురుషోత్తమ తీర్థమున ప్రత్యక్షమగును. కావున ఈ దినములలో ఈ తీర్థమున చేయబడు స్నానదానాదికములు దైవదర్శనములన్నియు అక్షయ పలమును ప్రసాదించును. జ్యేష్ఠ శుక్లదశమి పదిపాపములను హరించును కావున ఆ దశమిని “దశహర’ అందురు. ఈ దశమినాడు బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను దర్శించుకొనువారు సర్వపాపవవినిర్ముక్తులై శ్రీ మహావిష్ణులోకమును చేరెదరు. గోవిందుడగుపురుషోత్తముని ఊయలలో నుండగా చూచినవాడు. ఇది కూడా ఫాలున పూర్ణిమనాడు చూచినచో గోవిందలోకమును చేరును. విషువదినమున పంచతీర్థ విధానముచే బలరాముని శ్రీకృష్ణుని సుభద్రాదేవిని దర్శించి దుర్లభమగు సమస్త యజ్ఞఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకము పొందును. వైశాఖశుద్ధ తృతీయనాడు చన్దన రూషితుడగు శ్రీకృష్ణభగవానుని సందర్శించినచో అచ్యుతమందిరమును చేరును. రాశి నక్షత్రయోగముననుసరించి మహా జ్యేష్టి యేర్పడినపుడు ప్రయత్నము చేసి పురుషోత్తమునకు వెళ్ళవలయును. మహా జ్యేష్ఠి నాడు శ్రీ కృష్ణభగవానుని, బలరాముని, సుభద్రను సందర్శించినచో ద్వాదశయాత్రఫలమును పొందును. ప్రయాగలో, కురుక్షేత్రములో, నైమిషమున, పుష్కరమున, గయలో, గంగాద్వారమున కుబ్ధామమున, గంగాసాగరసంగమమున, కోకాముఖమున, సూకరమున, మధుర యందు, మరుస్థలమున, శాలగ్రామమున, వాయుతీర్థమున, మందరమున, సింధుసాగరమున, పిండారకమున, చిత్ర కూటమున, ప్రభాసమున, కనఖలమున, శంభోద్దారమున, ద్వారకయందు, బదరికాశ్రమమున, లోహ కూటమున, అశ్వతీర్థమున, సర్వపాప ప్రమోచనమున, కర్ధమాలమున, కోటి తీర్థమున, అమరసంకటమున, లోలార్కమున, జంబుమార్గమున, సోమతీర్థమున, పృథూదకమున, ఉత్పలావర్థకమున, పృధుతుంగమున, కబకమున, ఏకామ్రకమున, కేదారమున, కాశియందు, విరజాతీర్థమున,కొలంజరమున, గోకర్ణమున, శ్రీ శైలమున, గంధమాదనమున, మహేశ్రమలయ విస్ల్యపర్వతములందు, పారియాత్రమునందు, హిమాలయము నందు, సహ్యశుక్తి మదోమతి అరుద పర్వతములందు, గంగయందు, యమునానది యందు, సారస్వతము నందు, గోమతి యందు సప్త బ్రహ్మపుత్ర తీర్థములందు, గోదావరీ, భీమరధీ, తుంగభద్రా, నర్మదా, తాపీ,పయోషీ, కావేరీ, శిప్రా, చర్మణ్వతీ, వితస్తా, చనభాగా, శతద్రు, బాహుదా, ఋషికుల్యా, మరుద్వధా, విపాశా, దృషద్వతీ, సరయూ, నాకగంగ, గండకీ, కౌశికీ, కరతోయా, త్రిఫ్రోతా, మధువాహిని, వైతరణీ ఇతర నదులు ఇవన్నీయూ క్షేత్ర తీర్థములు శ్రీకృష్ణసందర్శనమునకు సమము కాజాలవు. సూర్యగ్రహణ సమయమున స్నానదానముల వలన కలుగు ఫలము మహాజ్యేష్ఠినాడు శ్రీకృష్ణసందర్శనముచే లభించును. అందువలన సర్వాభీష్ట ఫలమును కోరువారు మహాజ్యేష్ఠినాడు సర్వప్రయత్నములతో పురుషోత్తమమునకు వెళ్ళవలయును, పురుషోత్తమమున బలరాముని శ్రీకృష్ణుని సుభద్రను చూచినవారు నూరుకులముల నుద్దరించి శ్రీ విష్ణులోకమును చేరెదరు. విష్ణులోకమున ప్రళయకాలము వరకు సకల భోగములననుభవించి పుణ్యక్షయమున భూలోకమునకు వచ్చి చతుర్వేదములు తెలిసిన బ్రాహ్మణునిగా పుట్టును. స్వధర్మనిరుతుడు, శాన్తుడు, కృష్ణభక్తుడు, జితేన్టియుడుగా నుండును. శ్రీ విష్ణుభక్తి యోగమున మోక్షమును పొందును. జేష్ఠ పౌర్ణమినాడు జ్యేష్ఠా నక్షత్రమైనచో సాగరస్నానము ప్రశస్తము. సాగరమున సర్వతీర్థమయకూపము. సజలము, పరిశుద్ధము. సాగరమున భోగవతి కూడా ప్రతక్షమగును.కావున జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు హైమాధి కలశములచే జలమును తీసుకొని బలరామ శ్రీకృష్ణ సుభద్రలకు అభిషేకము కొరకు చక్కని వేదికను సిద్దము చేసి, పతాకములతో అలంకరించి, సుదృఢముగా, సుఖసంచారముగా నేర్పరించి, వస్త్రములతో పుష్పములతో అలంకరించి విశాలముగా సిద్దముగా నేర్పరిచి, ధూపమును అర్పించి రామకృష్ణులస్నానము కొఱకు, పీతాంబరధారి ముక్తాహారభూషితుడుగు శ్రీకృష్ణభగవానుని నీలాంబరధారియగు బలరాముని నానావిధవాద్యములచే జయమంగలనాదములచే వేదికయందు ప్రతిష్టించి బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులచే కొన్ని వేలమంది స్త్రీ పురుషులచే పరివృతులై గృహస్థులు, స్నాతకులు, యతులు, బ్రహ్మచారులు వేదికయందున్న బలరామకృష్ణులను స్నానము చేయించెదరు.

   అట్లే సమస్త తీర్థ ములు మోదకములచే పుష్పమిశ్రములచే విడి విడిగా స్నానము చేయించును. తరువాత. పటహఘోషములచే భేరీమురజధ్వనులచే కాహలములచే, తాలశబ్దములచే మృదంగ దర్షరములచే, ఇతరములగు బహువిధవాద్యములచే ఘంటానాద మిశ్రితముగా, స్త్రీల మంగల శబ్దములచే మనోహరములగు స్తుతి శబ్దములచే, జయ శబ్దములచే, స్తోత్రముచే వీణావేణు నినాదములచే సాగరఘోషముల వలె గొప్ప శబ్దము వినవచ్చును. మునుల వేదఘోషలచే మన్తవషములచే, నాగాస్తోత్ర నాదములచే పవిత్రములగు సామగానములచే, వీతరక్తాంశుకములను ధరించిన శ్యామావదాతవేశ్యలు రత్నదండములు గల చామరములచే వీచుచుందరు. యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, దేవగంధర్వ కిన్నరులు, చారణులు, ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుద్గణములు, కపాలులు, ఇతరులు పురుషోత్తముని స్తుతించుచుందురు. దేవదేవేశా! పురాణ పురుషోత్తమా? నీకు నమస్కారము. సృష్టి స్థితి లయకారక! లోకనాధ! గత్పతీజ! నేను త్రైలోక్యరక్షకుడు బ్రాహ్మణ ప్రియుడు., మోక్షకారణము, సర్వకామవ లద్రుడుగు ఆదిదేవుని నమస్కరించుచున్నాను. ఇట్లు దేవతలు బలరాముని, శ్రీకృష్ణుని సుభద్రను కూడా ఆకాశము నుండి స్తుతించెదరు. దేవతలు గంధర్వులు గానము చేతురు. అప్సరసలు నృత్యము చేతురు. దేవ వాద్యములు మోగును. చల్లగాలులు వీచును. ఆకాశగోచరములగు మేఘములు పుష్పవర్షమును కురియును. మనులు, సిద్దచారణులు జయ శబ్దములను చేతురు. ఇంద్రాదిదేవతలు, ఋషులు, పితరులు, ప్రజాపతులు, నాగులు, ఇతర స్వర్గవాసులు మంగళ సంభారములచే విధిమవ్ర పురస్కృతముగా అభిషేక ద్రవ్యమును గ్రహించి, మహావీరులగు ఇంద్ర ఉపేస్టులు, సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని వాయువులు, పూష, భగ అర్యమ త్వష్ట, వివస్వాన్, అంశుమంతుడు, రుద్రులు, అశ్వినీ దేవతలు, వరుణుడు రుద్రవస్వాదిత్యవాలఖిల్య మరీచి పుత్రులచే, భృగు అంగిరసులచే సర్వ విద్యా విశారదులచే కూడి పితామహుడు పులస్త్యుడు మహాతపస్వియగు పులహుడు, అంగిరసుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు. ప్రచేతా, మనువు, దక్షప్రజాపతి, ఋతువులు గ్రహములు, నక్షత్రములు, బ్రాహ్యణోత్తములు, ఆకారమును ధరించిన నదులు, సనాతన దేవతలు సుభద్రములగు ప్రదములు, బహు విధతీర్థములు, భూమి, ఆకాశము, దిక్కులు, వృక్షరాజములు, దేవమాతయగు ఆదితి, స్త్రీ, శ్రీ స్వాహా, సరస్వతి, పార్వతి, శచీదేవి, సినీవాలి, సానుమతి, కుహు, రాకా ధిషణా, ఇతర దేవపత్స్యులు, పర్వతరాజగు హిమవంతుడు, నాగరాజు వామన గజరాజు, పారియాత్ర వింధ్య మేరుపర్వతములు, ఐరావతము కలలు, కాష్ఠలు, మాసము, పక్షము, రాత్రి, పగలు, సంవత్సరములు, హయశ్రేష్టమగు ఉచ్చైశ్రవము, అరుణుడు, గరుడుడు, లతలు, ఓషధులు, ధర్మదేవతలు అందరూ అన్ని దీక్కులనుండి రాగలరు. కాలము, యముడు, మృత్యువు, యమభటులు, ఇంకనూ చెప్పబడనీ ఇతర దేవతాగణములు దేవాభి షేకము కొరకు వచ్చేదరు. దివ్య సంభారములను, బంగారు కలశములలో పవిత్రములగు సారస్వత తోయములను తీసుకొని, ఆకాశగంగా జలములలో మంచి పుష్పములను కలిపి రామునితో కలిసియున్న శ్రీకృష్ణ భగవానుని స్సాము చేయించేదరు. ఆకాశమున దేవతా విమానములు తిరుగుచుండును. ఈ విమానము అత్యున్నతములు, దీవ్యములు, కామగమనము కలవి, స్థిరములు, దివ్యరత్న విచిత్రతములు, అప్పరగణసేవితములు గీతవాద్య పతాకములచే అంతటా అలంకరించబడియుండును. ఇట్టి విమానములలో నుండి దేవతాగణములు బలరామకృష్ణ సుభద్రలను స్నానము చేయించేదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున అభిషేకమను అరువదియవ అధ్యాయము.