నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

30 - కాష్ఠీలా చరితమ్

కాష్ఠీల పలికెను : భార్యయగు రాక్షసి పలికిన ధర్మ సంయుతమగు ఆ మాటలను విని రాజకుమారితో యేనుగు మూపు నుండి క్రిందికి దిగెను. బ్రాహ్మణుడు దిగిన వెంటనే ఆయేనుగు మరల చక్కని రూపముగల యువతిగా మారెను. ఆ రాక్షసి చంద్రముఖి బాగుగా బలిసిన ఎత్తుగా యున్న స్తనములు కలదాయెను. ఆ రాజకుమారి కూడా తన తండ్రి నగరమును చేరి నగర రక్షకుని గూర్చి ఇట్లు పలికెను. నీవు నా తండ్రి వద్దకు వెళ్ళుము. పూర్వము అపహరించబడిన రత్నావళీదేవి వచ్చినదని తెలుపుము. నేను శయ్యపై నిద్రించుచుండగా రాత్రి యందు రాక్షసునిచే అపహరించబడితిని. మరల నేను సురక్షితముగా ప్రాణములతో చేరితిని. నీవు ఊరడిల్లుము. నాకొరకు దుఃఖించుకుము. గంగాజలము వలె పవిత్రముగా నుంటిని నీకు కీర్తిని తల్లి సౌశీల్యమును తెలుపుదాననుగా నుంటిని అని తెలుపుము. ఆ రాజకుమారి మాటలను విని సు బాహువను పేరుగల పురపాలకుడు శీఘ్రముగా సుద్యుమ్నమహారాజు సమీపమునకు చేరెను. నమస్కరించి రాజుచే కుశలమడుగబడి ఆదరముతో రాజుతో ఇట్లు పలికెను. ఓ రాజా! పూర్వము ' అపహరించబడిన నీపుత్రిక రత్నావలీ ఒక యువతితో బ్రహ్మణునితో మరల వచ్చినది. నగరము వెలుపల నిలిచినది. తెలుపటకు వచ్చితిని. పాపరహితనుగా వచ్చితినని తెలియుము అని తెలుపుచున్నది. నా తండ్రి సుకృతవంతుడని చెప్పుచున్నది. ఇట్లు పురపాలకుడు చెప్పిన మాటలను వినిన వెంటనే మహారాజు ఆమౌత్యసహితముగా భార్యా సహితుడై బ్రాహ్మణులతో కలిసి నగరము నుండి బయలుదేరేను. ఆ మహారాజు నగరము వెలుపలకు వెళ్ళి గంగాతీరమున నిలిచియున్న భాస్కర సన్నిభ ద్వీజ స్త్రీసంయుత యగు రత్నావలిని చూచెను. ఆ కుమారి సహజ భూషణములచే భూషించబడిన భూషణప్రియ, వాడని పూవువలెనున్న, తప్తకాంచన సన్నిభయగు రాకుమారిని చూచెను. దూరము నుండి చూచి సమీపించి రాజు పుత్రికను ఆలింగనము చేసుకొనెను. రత్నావళి కూడా సంతోషముచే ఆలింగనము చేసుకొని తండ్రికి నమస్కరించెను. తరువాత సంతోషముతో నున్న తల్లిని సంతోషముతో కలిసి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నేను చెలులతో కలిసి రత్నశాల యందు నిదురించి యుంటిని. ఉత్తర దిక్కున శిరము నుంచి పాదప్రక్షాళనము గావించక మంచము పై పరుండి వివాహమును గూర్చి ఆలోచించుచుండగా నిశీధకాలమున రాక్షసుడహరించెను. ఆ రాక్షసుడు నన్ను తీసుకొని సముద్ర మధ్యభాగముననున్న పర్వతగుహలో నున్న తన ఇంటకి చేర్చేను. నానారత్నమయమగు గుహలో నన్నుంచేను. అచట నను వివాహమాడు నుపాయమునాలోచించు చుండెను. ఆ రాక్షసుని భార్యయే ఈ సుందరాంగి. ఈ రాక్షసి అంతకు పూర్వమే దైవయోగమున అటకు చేరిన ఈ బ్రాహ్మణునిచే తన భర్తయగు రాక్షసుని చంపించెను. ఇంద్రుని శక్తిని బ్రాహ్మణునకిచ్చి ఆశక్తిచే రాక్షసుని సంహరింపచేసేను. ఈ రాక్షసి ధర్మ దూషకుడగు తన భర్తను చూచి ఈ బ్రాహ్మణునిచే సంవాదము చేసి, బ్రాహ్మణుని రూపమును చూచి మోహించి తన భర్తను సంహరింప చేసి తాను వివాహమాడెను. ఇట్లు బ్రాహ్మణుని భర్తగా చేసుకొని ఆడయేనుగు రూపమును ధరించి గృహములోని సంపదనంతా తీసుకొని నన్ను కూడా తను మూపు పై కూర్చోబెట్టి నన్ను అప్పగించుటకు నీ మందిరమునకు వచ్చెను. ఇట్లు ఆ రాక్షసుని నుండి నన్ను ఈమె కాపాడెను. కావున బ్రాహ్మణునితో ఈ రాక్షసిని చక్కగా సత్కరించి పూజించవలయును. ఈమె అనుమతిని పొంది నన్ను ఈ బ్రాహ్మణునకరించుము. నేను ఇతనితో కలిసి ఏకాసనమున కూర్చొని వచ్చితిని కావున ఇతను నాకు భర్త ఆయేను. స్త్రీ ఏ పురుషునితో ఏకాసనగతయగునో అతనే ఆమెకు భర్తయగును. ఇతరుడు కాజాలడని పురాణములలో చెప్పబడియున్నది. నేను బ్రాహ్మణునితో కలిసి ఈమె మూపు పై ప్రీతితో కూర్చొంటిని. కావున ధర్మానుసారముగా ఇతనే నా భర్తయని నాయభిప్రాయము. కావున ఈమెను ఓదార్చి శాస్త్రిగమ విధానముననుసరించి ఈ బ్రాహ్మణునికి నన్ను అర్పించుము. నేను ఇతరుని భర్తగా వరించజాలను. అంతట సుద్యుమ్నమహారాజు పుత్రిక మాటలను విని సుందరాంగియగు రాక్షస యువతిని వినయముచే నమ్రుడై ఓదార్చసాగెను. ధర్మభీతయగు నా పుత్రిక నిన్నే శరణు పొందినది. నీవు మొదటి పతిని చంపిన కారణముతోనే ఈమె నా పుత్రిక నిన్ను ఆశ్రయించి యున్నది. నీవు భర్తగా చేసుకొనిన ఇతనిని ఈమె భర్తగా కోరుచున్నది. నేను నమస్కరించి నిన్ను యాచించుచున్నాను. కావున నీవు అంగీకరించి నా పుత్రిక సహాయకురాలిగా స్వీకరించుము. నీ మాటచే నా పుత్రిక ఈ విప్రునికి భార్యయగుగాక. సవతి భావమును విడిచి నా పుత్రికను కాపాడుము. నీవు నా పుత్రికకు నా భార్యకు నా సైన్యమునకు, ప్రజలకు, నగరమునకు, రాజ్యమునకు, నాకు నీవే యజమానురాలవు కమ్ము. ఈ సా పుత్రిక యెప్పుడు నీ మాట యందు నిలిచియుండును. ఇట్లు పలికిన సుద్యుమ్న మహారాజు మాటలను వినిన రాక్షసి పరిశుద్ధమగు మనసుచే ఆమోదించి కన్యాదానమును చేయుటకు సిద్ధముగా నున్న మహారాజుతో ఇట్లు పలికెను.

ఓ రాజోత్తమా? నీవు పరిశుద్దమైన భావముచే నన్ను ఆశ్రయించితివి కావున ఈ రాకుమారి ఈ బ్రాహ్మణునకు రెండవ భార్యయగును. నన్ను చక్కగా పూజించవలయును. మొదట దేవాలయమున ఫాలున శుద్ధ అష్టమినుండి చతుర్థశి వరకు ఏడు దినములు ఉత్సవమును జరుపవలయును. నటులతో, నర్తకులతో గొప్ప గీతవాద్యములతో మైరేయమాంసరక్తాదిబలులతో చక్కగా పూజను గావించుము. ఇట్లు పూజించు నీకు నేనెప్పుడూ రక్షకురాలిగా నుందును. నీవు నీ మాటను పాటించుము. ఇట్లు పలికిని రాక్షసి మాటలను వినిన సుద్యుమ్న మహారాజు ఆమె ప్రీతితో పలికిన మాటలను సంతోషముగా నంగీకరించేను. రాజు అంగీకరించగనే రాక్షసి సంతోషించెను. బ్రాహ్మణునితో ఈ రాజు కుమారిని కూడా భార్యగా చేసుకొనుము అని పలికెను. నేను ఈర్యను విడిచి ఈమెతో యుందును. ఈమే నాకు సోదరి కాగలదు. ఇట్లు రాక్షసి మాటతో రాజపుత్రికను వివాహమాడి బహుధనరాశులతో కరిణీ రూపమున నున్న రాక్షసినధిరోహించి మహాదయ పురమునకు వెళ్ళెను. అంతట నేను నీ భర్త బహురత్నములను తీసుకొని ఇద్దరు భార్యలతో వచ్చెనని వింటిని. అంతట నేను బంధువర్గముతో తలిదండ్రులతో సఖీగణముతో కలిసి మర్మములను భేదించు పరుషవాక్యములచే దూషించబడితిని. ధనము యందు ఆశకల దానా? ఇప్పుడు సంపదలు చేకూరిన భర్తను ఎట్లు సమీపించేదవు? పూర్వము ధనహీడని నీవే విడిచితివికదా? స్త్రీలకు తండ్రి సంపదలు చంచలములు. భర్త సంపాదించిన సంపదలు స్థిరములని చెప్పబడును. పూర్వము పరుష పదజాలముచే నిందించి ఇపుడెట్లు మాటలాడగలవు? నీకు అతని ఇంటిలో ప్రవేశము కూడా దుర్లభము కాగలదు. ఒకవేళ వెళ్ళిననూ అచట నీవు భర్తతో శయనించుట దురాచారముగల నీకు సుఖప్రదము కాజాలదు. లోకాపవాద భయముచే నీ భర్త నిన్ను స్వీకరించిననూ నీ మీద స్నేహశూన్యమగు మనసు కలవాడు కావున నీతో కలియజాలడు. స్నేహ శూన్యమగు మనసు కల దంపతుల కలయిక కంటే మించిన దుఃఖప్రదము మనోవైకల్యకారీ మరియొక్కటి యుండజాలదు. ఇట్లు పలు విధములగు మాటలను విన్న నేను అధోముఖినై, నీరు నిండిన కనులతో చాలా దుఃఖించితిని. నేను మొదట నా చేతి కంకణము నీయకపోతిని. కటి సూత్రమును నూపురములను ఈయజాలకపోతిని. అట్లు ఇచ్చినచో నా పతి సంతోషించి యుండెడివాడు, పతియే భార్యధనమునకు జీవితమునకు స్వామియని లోకమున చెప్పబడుచున్నది. నేను అట్టి ధనమును అపహిరించి వచ్చితిని. ఇప్పుడు నాకేదిగతి? ఇపుడు నేనతని ఇంటికి ఎట్లు వెళ్ళగలను? ఎట్లు మాటలాడగలను? నన్నెట్లు విశ్వసించును? ఇట్లు పరితప్త మనసుచే చింతించుచు బంధువర్గ పరివేష్టితనై యుంటిని. ఇంతలో తెల్లని ఛత్రముతో అలంకరించబడి) సుకోమలము బలిష్ణులగు పురుషులచే మోయబమడుచున్న పల్లకి అచటికి వచ్చెను. ఆ పురుషులొచ్చి నాతో ఇట్లు పలికిరి. నీ భర్త నిన్ను ఆహ్వానించుచున్నాడు. సంతోషముచే త్వరగా రమ్ము. నీ భర్త ధనరాశులతో రత్నరాశులతో ఇద్దురు భార్యలతో వచ్చియున్నాడు. గృహమున ప్రవేశించిన వెంటనే తండ్రి ఇంటిలో నున్న నిన్ను తొడిని వచ్చుటకు మమ్ములను పం పెను. అది. అంత నేను సిగ్గుపడి నా పతి చేసిన పనిని చూచి ఏ సమాధానమును చెప్పక కొంత సేపు మౌనముగా నుంటిని. అంతట నన్ను బంధువర్గము మాటిమాటికి బోధించినది. సమ్మానముతో భర్త ఆహ్వానించినపుడు అతని వద్దకు వెళ్ళవలయును. భర్త పిలిచినపుడు అతని వద్దకు వెళ్ళని భార్య పది హేను జన్మలు ఆడకాకిగా పుట్టును. ఇట్లు బోధించి నన్నోదార్చి నన్ను తీసుకొని త్వరగా పల్లకిలో కూర్చండబెట్టి వెళ్ళుము వెళ్ళుము అని మాటిమాటికీ పలికిరి. అంతట ఆ పురుషులు పల్లకీని భుజములపై నిడుకొనీ వేగముగా నా భర్త నివసించియున్న మహోదయ పురమునకు గొనిపోయిరి. నేను నా భర్త గృహమును అంతటా బంగారముతో నిండియున్న దానిని, ఉత్తమాసనములతో, భోజ్యములతో, ధనములతో, వస్త్రములచే కూడియున్న దానిని, చూచితిని. అంతట ఆ రాక్షసీదేవి, రాకుమారి ప్రీతితో నన్ను పూజించిరి. భర్త వాక్యముతో నేను ప్రీతి చెంది ఆదరముతో స్నానముచేసి భుజించితిని. సూర్యాస్తమయము తరువాత నా భర్త నన్ను పిలిచి చాలా సేపు ఆలింగనము చేసుకొని పర్యంకమున కూర్చోబెట్టెను. తరువాత రాక్షసిని రాజపుత్రిని పిలిచి నా భర్త ఇట్లు పలికెను.

మీరు భక్తితో ఈమె పాద సేవ చేయవలయును. ఈమె నా మొదటి భార్య. మీ ఇద్దరి కంటే పెద్దది. ఇట్లు నా భర్త చేప్పగా వారిద్దరు నా పాదములను గ్రహించిరి. సవతి భావమును, ఈర్యను విడిచివేసిరి. అంతట సేవకులను పిలిచి నా భర్త ఇట్లు పలికెను. రాక్షసుని గుహనుండి నేను పొందిన సంపదను, రాజకుమారిని వివాహమాడినపుడు పొందిన సంపదను మొత్తమును భక్తి భావముతో తీసుకొనిరండు. ఆలస్యమును చేయకుడు. ఓ సేవకులారా? ఆ సంపదకంతటికి ఈమెయె యజమానురాలు. నా భర్తమాటతో సేవకులు త్వరగా ధనమును గొనివచ్చిరి. నా పతి ప్రీతితో దానీనంతటిని నాకు సమర్పించేను. స్వచ్చమైన చిత్తముతో వస్త్రభూషణాదులచే సత్కరించి రాక్షసి రాజ పుత్రికలు చూచుచుండగనే పర్యంకమున నున్న నన్ను బిగియార కౌగలించి ఆధరమును చుంబించెను. ఇట్లు ఆశ్చర్యకరమగు భర్త చేసిన దేహవిత్తసమర్పణను, ఉల్లాసమును కలిగించు మాటలను, చేతితో చేసిన కుచమర్ధనమును చూసి ఖడ్గముచే ఛేదించబడిన గోవువలే నా ప్రాణములు నన్ను విడిచి పోయెను. తరువాత నేను యముడు విధించిన నరకయాతనను బహుదుఃఖముతో అనుభవించి ఇపుడు కాషీలగా పుట్టితిని. మరల నేను పశు జన్మనందెదను. ఇట్లు వేల జన్మలు ఎత్తగలను. ఇట్లు భర్తకు తన విత్తమును జీవితమును అర్పించని స్త్రీ ఇట్టి స్థితినే పొందగలదు. కావున ఇట్లు తెలిసి ఎల్లపుడూ భర్త కోజకే విత్తమును జీవితమును రక్షించవలయును. భర్తయే తల్లి, తండ్రి, ధనము, బ్రతుకు, గురువు, ఆధారము. ఎన్నో సుకృతములు చేసిన స్త్రీ మాత్రమే భర్తతో తన శరీరమును కూడా దహింపచేసి విష్ణు పదమును చేరును. విత్తమునందు దేహమునందు లోభముగల స్త్రీ యమలోకమును, దుష్ట జన్మలనందును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున కాషీరా చరితమను ముప్పది యవ అధ్యాయము.