నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

38 - గంగామాహాత్మ్యవర్ణనమ్

వసిష్ఠమహర్షి పలికెను:- వసువు శుద్ధిపొందదలచిన మోహినిని సర్వలోక హితమును కోరి మృదువుగా ఇట్లు పలికెను.

వసువు పలికెను:- ఓ మోహినీ వేరు వేరుగా తీర్థ లక్షణములను చెప్పెదను వినుము. ఇవి తెలిసినంతనే పాపులకుత్తమగతి లభించును. భూలోకమున అన్ని తీర్థములలో శ్రేష్టమైనది గంగాతీర్థము. గంగతో సమానమగు పాపనాశకతీర్థము మరియొకటి లేదు. ఆ మాటను వినిన మోహిని గంగా స్నానము చేయదలచి వసువుతో ఇట్లు పలికెను.

మోహిని పలికెను:- ఓ బ్రాహ్మణ శ్రేష్టా! సర్వపురాణ సమ్మతమగు ఉత్తమగంగా మహాత్మ్యమును ఇపుడు చెప్పుము. పాపనాశకమగు గంగా మహాత్మ్యమును విని నీతో కలిసి పాపనాశినిలో స్నానము చేయుటకు వెళ్ళేదను. ఆ మోహినీ వాక్యమును వినిన సర్వపురాణ విదుడగు వసువు పాపనాశకమగు గంగా మహాత్మ్యమును చెప్పసాగెను.

వనువు పలికెను:- గంగానదీ సమీవ ముననున్నవి మాత్రమే దేశములు, జనపదములు, పర్వతములు ఆశ్రమములనబడును. గంగా సేవనముచే లభించు సద్గతి తపస్సుచే, బ్రహ్మచర్యముచే, యజ్ఞములచే, త్యాగముచే లభించదు. యౌవనమున పాపకర్మలను చేసిన వారు కూడా వృద్దాప్యమున గంగను సేవించినచో ఉత్తమ గతిని పొందేదరు. వేయి యుగములు ఒంటికాలు పై నిలిచి తపమును చేసినవాడు ఒక మాసము "గంగను సేవించిన వాడు సమాన ఫలమును పొందును. పదివేల యుగములు తలక్రిందులుగా తపస్సు చేసినవాడు యధేచ్చగా గంగయందు నీలిచినవానికంటే తక్కువ స్థితిలో నుండును. దుఃఖోపహతచేతస్కులగు ఉత్తమగతిని అన్వేషించు సమస్త ప్రాణులకు గంగను మించిన గతి లేదు. ప్రకృష్టములు ఘోరములగు పాపముల నాచరించిన, అపవిత్రమగు నరకమునకు వెళ్ళు పరమపాపులను కూడా సహించి నిరోధించి గంగ తరింప చేయును. గంగను ఎప్పుడూ వెళ్ళి సేవించువారు మునులతో ఇంద్రాది దేవతలతో సమానులు. అంధులను జడులను ద్రవ్యహీనులను కూడా విశ్వరూ బృహతి యను గంగ పావనము చేయును. ఇంద్రాది దేవతలచేత మునులచేత మానవుల చేత తమ సమృద్ధి కొజుకు సర్వకాలములందు సేవించబడుచున్నది. పక్షాదియందు, కృష్ణపక్షమున అమావాస్యనుండి వెనుకకు పది దినములు గంగ భూమియందు సన్నిహితముగా నుండును. శుక్ల ప్రతిపత్తు నుండి పది దినములు పాతాళమునకు సన్నిహితముగా నుండును. శుదైకాదశి నుండి పది దినములు అనగా బహుళ పంచమి వజుకు స్వర్గమునకు సన్నిహితముగా నుండును. కృతయుగమున అన్ని తీర్థములు పావనములే. త్రేతాయుగమున పుష్కరతీర్థము, ద్వాపరయుగమున కురుక్షేత్రము, కలియుగమున గంగాతీర్థము విశిష్టము. కలియుగమున అన్ని తీర్థములు తమ తమ శక్తులను గంగలో నిక్షేపించును. గంగ మాత్రము ఎచటా నిక్షేపించదు. గంగాజల కణమును తాకిన వాయువును స్పృశించిననూ పాపశీలులగు నరులు కూడా ఉత్తమ గతిని పొందెదరు. సర్వగతుడు జ్ఞాన స్వరూపుడు అగు జనార్ధనుడే ద్రవరూపమున గంగాజలముగా నిలిచేను. ఈ విషయమున సంశయముతో పనిలేదు. బ్రహ్మహత్య చేసిన వాడు, గురుహంతకుడు, గోహంతకుడు, చోరుడు, గురుతల్పగతుడు గంగా జలముచే పావనులగుదురు. ఇచట విచారించవలసిన పనిలేదు. క్షేత్రస్థమగు జలము, ఉద్ధృతమగు జలము శీతమైనను ఉష్ణమైననూ గంగా జలమైనచో మరణము వరకు చేసియున్న పాపములను హరించివేయును. ఫర్యుషితమగు జలమును వర్ణించవలయును. పర్యుషితదలమును వర్ణించవలయును. కాని గంగాజలమును తులసీదళమును వర్ణించవలసిన పనిలేదు. మేరు పర్వతగుణములను, సువర్ణ గుణములను, సర్వరత్న గుణములను, పాషాణ సంఖ్య, ఉదకసంఖ్య, గంగాజలగుణ సంఖ్య చెప్పశక్యము కానిది. సకల తీర్థయాత్రా విధి నాచరించని వారు కూడా గంగా జల సేవన మాహాత్మ్యమున ఉత్తమ గతిని పొందగలుగును. చింతామణి గుణములకంటే భక్తులకు వాంఛితార్థమును ప్రసాదించు గంగా జలబిందువులు విశిష్టములు. భక్తిచే గండూషమాత్రగంగాజల సేవనము కామధేనువు సృజించు దీవ్యభోగములననుభవించ గలుగును. శాలగ్రామశలయందు గంగాజలమును ప్రోక్షించినవాడు తీవ్రమగు అజ్ఞానమును హరించి ఉదయకాలసూర్యుని వలె ప్రకాశించును. మనోవాక్కాయపాపములు చేసినవాడు కూడా గంగా జలమును దర్శించినచో పావనత్వమును పొందును. గంగా జలాభిషిక్తమగు భిక్షను భుజించినవాడు పాము కుబుసమును విడుచునట్లు పాపములను విడుచును. హిమాలయ వింధ్య పర్వతములంతటి పాపరాశులు కూడా గంగా జలముచే విష్ణుభక్తిచే ఆపదలు తొలగునట్లు తొలగిపోవును. భక్తితో స్నానమునకై నరులు గంగా జలమున ప్రవేశించినంతనే బ్రహ్మహత్యాది పాపములు హాహాయనుచు పారిపోవును. నిత్యము గంగాతీరమున నివసించవలయును. గంగా జలమును పానము చేయవలయును. ఇట్లు చేసిన మానవుడు పూర్వ జన్మ సంచిత పాపముల నుండి కూడా విముక్తుడగును. నిత్యము .గంగనాశ్రయించి నివసించు వాడు దేవతలకు, మానవులకు, మహర్షులకు కూడా పూజించదగినవాడు. అష్టాంగ యోగముతో, తపములచే, యాగములచే ప్రయోజనము లేదు. గంగా తీరవాసమే విశిష్ట ఫలప్రదము. కాలహరణమును చేయు బహుయజ్ఞములచే, తపస్సులచే, ధనార్పణలచే ఏమి ప్రయోజనము. సర్వమోక్ష ప్రదయగు గంగ సులభ సేవ్యముగా నున్నది కదా. యజ్ఞ యమ నియమ దాన సన్యాసములచే కూడా గంగా సేవఫలము లభించజాలము. రాహుగ్రస్త సూర్యగ్రహణకాలమున ప్రభాస తీర్థమున గోసహస్రదానము చేసిన లభించు ఫలము గంగా సేవనముచే లభించును. మోక్షమును కోరువాడు అన్యోపాయములను విడిచి గంగాతీరమున ఆనందముగా నుండవలయును. ఆ గంగాతీరమే మోక్ష భోజనము. విశేషించి వారాణసీలో నున్న గంగ సద్యోమోక్షప్రదము. ప్రతిమాసమున చతుర్దశినాడు అష్టమినాడు యావజ్జీవము గంగా తీరవాసము సిద్ధిని ప్రసాదించును. ఎల్లపుడు కృచ్చవ్రతముల నాచరించి పొందు వలము, సదా చాంద్రాయణమునాచరించు వాడు పొందు వలము జాహ్నవీతీరవాసమున పొందగలుగును. సగము దినము గంగా సేవా పరుడైన వాడు పొందు వలమును, నూరు యాగములనాచరించువాడు కూడా పొందజాలడు. సర్వయజ్ఞతపోదాన యోగ స్వాధ్యాయకర్మలచే పొందు ఫలమును గంగా తీరనివాసి పొందకలుగును. సత్యవచనమున, నైష్టికబ్రహ్మచర్యమున, నిత్యాగ్నిహోత్రులకు లభించు పుణ్యము గంగాతీర నివాసులకు లభించును. మాతృపితృదారలను కోటికులమును అనంతముగా గంగాభక్తి సంసారసాగరము నుండి తరింప చేయును. సంతోషము పరమేశ్వర్యము, తత్వజ్ఞానము, వినయము, ఆచార సంపత్తి గంగా భక్తునికి సమకూరును గంగాజలమును పానము చేసినవాడు కృతకృత్యుడగును. నరుడు మృతుడైనను గంగాభక్తుడు గంగాపరుడుగనే ఉండవలయును. భక్తిచే గంగా జలమును పానము చేసినవాడు, గంగా జలమును స్పృశించువాడు సులభముగా మోక్షోపాయమును తెలియును. గంగా జలముచే సర్వకార్యముల నాచరించువాడు సర్వయజ్ఞ దీక్షితుడు, ప్రతినిత్యము సోమపానము చేసినవాడగును. సూర్యచంద్రాదులు ఇంద్రాదిదేవతలు అమృతమును పానము చేసినట్లు గంగా జలపానమును చేసిన వారు దేహమును విడిచి శివుని సన్నిధిలో ఆనందింతురు. భక్తిచే కన్యాదానమును, భూదానమును, అన్నదానమును, గోదానమును, స్వర్ణదానాదులను, రధాశ్వగజదానములను, చేసినవారికి కలుగు పుణ్యమునకు నూరురెట్లు ములుకమాత్ర గంగాజల ప్రాశనముతో కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతములనాచరించిన వారికి కలుగును. సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించినవారికి కలుగు ఫలమునకంటే అధిక ఫలము గంగా జలపానము వలన కలుగును. గండూషమాత్ర గంగా జలపానముచే అశ్వమేధ యాగఫలము లభించును. ఇష్టపూర్వకముగా గంగా జలపానము చేసిన వారికి మోక్షము కరతలామలకముగా నుండును. మూడు మాసములు సరస్వతీ తోయము, ఏడు మాసములు యమునాజలము పది మాసములతో నర్మదా జలమును సంవత్సరము గంగా జలమును సేవించ వలయును. మరణించిన వారికి శాస్త్రవిధి. ననుసరించి తర్పణమును చేయువారి అస్తులను గంగాతోయమున కలిపినచో ఉత్తమగతులు లభించును. కాయశోధనమును చేయు సహస్ర చాంద్రాయణ వ్రతముల నాచరించిన వారికంటే యధేష్టముగా గంగా జలపానమును చేసిన వాడు విశేష ఫలమును పొందును. గంగను దర్శించినవాడు, స్తుతించినవాడు, గంగా స్నానము చేసినవాడు, భక్తిచే గంగా జలమును పానము చేసి నవాడు, స్వర్గ మును, వ విత్ర జ్ఞానమును, ఉత్తమ యోగ మును, మోక్షమును పొందును. గోమూత్రయావకాహారముకంటే సూర్యకిరణ పరితప్తమగు గంగాజలపానము విశేషఫలమునిచ్చును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున గంగా మహాత్మ్యవర్ణనమను ముప్పది యెనిమిదవ అధ్యాయము.